Previous Page
గృహిణి పేజి 20


                                        3

    ఆ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిముషాల కింట్లో అడుగు పెట్టింది ప్రియ. గుమ్మలోనే ఆమెను భర్త పలకరించాడు.
    ఆ సమయంలో అతడినింట్లో చూసి ఆశ్చర్య పోయింది ప్రియ.
    "నీతో మాట్లాడాలి -" అన్నాడు రాఘవ క్లుప్తంగా.
    ప్రియ భర్త ననుసరించి పడక గదికి వెళ్ళింది.
    రాఘవ తలుపులు వేశాడు . ప్రియ ఆశ్చర్యపడింది.
    "నేనేం తప్పు చేశాను?" అన్నాడు రాఘవ.
    ప్రియ ఆశ్చర్యంగా - "మీరు తప్పు చేశారని ఎవరున్నారు ?' అంది.
    "ఒక తప్పు జరిగంది. ఏ తప్పుకూ కారణం నీవు కాలేనని నా నమ్మకం . అందుకని నేనే ఆ కారణమని భావిస్తున్నాను." అన్నాడు రాఘవ.
    "ఏమిటా తప్పు ?"
    "ఇప్పుడు నువ్వెక్కన్నించి వస్తున్నావు?"
    ఇలాంటి ప్రశ్న భర్త తననడగడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె తడబడింది.
    'చెప్పు ప్రియా! ఇప్పుడెక్క నించి వస్తున్నావు?"
    "నా గురించి మీకు తెలియని విశేషమేముంటుంది?"
    "అయినా సరే - నీనోట వింటాను, చెప్పు ...."
    "మనింటికి వెళ్ళి - ఏకాంతంగా నా గదిలో సంగీతం వింటూ పుస్తక పఠనం చేశాను-"
    "నువ్వబద్దం చెబుతున్నావు ..."
    "మీకు తెలిసిన నిజమేమిటో చెప్పండి!" అంది ప్రియ.
    "నువ్వు అ ప్రక్క వాటా బాబూరావుతో.....' ఆగాడు రాఘవ.
    ప్రియ ముఖం ఎర్రబడింది. "అంటే మీరు నామీద నిఘా వేసి నా రహస్యాలు తెలుసుకోవాలనుకుంటూన్నారన్నమాట! మీరు నన్ననుమానిస్తున్నారన్న మాట?"
    రాఘవ చలించకుండా - "లేదు నిన్ననుమానించేవాడినైతే ఈ విషయం ఎప్పుడో తెలుసుకునేవాణ్ణి. నిన్నారాదించాను. నీకు స్వేచ్చ నిచ్చాను. ఆ స్వేచ్చ నిన్ను పెడదారులు తోక్కించడంలో నా తప్పే మిటో నాకు తెలియడం లేదు-' అన్నాడు.
    "నేను పెడదారులు తొక్కలేదు - " అంది ప్రియ.
    'సమాజపు నీతినియమాలు నీ అభిప్రాయాన్నంగీకరించవు...."
    ప్రియ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. "ఇంతకాలం మీరందరు పురుషుల వంటి వారు కారనుకున్నాను. ఈ రోజది అబద్దమై పోయింది. మీరు నన్ననుమానిస్తున్నారు. మీ అనుమానానికి ఆధారం లేదు...."
    'అధారమంటే ?...."
    "అది సంపాదించడానికి మీరు ప్రయత్నించారని అర్ధం. ఆ ప్రయత్నం నన్ననుమానించడమే కదా?" అంది ప్రియ.
    రాఘవ నిట్టూర్చి - "ప్రియా ! నువ్వు నా ప్రేమనర్ధం చేసుకోలేవు. నువ్వు బాబురావును కలుసుకునేందుకే అక్కడికి వెళుతున్నావన్న విశేషం నాకీరోజే తెలిసింది. అయినా అది ఋజువు చేసుకునేందుకు రెడ్ హ్యాండేడ్ గా నిన్ను పట్టుకోవాలని నేననుకోలేదు. నిన్నే అడిగి నిజం తెలుసుకోవాలన్నాను.నిన్ను నేరస్తురాలిగా పరగనించడం నాకిష్టం లేదు. కానీ నీ కన్నబిడ్డల ద్వేషానికి నీవు గురి కాకుడదన్నది నా కోరిక -' అన్నాడు.
    "అంటే?"
    "నువ్వు రోజూ బాబూరావు ను కలుసుకుంటానంటే ఇప్పటికీ నాకే అభ్యంతరం లేదు. కానీ ఆ విషయం మన బిడ్డలకు తెలియకుండా చూసుకొనడం నీ భాద్యత. ఈరోజు విజయ్ మిమ్మల్నిద్దర్నీ చూసి నీమీద ద్వేషం పెంచుకుని నా దగ్గరకు వచ్చి చెప్పాడు...." అన్నాడు రాఘవ.
    ప్రియ తెల్లబోయింది. ఆమెకు నోట మాట రాలేదు.
    రాఘవ ఆమెకేం జరిగిందో ఎలా జరిగిందో చెప్పాడు.
    "నేను నిన్ను సానుభూతితో అర్ధం చేసుకుంటాను. నాలో లేని ఆకర్షణ నీకా బాబురావులో ఏమి కనబడింది?" అన్నాడు రాఘవ ప్రశాంతంగా.
    తమాయించుకునేందుకు ప్రియకు కాసేపు పట్టింది. తర్వాత ఆమె గొంతు సవరించుకుని నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది.
    "నేను మధ్యతరగతి లో పుట్టాను. నా అందం అసామాన్యమైనదని మీరన్నారు కానీ మానసికంగా నేను సామన్యురాలిని. మీరు నన్నో సినీతారలాగో, మహారాణి లాగో చూస్తున్నారు. ఆ జీవితం కొంతవరకూ నాకు బాగానే వుంది. అయితే బాబురావు, నేనూ పెళ్ళికి ముందు ప్రేమించుకున్నాం. భావిజీవితం గురించి కొన్ని కలలుకన్నాం. నాకు సంబంధించినంత వరకూ ఆ కలలు సామాన్య గృహిణిని. మీతో వివాహమైనాక ఆ కలల్లో ఒక్కటీ నాకు తీరలేదు....' అని ఆగింది ప్రియ.
    'ఆ కలలేమితో నేను తెలుసుకోవచ్చా ?" అన్నాడు రాఘవ కుతూహలంగా. తన కారణంగా బాబూరావుతో ప్రియకు జరుగవలసిన పెళ్ళి ఆగిపోయిందని రాఘవకు తెలుసు.
    "అన్నింటికీ నా భర్త నాపై ఆధారపడాలి. నా భర్త పనులన్నీ నేను చేసుకోవాలి. అతడికి నేను స్వయంగా వండి పెట్టాలి. నేను సర్ధనిదే అతడి పక్కకు అందం లేదు. నేను వండనిదే అతడి రుచులకు తృప్తి లేదు. నేను చెప్పనిదే అతడి అలంకరణకు హుందాలేదు. నేను లేని లోటు అతడింట అనుక్షణమూ అతడు ఫీలవ్వాలి....."
    రాఘవ ఆశ్చర్యంగా -" 'ఊ" అన్నాడామేను కొనసాగించమన్నట్లుగా.
    "బాబూరావింట్లో నేనతని బట్టలుతికాను. అతడి రుచుల కనుగుణంగా వండి పెట్టాను. అతడింటిని తీర్చిదిద్దాను. అతడు నన్నభినందిస్తుంటే ఎంతో ఆనందించాను...." అంది ప్రియ.
    "బాబూరావద్రుష్టవంతుడు. బాధ్యతలు లేకుండా భార్య దొరికింది." అన్నాడు రాఘవ నిట్టూర్చి.
    'అతడి అదృష్టాన్ని నేనభినందిచలేను...." అంది ప్రియ.
    "ఎందుకని?"
    "నా తనువు భర్త ను కోరింది. నేను మీకు భార్యనయ్యాను. నా మనసు భర్తను కోరింది. బాబురావు కు గృహిణినయ్యాను. ఈ విధంగా నాకు తనువు, మనసు రెండూ తృప్తి చెందాయి. కానీ బాబూరావుకు గృహిణి లభించింది. భార్య లేదు. ఇది అదృష్టమే నంటారా ?" అంది ప్రియ.
    "ఏమన్నావ్ ?" అన్నాడు రాఘవ.
    ప్రియ బడులివ్వకుండా అతడి వైపు చూసింది.
    ఆమె కనులబాష రాఘవకు తెలుసు. అవి అతడి కెన్నడూ  అబద్దం చెప్పలేదు.
    తన ఇంట గృహిణి కాలేక  ఆమె బాబూరావు నాశ్రయించింది. శారీరకంగా ఆమె ఏతప్పూ చేయలేదు.
    సినీతారలు, మహారాణులు - తమ సౌందర్యాన్ని - పరుల కోసం జీవించే తమ పద్దతుల కనుగుణంగా మలచుకుంటారు. కేవలం తన కోసమే జీవించాలనుకున్న ఒక యువతిని వారిలా తయారు చేయాలనుకున్న కారణంగాప్రియ మానసిక అసంతృప్తిని చల్లార్చుకునేందుకు మరో పురుషుడి నాశ్రయించింది.
    "ప్రియా ! మగడనుమానించని మగువను భగవంతుడు కూడా తప్పు పట్టలేడు. మన బాబుకు నేను నచ్చజేప్పగలను. ఈరోజు నుండి నీవు నా భార్యవు కాదు. గృహిణివి...." అన్నాడు రాఘవ.

                                           ***

 Previous Page