Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 1

                                 


                     ప్రేయసీ! నీ పేరు రాక్షసి!                                                                                     యర్రంశెట్టి శాయి

                                 


    అతి సమీపంలోనే పిడుగు పడినంత భయంకరంగా ఆకాశం ఘర్జించింది.
    ఆ శబ్దానికి ఆమె భయంగా అతనిని కౌగిలించుకుంది.
    సరిగ్గా అప్పుడే ఎగిరిన కిటికీ కర్టెన్ సందులోనుంచి ఆకాశాన్ని రెండుగా చీల్చిన మెరుపు, కళ్ళు మిరిమిట్లు గొలిపేంత కాంతితో మెరిసింది.
    ఒక్కసారిగా విదిలించి కొట్టిన చల్లగాలి తనతోపాటు లత మల్లెల గుబాళింపుని తీసుకొచ్చి అతని శరీరమంతా తాకేసరికి ఉక్కిరి బిక్కిరయ్యాడతను.
    తన్మయత్వంతో, కోరికతో ఆమె కురులలో మొఖం దాచుకుని గుండెల నిండుగా మల్లెల సువాసన పీల్చుకున్నాడు.
    దరిచేరిన పెదాలు అమృతం కురిపించాయ్.
    ఆ అర్థరాత్రి_
    మరోసారి
    ఒకరిలో ఒకరు ఐక్యమయిపోతున్న సమయంలో_
    బయట ఉధృతమయిన వర్షం ప్రారంభమయింది.
    వర్షం ఎప్పటికి వెలిసిందో తెలీదు.
    ఒకరి కౌగిలిలో ఒకరు ఎప్పటికి సేదతీరారో తెలీదు.
    "ఇంక వెళతాను" అంది శృతి.
    "అప్పుడేనా??" అసంతృప్తితో అడిగాడు.
    ఆమె నవ్వింది.
    "నాకు తెలుసు- ఎన్ని రోజులు గడిపినా పరగడుపే"
    "అన్యాయం" అన్నాడతను. "ఇంకొద్దిసేపు"
    "ఇంకేమైనా వుందా?"
    "శృతీ...."
    "ఊఁ...." తయారై హాండ్ బాగ్ అందుకొంటూ అందామె.
    "ఇంకెంతకాలం ఇలా?"
    "కొంచెం ఓపిక పట్టు...."
    "ఇంకెంతోకాలం ఆగలేను లేను"
    "అంటే? వదిలేస్తావా నన్ను?"
    "అలా కనిపిస్తున్నానా?" లేచి ఆమె దగ్గరగా వచ్చి చుబుకం పట్టుకున్నాడు.
    "చచ్చిపోతానేమోగాని నిన్ను వదిలేయగలనా?"
    "నేను మాత్రం ఇలా నీకు దూరంగా బ్రతగ్గలనా?" వీలు చూసుకుని అడిగేస్తాను.
    ".........."
    "మళ్ళీ ఎప్పుడు?"
    "ఏమో....టైమ్ చూసుకొని నేనే ఫోన్ చేస్తా....ఏం?"
    తలుపుదాకా నడిచి వెనక్కి తిరిగిందామె.
    "సాగర్"
    "ఊఁ...."
    "కిస్ మీ" మత్తుగా అంది.
    ఆమె దగ్గరగా నడచి నడుంచుట్టూ చేయివేసాడు.
    "బై డార్లింగ్"
    ఆమె పెదాలపై మెత్తగా చుంబించాడతను.


                                                *    *    *    *


    ఎదురుగా వున్న గ్లాసులోని నీరు మరో గ్రుక్క త్రాగి తిరిగి గ్లాసు టేబుల్ పైన ఉంచాడు సాగర్. చల్లని నీరు గొంతుదిగి, గత రెండు గంటలనుండీ అతన్ని వేధిస్తున్న సమస్యకి ఊరట కలిగించింది. విసుగ్గా ఓసారి గడియారంవంక చూసుకున్నాడు. ఆరుగంటలయ్యింది అప్పుడే. అయిదున్నరకి కలుద్దామన్న 'శృతి' ఇంకా రాకపోవడంతో విసుగుతో పాటు చిన్నగా కోపం కూడా రాసాగింది. ఒకసారి చేతులకేసి చూసుకొని మళ్ళీ హోటల్ వాకిలికేసి దృష్టి సారించాడు.
    జంటనగరాలలో మంచి హోటళ్ళుగా జమకట్టబడే వాటిలో అది కూడా ఒకటి. మొదటి అంతస్థులో చైనీస్ రెస్టారెంటుంది. క్రింద వెజ్ టేరియన్ రెస్టారెంట్....విశాలమైన ఆ రెస్టారెంటులో దాదాపు నూరుమంది కూర్చోవచ్చు.
    కాస్త చిన్నగా మాట్లాడుకుంటే ప్రక్కటేబుల్ వాళ్ళకి వినిపించే అవకాశం అస్సలు లేదు.
    చల్లటి ఎయిర్ కండిషన్డ్ గదే అయినా సాగర్ నుదుటికి చిరుచెమటలు పట్టాయి. ఎందుకో ఆరోజు శృతి తనకి ఫోన్ చేయడం గుర్తుకొచ్చింది.
    "సాగర్?"
    "యస్"
    "నేను....శృతిని"
    "చెప్పు...."
    "మనం అర్జంటుగా కలుసుకోవాలి"
    ఆమె కంఠంలోని ఆతృత కంగారు పెట్టిందతనిని.
    "ఎనీ ప్రాబ్లమ్?"
    "ఫోన్ లో మాట్లాడేది కాదు"
    తూచి, తూచి మాట్లాడుతోంది.
    అతని మనసెందుకో కీడును శంకించింది.
    "ఎక్కడ?"

Next Page