Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 43

   

     "నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్దవాడివై పోయావు సోమయాజీ! పుట్టినరోజున నీ మనసు నొప్పించటం యెందుకని......అందునా ఆ బహుమతి నీకేమయినా పనికివస్తుందేమోనని యిచ్చానే తప్ప నీతో ఇక మాట్లాడను" అని ఆమె అంటూ వుంది. ఒక్కొక్కమాట గుండెల్లో సూదుల్లా తగుల్తుంది.
   
    అతడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నేను.....నేను" అన్నాడు తడబడుతూ ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలియదు. ఆమె తలెత్తి చూసింది. అయినా ఆమె మొహంలో ఏ భావమూ లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం క్షణాల్ని యుగాల్ని చేసుకుని నడిచింది. అది భయంకరమై అతడిని బాధ పెట్టింది. "నేను .... నేను చచ్చిపోతాను" అన్నాడు బెదిరిస్తున్నట్లు.
   
    ఆమె నెమ్మదిగా "చంద్రమూ ఈ మాటే అన్నాడు" అన్నది. చెళ్ళున చరిచినట్టయి, అతడు పిచ్చెక్కినవాడిలా తల కొట్టుకుంటూ, "చంద్రమూ నేనూ ఒకటేనా ఏమిటి?" అని అరిచాడు ఉక్రోషంతో.
   
    "కాదా ఏమిటి?"
   
    అతడు ఏమీ చేయలేక మరింత వెర్రివాడిలా తన అరచేతిలో మరో అరచేతి పిడికిలిని కొట్టుకుంటూ "అమ్మా! అమ్మా!" అన్నాడు చచ్చిపోయిన తల్లిని తల్చుకుని వెక్కుతూ అతడి కంఠంలోంచి నిజాయితీ ఆ రూపంలో బయటకి వచ్చింది. ఎటువంటి హృదయాన్నైనా కదిలించేటంత ఆర్ద్రతతో హృదయవిదారకంగా వుంది ఆ పిలుపు. అతడి ఆ స్థితి చూసి ఆమె కరిగిపోయింది. చేతిలో కాగితం జారిపోయింది.
   
    ఆమె ముందు చేతులు సాచిందో, అతడే ముందుకు వచ్చాడో తెలియదు కానీ, ఆమె ఎదలో అతడు ఒదిగిపోయాడు. 'ప్రేమ' ఉద్రేకపు స్థితిని దాటిపోయినప్పుడు, శాంతికీ అశాంతికీ తేడా లేకపోయినప్పుడు, శ్వాస ఆగిపోయినప్పుడు, దేవా! నిన్న రాత్రి పక్కమీద వాడిపోయిన పూలని ఈ ప్రొద్దున్న పూడ్చిపారేసే నీ చేతులు... ఇంత క్షణభంగురాలయిన ఈ మనుష్యుల జీవితాల్లో ఇంత ఆనందాన్నీ, విషాదాన్నీ ఎందుకు కూరి వుంచావు? మహాత్మా! సుఖానికీ విషాదానికీ అతీతమయిన మౌనాన్ని, శాంతిని, బ్రహ్మపరమైన ఆనందాన్ని నాకు శాశ్వతంగా ఎందుకు ప్రసాదించవు? విషాదంలో నాకు ఆనందం లభిస్తూందని తెలిసి, విషాదం నుంచి కూడా నన్ను వేరుచేయకు. ఓ పరమాత్మా! ఈ క్షణమే నాకో సత్యం తెలిసింది. వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వము ఓ శాంతి శ్శాంతి-శ్శాంతిః-
   
                           10
   
    అతడామె డైరీలు చదవటం ప్రారంభించాడు.
   
    21 శ్రావణము
   
    వర్షాకాలం వచ్చేసింది. చూరుమీదనుంచి కారే వర్షపు ధారల్ని అరుగుమీద మోకాళ్ళపై కూర్చుని చూస్తూ వుండటం గొప్ప అనుభూతి పట్టుచీర కొస అంచుల్ని తడుపుకుంటూ, వర్షం నీళ్ళలో హడావుడిగా నడుస్తూ నోములకి పిలిచే పేరంటాళ్ళు, మెట్ల పక్కనుంచి ప్రవహించే నీటిలో కాగితం పడవల్ని వదిలే పిల్లకారూ, శ్రావణమాసం వచ్చిందంటేనే హడావుడి. ఆరుద్ర పురుగుల గురించి వర్ణించింది కిష్కింధకాండలో వాల్మీకి కదూ..... పచ్చటి పైరు భూదేవి చీరయితే, అక్కడక్కడ ఆరుద్ర పురుగులు చీర అంచుమీద నక్షత్రాల్లా వున్నాయట. వాల్మీకిలాంటి పెద్ద తాతయ్య వుంటే బావున్ను అన్న కోర్కె ఎందుకో ఈ మధ్య చాలాసార్లు కలుగుతుంది. అర్ధంకాని కోరిక. నవ్వొస్తూంది.
   
    వర్షం ఆగగానే మళ్ళీ రొద మొదలైంది. తారురోడ్డు వేస్తున్నారట. 'తడిసిన మట్టివాసన ఇక వుండదు కాబోలు' అని నేనంటే 'ఇవేం పోయేకాలం ఆలోచనలే పిల్లా' అంటుంది అమ్మ ఊళ్లోకి నాగరికత కొండచిలువలా ప్రవేశిస్తోంది.
   
    బైట వర్షం మళ్ళీ కురుస్తూంది. చీకట్లో ఊరంతా నిదరోయాక, ఇలా హరికెన్ లాంతరు వెలుతుర్లో కిటికీ పక్కన కూర్చుని డైరీ వ్రాసుకోవటం ఎంతో ఇష్టంగా వుంటుంది. మర్చిపోయిన విషయం ఏదో ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చినట్టు టపటపా నాలుగు చినుకుల్ని రాలుస్తాయి మేఘాలు. మళ్ళీ నిశ్శబ్దం. సన్నగా గాలి వీస్తుంది. మేమూ నీతోపాటే మేల్కొని వున్నాం సుమా అన్నట్లు ఆకులు శబ్దం చేస్తాయి. అనుభవించదల్చుకుంటే జీవితం అంత గొప్పదీ, స్నేహం చేయదల్చుకుంటే ప్రకృతి అంత మంచిదీ వేరొకటి లేదు కాబోలు. ఎగిరేపక్షి, కదిలే ఆకు, లేచే కెరటం-ప్రతి దాంట్లోనూ నాకు అందమే కనబడుతోంది. మొన్న బందరు మామయ్యొచ్చి "ఈ పిల్ల పిచ్చిది" అని ఒక యోగ్యతా పత్రం ఇచ్చి వెళ్ళాడు. నాకయితే ఈ ప్రపంచమే పిచ్చిగా కనబడుతుంది. లేకపోతే ఇంత అందమైన రాత్రి ఇంతమంది మనుష్యులు నిద్రలోనే కాలం గడుపుతారా?
   
    లోపల్నుంచి నాన్న దగ్గు ఆగి ఆగి వినపడుతూంది. నాన్నని చూస్తుంటే జాలేస్తుంది. పాడైపోతున్న ఆరోగ్యాన్ని పైకి కనపడనివ్వకుండా చేసే ప్రయత్నంలో ఆయనీ మధ్య విఫలమవుతున్నాడు. అమ్మని చూస్తుంటే కోపం కూడా వస్తూంది. తన జీవితకాలంలో ఒక్కసారైనా నాన్నని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించదేం? నాన్న లాంటివాడు భర్తగా వచ్చినందుకు మళ్ళీ ఏడువారాల నోములు చేయాలి. అసలైతే... ఉహు.... నేనిలా వ్రాసుకోకూడదు. ఎవరైనా చదివితే బావోదు.
   
    16 భాద్రపదము
   
    ఈ రోజు నాన్న మామూలుగానే దగ్గర కూర్చుని పాడమన్నాడు. "మరుగేలరా ఓ రాఘవా" అని పాడుతుంటే నాన్న ఎందుకో పరీక్షగా నన్నే చూస్తున్నాడు. కారణం అర్ధం కాలేదు. కానీ తరువాత అయింది. పట్టుచీరతో తీయించుకున్న ఫోటోలు ఒఅక్తి రెండు అదృశ్యమవటం, నేను వెళ్ళగానే ఇంట్లోవాళ్ళు మాటలు ఆపుచేయడం ఇదంతా చూస్తుంటే ఏదో కుట్ర పన్నుతున్నట్టుంది.
   
    నాన్న దగ్గరికి వెళ్ళి ఎలాగో ప్రాణం ఉగ్గపట్టుకుని చెప్పేశాను. ఆయన కంగారుపడి 'ఏమ్మా ఏమిటీ కారణం' అన్నాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. తలవంచుకుని 'నేను పెళ్ళి చేసుకోను నాన్నా!" అన్నాను. ఆయన నవ్వాడు. "ప్రతి ఆడపిల్లా మొదట్లో అలానే అంటుందమ్మా' అన్నాడు. నాకు కోపం వచ్చింది. 'నేను ప్రతి ఆడపిల్లలాంటిదాన్ని కాదు నాన్నా!" అందామనుకున్నాను. 'ప్రతి ఆడపిల్లా అలానే అనుకుంటుందమ్మా' అంటాడని భయంవేసి వూరుకున్నాను. నా మొహంలో బహుశా ఏదో తటపటాయింపు గమనించి వుంటాడనుకుంటా. 'ఏమిటమ్మా' అన్నాడు. "నేను.... నే...ను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు నాన్నా? నీకెవరూ పాటలు పాడి వినిపించరు తెలుసా?" అన్నాను. నాన్న నన్ను దగ్గరకు తీసుఉని ఏడ్చాడు. అదే మొదటిసారి, చివరిసారి నాన్న ఏడవగా చూడటం ఇన్నాళ్ళ బాధంతా యిప్పుడు బయటకొచ్చినట్లుంది. అమ్మమీద భలే కోపం వచ్చింది.
   
    14 కార్తీకము
   
    వసంతం తరువాత అంత ప్రశస్తమైనది శరదృతువు అంటారు. కానీ నాకెందుకో హేమంతం నచ్చుతుంది. హేమంతం వస్తూందంటేనే గమ్మత్తుగా వుంటుంది. కిరణాలు మంచులో తడుస్తూ ప్రసరించటం వలన ఉదయిస్తూన్న సూర్యుడు చంద్రుడిలా వుంటాడు. చెట్టుమీద పువ్వు వుండదు. కానీ రాత్రంతా కురిసిన మంచుబిందువులు పువ్వుల్లా మెరుస్తూ వుంటాయి. తెల్లవారుఝామునే గుడికి వెళ్ళి నిద్రగన్నేరు చెట్టు పక్కనుండి మెట్లు దిగి పరికిణీ కుచ్చిళ్ళు పైకెత్తి కోనేటిలో కాలుంచితే - జిల్లుమని లాగేస్తుంది చల్లటి నీరు. నాన్న తిడతాడు. జలుబు చేస్తుందంటాడు. పిచ్చి నాన్న! చిత్రమేమిటంటే నాన్నని చూసి నేనెంత జాలిపడతావో, నన్ను చూసి నాన్నా అంత జాలిపడతాడు. 'ఏ ఇంట కాలు పెడుతుందో - ఎలా బ్రతుకుతుందో' అని ఈ మధ్య మాటిమాటికీ అంటున్నాడు. ఇంతకీ ఏం వ్రాస్తున్నాను? హేమంతము గురించి కదూ!
   
    గుడి కొలనులో ఒక్క పద్మం కూడా లేదు. పద్మం అనగానే నన్నెచోడుడు గుర్తొస్తాడు. అందరూ కాళిదాసు అంటారు కానీ, కుమారా సంభవంలో నన్నెచోడుడు ఎంత బాగా వర్ణించాడు? చల్లని కొలనులో పార్వతి మెడలోతు దిగి దీర్ఘమైన తపస్సు చేస్తూంటే, తల మాత్రం పైకి కనపడుతూ వుందట. హేమంతం అవడంవలన చలికి పద్మాల జాతి అంతా నశించిందట. ఆ వంశాన్ని నిలపడం కోసం ఈ ఒక్క పద్మమూ నిలిచిందా అన్నట్లు వుందట నీతి మీద ఆమె ముఖము. ఎంత గొప్ప వర్ణన.... నాన్నతో అంటే "చూసేవా అమ్మా! ఆ రోజుల్లో భర్తల కోసం మంచు నీటిలో దిగి తపస్సు చేసేవాళ్ళు మీరేమో అసలు పెళ్ళిచూపులే వద్దంటున్నారు" అని ఎగతాళి చేశాడు. భలే సిగ్గేసింది.
   
    హేమంతం మరింత విజ్రుంభించి వెళ్ళిపోయింది. శిశిరం ప్రభావంతో చెట్లు అప్పుడే ఆకులు రాలుస్తున్నాయి. రాబోయే ఒక అత్యద్భుత ఋతువు కోసం ప్రకృతి అంతా ఎదురుచూస్తున్నట్లు వుంది. అవును రాబోయేది వసంతం కదూ!
   
    నాకెందుకో ఒక పోలిక గుర్తొస్తోంది. ఈ ముకుళించుకుపోయిన చెట్లు, ఈ స్థబ్దమయిన వాతావరణం, వసంతం కోసం మౌనంగా ఎదురుచూస్తూ వున్న లతలూ, చెట్లూ, పక్షి, పులుగూ....హేమంతం నుంచి వసంతానికి ప్రయాణించే ఈ ప్రకృతి అంతా రవ్వంత సిగ్గుపడుతూ 'ఈ' ఇంటినుంచి 'ఆ' ఇంటికి వెళ్ళడానికి ఆయత్తమయ్యే పదహారేళ్ళ ఆడపిల్లలా లేదూ!
   
    .... .... ....
   
    అతడొచ్చాడు. మంచి ఫుట్ బాల్ ఆటగాడట. బంతిలాగే వున్నాడు. ఛా - అలా అనకూడదు. బానే వున్నాడు. పేరే బాగోలేదు- సుబ్బారావట. అయినా ఫర్వాలేదు. రాముడు పేరెం బావుంది? సీత యిష్టపడలేదూ!
   
    24 వైశాఖము
   
    వసంతం వచ్చేసింది.
   
    మీనము పోయి మేషము రావడంతో వసంతం ప్రారంభమవుతుందంటారు. మీనం మన్మధుని (వసంతుని) వాహనం కదా అది(మీనం) వెళ్ళిపోయినా ఇతడు (వసంతుడు) ఎందుకు వుండిపోవటం? ఓహో! అర్ధమైంది అగ్ని దేవుడి వాహనం మేషంకదూ! విరహం కూడా అగ్నేగా! ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి.

 Previous Page Next Page