Previous Page
వసుంధర కధలు-8 పేజి 36

 

    "ఆ మందును చేత్తో తాకకూడదు. అలాగే ఇచ్చేసేయ్" అన్నాడు డాక్టర్.
    "గంగరాజుగారూ నోరు తెరవండి" అంది సుగుణ.
    "ఆ" అంటూ గంగరాజు నోరు తెరిచాడు. మందు వేసుకునే ముందాయన "డాక్టర్ నాకింకా నలభై అయిదేళ్ళు. కనీసం మరో పదిహేనేళ్ళయినా బ్రతుకుతాను కదూ, చెప్పండి డాక్టర్!" అన్నాడు.
    "తప్పకుండా" అని ముఖం తిప్పుకున్నాడు డాక్టర్.
    'డాక్టర్ చేత్తో విషమిచ్చినా అమృతంగా మారి నాకు ప్రాణం పోస్తుంది. అయన హస్తవాసి చాలా మంచిది. సుగుణా, నేను రెడీ " అంటూ నోరు తెరిచాడు గంగరాజు. సుగుణ చేతిలో ఉన్న చెంచా లోంచి గంగరాజు నోట్లోకి మందు వెళ్ళింది. గంగరాజు గుటకవేశాడు. చెందాను కడగడానికి వెళ్ళిన సుగుణ డాక్టర్ ఇచ్చిన మందు సీసాను తీసుకెళ్ళి లోపల అలమారాలో దాచింది. ఆమె చెంచా కడిగి వచ్చే సరికి  అందరూ గొల్లుమని ఏడుస్తున్నారు.
    అంతా అయిపొయింది . గంగరాజు మరణించాడు.
    "ఈరోజు గడవడం కష్టమని డాక్టరు గారు నాకు తెలిపినా సామాన్య మానవుడిగా బ్రతికితే బాగుండునని ఆశించాను. కానీ ఆ ఆశ నిరాశయింది" అన్నాడు డాక్టర్ కళ్ళు తుడుచుకుంటూ.
    రంగమ్మ, సుభద్రమ్మ , గొంతెత్తి ఏడుస్తున్నారు. భద్రానికి ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళాగడం లేదు.
    'ఆయనకు బ్రతుకు మీద ఎంత తీపి? అయినా మృత్యుదేవత ఆయన్ను కరుణించలేదు" అంది సుగుణ . ఆ తర్వాత ఆమెకూ ఏడుపొచ్చి మాటలు రాలేదు.
    అప్పుడే రామారావు అక్కడికి వచ్చాడు. అక్కడి వాతావరణం తన్ను కలవరపరుస్తుండగా అతన్ని మరింతగా కలవరపరుస్తూ శవామున్న మంచానికి పక్కనున్న టేబుల్ మీద పోలీతీన్ ట్యూబ్ కనిపించింది. పరుగెత్తుకెళ్ళి దాన్ని తీశాడు. అది తనదే. దాని మీద షుగర్ అన్న అక్షరాలూ!
    రామారావుకి కళ్ళు తిరిగినట్లయింది. అతను అక్కడున్న వారితో "ఈ మంచం మీదాయన చనిపోయారా?" అన్నాడు.
    'అందుకే కదయ్యా మేమేడుస్తుంట!" అన్నాడు భద్రం ఏడుస్తూనే. అతని ద్వారానే రామారావు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని గుండెలు విపరీతమైన వేగంతో కొట్టుకోసాగాయి. తటాలున రెండు చేతులతో ముఖం కప్పుకుని "ఇది మామూలు చావు కాదు. హత్యే! అన్నాడు.
    "ఏమిటి హత్యా!" అన్నాడు భద్రం. అందరూ ఉలిక్కిపడ్డారు.
    "ఈయనేవడో పిచ్చివాడులాగున్నాడు. నేను డాక్టర్నిక్కడున్నాను. అయన మరణం మాములుగానే సంభవించింది. ఉదయం నించీ ఏ క్షణాల్లోనయినా ప్రాణం పోవచ్చు నన్నస్థితిలో వున్నాడాయన."
    "కావచ్చు, కానీ అయన మరణం ఈ ట్యూబ్ లోని పదార్ధం తిన్నాక సంభవించింది. ఈ ట్యూబులో ఉన్న దేమిటో తెలుసా? సయనైడ్!" అంటూ రామారావు దాని వివరాలు చెప్పాడు.
    భద్రం ఆవేశంతో ఊగిపోతూ రామారావుని వడిసి పట్టుకొని "పోలీసుల్ని పిలవండి" అన్నాడు.

                            *    *    *    *

    "మీ నిజాయితీని హర్షించగలను. కానీ మిమ్మల్ని శిక్ష నుంచి తప్పించలేను" అన్నాడు ఇన్ స్పెక్టర్. "మరో పావుగంటలో పోస్టు మార్టమ్ రిపోర్టు వస్తుంది. హతుడు సయనైడ్ వల్లనే మరణించి వుంటే మీ కెటువంటి శిక్ష పడుతుందో చెప్పలేను. మీరు లాయర్ని పెట్టుకోవడం మంచిది" సలహా కూడా ఇచ్చాడు ఇన స్పెక్టర్.
    రామారావు అదోలా నవ్వాడు. "బాధ్యత గల పౌరుడిగా నన్ను నేనే మన్నించుకోలెకపోతున్నాను ఇన స్పెక్టర్. నా అజగ్రత్తకు అనివార్య పరిస్థితులు తోడూ కాగా ఒక నిండు ప్రాణం బలై పోయింది."
    ఇన స్పెక్టర్ ఏమీ మాట్లాడలేదు. క్షణాలు భారంగా గడిచిపోతున్నాయి. సయనైడ్ వల్ల మరణం సంభావించలేదని పోస్టు మార్టం రిపోర్టు వస్తే ఎంత బాగుండును అనుకుంటున్నాడు రామారావు. కానీ అదెలా సంభవం!
    పోస్టు మార్టమ్ రిపోర్టు వచ్చింది. హతుడి మరణం సయనైడ్ వల్లనే సంభవించింది. మరణ కాలమూ, పోలీతీస్ ట్యూబ్ లోని పదార్ధం ఇవ్వబడిన సమయమూ రెండు సరిగ్గా సరిపోయాయి. "సో యు ఆర్ అండర్ అరెస్ట్ రైట్ ఫ్రమ్ నౌ" అన్నాడు ఇన స్పెక్టర్.
    "మీ బాధ్యత మీరు నిర్వహించండి. కానీ మా యింటికి కాస్త కబురు పంపించండి" అన్నాడు రామారావు.

                           *    *    *    *

    ఇంటి దగ్గర్నుంచీ బిలబిలమంటూ రామారావుని చూడ్డానికి జనం వచ్చారు. వాళ్ళలో సుందరి కూడా వుంది.
    "బావా, ఇదేమిటిలా జరిగింది. నీకో శుభవార్త ఈరాత్రే చెప్పాలనుకున్నాను. మధ్యాహ్నం నువ్వింట్లో లేనప్పుడు నీకు పోస్టు వచ్చింది. ఒక కవరు కార్డు వచ్చాయి. కార్డు మీద ఏముందో తెలుసా ? ఒక కంపెనీ వాళ్ళు నీకుద్యోగం ఇస్తున్నారు. నెల రోజుల్లో అపాయింట్ మెంట్ ఆర్డరు పంపిస్తున్నారుట. ఈలోగా నువ్వు మెడికల్ ఎగ్జామినేషన్ వగైరా కొన్ని ఫార్మాలిటీస్ అండర్ గో కావలసి ఉందని రాశారు. నిన్ను ఊరించి రాత్రి చెప్పాలనుకోన్నాను. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో....' అంటూ ఏడుపు రాగా ఆమె పైట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని రెండు ఉత్తరాలూ బావకు అందించింది.
    రామారావు నిర్లిప్తంగా వాటిని అందుకుని చూశాడు. కార్డు చదివి వేదాంతిలా నవ్వుకున్నాడు. కవరు చింపి ఉత్తరం చదివాడు. అది రవి రాశాడు. చదువుతుండగా అతని ముఖంలో వెలుగు కనిపించింది. "ఇన స్పెక్టర్ ఇది చూడండి" అంటూ అయన కందించాడా ఉత్తరం.
    'డియర్ రావ్!
    నీ ఉత్తర మందిన తక్షణం ఇది వ్రాస్తున్నాను. నిజానికి ఇంతకాలానికి మనిషిననిపించావు. ఉద్యోగం లేకపోతే బ్రతుకలేననుకున్న నువ్విలా మారినందుకు చాలా సంతోషం. ఇందుకు నీ మరదల్ని అభినందించకుండా వుండలేను. విష్ యూ అల్ సక్సెస్ ఇన్ యువర్ వెంట్యూర్. సయనైడ్ ట్యూబు దొంగిలించానని రాశావు. విచారించకు ఆ సంగతి నాకు తెలియదనుకొంటున్నావా? నువ్వు దాన్ని మార్చి తీసుకు పోయినట్లు నాకారోజే తెలుసు. అసలు నువ్వలా చేస్తావని కూడా తెలుసు. చావాలనుకొంటున్న వాడికి అందుబాటులో మృత్యుదేవతనుంచే ఫూల్ ని కాదు నేను. నేను చూపించిన రెండు ట్యూబుల్లోనిదీ పంచదారే! మృత్యుదేవత అందుబాటులోకి వస్తే కానీ ప్రాణాల విలువ తెలియదు. అందుకే అది సయనైడ్ అన్న బ్రాంతి నీకు కలిగించాను. కానీ ఇంత వరకూ నువ్వు దాన్ని తినలేకపోయావంటే కారణం పరిస్థితులు కాదు ఏ మూలనో ప్రాణాల మీద నీకున్న తీపి! ఈ ఉత్తరం అందగానే అందులోని పంచదార కాస్త నోట్లో వేసుకుని హాయిగా చప్పరించు. వుంటాను మరి,

                                                                                                  నీ ---రవి"
    ఉత్తరం చదువుతూనే ఇన స్పెక్టర్ ముఖంలో రంగులు మారాయి. ఒకసారి నుదుటి మీద కొట్టుకుని "వాటీజ్ దిస్!" అనుకున్నాడు. కేసు కొత్త రూపం దాల్చేలా వున్నదని ఆయనకు భయం వేసింది. వెంటనే అయన 'ఈ మధ్యకాలంలో నేనెన్నడూ ఇంత పెద్ద పొరపాటు చేయలేదు. అసలు విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఒక అమాయకుణ్ణి అరెస్టు చేశాను" అని గొణుక్కుంటూ అయన లాబొరేటరీకి ఫోన్ చేసి పోలతీన్ ట్యూబ్ లోని పదార్ధం పంచదరో, సయనైడో టెస్టు చేసి అర్జంటుగా రిపోర్టు చెయ్యమని అడిగాడు.
    పది నిమిషాల్లో రిపోర్టు వచ్చింది-- అది పంచదారేనని.
    "సో యు ఆర్ రిలీజ్ డ్" అన్నాడు ఇన్ స్పెక్టర్. నవ్వుతూ . అంతలోనే అయన ముఖం గంబీరంగా మారిపోయింది. అయన తీవ్రా లోచనలో పడ్డాడు.

                         *    *    *    *

    'సృష్టిలో ప్రతి చిన్న విషయానికి ప్రాముఖ్యత ఉంటుందన్నది అక్షరాలా నిజం. మీరు ఆత్మహత్య చేసుకోవాలని ఒక బలహీనమైన క్షణంలో తీసుకున్న నిర్ణయం ఒక హంతకుణ్ణి పట్టి ఇవ్వగలిగింది. మీ ఆధారం లేకపోతె ఈ హత్యే నెవ్వరూ గుర్తించి వుండేవారు కాదు-" అన్నాడు ఇన్ స్పెక్టర్ రామారావుని ప్రత్యేకంగా అభినందిస్తూ.
    రామారావు ఇన్ స్పెక్టరు వద్ద సెలవు తీసుకొని వచ్చేసాడు. హతుడు మరణించిన సమయాన్ని బట్టి, తన ట్యూబు లోనిది పంచదారే అయినట్లయితే ఆ పంచదార తో పాటు ఇవ్వబడిన మందు సయనైడ్ అయుండాలని భద్రం అన్నాడు. వెళ్ళి విచారించగా ఆ మందు సీసా బయటపడింది. అందులో వున్నది సయనైడ్.
    తన క్లయింట్ సయనైడ్ వల్లనే మరణించినట్లు డాక్టరు అంగీకరించ దల్చుకోలేదు. కానీ హత్యకు కారకుడు రామారావేనని స్పష్టంగా కనబడుతుంటే అయన తృప్తిగా ఊరుకోవడమే కాక అజాగ్రత్తగా కూడా వున్నాడు. అతి సులువుగా హత్యానేరం రుజువయింది. ఆ మందును డాక్టరే ఇచ్చాడని అందరితో పాటు సుగుణ కూడా ఇచ్చిన సాక్ష్యం బలపరిచింది.
    రామారావు కు డాక్టరు మీద జాలివేసింది. చనిపోయిన గంగారాజుకి డాక్టరు మీద అంతులేని విశ్వాసమట. అందువల్ల అయన బ్రతికుంటే ఈరోజే వీలునామా మార్చి వ్రాసి ఉండేవాడు. అర్ధాంతరంగా తను మరణించినట్లయితే ఆ సందర్భంలో తన ఆస్తికి డాక్టర్ని ట్రస్టీగా వేయదలచాడాయన. కూతురికి, మేనల్లుడికి వ్యవహార దక్షత లేకపోవడం వలన ఆస్తికి వాళ్ళు వరసులైనా వినియోగానికి డాక్టర్ని సంప్రదించడం వల్ల మేలు జరుగుతుందని అయన అభిప్రాయపడ్డాడు.
    అయితే డాక్టరు పధకాలు వేరుగా వున్నాయి. తను ఆస్తికి ట్రస్టీగా ఉంటే ఎలాగోఅలా భద్రాన్ని వదిలించుకొని రంగమ్మను పెళ్ళి చేసుకోవాలని అయన అనుకొన్నాడు. రంగమ్మ వంటి అమాయకురాలిని తను సులభంగా లొంగదీసుకోగలనని అయన అభిప్రాయపడ్డాడు.
    కానీ హత్య జరిగే రోజు మధ్యాహ్నం గంగరాజు డాక్టరు తో సరదాకి ఓ అబద్దం చెప్పాడు. డాక్టర్నీ ట్రస్టీగా చేస్తూ తానిదివర లోనే వీలునామా వ్రాశాననీ ఇప్పుడు తన ఆరోగ్యం మీద బాగా నమ్మకమేర్పడడం వల్ల ఆ విల్లు మార్చి వ్రాయబోతున్నాని అయన డాక్టరు తో అన్నాడట. మర్నాడు డాక్టర్ని ఆశ్చర్యపరచాలనే అభిప్రాయంతో అయన అబద్దమాడి ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు.
    పాపం గంగరాజు! తన గుండె పోటు ఎక్కువ కావడంతో అనుమాన మొచ్చిందో యేమో - రాత్రి - లాయరు కోసం ఓ చీటీ కూడా వ్రాసి భద్రానికిచ్చాడు. అందులో "నా ఫామిలీ డాక్టరు, మీరూ నా ఆస్తికి ట్రస్టీలుగా వుంది ఆస్తిని సద్వినియోగం చేసుకోవడం లో నా వారసులకు సహాయపడాలి. రేపు వీలునామా వ్రాయబోతున్నాను. మీరు తప్పక రావాలి" అని రాశాడు. ఆ ఉత్తరం రాసినట్లు డాక్టరు కి తెలియదు. చేజిక్కిన ఆస్తి చేయిదాటి పోతుందనే భయం ఆయన్ని ఆవహించింది. రాత్రికి తయారుగా వచ్చాడు. గంగరాజు ప్రాణాలు ఎవ్వరూ అనుమానించలేని విధంగా తీశాడు.
    తను విన్నదాన్ని బట్టి అది నుంచీ గంగరాజుకి మృత్యువంటే భయం. కానీ అదతన్ని వదలలేదు. ఒకప్పుడు కోరి తనే మృత్యువు నాహ్వానించాడు. కానీ అది తనను తప్పించుకుని తిరగడమే కాక చివరకు అంతులేని ఆత్మ విశ్వాసాన్ని తనకు ఆపాదించింది. కంపెనీలో తనకు ఉద్యోగం రావచ్చు కానీ నే దాన్ని అంగీకరించడు. తన కాళ్ళ మీద తనే నిలబడేలా స్వయంగా సంపాదించుకొనే మార్గాలు వెతుక్కొంటాడు.
    రామారావు నడకలో వేగం వెచ్చింది.
    ఇంటి వద్ద అతని కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తుండే మరదలు సుందరి వుంది మరి!

                                      ***

 Previous Page