ఆ రోజే మిసెస్ కామేశ్వరీ దేవిని కలుసుకున్నాడు. "నా ప్రాణస్నేహితుడు విక్రంణు కూడా మన హాస్పిటల్ లో సర్జన్ గా వేయించాలి."
కామేశ్వరీ దేవి నవ్వుతూ "బాగుంది! నీకు సహాయం చేసిందే కాక నీ స్నేహితులకు కూడా సహాయం చెయ్యమంటావా? నా వల్ల కాదు" అంది.
మిసెస్ కామేశ్వరీ దేవి తన మాట కాదనదని వామనమూర్తికి బాగా తెలుసు! తన మీద ఆవిడకు వ్యామోహమని వామనమూర్తి భ్రమపడలేదు. ఆవిడ పాతివ్రత్యమూ భక్తి నిష్టలూ అతనికి బాగా తెలుసు!
తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా ఆవిడ ఇంట్లో టేప్ రికార్డర్లలోని సుప్రభాతాలు మైక్ లో చుట్టుప్రక్కల ఇళ్ళకు కూడా వ్యాపించి వద్దన్నా వాళ్ళ చెవులు కూడా బ్రద్దలు చేసుకుని మనసును ఏదో ఒక విధంగా మధించి వదిలి పెడతాయి. ఆ తరువాత భజన! కామేశ్వరీ దేవితో పరిచయమయిన నాటినుండీ ఏనాడూ వామనమూర్తి భజన కార్యక్రమాన్ని మానుకోలేదు. అతను చిడతలు పట్టుకుని భజన చేస్తుంటే నాస్తికులలో సహితం భక్తి భావం కలిగేది. కామేశ్వరీ దేవి అతన్ని చూసి గర్వపడేది! ప్రసాద వినియోగం మొట్టమొదట అతనికే!
"యవ్వనాన్ని కాపాడుకోవటం ఎలా?"
"పోయిన యవ్వనాన్ని తిరిగి పొందండి!"
"మీ శరీరచ్చాయను పెంపొందించుకోవటానికి మార్గాలు!"
"శృంగార రహస్యాలు!"
"లావణ్యవంతమయిన దేహానికి దారి!"
ఇలాంటి పుస్తకాలు తెచ్చేవాడు. ఏం మాట్లాడకుండా అక్కడ పెట్టేవాడు.
"ఎందుకయ్యా ఇలాంటి పుస్తకాలు!" అనేది మిసెస్ కామేశ్వరీ దేవి వాటిని తిరగేస్తూ...
"విజ్ఞానమండీ! అన్నీ చదవవలసిందే! అన్నీ తెలుసుకోవలసిందే. జ్ఞాన సముపార్జనకు అది, ఇది అని భేదం ఉండకూడదు." అనేవాడు వామనమూర్తి.
కామేశ్వరీ దేవి వెంటనే అతనితో ఏకీభవించేది.
చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వామనమూర్తి మేనమామ ఇంట్లో పెరిగాడు. ఆ మేనమామకు ఒక కూతురయినా లేదు. ఆ కారణంగా వామన మూర్తి మీద ఎలాంటి అభిమానమూ లేదు. ఆ మేనత్త ఒక రాక్షసి అని చెప్పుకునేవారు. అలాంటి రాక్షసిని మంచి చేసుకోగలిగిన ఘనత వామన మూర్తికి దక్కింది.
ఆవిడకు పనులు చెయ్యడం వల్ల కాదు - చెయ్యక తప్పదు! ఆవిడ సంగీతాన్ని శ్రద్దగా వినేవాడు! వినేటప్పుడు అతని ముఖంలో తన్మయత్వం ఆవిడను ముగ్ధురాలిని చేసేది.
కానీ, పాపం వామనమూర్తికి చదువు దినదిన గండం గానే ఉంది. పెద్ద తెలివయినవాడు కాదు. కష్టపడటానికి టైం ఉండేది కాదు. కానీ మాస్టర్ల అందరికీ అనువర్తనగా ఉండేవాడు. అందుకే పాసయిపోయేవాడు.
"ఆ వామనమూర్తా? భలే కుర్రాడు. మంచివాడు. తెలివయినవాడు" అని కూడా అనేసేవారు. మంచిలో తెలివి కూడా ఒక భాగమని అనిపించిందేమో! అసలు 'మంచి' అంటే ఏమిటో?
* * *
వామనమూర్తికి మరొక స్నేహితుడున్నాడు, భాస్కరరావు. ఇద్దరూ కలిసి చిన్నప్పుడు ఆడుకునేవారు. భాస్కరరావు బాగా డబ్బున్నవాడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. అతని ఖర్చుమీద ఆనందించే స్నేహితుల్లో ప్రధానమైనవాడు వామనమూర్తి... భాస్కరరావుకి చిన్నతనంలోనే వెన్నులో ఏదో వ్రణంలా అయింది. అప్పటి నుండి అతడు నడవలేడు. కూర్చోలేడు. వెల్లకిలా పడుకోలేడు. మంచంలోనే దివారాత్రులు. ఆ స్నేహితులందరూ దూరమయ్యారు. కానీ వామనమూర్తి మాత్రం వదలలేదు. ప్రతీ రోజూ వచ్చేవాడు. కబుర్లు చెప్పేవారు. అతనికి ఆ మంచంలోనే లోకమంతా చూపించేవాడు. అతనికి చెప్పినట్లుగా తన ఇబ్బందులు చెప్పేవాడు. అతడు డబ్బు ఇస్తోంటే వద్దు వద్దని అతను ఎంతో బలవంతపెట్టాక తీసుకునేవాడు.
ఒకనాడు భాస్కరరావు అన్నాడు-
"నా స్నేహితులంతా నన్ను వదిలేశారు. నువ్వు మాత్రం వదలకుండా వస్తున్నావు. నీ ఋణం తీర్చుకోలేను..."
"దానిదేముంది భాస్కర్! నిన్ను చూడకపోతే నాకు తోచదు. ఒక్క రోజు నీ దగ్గరకు రాకపోయినా పిచ్చెత్తినట్లే ఉంటుంది." మామూలుగా అనేశాడు వామనమూర్తి.
"ఎంత మంచివాడివి వామన్! నాలాంటి రోగి దగ్గరకు రావాలని ఎవరనుకుంటారు? అప్పుడప్పుడు చచ్చిపోయినా బాగుంటుందని అనిపిస్తుంది....నిన్ను చూశాక మళ్ళీ బ్రతకాలనిపిస్తుంది..."
భాస్కరరావు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ కళ్ళలో నీళ్ళు చూసి చలించి పోయాడు. రాగంలో కొట్టుకుంటున్న ఆ మూర్తి అతని మనసును విపరీతంగా మధించింది.
"భాస్కర్! నేను ...నేను...నీ డబ్బు కోసం వస్తున్నాను. డబ్బు కావాలి నాకు! నా స్నేహాన్ని నమ్ముకోకు!"
అప్రయత్నంగా తన నోట వచ్చిన మాటలు విని తనే తెల్లబోయాడు వామనమూర్తి.
భాస్కరరావు ముఖం కోపంతో జేవురించింది.
"రాస్కెల్! గెటవుట్! గ్రద్దలా, రాబందుల్లా నా డబ్బు కోసం పీక్కుతినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు రానక్కర్లేదు. వెళ్ళు..."
ముఖం వేలాడేసుకుని వెళ్ళబోయాడు వామనమూర్తి. గడపదాటకుండానే పిలిచాడు భాస్కరరావు.
"రా! నువ్వెందుకొస్తున్నావో నాకు తెలియదనుకున్నావా? ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు."
భాస్కరరావు కనుకొనల్లో నిలిచినా నీటి బిందువులు తన చొక్కాతో తుడిచాడు వామనమూర్తి.
"నిన్ను చూసి నిజంగా కదిలిపోయాను" అని అతడు అనలేదు. వామన మూర్తి చేతిబ్ని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కాడు భాస్కరరావు.
* * *
కామేశ్వరీ దేవి అనేక అనాథ శరణాలయాలను నడిపిస్తోందనీ, ఆవిడ డబ్బు గల ఆవిడనీ విన్నాడు వామనమూర్తి.