Previous Page Next Page 
వేప పువ్వులు పేజి 5

                                 


    లోలోపల ఆవిడఎంత దహించుకుని పోతున్నది సుమిత్ర కనిపెట్ట గలదు.
    అందుకనే ఆవిడ అడిగిన డానికి సూటిగా సమాధానాలివ్వకుండా వక్రం గానే ఇవ్వ మొదలెట్టే సరికి కోపంగా లేచిపోయింది!
    అక్క అంటుండేది -- అత్తగారు బతికి ఉండే రోజుల్లో చాలా సుఖంగా ఉండక పోయినా, పోగొట్టు కున్నది ఆవిడ చాలా సులభంగా భర్తీ చేసెయ్య గలిగేది! కాని, వీళ్ళో పోగొట్టేందు కు మాత్రమే సిద్దం!
    శాంత చిన్న తోటి కోడలును చూసి నవ్వుకుంటూన్న నవ్వు పెదవుల మీద ఉండగానే ఆడబిడ్డ ప్రవేశించింది. స్టేజి కి , ఆ గదికి వ్యత్యాసం లేదు! వెనకటి చిరునవ్వు తాలూకు చిహ్నాలు తనను చూసే అనుకుని పెద్దగా పళ్ళికిలిస్తూ నవ్వింది , పాపం!
    ఆ నవ్వులో ఎంతో విషం ఉంది!
    ఆ నవ్వులో ఎంతో ఈర్ష్య ఉంది!
    అదే నవ్వులో ఎంతో హేళన ఉంది!
    మెడలో చిక్కుపడిపోయిన మంగళ సూత్రాలని సవరించు కుంటూ ప్రవేశించింది! సుమిత్ర మెడలోని ఒంటిపేట గొలుసు నవ్వింది!
    ఈసారి నటించడం లో నాలుగడుగులు వేసింది సుమిత్ర.
    పమిట ను సవరించుకుని నిండుగా కప్పుకుని హుందాగా నవ్వింది సుమిత్ర, మనిషి కొంచెం గడసరి తనం నేర్చిందన్న మాట అనుకుంటూనే.
    "కులాసాగా ఉన్నారా? పాపం-- ఉద్యోగం, చదువు అన్నీ సాగుతున్నాయా?ప్రశ్నించింది ఎత్తెత్తి పొడుస్తూ.
    తల ఊపుతూ , "ఏమిటో వీటిలో ఏ ఒకటి లేకపోయినా మనం బతికేది తిని తిరగడాని కెనా అనిపిస్తుంది! కాకిలా నిరుపయోగంగా బతికే కంటే, ఏదో జీవితాన్ని మనం తీర్చి దిద్దే ముగ్గులంత అందంగా చేసుకోవాలనీ" నిరుపయోగంగా కాలాన్ని ఖర్చు సేస్తున్నందుకు నవ్వుతూ అంది సుమిత్ర.
    "మధ్యాహ్నం తీరిక వేళల్లో......."
    మధ్యలోనే ఆవిడ మాటలు అందిపుచ్చుకుని, "మధ్యాహ్నం తీరిక వేళ లంటూ ఉంటాయనే మాకు తెలియదు! పొద్దున్నే లేవడం, ఓపిక ఉన్నంత మేరా కావలసినవి వండు కోవడం, ఆ పైన కాలేజీ కి పోవడం, నా పీరియడ్స్ ఏమైనా ఉంటె క్లాసు లకి పోయి చెప్పటం, లేకుంటే నా రిసెర్చి హడావిడి లో నేను మునిగి పోతాను! మళ్ళీ ఒంటి గంట కి రూముకు వెళ్లి, విశాలి కి దగ్గిర ఉండి అన్నం తినిపించి, నేను కాస్త కాఫీ టిఫిను తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాను! సాయంకాలం ఇంటికి వెళుతూనే కాస్త సేపు విశ్రాంతి తీసుకుని, మళ్ళీ కావలిసింది వండుకుని ఇంక కొంచెం సేపు రేడియో తో గడిపి, భోజనం చేశాక మళ్ళీ రిసెర్చి పుస్తకాలూ గొడవా. ఇది నా దినచర్య. సెలవు రోజుల్లో కూడా ఎక్కువ కాలం చదువులో వినియిగిస్తుంటాను.
    ఇంక విశాలి ఉందంటే , చిన్న పిల్ల , ఇంటి దగ్గిర ఎంతో గారంగా పెరగడం వల్ల పనులేమీ చెయ్యనివ్వను! పది గంటలకి అన్నం తినేసే వరకూ ఏవో రికార్డులు వేసుకుంటుంది. ఆ పైన కాలేజీ. సాయంత్రం ఏదో కాస్సేపు ఆదుకుని అది తిరిగి వచ్చేసరికి మళ్ళీ రాత్రి అన్నం తయారుగా ఉంటుంది! భోజనం చేసి ఆ వేళ పేపరు చదువుకుని, నిద్రపోతుంది పది గంటల కల్లా!
    అందుకనే మాకు విశ్రాంతి వేళలు, తీరిక వేళలు అంటే కంచు కాగడా వేసినా కనిపించవు." మాట్లాడే తీరిక కూడా ఆవిడకి కలగనివ్వ కుండా మాట్లాదేసింది సుమిత్ర.    
    ఉక్కిరిబిక్కిరైన ఆవిణ్ణి అపర్భంధవుడులా మామగారు పిలవకపోతే మరీ ఊపిరే సలిపెది కాదు.
    ఆవిడ వెళ్లిపోతుంటే అపుగోలేని నవ్వుతో సతమతమయింది సుమిత్ర. దీనికంతటి నీ చూస్తూనే, శాంత ముని పళ్ళతో పెదవి నొక్కిపెట్టి, చకచకా పనులు ముగించుకు వచ్చేయ్యాలనే తాపత్రయం లో నానా హైరానా పడిపోతుంది.
    శాంతని చూస్తుంటే దిగులుగా ఉంటుంది అనుకుని తల వంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంది, ఆ మార్గం తప్పే ఉపాయాల కోసం!
    "అసాధ్యంబు లేదుట ఈ ఇలలో..." నీతి సూక్తులు నవ్వుకున్నాయి!
    "చేరి మూర్కుని మనసు రంజింప రాదు......" గుర్తుకు వెనువెంటనే వచ్చి , "శాంతా! ఎక్కడ అలుక్కుని పోతున్నావ్?" అందర్నీ మించిన అధికార దర్పం పాము పడగలా బుస కొడుతుంటే, ప్రవేశిస్తూనే మండి పడుతూన్నశంకరం , మరదలు పిల్ల సుమిత్ర ని చూసి తెల్లబోయి కాస్త కోపాన్ని తమాయించు కున్నాడు. అది గమనించిన సుమిత్ర , "ఇంకాస్త తమాయించు కోవాలి, బావగారూ!" అని నవ్వింది.
    "మా తమాయింపులకేం గానీ, ఏమిటిట వేళా విశేషం!" పూర్తిగా తమాయించు కుని అన్నాడు శంకరం.
    "ఈసారి మా నాన్నగారు తరవాత పెళ్ళిలో మరొక విచిత్ర పద్దతి అవలంబించారు లే! మీ అమ్మాయి నాకు కావాలి అన్న వాళ్లకి ఇవ్వకుండా, అమ్మాయికి నచ్చిన సంబంధాన్ని చేద్దామని!" అంది సుమిత్ర.
    "తమరి పెళ్లి విషయం చెప్పడానికా?" తప్పించబోయిన మాట వెనక్కి లాగి అంది సుమిత్ర. "లేదు, బావా. మా అక్కయ్య చాలా చిక్కి పోయింది, నా వెంట పంపించ కూడదూ? నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుని వస్తుందిలే! మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీ గొప్పతనం తో వంట కి ఒక నాలుగు రోజుల పాటు వంట వాణ్ణి పెట్టుకుంటే మంచిది."
    "నన్ను పిలవటం లేదే! నేనేం చిక్కలేదా!"
    "నీవు చిక్కడం, మా అక్క బలవడం ఒకేసారి గానీ, ఈసారి కొంచెం పంపుదూ!" బతిమాలు కుంటున్న ధోరణి లో అంది సుమిత్ర.
    "నా అభ్యంతరం ఏమీ లేదు."
    "నా కుంది అభ్యంతరం." అక్క అభ్యంతరాన్ని చూసి నిర్ఘాంతపోయింది సుమిత్ర. హటాత్తుగా ప్రవేశిస్తూనే అభ్యంతర పెట్టింది శాంత!
    "ఏమిటిట?' ఇద్దరు ఒకేసారి ప్రశ్నించారు.
    "నేను రాలేను ఈసారి. మళ్ళీ వస్తాలే! నీవు విదేశాలకి వెళ్లి పోయే ముందు ఒక నెల రోజులు ఉండేలా వస్తాను." నమ్మలేనట్లు చూసింది సుమిత్ర.
    "విదేశాలకి వెం చేసే వారేనా, ఇంతకీ ముందు పెళ్లిని గురించి మాట్లాడిందీ?' తికమక పడ్డాడు యేది నమ్మాలో , ఏది నమ్మ కూడదో అర్ధం కాని శంకరం!
    'సరేకానీ, బావా! పోనీ, మీరిద్దరూ కలిసి...."
    మాట మధ్యలోనే అందుకుని, "అదేం కుదరదు సుమీ! నా మాట విను నేను తరవాత వస్తాను!" అంది. అక్క పంతానికి అర్ధం లేదని సుమిత్రకు కోపం వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఖాతరు చెయ్యకుండా వెళ్ళిపోయింది లోపలికి శాంత.
    "కొన్ని కొన్ని మాను జాతి తీగలుంటాయి , బావా! వాటిని సైన్సు లో ఉడ్ క్లైంబర్స్ అంటారు! శుభ్రంగా స్వయంగా పెరగ గల ఓపిక ఉన్నా, ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అంతింత లావు మానులతో అవి వేటి నైతే ఆధారంగా అల్లుకుంటూ పోతాయో, చివరికి ఆ ఆధారాలు సర్వనాశనం అయి పోతాయి నలిగి! అందుకనే ఈ మధ్య వాటికి ఆధారంగా ముళ్ళ తీగెలు కడుతున్నారు. ఈ ఇంట్లో ఆ జాతి తీగెల కోసమని అల్ప ప్రాణిని ఉపయోహించు కోవడమంత క్షుద్రమైనది మరొకటి ఉండదు! ఎవరికి ఈ ఇంట్లో బాగా లేదని లేవలేరో చెబుతావా? అక్క తోడి పోసే నీళ్ళల్లో-- నే నిందాకటి నించి చూస్తున్నా -- మీ చెల్లెలి కొడుకులు పెన్నులు కడిగి పోతున్నారు! నేను చూడడం లేదనుకుని , రెండు సార్లు ఆ గుండిగల నీళ్లన్నీ వంపి అది తోడుతుంటే నే చూశాను! బాయిలర్లో నీళ్ళు మిగల లేదని గొడవ చెయ్యకపోతే, మీ తమ్ముడికి ప్రత్యేకంగా ఒక బాయిలరు అట్టే పెట్టేస్తే తతిమ్మా మనుషులకి మరొక బాయిలరు ఉపయోగించేదిగా! ఇది చన్నీళ్ళు పోసుకుంటుందని నీకూ తెలుసు ఎందుకు దీనికా బాధ?
    మా అమ్మ చిన్నతనంలో పుట్టింది ఇది ఒక్కర్లె! దీన్ని మహా గారంగా పెంచారు! మరువం మొక్క రేగడి నేలలో బతకలేదు, ఇసక లో తప్ప! అంత జాగ్రత్తగా నువ్వు చూసుకుంటావనే మేము అనుకున్నాం కానీ, మరువాన్ని తెచ్చ్జి రేగడి నేలలో పాతుతావని కలలో అయినా ఊహించ లేకపోయాం! నువ్వేమో వెర్రి వాడిలా ఇంటెడు చాకిరీ కి మా అక్కని నియోగించావు కానీ, నీ తమ్ముళ్ళ లో ఎవరైనా అలా చేస్తున్నారా? ఆవిడికి కళ్ళు మంటలు, మరో ఆవిడికి కడుపు మంటా! రోగం లేనిది మా అక్కే అన్న మాట! నీ మనస్సు ను అనవసరంగా నిద్రింప జేస్తున్నావు! అది చాలా కాలం పడుకోదు. కాని, అది మేల్కొన్న టైముకి ఆ బాధ భరించే ఓపిక నీకు ఉండదు! మొదటి విషయం. రెండోది మా అక్క మిగలక పోవచ్చు! ఆలోచించుకో, బావా! నీవు చాలా ఉత్తమంగా ఆలోచించగలవు, అందరి విషయాలలో ను కాదు! పరుల విషయాలలో మాత్రమె.
    కోరి చేసుకున్న నిన్ను నమ్ముకుని మమ్మల్ని అందరిని వదిలి నీతో వచ్చేసింది! నీతో వచ్చినందుకు ఇక్కడ మానసికమైన సుఖం గాని, శారీరకంగా సుఖం గాని ఎరగదు.
    ఏదో ఎండాకాలం లో వర్షపు చినుకు కోసం ఎదురు చూస్తూ ఎండిపోతున్న మోడు లా ఉంది దాని జీవితం!
    అది రానన్న కారణం నీకు తెలుసును గా! మీ ఆఖరి చెల్లెలి కి పురుడు పొయ్యడాని కని ఆగిపోతా నంటుంది!"
    "సుమిత్రా! అన్నానికి లెండి!' లోపల నుండి శాంత హెచ్చరించింది, అసలు సుమిత్ర ఏ విషయం మీద ఇంత అనర్గళంగా ఉపన్యస్తుందో తెలియక.
    మౌనంగా తల వంచుకుని విన్న శంకరం లేచి నిలబడ్డాడు, "భోజనానికి నడు. నేను చూస్తానుగా " అంటూ.
    "నువ్వూ చూస్తూనే ఉంటావు! మేం వింటూనే ఉంటాం! మంచిదైతే చాలా బావుండేది! కానీ నొసట వ్రాసిన వ్రాత అంతేనేమో దానికి!' బాధగా లేచి నిలబడింది సుమిత్ర.
    తన విషయం కన్నా, శాంత విషయం మొదలు పెడితే తల, తోక తెలియనంతగా ములిగి పోతుంది విషాద సాగరం లో సుమిత్ర!
    
                          *    *    *    *
    పొలాల గట్ల మీద తిరుగాడుతూ అనుకుంది లోలోన సుమిత్ర, పక్కనే నున్న శాంత వినకుండా "రహదారి మీద నడవ వలసిన జీవితాన్ని వదులుకుని , ఈ పొలాల గట్ల మీద నడవడానికి నిర్ణయించు కున్నాను!' అని.
    అందమైన వస్తువు కనిపిస్తే అందులో గోపాలం ప్రతిబింబం కనిపిస్తుంది.
    మనసును మైమరపించే సంఘటన లో ప్రకృతి లో లీనమై పోయే ముందు తన పక్కనే గోపాలం కూడా ఉంటాడు. నిట్టుర్పు లోపల అణుచుకుంది సుమిత్ర పెదవులు నవ్వుతూండగా.
    సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకోవడానికి హడావిడి పడిపోతున్నాడు!
    బహుశః పొద్దున్న సాగనంపే ముందు చాయాదేవి సాయంత్రం పెందరాళే రండి, సినిమాకు వెడదాం అందేమో! ఉదయించే ముందు, అస్తమించే ముందు ఆ సూర్యుడు తన గొప్పతనాన్ని చాటుకొందే ఊరుకోడు! ఆకాశం అంతా ఆ సూర్యుని ఒంటి రంగుల కాబోలు కుంకం రంగులో ఉంది! అసలు ఆసూర్యుడి ప్రియురాలు అతని వక్ష స్థలం మీద మోము ఉంచి నిద్రపోవడం వల్ల మొట్టమొదట అతని వక్షః స్థలానికి ఆమె నుదుటి కుంకం అంటుకుని ఉంటుంది! తెల్లవారగానే టంచన్ గా సూర్యుడి ఇంటి ముందు రధం సిద్దం చేసి కాచుకుని ఉండడం కోసం ఆదరాబాదరా గా స్నానం చేసెయ్యడం లో వక్ష స్థలాన్ని అంటుకున్న అతని ప్రియురాలి కుంకం శరీరం అంతట పాకిపోయి ఉంటుంది. ప్రతి రాత్రి ఆమె నిద్రపోవడం, అలాగే కుంకం అంటుకుని ఉండడం, మళ్ళీ మర్నాడు ఆదరాబాదరా గా ఒళ్ళు సరిగా తుడుచుకోకుండా వెళ్ళిపోవడం వల్ల చివరికి అతని ఒంటి రంగు ఆవిధంగా స్థిర పడిపోయిందేమో! అందుకనే ఆకాశం కుంకం రంగులో ఉంది! నవ్వుకుంది సుమిత్ర.
    "ఎందుకు నవ్వుతున్నావ్? అంత నవ్వుకోవలసినది ఏముంది?' శాంత ప్రశ్నించింది.
    'నా మొహాన్ని నవ్వుకోవడం ఒకటే మిగిలింది!' లోలోపల అనుకుని ఆ ప్రయత్నంగా ముడుచుకునిపోయిన పెదవులకు పని చెప్పింది. 'ఆహా, ఒక వైపు ఆ వేళకి గింజలు ఏరుకునే పక్షుల కంగారు చూసి కూడా సూర్యుడు అంత త్వరత్వరగా ఎందుకు వెళ్లి పోతున్నాడో అనుకునేసరికి, ఆలస్యంగా ఇంటికి వెళితే చల్లటి నిమ్మషర్బత్ కు బదులుగా చాయాదేవి పొగలు కక్కుతూన్న కాఫీ అందిస్తుందని భయం కాబోలు అనిపించి!" అంది పైకి నవ్వేస్తూ.
    శాంత కూడా నవ్వేసింది.
    పచ్చటి పొలాలు తలలూపుతూ నిండుగా నవ్వాయి, వంగి పోతూన్న కంకేలతో నిండు చందమామ లా!
    సాయంత్రం విహారానికి బయలు దేరిన తెల్ల మబ్బులు కాస్సేపు గగన విహారం మాని భూమి మీదికి దిగి, వాళ్ళు అంత హాయిగా ఎందుకు నవ్వుకుంటూన్నారో  తెలుసు కుందామా అనుకుని, "అనువు గాని చోట అధికుల మనరాదు!' అన్న సామెత గుర్తుకు వచ్చి అక్కడ నుంచే కాస్సేపు చూసి సాగిపోయాయి చివరికి!

                            
    "అక్కయ్యా! మనం చేతులో ఈ చెంబు లేకుండా బయలుదేరితే మనల్ని వెళ్ళనిచ్చె వాళ్ళు కాదు గదూ?' తొణికిసలాడుతూన్న నీళ్ళు విచ్చుకుంటూన్న బొండు మల్లెలనీ, పరిహసిస్తున్న పారిజాతాల నీ గుర్తుకు తెచ్చాయి, చల్ల చల్లగా తగులుతూ!

 Previous Page Next Page