అచ్చమాంబ చాపమీద దిండులేకుండా పడుకొని, పైటకొంగుతో ముఖం కప్పుకొని ఏడుస్తోంది. ఆ దృశ్యం చూస్తే చాలా జాలికలిగింది ఝాన్సికి. ఇప్పుడు ఆమె మనసులో తల్లిపట్ల కోపం ఏమీ లేదు. "మనకంటే ముందు తరం వాళ్ళను అర్ధంచేసుకోవాలి, తప్పు పట్టకూడదు" అన్న కుమార్ మాటలే మనసులో మార్మ్రోగుతున్నాయి. అదీ గాక ఇన్నాళ్లూ కుమార్ పట్ల తల్లి ప్రవర్తనకు ఝాన్సీ మనసు కూడా ఏదో అపరాధ భావనతో నలిగిపోయేది. కుమార్ ముఖం చూడలేకపోయింది. ఇప్పుడు శాంతమ్మ కూడా కొంచెం ఇంచుమించు తల్లిలాగే ఆలోచిస్తుందనుకొనేసరికి, ఆ అపరాధ భావన పోయి కొత్తబలం వచ్చింది. తల్లి దగ్గర కూచుని, "అమ్మా" అంది ప్రేమగా. అచ్చమాంబ ఉలికిపడినట్లు లేచి, భయంగా ముఖం తుడుచుకొని "వచ్చేశావా? కాఫీ కలపనా? నాలుగు బజ్జీలు కూడా వేయనా?" అంది తడబిడలాడుతూ.
తన కన్న తల్లి, కోసం యంత్రంలా కష్టపడిన తల్లి, తనను చూసి అలా బెదిరిపోవటం ఝాన్సీ మనసు కెలానో అనిపించింది. ఆర్ధికపరిస్థితులు మనుష్యులనెలా కృంగదీస్తాయి? ఇదే తమకు ఆస్తిపాస్తులుండి తన తల్లి పెద్ద ఆస్తికి అధికారిణి ఐతే, ఇలా భయపడుతూ, బెదిరిపోతూ ఉండేదా?
"నాకేం వద్దుకాని, ఒకటి చెప్పు- నేను కుమార్ ని భర్తగా అంగీకరించటం నీకు మనసారా ఇష్టమేనా?" అచ్చమాంబ ముఖం ఒక్కసారిగా వికసించింది.
"అంతకంటే నాకు కావలసిందేముంది తల్లీ! మీరు భార్యాభర్తలని ముందే తెలిస్తే...."
ఆగిపోయింది అచ్చమాంబ ఏమి చెప్పాలో తెలియక. ఝాన్సీ నవ్వుకొని, "అమ్మా! ఈ ఉద్యోగంకోసం నేను అతణ్ని భర్తగా అంగీకరించాను. దీనికి రాజీనామా చేసేస్తున్నాను" అంది.
అచ్చమాంబ ముఖం కొద్దిగా మలినమయినా, వెంటనే తేరుకొని, "నీ యిష్టం తల్లీ! తెలివయినదానివి. అన్నీ తెలిసిన దానివి, నీ కేది మంచిదని తోస్తే అలా చెయ్యి. పెద్దదాన్ని అలా మోడులా చూస్తుంటే గుండె చెరువైపోతుంది. నిన్నైనా కళకళలాడుతూ చూసుకోనీ!" అంది.
ఝాన్సీ తల్లిని ఆప్యాయంగా కౌగలించుకుంది. అచ్చమాంబ కూతురి తల ప్రేమగా నిమిరింది.
ఝాన్సీ కుమార్ కి ఒక ఉత్తరం వ్రాసి పంపించింది.
"మైడియర్!
సాయంత్రం కాలవగట్టుకి, మన తోటలోకి రా.
నీ
ఝాన్సీ"
'మనతోట' అంటే అది కుమార్ , ఝాన్సీలలో ఎవరి తోటా కాదు ఒకప్పుడు, ఇటు శాంతమ్మా, అటు అచ్చమాంబా ఇద్దరూ రాకమునుపు ఝాన్సీ కుమార్ లు కాలువ గట్టున వున్న ఆ పంటచేల గట్లమీద కబుర్లు చెప్పుకొంటూ ఎన్నో సంధ్యా సమయాలు గడిపారు వేసవి అయితే రైతులు వీళ్ళకి తాటిముంజెలు, కొబ్బరిబోండాలు తెచ్చిపెట్టేవారు ఆ తోట ముఖం చూసి ఎన్నో రోజులయినట్లుగా ఉంది ఝాన్సీకి ఇన్ని రోజుల తర్వాత కుమార్ ని ఏకంతంగా ఆ తోటలోనే కలుసుకోవాలనిపించింది.
ఎత్తుగా గట్టు- ఆ గట్టుకు అటువైపున కాలువ- ఇటు వైపున వరిచేతులు! ఆ గట్టుమీద నిలబడి కాలువలో నిదానంగా ప్రవహిస్తున్న నీళ్ళను, పడవలమీద ప్రయాణం చేస్తున్న పల్లె జనులనూ చూస్తున్నాడు కుమార్. పొడుగ్గా, ఠీవిగా గాలికి ఎగురుతున్న ఉంగరాల జుట్టుతో, వెనుకనుంచి చూడటానికి అతడొక మహా పరుషుడిలా ఉన్నాడు. అంత దూరంలో అతణ్ని చూడగానే, ఝాన్సీ హృదయం ఆనందముతో ఉప్పొంగింది. ఇన్నాళ్ళుగా అతి నిగ్రహంతో ఆనకట్ట వేసి దించిన ప్రేమ ప్రవాహం గట్లు తెంచుకొని పొంగింది. చప్పుడు చెయ్యకుండా వెనుకనుంచివచ్చి అతడి కళ్ళు గట్టిగా మూసింది. ఆనందాశ్చర్యాలతో ఆ చేతులు తన చేతులలో ఇముడ్చుకొని, "ఝాన్సీ!" అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఝాన్సీ అతడి హృదయం మీద వాలి కదలలేనట్లు ఉండిపోయింది. సర్వ ప్రకృతీ ఆ పవిత్ర ప్రేమికులను ఆశీర్వదిస్తుందా! అన్నట్లు పరిమళ భరితమైన చల్లని గాలులు వీచాయి. ఆమెచుట్టూ తన చేతులను మరింత గట్టిగా బిగిస్తూ "ఎట్ లాస్ట్!" అన్నాడు సంతృప్తితో.....
ఝాన్సీ అతని చేతులను విడిపించుకొంటూ ఎడంగా జరిగి "అసలు సంగతివిను!" అంది.
అతడు భయం నటిస్తూ "మళ్ళీ ఏమిటి!" అన్నాడు.
ఆమె నవ్వి "నేనింక ఆ ఆస్పత్రిలో ఉద్యోగం చెయ్యను. రాజీనామా చేసేస్తున్నాను నేనూ నీ దగ్గర చేరిపోతాను..... కాని.....కాని......." అంటూ సంకోచంగా ఆగిపోయింది.
కుమార్ ఆమె చేతులు పట్టుకొని తన మీదకు లాక్కొంటూ "ఇంకా నా మీద నమ్మకంలేదా? మనదంతా ఒకే కుటుంబం. మీ తమ్ముడూ, చెల్లెలూ, మీ అమ్మగారు, అక్కా, అంతా మన మనవాళ్ళే! ఎవ్వరికి ఏ లోటూ రాదు, రానీయను" అన్నాడు.
అతని చేతులమధ్య అతని హృదయం మీద ఎంతో నిశ్చింతగా ఎంతో విశ్రాంతిగా ఉంది ఝాన్సీకి. ఈ లోకంలోని అన్ని చికాకునుండీ తనను కాపాడుతున్నట్లుగా ఉన్నాయి అతని చేతులు, పారవశ్యంతో కళ్ళు మూసుకుంది.
ఆ పల్లెటూరిలో ప్రతి ఒక్కరూ విస్తుపోయేలాగా మేరీ, ఝాన్సీ, కుమార్ కుటుంబాలు ఏక కుటుంబంగా కలిసి పోయి ఒకే ఇంట్లోకి మారిపోయారు.
సుందరమ్మ కొత్తగా కట్టించిన ఆస్పత్రి భవనం పూర్తయింది. సుందరమ్మ ఎంత వద్దంటున్నా దానికి "సుందరమ్మ ఆస్పత్రి" అనే పేరు పెట్టాడు కుమార్ ఆధునిక పరికరాలతో సమర్దులయిన ఇద్దరు డాక్టర్లతో, ఆ ఆస్పత్రి చుట్టు ప్రక్కల గ్రామాలవారికి కల్పవృక్షమే అయింది ఆపదలో, అనారోగ్యంలో "సుందరమ్మ ఆస్పత్రి" ని తలవని గ్రామస్థుడు లేడు.
శ్రద్ధతో రోగులకు వైద్యం చేసే ఝాన్సీ కుమార్ లనూ, ఆస్పత్రి భవనంపైన చెక్కిన "సుందరమ్మ ఆస్పత్రి" అనే అక్షరాలనూ, సంతృప్తితో చూసుకొనేది సుందరమ్మ.
ఆనాడు సుందరమ్మ అందరిని తన ఇంటికి భోజనానికి పిలిచింది. అచ్చమాంబతో సహా అందరూ వచ్చారు. సుందరమ్మ మనసు సంతృప్తితో నిండిపోయింది. కుమార్ తో అంది, "ఎవరు తమా జీవితాన్ని తిరిగి జీవించాలనుకొంటారో, వాళ్ళ జీవితం ధన్యం అంటారు. నా పేరుమీద నలుగురికి ఉపయోగపడే ఇలాంటి ఆస్పత్రి నిలబెట్టగలిగితే ఈ నికృష్ట పుబ్రతుకు ఒక జన్మలో కాదు, కోటి జన్మలలోకూడ సంతోషంగా భరిస్తాను."
సంఘాని కందని ఆమె అంతరంగ దీప్తులను ఆ గ్రామపు చీకట్లలో విరజిమ్ముతున్నాయి, ఆస్పత్రి భవనంపైన వెలిగే విద్యుద్దీపాలు.
(శుభం)