ప్రధమ తాంబూలం
వసుంధర
ఇళ్ళ స్థలాల కోసం రీజనల్ డేవలప్ మెంట్ బోర్డుకు అప్లై చేశాను. ఇల్లు కట్టుకునేందుకు మా ఆఫీసు నాకు రెండు లక్షలు అప్పిస్తుంది. దాంతో చక్కటి యిల్లోకటి కట్టేసుకుని అందులోనే ఉండాలని నా ఆశ.
నగరానికి మాధ్యలో పెంటకుప్పలుంటే పెద్ద స్థలమొకటుంది. ఆ మైదానం ఊరి అందాన్ని హారిస్తోంది. నగర వసులక్కడి వాసనను భరిస్తున్నారు. కొత్తగా వచ్చిన మ్యున్సిపల్ కమీషనర్ ఏ కారణం వల్లనో - ఆ స్థలంలో ఇళ్ళు కట్టాలనుకున్నాడు.
మాములుగా అయితే అక్కడి స్థలం ధర నా బోటి వాడికి కందుబాటులో ఉండదు. ఈ స్థలాన్ని సరసమైన ధరకు అప్లికేషన్సు ప్రకారం ఎవరికైనా యివ్వాలని మ్యున్సిపాలిటీ నిర్ణయించింది. ఇళ్ళ స్థలాల కేటాయింపు న్యాయ ప్రకారం జారుగుతుందని స్థానిక దిన పత్రికలలో ప్రకటించడం కూడా జరిగింది.
అక్కడ వందిళ్ళ కవకాశముంది. అప్లీకేషన్సు యాభై వెల దాకా వచ్చాయి. కొందరు ప్రముఖులా సమక్షంలో , లాటరీ పద్దతిలో స్థలాల కేటాయింపు జరిగింది. వందమందికి ఉత్తరాలు వెళ్ళాయి. వందమంది పేర్లూ స్థానిక దినపత్రికలో వేయడం కూడా జరిగింది.
అందులో నా పేరూ ఉంది.
స్థలాల కేటాయింపు న్యాయంగా జరిగిందనడానికిదే నిదర్శనం. నేను మంచి ఉద్యోగంలో ఉండి నా మాటుక్కు నేనో రిఫిజిరేటర్ కొనుక్కోగలనేమో ! నా పిల్లలు కాస్త మంచి బట్టలు వేసుకుంటారేమో! కానీ నేను - నగరానికి సంబంధించి అనామకుణ్ణి.
ఇళ్ళ స్థలాలు కేటాయింపైన వారిలో ఇంచుమించు నా బోటి వారే!
నేనెంతో సంతోషించాను. వెంటనే ఆమోదాన్ని తెలియబరుస్తూ ఉత్తరం కూడా రాశాను.
నెల్లాళ్ళయింది.
ఒకరోజు మా ఇంటికో మానిషి వచ్చాడు. తన పేరు ధర్మారాజని చెప్పాడు. అతడెవరో నాకు తెలియలేదు.
"నగరం మధ్య మైదానంలో మీకు స్థలం కేటాయింపు జరిగింది మీకు. పదివేలిచ్చి స్థలం కొంటున్నారు. నేనా స్థలానికి పాతిక వేలిస్తాను. నా కామ్మేయండి." అన్నాడతను.
ఆ ప్రాంతాల స్థలాలే దొరకవు. ఏ సెంటర్లో కొనాలన్నా స్థలం ఆ మాత్రంది కావాలంటే యాభై వేల దాకా అవుతుంది.
నే నతడికి సారీ చెప్పాను.
ఆతడు ధర పెంచాడు.
నే నొప్పుకోలేదు.
అతడు నలబై వేల దాకా వెళ్ళాడు.
"స్థలం అమ్మే ఉద్దేశం నాకు లేదన్నాను. మీరు బేరాలు చెప్పవద్దు-" అన్నాను కాస్త తీవ్రంగా.
"నేను నేనుగా మాట్లాడ్డం లేదు. కొందరు ప్రముఖుల తరపున వచ్చాను నేను. వారు తలచుకుంటే ఆ స్థలం మీక్కాకుండా పోగలదు" అన్నాడు ధర్మరాజు.
"ఎలా?"
స్థలం కేటాయింపు జరిగిన నెల రోజుల్లోగా మీరు వాళ్ళకి ఉత్తరం రాయాలి - ఆమోదాన్ని తెలియబరుస్తూ! ఆ ఉత్తరం నెలరోజుల్లోగా వారికి చేరకపోతే - మీకా స్థలం అవసరం లేదని వాళ్లనుకుంటారు. మరొకరికి కేటాయిస్తారు." అన్నాడతను తాపీగా.
"నేను వెంటనే ఉత్తరం రాశాను. నెల్లాళ్ళవసరం లేదు. వారం రోజుల్లోనే అంది ఉంటుంది."
ధర్మరాజు నవ్వి - "ఉత్తరం ఫైల్లోంచి గల్లంతైతే....? అన్నాడు.
నా గుండె గుభేలుమంది.
రీజనల్ డెవలప్ మెంట్ బోర్డు - ఆఫీసులో ఇలాంటివి చాలా జరుగుతాయని విన్నాను.
"గల్లంతెందు కవుతుంది?" అన్నాను మేకపోతు గాంభీర్యంతో.
"రిజిస్టర్డు ఉత్తరాలే గల్లంతవుతాయి మీరు మామూలుత్తరం రాశారు. గల్లంతు చేయడం మాకు కష్టం కాదు. రెండ్రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. ఈలోగా ఆలోచించుకొండి." అని ధర్మరాజు వెళ్ళిపోయాడు.
నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. రిజిష్టరు లెటరు రాయాల్సింది.
ఇప్పుడిక టైము లేదు. గడువై పోయింది.
ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా శ్రీమతి పిలిచి ఏదో పని చెప్పింది. బజారుకు వెళ్ళాను. అనుకోకుండా బజార్లో భూషణరావు కనబడ్డాడు.
భూషణరావు నా క్లాస్ మెట్. ఇద్దరం విడిపోయి ఆరేళ్ళయింది. నాకు హైదరాబాదు లో ఉండాలని గుర్తు.
"అరే - భూషణ్! నువ్విక్కడున్నావేమిటి?" అన్నాను.
వాడూ నా గురించి అదే ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.
ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం.
భూషణరావు రీజనల్ డెవలప్ మెంట్ బోర్డు - ఆఫీసులో ఆఫీసరుగా వచ్చి రెండు నెలలయింది.
వెంటనే నేను వాడికి నా సమస్య చెప్పుకున్నాను.
"ఇదేం పెద్ద సమస్య కాదు. రేపోసారి ఆఫీసు కిరా-' అన్నాడు భూషణరావు.
"నా వివరాలిస్తాను, నేను మళ్ళీ ఆఫీసుకి రావడమెందుకు ?" అన్నాను.
'అలా కాదు ఎవరి కేసు నైనా వ్యక్తుల సమాక్షం లోనే చూడాలని మాకు నియమముంది. లేకుంటే ఇంటికి వచ్చి చాలా మంది మమ్మల్ని ఇన్ ఫ్లుయన్సు చేసే అవకాశాలుంటాయని యాజమాన్యం అభిప్రాయం. నువ్వు స్వయంగా ఆఫీసుకు రాకపోతే నీ కేసు చూడలేను...." అన్నాడు భూషణరావు.
"మరి పెద్దవాళ్ళ విషయం ల్లోనూ ఇంతేనా?"
"ఊ " అన్నాడు భూషణరావు. "వాళ్ళిలా రావడానికి జంకుతారు . ఇలాంటి వ్యవహారాల్లో స్వయంగా జోక్యం చేసుకోవాదం వాళ్ళ కిష్ట ముండదు. అసలు వాళ్ళ ఇన్ ఫ్యుయన్స్ తగ్గించాలనే యాజమాన్యం ఈ నియమం పెట్టింది. అప్లికేషన్ ఎవరిదో ఆ మనిషే స్వయంగా రావాలి. తన మనుషుల్ని పంపినా మేము పని చూడం -" అన్నాడు భూషణరావు కచ్చితంగా.
భూషణరావబద్ధం చెప్పడని నాకు తెలుసు.
మాది చాలా దగ్గర స్నేహం.
ఒకళ్ళ నొకరు బూతులు కూడా తిట్టుకునే వాళ్ళం. అయితే మా మధ్య ఎన్నడూ విరోధ భావం లేదు.
భూషణరావుని ఇంటికి రమ్మన్నాను.
వాడు రానన్నాడు.
"నీ పని పూర్తయ్యాక స్థలం నీ పెరున రిజిష్టరయ్యాక నీ ఇంటికి పిలిచి సన్మానించు. అంతవరకూ రాను." అన్నాడు భూషణరావు.
మర్నాడు భూషణరావు ఆఫీసుకు వెళ్ళాను. సైంధవుడిలా నాకు ఫ్యూన్ అడ్డం తగిలాడు.
అతడి పేరు అప్పల నరసయ్య. చాలా అర్జెంటన్నాను. భూషణరావు నా స్నేహితుడన్నాను.
దేనికీ వాడు చలించలేదు.
"సాబ్ బిజీగా ఉన్నారు. ఈరోజు కేవర్నీ చూడరు....." అదే వాడి సమాధానం.
నేను దిగులుగా బయటకు వచ్చాను. అక్కడెవరో నాకు సలహా యిచ్చారు. అప్పలనరసయ్య చేతిలో పది రూపాయాలు పెట్టమని.
నా స్నేహితుణ్ణి కలుసుకునేందుకు - నేను ఫ్యూన్ చేతిలో డబ్బు పెట్టాలా? నా దగ్గర భూషణరావు టెలిఫోన్ నెంబరుంది.
నా ఆఫీసుకి వెళ్ళి భూషణరావుకి ఫోన్ చేశాను.
భూషణరావు ఫోనెత్తి నా గురించి తెలుసుకుని - 'సాయంత్రం బజార్లో కలుసుకుందాం -" అన్నాడు.
ఫోన్లో వాడి కెక్కువ మాట్లాడ్డం ఇష్టం లేదని అర్ధమయింది.
భూషణరావుని బజార్లోనే కలుసుకున్నాను.
"వాడి చేతిలో పది రూపాయలు పెట్టు - ' అన్నాడు భూషణ'రావు.
"నువ్వు యిదే సలహా ఇస్తావా? నీ ఆఫీసులో నీ స్నేహితుడు నిన్ను కలుసుకుందుకు లంచమివ్వాలా?" అన్నాను రోషంగా.
"నువ్వేమైనా అనుకో....ఇది తప్పని సరి. అప్పలనరసయ్య కి రూలంటే రూలే! కొందరి విషయంలో నేను కలగజేసుకున్నానంటే రెండు రకాల వాడు నన్ను వేదిస్తాడు. ఒకటి అడ్డమైన వాళ్ళనూ నా గదిలోకి వదలడం. రెండు- వాడి యూనియాన్?" అన్నాడు భూషణం.
"అడ్డమైన వాళ్ళు నీ దగ్గర కెందుకొస్తారు?" అన్నాను.
"ప్రతి చిన్నపనికి ఆఫీసర్నీ మీటవడం ఒక అలవాటై పోయింది జనానికి. అందువల్ల మా పనుల అవరోధం కలుగుతుంటుంది. మా ఆఫీసులో ఫ్యూన్సు కొందరికి రెట్సు న్నాయి. వాళ్ళ కొచ్చే డబ్బులో పై అధికారులకి వాటా లున్నాయి. ఎవరి విషయంలోనూ ఈ నియమం సడలించలేము. అందువల్ల నాకే ఇబ్బంది...." అన్నాడు భూషణరావు.
నేను భూషణ'రావును తిట్టాను. ఆఫీసులో నువ్వు నన్ను కలుసుకోవాలంటే అప్పలనరసయ్య కు డబ్బిచ్చి తీరాలి...." అన్నాడు భూషణరావు.'
ఈ విషయమై ఆఫీసుకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను." అన్నాను. అపరిమితమైన ఆవేశంతో.
"చేయి. అందువల్ల అప్పల నరసయ్యకు తాత్కాలికంగా ప్రమాదముంటుంది. ఆ ప్రమాదం తప్పించుకొనటం అతనికి తెలుసు. కానీ నీ స్థలం నువ్వు దక్కించుకోలేవేమో చూసుకో" అన్నాడు భూషణ'రావు.
వాడి హెచ్చరిక నా కర్ధమయింది.
"నువ్వు అవినీతి పరులను సమర్దిస్తున్నావు-" అన్నాను.
"ఒక వ్యవస్థలోని భాగాన్ని నేను-" అన్నాడు భూషణరావు.
మర్నాడు నేను అప్పలనర్శయ్యకు పది రూపాయలు ఇచ్చాను. అతడింకో పది అడిగాడు.
"ఎందుకు ?" అన్నాను.
"మీరు నిన్న వచ్చారు. ఇది రెండో సారి రావడం. మొదటి సారికి పది, ఇప్పుడింకో పది...."
చాలా తాపీగా అన్నాడతడు.
నాలో మళ్ళీ ఆవేశం చోటు చేసుకుంది.
అప్పలనరసయ్య స్వరం తగ్గించి - "ఆఫీసరు బాబు మీకు స్నేహితుడో కాదో తెలియదు . కానీ స్నేహితుడైనా సరే - నేను తల్చుకోనిదే పని కాదు. నాకు మీ పనేమిటో చెప్పండి. జరిగేదో జరగందో చెబుతాను -" అన్నాడు.
నేనావేశాన్ని తగ్గించుకున్నాను. ఎందుకయినా మంచిదని విషయం అతడికి చెప్పాను.
"ఫైల్లో కాగితాలు గల్లంతు చేయడానికి వాడికి వెయ్యి రూపాయలు దాకా ముడుతుంది సార్. కాగితం గల్లంతైతే ప్రధానమంత్రి కూడా మీకు సాయపడలేడు. పనైతే నన్ను సంతోష పెడతానని మాటివ్వండి. చిటికెలో మీపనవుతుంది. వెయ్యి రూపాయలుచ్చుకుని పెద్దవాళ్ళకు సాయపడ్డం లో కంటే - తక్కువైనా పుచ్చుకుని మీబోటి వాళ్ళకు సాయపడ్డంలోనే మాకానందముంది సార్!" అన్నాడు అప్పాలనరసయ్య.
అతడికింకో పది ఇచ్చాను. సంతోషపెడతానని మాటిచ్చాను.
ఆఫీసులో భూషణరావు దర్శనమయింది నాకు.
భూషణ'రావు గుమస్తాను పిల్చుకుని రమ్మని అప్పలనరసయ్య కు చెప్పాడు. గుమస్తా వచ్చాడు.
"ఉత్తరం రిజిష్టరు పోస్టులో పంపారా?" అన్నాడు క్లర్కు .
"లేదు -"
"పోనీ ఉత్తరం కాపీ ఉందా?"
"లేదు....ఏ తేదీన రాశానో చెప్పగలను."
"ఆ సమాచారం చాలు. ఇతడు నా క్లాస్ మేట్ . ఉత్తరం ఎప్పుడందిందో చూసి చెప్పు ." అన్నాడు భూషణ'రావు క్లర్కుతో.
అతడు రిజిష్టర్ వెతుక్కున్నాడు.
మేమిద్దరం చిన్ననాటి కబుర్లలో పడ్డాం.
నేనూ, భూషణరావు స్నేహితులమని క్లర్కుకు తెలియాదానికే ఆ కబుర్లు.
నాకేసు న్యాయమైంది.
భూషణరావుకు కావలసిన మనిషిని నేను. క్లార్క్ కు ఉత్తరం దొరికింది.
"వెంటనే ఉత్తరం అందినట్లు లెటర్ టైపు చేయి. రిజిస్ట్రేషన్ కి తేదీ నిర్ణయించు " అన్నాడు భూషణరావు.
క్లర్కు తలూపి వెళ్ళిపోయాడు.
తర్వాత రెండు నెల్లల్లో స్థలం నా పేరున రిజిస్ట్రేషన్ అయిపొయింది.
"నువ్వు నాకు సన్మానం చేయాలి.' అన్నాడు భూషణ రావు.
"తప్పకుండా . రేపు హోటల్ శారదకు రా. సాయంత్రం ఆరింటికి...." అన్నాను.
భూషణ'రావు ఒప్పుకున్నాడు.
అయితే ఆ సాయంత్రం అనుకోకుండా అరుగంటల ప్రాంతంలో ఇద్దరం హోటల్ శారదలో కలుసుకున్నాం.
ఎందుకో భూషణరావక్కడికి వచ్చాడు.
నన్ను నాఎదుట కూర్చున్న అప్పలనరసయ్య నూ జూసి ఆశ్చర్య పడ్డాడు.
"ఇలారా-" అని పక్కకు పిలిచి - "ఏమిటిది?" అన్నాడు నెమ్మదిగా.
నేను నవ్వి ,"ప్రధమ తాంబూలం !" అన్నాను.
***