Next Page 
భార్యతో రెండో పెళ్ళి  పేజి 1

                                 

       
                                  భార్యతోరెండో పెళ్ళి
                                                     -డా:సి. ఆనందా రామం

                       
    కాలేజిలైబ్రరీ రీడింగ్ రూంలో కూర్చుని రిఫరెన్స్ బుక్స్ చూసుకుంటోందియశోద. ఏం.ఏ. సైకాలజీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆ అమ్మాయి.
     ఒకచేతికి ఒక జత గాజులు. రెండో చేతికిరిస్ట్ వాచ్. మెడలో సన్నని పొట్టి బంగారు గొలుసు. ప్రింటెడ్ బెంగాల్ కాటన్ చీర. నిరాడంబరమైన అలంకరణ. ముఖంచాలా కాంతివంతంగా ఉంటుంది.
    రీడింగ్ రూంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మాట్లాడకూడదని రూల్ ఉంది. ఆ రూల్ బ్రేక్ చెయ్యటానికి ఉన్న ఉపాయాలన్నీ వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు స్టూడెంట్స్. కొందరులావుపాటి పుస్తకాలుముందేసుకుని చిన్న చిన్న స్లిప్స్ ద్వారా సంభాషణలు జరుపుకొంటున్నారు. మరి కొందరు బుక్స్ రాక్స్ వెనుకచేరి గుసగుసలు చెప్పుకుంటున్నారు.
    రిఫరెన్స్ బుక్స్ జాగ్రత్తగా చూసుకుంటూనే చుట్టూ చూస్తోంది యశోద. ఆమె చూపులు ఎవర్నీ వెతుక్కోవటంలేదు. దేనికోసమూ ఎదురు చూడటం లేదు. అలా చూసీ చూడనట్లుచుట్టుప్రక్కలవాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళ మనస్తత్వాలు అంచనా వెయ్యటం. తర్వాత తన అంచన తప్పో రైటో తెలుసుకోవటం యశోదకి చాలా ఇష్టం.
    అందరినీ మామూలుగా గమనిస్తుంది. ఎవరైనా ప్రత్యేకంగా కనిపిస్తే మాత్రం మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుంది.
    యశోద చూపులు కొంత దూరంలో ఉన్న వివేక్ మీద నిలిచాయి. అతడు యశోదనే చూస్తున్నాడు.

    ఎప్పటి నుండి చూస్తున్నాడో తెలీదు. యశోద చూపులతో చూపులు కలవగానే చటుక్కున చూపులు తిప్పుకున్నాడు.
    ఏదో మహాపరాధం చేస్తూ దొరికిపోయిన వాడిలాగా తల దించుకున్నాడు. సిగ్గుపడుతున్నట్లుగా లేదు అతని మొహం. ఏదో చెయ్యరాని పనిచేస్తూ ఇతరులకి దొరికిపోయినట్లు, లజ్జతో కృంగిపోతూ తల దించుకున్నాడు.
    ఇదివరలో కూడా అతడు యశోదవంక చూడటం. ఆమె చూపులతో చూపులు కలవగానే భయపడిపోతున్నట్లు అయిపోవటం జరిగింది.
    అతడిని మరింత పరిశీలించాలనిపించింది. మళ్ళీ మళ్ళీ అతడి చూపులతో చూపులు కలపటానికి ప్రయత్నించింది.
    అతడు ఏదో చెరువులో మునిగి ఊపిరాడని వాడిలా అయిపోయి రీడింగ్ రూంలోంచి వెళ్ళిపోయాడు.
    అతడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ క్లాసో తెలుసుకోవాలనిపించింది. చాలా గమ్మత్తుగా ఉంది అతడి ప్రవర్తన.
    అతడు సైకాలజీ స్టూడెంట్ కాదు.
    రిఫరెన్స్ బుక్ దాని ప్లేస్ లో షెల్ఫ్ లో పెట్టేసి రీడింగ్ రూం బయటకివెళ్దామని బయలుదేరింది.

    వరండా కిటికీ లోంచి రీడింగ్ రూం లోపలికి చూస్తున్నాడు వివేక్. ఆకర్షణీయమైన పెద్దకళ్ళు. పేరుకుతగ్గట్లే చూడగానే ఇంటెలిజెంట్ అనిపించే ముఖ వర్చస్సు! కానీ నవ్వులో మాత్రం ఏదో అమాయకత్వం!

    యశోద కిటికీలోంచి రీడింగ్ రూం లోపలికి చూస్తున్నాడు వివేక్. ఆకర్షణీయమైన పెద్దకళ్ళు. పేరుకుతగ్గట్లే చూడగానే ఇంటెలిజెంట్ అనిపించే ముఖ వర్చస్సు! కానీ నవ్వులో మాత్రం ఏదో అమాయకత్వం!
    యశోద కిటికీ వైపు చూడగానే చటుక్కున అక్కడి నుంచి తప్పుకుని మరుక్షణంలో చెట్లచాటుకుకనుమరుగైపోయాడు. ఎలాగైతేనేం అతడిని వెతికి పట్టుకుని మాట్లాడాలని నిర్ణయించుకుంది యశోద.

    యశోద క్లాస్ మేట్ అరుణ అటూఇటూ చూస్తూ క్లాస్ రూంబయట వరండాలో తిరుగుతున్న యశోదని ఉద్దేశించి నవ్వుతూ అంది...   

    "ప్రఖ్యాత పరిశోధకురాలు కుమారి యశోదాదేవి తన పరిశోధన కోసం "గినియాపెగ్స్" ని వెతుక్కుంటూ ఇలా బయలుదేరిందా?"
    "గినియాపెగ్ అవునో కాదో నాకు తెలీదు. కానీ కొంత గమ్మత్తుగా ఉంది ధోరణి. అతడు ఏక్లాసో తెలుసుకుని అతడితో మాట్లాడాలని ఉంది."
    "ఆధోరణి ఏమిటో కాస్తవివరించు. ఆ గినియా పెగ్ కోసం నేనూ వెతుకుతాను."
    "నావైపు చూస్తాడు నేను చూడగానే తబ్బిబ్బుపడిపోయి తల దించుకుని పారిపోతాడు. చాలా కంగారుపడిపోతాడు."
    "అతడా! వివేక్! లిటరేచర్ స్టూడెంట్! అతడూ యం.ఏ. ఫైనల్ లోనే ఉన్నాడు!"
    "ఇంత తొందరగా ఎలా గుర్తు పట్టావే?"  
    "ఒకప్పుడు అతడికోసం నేనూ వలవిసిరాను. అందగాడని ఐశ్వర్యం ఉన్నవాడనీ. కానీ అతడు ఆడగాలి సోకగానే ఈతరానివాడు లోతుగా ఉన్న చెరువులో మునిగినట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. దొంగతనంగా ఐనా నీ వైపు అన్నిసార్లు అతడు చూడటం నీ అందానికి ఆకర్షణకి చాలా గొప్ప సర్టిఫికెట్"
    "ఏడిశావులే! ఆ సర్టిఫికేట్ ఏదైనా వొస్తే అది నీకే ఇస్తాను! అదిసరే గానీ అతడు పిరికివాడా? లేకపోతే నలుగురిలోనూ ఇమడలేడా?"

    "అదేంకాదు. అతడు మంచి వక్త. ఏవిధమైన అడ్డూ లేకుండా అనర్గళంగా శ్రోతలను ఆకట్టుకుంటూ గంటలకొద్దీ ఉపన్యసించగలడు. మంచి కరాటే ఫైటర్....."

    "కరాటే ఫైటర్....?"
    "అతడిదగ్గర మన కాలేజిస్టూడెంట్స్ లో చాలామంది ప్రతీ సాయంత్రం కరాటే నేర్చుకుంటారు. కాలేజీ ప్లేగ్రౌండ్స్ లో!"
    "నిజంగా నువ్వు చూసావా?"
    "ఆ! నాక్కూడా నేర్చుకోవాలనిపించింది. కానీ నన్ను చూడగానే ఆ కరాటే వీరుడుకి వంటినిండా చెమటలు పట్టడంతో అతడి శిష్యులంతా నన్ను బయటికి గెంటేసారు."   
    "అయితే తప్పకుండా అతడితోపరిచయం చేసుకుంటాను."
    "నేనూరానా?"
    "నోర్మూసుకో, జానీతో తిరుగుతున్నావుగా! రూట్ మార్చకు!"
    "జానీ లాభంలేదు. 'పెళ్ళిటైప్' కాననిస్పష్టంగా చెప్పేసాడు. ఇంకో రూట్ చూసుకోవలసిందే."
    "అయితే ముందు నన్ను మాట్లాడనియ్యి. పెళ్ళి టైప్ అవునో కాదో తేల్చుకుని తర్వాత నిన్ను పరిచయం చేస్తాను."
    "సరే! తీరా పరిచయమయ్యాక. అది ముదిరాక నన్ను మరిచిపోకు!"
    "నోర్మూసుకో! ఎక్కడైనా ఏదైనా వాగావంటే తెలుసుగా!" చెయ్యెత్తి చూపించింది.
    అరుణభయం నటిస్తూ లెంపలేసుకుని "వాగనువాగను" అని వెక్కిరించి వెళ్ళిపోయింది.

Next Page