Previous Page Next Page 
స్త్రీ పేజి 39

 

    సూర్యం నుదురు చిట్లించాడు. "అర్ధం లేని విషయాలన్నీ ఆలోచించటం దేనికి? ఏమో? అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో! అది చెప్పమంటే నేనేం చెప్పగలను? అన్నిటినీ మనకు అనుకూలంగానే ఆలోచించాలి గానీ, కాకపొతే? లేకపోతె?-- అంటూ అపనమ్మకాలలెందుకూ?"
    పార్వతికి కొంచెం కోపం వచ్చింది. "అలా అలోచించి చూసుకోనప్పుడు నీ కోరిక కి నిజమైన విలువ ఉందొ లేదో ఎలా తెలుస్తుంది? ఇస్తే కట్నం ఇస్తారనీ, లేకపోతే చదివిస్తారనీ ఆశతో, నిజం చెప్పాలంటే ఒక రకమైన స్వార్ధం తో కదా నువ్వు రాణిని పెళ్ళి చేసుకోవటానికి అంగీకరిస్తున్నావు?"
    "అయితే కావచ్చు. ఏం? తప్పేముంది? లోకమంతా ఓ దారిన పోతోంటే మనం మరో దారిన పోవటం వివేకమే అంటావా? నువ్వూ నేనూ రీతిగా ఉండి ఈ సంఘాన్ని ఉద్దరించేస్తామా? మన కోరికలు మనవి. మన అవసరాలు మనవి. మన స్వార్ధమే మనకులేనప్పుడు ఇక బ్రతకటం లో అర్ధ మేమిటసలు? నాకు నిజంగానే ఈ గుమస్తా జీవితమంటే విసుగు వేస్తోంది. జీవితంలో కోరికలు తీరి సుఖపడాలంటే మరో మార్గం చూసుకోవాలిగా? ఉభయాత్రా లాభదాయకమైన మార్గం. వాళ్ళ పిల్లకి పెళ్ళి కావాలి. ఇటు నాకు జీవితంలో ఉన్నతీ కావాలి. ఇదంతా ఆలోచించే నేను నిశ్చయించుకున్నాను."
    తమ్ముడు చెప్పింది కొంతవరకూ సబబుగా కనిపించక పోలేదు. అయినా సూర్యం ఒక రకమైన స్వార్ధం కోసమే ఈ పెళ్ళికి ఒప్పుకోవటం ఏమిటో అవినీతి పాలు గావటమే అనిపించింది పార్వతికి. "పోనీ, సూర్యం! నీకంతగా చదువుకుని జీవితంలో పైకి రావాలని ఉంటె నాకూ సంతోషమే. కాదని ఎలా అంటాను? దాని కోసం చేతిలో ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని పరాయి వాళ్ళని నమ్ముకోటం ఏమిటి? ఏళ్ళ తరబడి చదువు ఏ ఆటంకమూ లేకుండా సాగిపోతుందని అనుకోలేం గా? కీడెంచి మేలంచాలన్నారు. ఎప్పుడేం జరిగినా బాధ పడేది మనమే."
    "ఇంతకీ నువ్వు చెప్పేదేమీటక్కయ్యా?"
    "ఉద్యోగం మానటం నాకిష్టం లేదురా! నైట్ కాలేజీ లో చేరి చదువు కోకూడదూ?"
    'అబ్బ! నా కంత ఓపిక లేదక్కయ్యా! పగలు  పనీ, రాత్రి చదువూ ఎన్నాళ్ళ కి తెల్లవారు తుంది?" విసుక్కున్నాడు సూర్యం.
    "అభివృద్ధి సాధించాలనే కోరిక ఉన్నప్పుడు కష్టపడక పొతే ఎలా, సూరీ?"
    "నీ ఆలోచనలన్నీ గొప్పవేకావచ్చు గానీ, నేను ఆచరించలేనక్కయ్యా!' తేల్చేసినట్టు అనేశాడు సూర్యం.
    పార్వతి మరోమాట మాట్లాడలేక పోయింది. తన ఉద్దేశ్యాలు తనవరకే గానీ ఎవర్నీ పాటించమంటే ఎవరు వింటారు? ఎందుకు వింటారు? పోనీ, కనీసం తమ్ముడు ఆ రాణీని కాకుండా మరో పిల్లను నిర్ణయించు కుంటే?
    పార్వతి ఆవేదన పార్వతికే మిగిలిపోయింది. పార్వతి ఇష్టా యిష్టాలతో ప్రమేయం లేకుండానే జరగవలసిన వ్యవహారమంతా జరిగిపోయింది. రాణీ తల్లి ఎవరో చుట్టపావిడ్నీ తీసుకుని పార్వతి తో మాట్లాడటానికంటూ వచ్చింది. కాని, పార్వతి మాట్లాడటానికి  ఒక్క నిమిషం అవకాశం కూడా ఇవ్వలేదు. "అమ్మాయీ! నువ్వూ చిన్నదానివే! నీకేం తెలుస్తుంది?మా పిల్ల మీ తమ్ముడంటే ఇష్టపడుతోందని దాని మాట కాదనలేక -- అయినా కుర్రాడిని చూస్తె మాకు ముచ్చటగానే ఉందనుకో." అంతలోనే కాస్త కంఠం తగ్గించుకుంది. "నీకు తెలుసో తెలీదో గానీ వాళ్ళిద్దరూ ఎన్నెన్ని ఉత్తరాలు వ్రాసుకుంటున్నా రనుకున్నావు! మీ తమ్ముడు వ్రాసే ఉత్తరాలన్నీ మా పిల్ల అపురూపంగా దాచుకొంటూనే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు నవ్వుతూ అంటారు కదా --  'మన తల్లికి కట్నాలూ కానుకలూ ఏమీ ఇవ్వనక్కర్లేదే! దాని దగ్గరున్న ఉత్తరాలన్నీ కోర్టులో పెడితే కుర్రాడు కాస్తా పిల్లి పిల్లలా పుస్తె ముడి వెయ్యాల్సిందే" అని. ఆయనలా అన్నప్పుడల్లా నేను మండలిస్తూనే ఉంటాను సుమీ -- "చాల్లెండి . మీరు -- మహా గొప్ప ప్లీడరు పని చేస్తున్నారని పిల్ల పెళ్ళికి అల్లరి పెడతామా ఏమిటి? మనకేం లేదా పోదా? కలిగినంత లో కట్నాలూ కానుకలూ ఇచ్చే కన్యాదానం చేద్దాం. కాదూ కూడదంటే కుర్రాడి కోరికేమిటో తెలుసుకుని మరీ...."
    ధోరణి లా సాగిపోతున్న ఆవిడ మాటల ప్రవాహానికి ధైర్యం చేసి అడ్డు కట్ట వేసింది పార్వతి. "చూడండి , అత్తగారూ! ఇంతవరకూ వచ్చాక ఇక నేనేదో అంటానని మీరు అనుమానించకండి. మీ అందరి ఇష్టమే నా యిష్టం. వాడెం పాలుతాగే పసివాడు కాదు. ఆ మంచి చెడ్డ లేవో వాడే నిర్ణయించుకోగలడు. నాదేముంది? అందరో తోపాటే తధాస్తు అంటాను. మంచి రోజు చూసి ముహూర్తం అదీ పెట్టించేయ్యండి."
    పార్వతి అంత సూటిగా ఖచ్చితంగా మాట్లాడే సరికి మొహమొహాలు చూసుకున్నారు పెళ్ళి పెద్దలిద్దరూ. "సరేనమ్మా! వెళ్తాం" అంటూ లేచిన వాళ్ళకు బొట్లు పెట్టి, తాంబూలాలిచ్చి సాగనంపింది పార్వతి.
    వీధి తలుపులు వేసుకుని వెనుదిరిగే సరికి అప్రయత్నంగా పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది. అలాగే తలుపుకి చేరబడి వెక్కి వెక్కి ఏడ్చింది. అర్ధం గాని ఆవేదనతో హృదయం బద్దలౌతుంది. ఎవరితోనో.....ఎవరితోనూ చెప్పుకోవాలని తహతహా కలుగుతుంది. ఎవరున్నారు? తన కెవరున్నారు? ఎవ్వరూ లేరు. అమ్మ కూడా లేదు. "అమ్మా!" అంటూ రోదించింది అంతరాత్మ. "నువ్వే వుంటే నన్నింత దిక్కులేని దాన్నిగా వదిలేస్తావా, అమ్మా?" అంటూ ఏడ్చింది పార్వతి. అమ్మ ఉంటె తన పెళ్ళి కోసం ఎంత కొట్టుక లాడి పోయేదో! ఆనాడు పరిస్థితుల కోసమే గానీ జీవితమంతా ఏకాకిలా ఉండి పోతాననలేదే? ఆ ముక్క సూర్యానికి తెలీదూ? పాతిక సంవత్సరాల వాడు , బి.ఎ చదువు చదివిన వాడు ఆ మాత్రం అర్ధం చేసుకోలేడూ? తన వయస్సు ముప్పై ఉండచ్చు. తనిక జీవితంలో ఏ అనుభవానికి నోచు కోలేదా? ఏ సుఖానికి పెట్టి పుట్టలేదా? 'ఎవరి స్వార్ధం వాళ్ళది ! ఎవరి అవసరం వాళ్ళది' అన్న సూర్యం మాటలు పార్వతి గుండెల్లో శూలపు పోట్లు పొడిచాయి. దీర్ఘంగా నిట్టూర్చింది. జరిగినదానికీ చేసిన దానికీ పశ్చాత్తాప పడుతుందా? ఊహూ! ఎన్నడూ అలా జరగదు. తన మనస్సు అంత చంచలం కాదు. తానేమీ కోరికలతో దహించుకు పోవడం లేదు. ఈనాటి కైనా తను కావాలనుకుంటే పొందలేనిది లేదు. తల్లి లేకపోయినా తన కష్ట సుఖాలు ఆలోచించే నేస్తం ఉంది. మనస్సు విప్పి పద్మజ కు ఒక్క మాట వ్రాస్తే చాలు, తనను ఆదుకొంటుంది. తన జీవితంలో దీపం వెలిగిస్తుంది. తన కన్నీళ్ళ తుడిచి వేస్తుంది. నిజంగా తనకు జీవితంలో తోడు కావాలా? ఈ ఒంటరి తనం భరించలేక పోతుందా? పురుష సాహచర్యం కోసం తహతహ లాడుతుందా? పార్వతికి తన మీద తనకే అపనమ్మకం కలిగింది. ఎందుకింత చిత్రంగా ఆలోచిస్తున్నది తను? ఎన్నడూ లేనిది, మనస్సెందుకిన్ని విధాల పరుగులేడుతుంది?"
    తను భద్రంగా దాచుకున్న భాధామయ స్మృతులు చిన్ననాటి రఘుబాబు గుర్తులు అప్పుడే చెదిరి పోయాయా? ఎన్నడూ ఎవ్వరికీ చోటు లేదనుకున్న తన హృదయం లో మరో వ్యక్తికీ, మరో పురుషుడి కి స్థానం ఉందా? మరెవ్వరైనా తన రఘుబాబు కాగలరా? తనతో ఆడుకున్న రఘుబాబు, తనతో మాత్రమే మనసిచ్చి మసిలే రఘుబాబు, తనతో మాట్లాడాలని ఆరాటపడే రఘుబాబు, తనకోసమే పిచ్చివాడై తిరిగే రఘుబాబు.
    దీర్ఘంగా నిట్టూర్చింది పార్వతి. కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. వర్షించిన మేఘం లా మనస్సెంతో తేలికైంది.

                            *    *    *    *
    మంచిరోజు చూసి సూర్యం పెళ్ళికి తాంబూలాలు పుచ్చుకోవటం, జరగవలసిన పెళ్ళి పనులేవో జరగటం -- అన్నీ ఒకదాని వెంట ఒకటి వాటికవే జరిగిపోయాయి. ప్లీడరు గారింట పెళ్ళి ఘనంగానే జరిగింది. ఎక్కడి కక్కడ నవ్వుతూ తుళ్ళుతూ ఆడబిడ్డ హోదాతో రాసుకు పూసుకు తిరిగింది రుక్మిణి. ఆడబిడ్డల తాలుకూ కట్నాలూ కానుకలూ అన్నీ తన పెట్టిలోనే సర్దుకొంది.
    "ఈ చీర నేను తీసుకుంటానే అక్కయ్యా!"
    "ఈ వెండి గ్లాసు బాబిగాడికి ఉంటుంది లేవే!"
    "ఈ రవికల గుడ్డలు నాకు బావున్నాయే అక్కయ్యా!"
    "ఈ నూట పదహార్ల లో నీకు వాటా ఎందుకు లెద్దూ? నెలనెలా అంతకు రెండు రెట్లు వస్తూనే ఉందిగా?"
    నవ్వుతూం నవ్వుతూ మాటలన్నీ హాస్య దోరణి లో పెట్టేసి మొత్తంగా దాదాపు లాంచనాలన్నీ తనే దక్కించుకుంది రుక్మిణి.
    అంతా చూస్తున్న శాంతమ్మ ఉండబట్ట లేక పెద్దల తరహా గా నచ్చ జెప్ప బోయింది. "అదేమిటే , రుక్కూ? అ చీరలైనా దానికి పనికి రావూ? పది మంది మధ్యకీ వెళ్ళి పని చేసుకు రావాలి కదా?బొత్తిగా దానికి మంచి గుడ్డలే ఉన్నట్టు లేవు. ఎప్పుడూ వేల వెల పోయిన చీరలే కట్టుకొంటూ ఉంటుంది. పోనీ, ఆ యెర్ర సిల్కు చీర దానికి ఉండనీ!"
    రుక్మిణి మిర్రుమంటూ చూసి విసవిసా నడిచి వెళ్ళి పెట్టి మూత ఎత్తి చీరలు రెండూ తీసి బయట పడేసింది -- "అది నిజంగా ఇచ్చేస్తుందని తీసుకున్నాను గానీ, ఆ ముష్టి గుడ్డలు రెండూ నన్నేం ఉద్దరిస్తాయా?" అంటూ.
    పార్వతి కలగాజేసుకోక తప్పలేదు. "రుక్కూ! నేను నిన్నేమీ అనలేదు. మాట్లాడ కుండా తీసి పెట్లో పెట్టుకో. అత్తయ్య ఏదో అందిలే. ఇప్పుడెం పోయింది? పెళ్లింట్లో మనం రాద్దంతాలు చేసుకుంటే బావుండదు" అనేసి ఏదో పని ఉన్నదానిలా పెరట్లో కి తప్పుకుంది.
    "అత్తయ్యా! ఒక్కసారిలా వస్తావూ?" అని పార్వతి పిలిస్తే ఉస్సూరను కొంటూ లేచి వెళ్ళింది శాంతమ్మ.

                                                 *    *    *    *

 Previous Page Next Page