Previous Page Next Page 
వెలుగుబాట పేజి 36

                                                                                                                                                                       
    "మీ అంతట మీరే పోయివుంటే, ఎంతో సంతోషించేదాన్ని. మీకామాత్రం సిగ్గూ, లజ్జా కూడా లేదు. ఏ ముఖం పెట్టుకుని ఇంకా ఇక్కడున్నారో నాకు అర్ధం కావటంలేదు."
    "ఏయ్! ఏమిటది నోటికొచ్చినట్టు వాగుతున్నావ్? నేను మొగాణ్ణి! ఏమి చేసినా చెల్లుతుంది."
    "ఇకనేం! ఊరిమీదకు బయలుదేరండి. ఏమేమి చెయ్యగలరో అన్నీ  చెయ్యండి. అయితే, వాటి ఫలితాలు కూడా మీరే అనుభవించండి? పారిపోయి ఇక్కడికి రాకండి."
    తెల్లబోయి చూశాడు సుబ్రహ్మణ్యం. అతనికి నిజంగా, మొదటి సారిగా భయంలాంటిది కలిగింది. ఈ  సంభాషణంతా తన గదిలోంచి వింటూన్న ఝాన్సీ చాలా సంతోషించింది. కాని అనారోగ్యంగావున్న తల్లి బాధపడుతుందేమోనని భయపడింది. తల్లి పడుకున్న మంచం దగ్గరకు వచ్చి చూసింది. ఉదాసీనంగా పడుకునివుంది అచ్చమాంబ. ఝాన్సీ  దగ్గరకు రాగానే, ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూసి, మళ్ళీ  కళ్ళు మూసుకుంది. చివరకు తల్లి కూడా ఈ అల్లుడితో విసిగిపోయిందన్నమాట!
    సుబ్రహ్మణ్యం హడావుడిగా కోపం తెచ్చేసుకుని, "నా సామాను సర్దు, నే పోతాను" అన్నాడు. నాగమాంబ నవ్వింది.
    "మొద్దులా నవ్వుతవేం?"
    "ఇన్నాళ్ళూ మొద్దులాగే ఏడుస్తూ పడివున్నాను. ఇప్పుడిప్పుడే మనిషిలాగా నవ్వుతున్నాను. నా మీద ఏదో  అధికారం వున్నట్లు పెత్తనం చెలాయిస్తోంటే నవ్వురాకే మవుతుంది? అయినా ఇప్పుడింక నాకు నవ్వుకాక ఏడుపెందుకు వస్తుందీ? మీరేం సర్దుకుంటారో సర్దుకుని తొందరగా బయటకు నడవండి."
    పుట్టి బుద్దెరిగాక ఆడవాళ్ళలో ఈ స్వరూపాన్ని ఎప్పుడూ చూడలేదు శాస్త్రి కోపంతో అతడి మనసు రగులుకుపోతుంది. తన బట్టలన్నీ పెట్టెలో కక్కుకుని, పెట్టె చేతపట్టుకుని "ఈ పాపానికి తగిన ఫలితం అనుభవిస్తావు" అని కసితీరా తిడుతున్నాడు.
    "పాప పుణ్యాలనేవి వుంటే, వాటికి తగిన ఫలితం మనుష్యులనుభంచేది నిజమే అయితే మీ మాటలు మీకే తగుల్తాయి."
    గతుక్కుమన్నాడు శాస్త్రి. ఒక్క క్షణం అక్కడ వుండకుండా రోడ్డుమీద పడ్డాడు. నాగమాంబ ఏ క్షణంలో నైనా వచ్చి తన కాళ్ళమీద పడుతుందనే ఆశ చావలే దతనికి! నాగమాంబ రాలేదుకాని, నూకాలమ్మ ఎదురు పడింది. ముఖం వికారంగా పేట్టి, కాండ్రించి ఉమ్మింది. గుండె గుభిల్లుమంది ఆ దీరుడికి! పెట్టెను ముఖానికి అడ్డంగా పెట్టుకుని గబగబా ముందుకు నడిచాడు.
    శాస్త్రి ఇంటినుంచి బయటికిపోయేవరకూ గంభీర్యంతో వున్న నాగమాంబ అతడు పోగానే కూలబడిపోయి కొంగులో ముఖం దాచుకుని ఏడుపు ప్రారంభించింది. ఝాన్సీ  జాలిగా అక్కదగ్గరకు వచ్చి "బాధపడకక్కా! నిజంగా నువ్వు చేసింది ఎంతో మంచిపని!" అంది.
    "కానీ ఝాన్సీ! ఇక మీదట నా బతుకు ఏమయిపోవాలే! ఇద్దరుపిల్లలతో నేనెలా బతకాలే! ఛీ! ఛీ! ఈ సమాజంలో ఆడదాని బతుకు ఎంత అధ్వాన్నం! హాయిగా రాధలాగా చదువుకొనే ప్రాప్తమైనా లేదు".
    "ఎందుకులేదూ? ఇప్పుడు నీకేమంత వయసు మించిపోయిందని? రాధలాగ స్కూల్ కి వెళ్ళలేక పోయినా,  ఇంట్లో ఉండి ప్రైవేట్ గా చదువుకోవచ్చు ఆ సదుపాయం నేను చేస్తాను. కాని ఆడదానికి భర్త తోడిదే లోకమనే అభిప్రాయాన్ని నీ మనసులోంచి పూర్తిగా తుడిచిపారెయ్యాలక్కా! అవసరమయితే, ఒంటరిగానే జీవించటానికి సిద్ధపడాలి."
    నాగమాంబ కళ్ళు తుడుచుకుని "ఆ చదువుకునే సదుపాయమేదో చూడు" అంది.
    మంచంలో పడుకుని వున్న అచ్చమాంబ ఒక్క నిట్టూర్పు విడిచింది.

 

                                                           *    *    *


    తల్లి జబ్బుపడ్డప్పుడు కుమార్ చూపిన శ్రద్ధా,చేసిన సహాయమూ, తల్లి మనసులో అతనిపట్ల ఏర్పడ్డ కృతజ్ఞతా భావమూ, ఝాన్సీ మనసులో కొత్త ఆశలను చిగురింపచేశాయి. తల్లి ఆరోగ్య విషయం చర్చించే నెపంతో ఇంచు మించు ప్రతిరోజూ, తన ఆస్పత్రినుంచి కుమార్ ఆస్పత్రికి వెళ్ళేది ఇద్దరూ, తల్లి అనారోగ్యంతో ప్రారంభించి, రకరకాల జబుర్లు చెప్పుకొనేవారు చెప్పుకోనేవి మామూలు మాటలే అయినా, వాటివెనుక, ఏదో ఆర్ద్రత  ఇద్దరి మనసులనూ తాకేది.  "మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో మెరుపులూ, చిరునవ్వులలో చిలిపితనమూ, ఆ మాటలకు కొత్త అర్ధాలు చెప్పేవి ఇద్దరూ మాటలలోపడి పరుగులుపెట్టే కాలాన్ని పూర్తిగా మరిచిపోతే,సుందరమ్మ వచ్చి హెచ్చరించి భోజనానికి పిలిచేది చాలా సార్లు సుందరమ్మ, ఝాన్సీ  కుమార్ కలిసి భోజనం చేసేవారు. ఒకప్పుడు ముభావంగా వుండే మేరీ కూడా ఝాన్సీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతోంది. అపుడప్పుడు పేషెంట్స్ ఎక్కువగా ఉంటే, ఆడరోగులని ఝాన్సీ పరీక్షించి, మందులు రాసిచ్చేది. అలాంటప్పుడు కుమార్ నవ్వుతూ "థాంక్యూ!" అని అంతలోనే తమాషాగా కన్నుకొట్టి "నేను నీకు థాంక్స్ చెప్పక్కర్లేదు నీ చేత పనిచేయించుకునే అధికారం నాకుంది" అనేవాడు. ఝాన్సీ నిలువెల్లా విద్యుత్తరంగాలు వ్యాపించేవి ఆ మాటలకు.
    అనిర్వచనీయమైన ఆనందానుభూతితో శరీరమంతా తేలికై గాలిలో తేలిపోతునట్లు ఇంటికి వచ్చేదరికి కలలో కూడా ఊహించని సన్నివేశం ఎదురైంది ఇంటి నిండా ముగ్గులున్నాయి. మావిడాకుల తోరణాలున్నాయి. ఇద్దరు బ్రాహ్మణులు ఏవో హొమాలు చేస్తూ మంత్రాలు చదువుతున్నారు. తల్లి పట్టుబట్టలు కట్టుకుని చేతులు జోడించి కూచుని. ఉంది. ఝాన్సీ విస్తుపోతూ నిలబడిపోయింది తల్లి తెలతెలబోతూ "ప్రాయశ్చిత కాండ జరిపించుకుంటున్నానే! అన్నాళ్ళు ఆస్పత్రిలో పడివున్నానా! ఆ మైల వొంటితో దేవుడికి నైవేద్యం ఎలా పెట్టను చెప్పు? ఇంత బతుకూ బతికి దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎలా తినను చెప్పు?" అంది. తననే సంజాయిషి అడుగుతున్నట్లు.
    ఝాన్సీ నిలువునా నీరసించిపోయింది. తన తల్లిలో మార్పు వచ్చింది అనుకుంది. ఎంత భ్రమ! ఎంత అభిమానమైనా, ఎన్ని అనుభావాలైనా. నరనరానా జీర్ణించుకు పోయిన, ఆ ఛాందసాన్ని మార్చలేవు. తను ఏమంటుందోనని బెదిరిపోతూ, దీనంగా ముఖం పెట్టుకొని, ప్రార్ధిస్తున్నట్లు బ్రతిమాలుకొంటోంది. అలాంటి తల్లితో కఠినంగా ఏం మాట్లాడగలదు? అప్పటివరకూ తల్లి మంచంలోనే ఉండి, పాలూ, పళ్ళూ, పళ్ళరసమూ మాత్రమే తీసుకొనేది. ఆ క్రిందటిరోజే తనూ, పళ్ళరసమూ మాత్రమే తీసుకొనేది. ఆ క్రిందటిరోజే తనూ, కుమార్, తల్లి మామూలుగా భోజనం చెయ్యవచ్చునని అభిప్రాయపడ్డారు. బహుశః అందుకే కాబోలు ఈ ప్రాయశ్చిత కాండ! ఈ  'ప్రాయశ్చితం' జరిగితేనే కాని, తల్లి భిజనం చెయ్యదు. లాభం  లేదు. తను ఏమీ  చెయ్యలేదు. మూర్ఖత్వాన్ని తను ఎదుర్కోగలదు, ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా  తట్టుకోగలదు. కాని, దైన్యమూ, నిస్సహాయతా, మమతా, మేళవించిన ఈ మూర్ఖత్వం ముందు చిత్తుగా ఓడిపోతోంది. తను తల్లితో గట్టిగా పోట్లాడవచ్చు, ఈ ప్రాయశ్చిత్త కాండను మాన్పించవచ్చు. కాని దానివల్ల ఏం జరుగుతుంది? తల్లి లోలోపల కుమిలిపోతూ. గుండెనొప్పి తెచ్చుకొంటుంది. అంతేకాని, ఈ ప్రాయశ్చితకాండ అనవసరమని మాత్రం తనను తాను నమ్మించుకోలేదు. రావలసిన మార్పు మనసులో! అదెలా వస్తుంది? మౌనంగా చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్ళబోయింది.
    "ఎక్కడకు వెళ్తున్నావే?" ఆ కంఠం నిండా  భయం. అదిగో, ఆ భయం చూస్తేనే తను భరించలేదు.
    సాధ్యమయినంత శాంతంగా "నువ్వు ప్రాయశ్చిత్తకాండ నిష్ఠగా జరిపించుకో! నేనెందుకూ ఇక్కడ?" అని బయలుదేరింది. నాగమాంబ అటు తల్లికి, ఇటు చెల్లెలికీ మధ్య పట్టుబట్టతో నిలబడిపోయి ఇద్దరినీ అయోమయంగా చూడసాగింది. బయటకు నడుస్తున్న ఝాన్సీ చెవిలో బ్రాహ్మణుల మంత్రాల ఘోష ఈనాటికీ పూర్తిగా వికసించలేని మానవత్వం చేస్తున్నా ఆక్రందనలా వినిపించింది.
    ఒక గమ్యం అంటూ లేకుండా నడుస్తున్న ఝాన్సీ కి బోసుబాబు ఇంటిముందు కూడా ఏదో సందడి కనిపించింది. పట్టుచీరలు కట్టుకున్న అమ్మలక్కలు చేతిలో ప్రసాదాలతో వెళ్తున్నారు! తన కూతురి కాపురం చక్కపడటానికి, బోసుబాబు సత్యనారాయణవ్రతం చేయిస్తున్నాడు. సరళా, మాధవరావు పీటలమీద కూచుని వ్రతం చేస్తున్నారు. పేరంటానికివచ్చి ప్రసాదం తీసుకుని బయటికి వచ్చిన అమ్మ  లక్కలు రకరకాలుగా వ్యాఖ్యానించుకొంటున్నారు. ఈ సంస్కృతిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంకాక, తల కొట్టుకుంది ఝాన్సీ.

 Previous Page Next Page