ఈ దెబ్బతో డెఫినెట్ గా చనిపోతుంది సౌదామిని. ఒకవేళ బతికినా, జీవచ్చవంలా తయారవుతుంది. కట్టుకున్న భర్తకు తను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ జీవితాంతం కుమిలిపోతూ కృశించిపోతుంది.
యా!
అతను తన ప్లానుని అమలులో పెట్టే అవకాశం నాలుగు రోజుల తర్వాత వచ్చింది.
ఆడిటోరియంలో ఆ రోజున "ఈస్ట్ వెస్ట్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్" గ్రూప్ ప్రోగ్రాం వుంది. అంతకుముందే జాగ్రత్తగా, సౌదామిని వీణలోకి ఎలక్ట్రిసిటీ ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేశాడు బాలు.
ఆ ఏర్పాట్లన్నీ చేశాక, మరొక విషయం గుర్తొచ్చింది బాలూకి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా తను ఆ సమయంలో ఆడిటోరియంలో వుండకూడదు. ఆమె పేరు ప్రఖ్యాతులు చూసి భరించలేకపోయిన ప్రత్యర్ధులెవరో ప్రాణాలు తీసి ఉండాలనుకుంటారు అందరూ లేకపోతే ఎలక్ట్రీషియన్ చేతగానితనం వలన ప్రాణాలు పోయాయనుకోవాలి.
"ఇవాల్టి ప్రోగ్రాంలో మొదటి ఐటమ్ నీ సోలో ఆ తర్వాత, యత్రా ఇన్ ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్!' పాట! బరప్ బేబీ! టర్న్ అవుట్ యువర్ బెస్ట్!" అన్నాడు బాలూ, లేని ఉత్సాహం తెచ్చుకుంటూ.
"థాంక్స్!" అని నవ్వింది సౌదామిని అతని మొహంలో ప్రసన్నత కనబడితే చాలు పొంగిపోతున్నట్లు కనబడుతుంది ఆమె.
ప్రోగ్రాం యింకా పది నిముషాలకు మొదలవుతుందనగా, కారేసుకుని బయటకు వెళ్ళాడు బాలూ.
అతని మనసు ఆలోచిస్తోంది.
ప్రోగ్రాం మొదలయ్యే ముందే కారుని మరో కారుకో, ట్రాఫిక్ ఐలాండ్ కో గుద్ది చిన్న యాక్సిడెంట్ చేస్తాడు తను. పోలీసులూ, సాక్ష్యాలూ, గొడవా అవుతుంది. వాటిలో ఇరుక్కుపోయిన తనకి పరఫెక్టు ఎలిబీ వుంటుంది.
వేగంగా వెళుతుంది అతని కారు. ముందు వెళుతున్న మరో కారుమీద పడింది బాలూ దృష్టి.
వెనుకనుంచీ దీన్ని గుద్దేస్తే? ఏ మడ్ గార్డో, బంపరో వంగిపోతుంది. మహా అయితే డిక్కీసొట్ట పడవచ్చు. లేకపోతే పెయింట్ పెచ్చులుగా ఊడిరావచ్చు. ఇంకా అయితే గియితే అద్దాలు పగలవచ్చు.
అంతే! అంతకంటే ఇంకేం కాదు! తూకంగానే కారు డామేజ్ అయ్యేలా చూస్తాడు తను గుడ్! గుడ్!
అనుకోకుండా యెదుటి కారు కొంచెం వేగం పుంజుకుంది.
తన కారు కూడా స్పీడు పెంచాడు బాలూ.
ముందు కారుని తరుముతున్నట్లు పోతోంది బాలూ కారు.
రెండు కార్లూ బాగా దగ్గరికి వచ్చేశాయి. ముందు కార్లోని మనుషులు ఇప్పుడు బాలూకి స్పష్టంగా కనబడుతున్నారు.
ఉలిక్కిపడ్డాడు బాలూ.
ఎదురుగా వున్నది డాక్టర్ మృదుల కారు! డాక్టర్ మృదులే డ్రైవింగ్ సీట్లో వుంది.
అదికాదు అతడిని ఆశ్చర్యపరిచింది.
ఆమె పక్కన-
ఎవరది?
వెనకనుంచి కనబడుతున్నా, బాగా పరిచయమైన ఆకారమే!
చటుక్కున స్ఫురించింది.
జానకి!
వెంటనే అతను ఆ కారు వెనక సీట్లోకి చూశాడు. జానకి భర్త కూడా వున్నాడు.
ఏమయింది? ఎక్కడి కెళుతున్నారు ముగ్గురూ? ముసలాయనకు మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా?
మృదుల కారు ఆమె నర్సింగ్ హోమ్ లోకి మళ్ళింది. పోర్టి కో మెట్లమీద వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నట్లు నిలబడి వున్నాడు ఆంజనేయులు!
ఆం...జ...నే...యు...లు....!!!!
రక్తం చివ్వున మొహంలోకి చిమ్మినట్లు అయింది బాలూకి.
అది యాదృచ్చికమే అయివుండవచ్చు. జానకి భర్తని మృదుల హాస్పిటల్ కి తీసుకువెళ్తూ వుండగా వేరే పనిమీద ఆంజనేయులు అక్కడ నిలబడి వుండటం వేర్వేరు కారణాలవల్ల అయివుండవచ్చు.
కాని-
కానీ ఏదో అర్ధంకాని మెలిక.
గుటకపడని భావన.
మృదులా నర్సింగ్ హోమ్ లో ఆంజనేయులుకేంపని? అదే ప్రశ్న...కారు నడుస్తూనే వుంది. ఇప్పుడు ఆక్సిడెంట్ చేయాలన్న ఆలోచన కాదు బాలూ మనసులో మెదులుతూ వున్నది-ఆక్సిడెంట్ లా కనబడిన ఈ సంఘటన. దాన్నెందుకో యాదృచ్చికమని అలాగే వదిలెయ్యదల్చుకోలేదు.
తన కారుని అక్కడ ఆపకుండా ముందుకు పోనిచ్చాడు బాలూ. పక్క సందులోకి టర్న్ చేసుకుని, నర్సింగ్ హోమ్ వెనుక భాగంలో పార్క్ చేశాడు కారుని. చిన్న గేటు వుంది అక్కడ.
అటూ, ఇటూ చూశాడు బాలూ, నిర్జనంగా ఉంది రోడ్డు.
ఒడుపుగా గేటుమీదికెక్కి లోపలికి దూకాడు. కాంపౌండ్ లో కూడా ఎవరూ లేరు. చుట్టూ చూశాడు. అంతలో మేడమీద గదిలో లైటు వెలిగింది. కిటికీలో మృదుల ఆకారం కనపడింది. వాళ్ళని తీసుకొచ్చిన మృదుల పైకి ఎందుకు వెళ్ళింది? వాళ్ళు కూడా పైన మేడమీదకు వెళ్ళారా? ....ఎందుకు? బాలూ ఇక సందేహించలేదు.
బూట్లు విప్పేసి, మేడమీదికి వేసివున్న సిమెంటు పైపులు పట్టుకుని నెమ్మదిగా పైకి పాకాడు.
మేడమీద గదికి కిందగా వున్న సన్ షేడ్ మీద నిలబడ్డాడు. అక్కడ్నించి గదిలోవున్న మనుషులు స్పష్టంగా కనబడుతున్నారు.
ఇద్దరి పెళ్ళాల మొగుడిలా సోఫాలో మృదులా, జానకిల మధ్యన కూర్చుని వున్నాడు ఆంజనేయులు. జానకి పమిట జారి ఒళ్ళో పడి ఉంది- అయినా ఆమె సరిచేసుకునే ప్రయత్నం చేయటం లేదు. మృదుల కాళ్ళెత్తి ఎదుటి కుర్చీమీద పెట్టి విలాసంగా కూర్చుని వుంది. ముసలాయన యిదేం పట్టనట్లు జీడిపప్పు నములుతూ విస్కీ తాగుతున్నాడు.
రెండువేల అయిదొందల మెగావాట్ల షాక్ తగిలినట్లయింది బాలూకి. పట్టుకున్న పైపు వదిలేసి క్రింద పడిపోతానేమోనన్నంత భయం కలిగింది. అతి కష్టంమీద నిభాయించుకున్నాడు.
ఆంజనేయులు మృదుల పరిచయస్తులన్న షాక్ కన్నా, అతడూ జానకీ కూర్చున్న విధానం- పక్కనే ముసలాయన ఇదంతా అతి సాధారణమైన విషయంలా తాగుతూ వుండటం అతడిని దిగ్భ్రాంతుడిని చేసింది.
జానకి!
అతడికి తల తిరిగిపోతూ వుంది.
ఆంజనేయులు తమింటికి వస్తూన్న టైమ్ లో ఎదురింటి దంపతులతో పరిచయం పెంచుకున్నాడా? జానకికి కూడా అలానే దగ్గిరయ్యాడా? మృదుల అతనికి ముందే తెలుసా? అంత ఒక అయోమయపు నాటకంలా వుంది.
ఆ నాటకానికి ఆఖరితెర వేస్తున్నట్టు మరో వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు- అతడు... ఆసెయ్య!!!
18
సాయంత్రపు గాలి రివ్వున వీస్తోంది. సన్ షేడ్ మీద నిలబడి చూస్తూన్న బాలూ బట్టలు రెపరెపలాడుతున్నాయి. మనసు స్థితికూడా అలాగే వుంది. తనకెందుకు స్పృహ తప్పలేదో ఆశ్చర్యంగా వుంది అతడికి. మెదడుఫై దెబ్బమీద దెబ్బ తగులుతున్నట్టు వుంది. ఏది అర్ధం చేసుకోవాలో కూడా తెలియటం లేదు. మనసుని ఏదో నొక్కిపట్టి వుంచినట్లు అనిపిస్తోంది. ఆఖరుగా ప్రవేశించిన ఆసెయ్య అతడిని పూర్తిగా నిర్వీర్యున్ని, ఆలోచనా రహితుడిని చేశాడు.
తన దగ్గిర అమాయకుడిగా, అసలు మాట్లాడటమే తెలియని నమ్మకస్తుడైన నౌఖరుగా నటించిన ఆసెయ్య ఆంజనేయులుతో మామూలుగా సంభాషిస్తున్నాడు. జానకి నవ్వుతూ వాళ్ళవైపు చూస్తోంది. మృదుల కాఫీ అందిస్తోంది.
వాళ్ళకి ఇంత దగ్గ్రిరలో - ఇంత సామీప్యంలో వుండి తను గమనిస్తున్నాడని వాళ్ళు ఊహించి ఉండరు. ఎక్కడో స్టేజీమీద ప్రోగ్రాం ఇస్తూ వుంటాడని అనుకుని వుంటారు. అందుకే ఇంత ధైర్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
బాలూ చూస్తూనే వున్నాడు.
ఆంజనేయులు జేబులోంచి మడతపెట్టిన వందరూపాయల నోట్లు కొన్ని తీసి జానకికి అందించాడు.
లెక్క పెట్టుకుని జాకెట్లో దోపుకుంటూ-
"సినిమాల్లో వేషం కూడా ఇప్పిస్తానంటివే!" అంది.
నవ్వాడు ఆంజనేయులు.
"నాటకం పూర్తికానీ! అప్పుడు కదా సినిమా?"
ముసలాయన సకిలించినట్లు దగ్గాడు.
"కథ క్లయిమాక్స్ కొచ్చేసింది బాబాయ్! హీరోయే విలనై పోయి హీరోయిన్ని సఫా చేయడానికి ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు. రేపొద్దుటికి నాటకానికి తెర పడిపోతుంది" అన్నాడు ఆంజనేయులుతో.
"ఏమాట కామాటే చెప్పుకోవాలి. నాటకంలో నాలుగే పాత్రలైనా ముచ్చటగా రక్తి కట్టించారులే!" అన్నాడు ఆంజనేయులు.
"రక్తి కట్టడానికి కారణముంది బాబాయ్!" అన్నాడా ముసలాయన. "పరిషత్తుల్లో నాటకమాడామనుకో! పంచేంద్రియాలూ కేంద్రీకరించి ఆడతాం. ఎందుకూ? బహుమతి కొట్టేయాలని ఎదురుగా వెండికప్పు కనబడి ఊరిస్తూ వుంటే ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి శ్రమిస్తాం! ఇక్కడ మేం ఆడిన నాటకం బాలూకి సౌదామిని మీద విరక్తి పుట్టించేంత రక్తి కట్టిందంటే దానిక్కారణం నువ్వు ఆశపెట్టిన డబ్బు బాబాయ్! మమ్మల్నే కాదు! మనుసులందరి చేతా ఎన్నో నాటకాలాడిస్తుంది డబ్బు ఎన్నెన్నో వేషాలేయిస్తుంది డబ్బు!" పేజీన్నర పొడుగున్న డైలాగుని సునాయాసంగా అప్పచెప్పినట్లు చెప్పేస్తున్నాడు ముసలాయన.
"ఆపుదూ నీ సుత్తి మార్కు డైలాగులూ!" అంది జానకి. హాండ్ బ్యాగులోనుంచి, పేపర్లో చుట్టివుంచిన కిళ్ళీ తీసి, దాన్లో జరదా సరిగ్గా వుందా లేదా అని సరిచూసుకుని బుగ్గన పెట్టుకుంటూ.
బాలూ ఆమెని నిర్ఘాంతపోయి చూస్తున్నాడు.
ప్రత్యూష కిరణాలు వెలుగులో పారిజాత పూలనికొస్తూ అలవోకగా తనని చూసి నవ్వినా జానకేనా ఈమె?
అతడలా చూస్తూ వుండగానే జానకి వళ్ళు విరుచుకుంటూ అంది. "ఎల్లుండి కాకినాడ్లో రాయబారం సీను వుంది. ఒప్పుకోవచ్చా! ఇంకా ఇక్కడ నాకూ గవర్రాజుకీ పనేముంది? కొంపముంచేశాంగా!" అంది.
సరదాగా ఆమెని కొట్టబోయినట్లుగా చెయ్యెత్తాడు ఆంజనేయులు.
"దొంగా....? ఎక్కడికీ పోయేది".
"పోనీ ఉంచుకుంటావా? వుండిపోతా!" అంది జానకి సిగ్గు లేకుండా.
గవర్రాజు అనబడే ముసలాయన గ్లాసెత్తి గటగట విస్కీతాగేసి అర్ధనిమీలిత నేత్రాలతో వాళ్ళని చూశాడు.