Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 35

 

    "పెట్టెయ్యనా!" అన్నాడతను మళ్ళీ.    
    "అలాగే!" అని అంది సౌదామిని.    
    రిసీవర్ ని క్రెడిల్ మీద వుంచేశాడు.    
    సంతోషంలేని నవ్వు వచ్చింది అతని పెదాలమీదకు.    
    గ్యాస్ సిలిండర్ అంటే బాంబుతో సమానమనీ, అరక్షణం అజాగ్రత్తగా వుంటే అంటుకుని పేలిపోతుందనీ భయపడి ఛస్తుంటారు జనం. కానీ నిజంగా చంపాలని అతి జాగ్రత్తగా ప్లానువేసి, తలుపులు మూసి- సిలిండర్ ఓపెన్ చేసి రబ్బరు పైపుని కోసేసినా ఏమీ కాలేదు.    
    ఈ లోకంలో ఎప్పుడూ అంతే ఏదీ ఎప్పుడూ అనుకున్నట్లు జరగదు. అనుకోనిది ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే వుంటుంది. సీసాడు కిరోసిన్ ఒంపి పది అగ్గిపుల్లలు అంటించినా అంటుకోనని మొండికేస్తుంది బాయిలర్.    
    కాల్చి పారేసిన సిగరెట్ పీక కొనప్రాణంతోనే ఎర్రగా వెలుగుతూ పుంజుకుని ఇల్లంతా తగలబెట్టేస్తుంది ఒక్కోసారి. సో! తన ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఇంకో ప్లాను వెయ్యాలి. విసుగ్గా లేచి- సిగరెట్ అంటించి, కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు బాలూ.    
    రూపాయి నాణాలు నేలమీద దొర్లిపోయినట్లు కనబడుతున్నాయి మష్ రూమ్స్. అటు... తూర్పువైపున వున్నవన్నీ విషపూరితమని చెప్పాడు మార్తాండ్. పాలేరు ఒకతను నీడలా కనబడుతున్నాడు. ఒంగి ఏదో చేస్తున్నాడు అతను. ఏం చేస్తున్నాడు? కళ్ళు చిట్లించి చూశాడు బాలూ. విషపూరితమైన మష్ రూమ్స్ ని పీకేస్తున్నాడు అతను. విషం, సహజమైన విషం.    
    మెరుపులా ఆలోచన తట్టింది అతనికి.    
    ఈ మష్ రూమ్స్ కలిసిన ఆహారం సౌదామినిచేత తినిపిస్తే...    
    మరణం తథ్యం...పైగా ఎవరికీ అనుమానం రాదు. మష్ రూమ్స్ పొరబాటున ఆహారంలో కలిశాయనీ, ప్రాణం పోయిందనీ అనుకుంటారు జనం. ఫుడ్ పాయిజనింగ్ అని తేల్చేస్తారు కేసుని.    
    అదే ఏ సైనేడ్ లాంటి విషాన్నో యిస్తే అది హత్యా ప్రయత్నం అని సులభంగా తెలిసిపోతుంది.    
    అందుకని మష్ రూమ్స్ బెస్ట్.    
    పాలేరు మష్ రూమ్స్ అన్నీ బుట్టలో వేసి, బావివేపు వెళ్ళాడు.    
    వెంటనే గబగబ అక్కడికి వెళ్ళి పది మష్ రూమ్స్ కర్చీఫ్ లో చుట్టి తన కారు డాష్ బోర్డులో పెట్టాడు బాలూ.    
    బాగా పొద్దెక్కాక లేచాడు మార్తాండ్.    
    అతనితో బిజినెస్ గురించి కాసేపు మాట్లాడి కాఫీ తాగి బయల్దేరాడు బాలూ.    
    ఇంటికి వస్తున్నంతసేపూ ఒకే ఆలోచన. తను ఇంత పకడ్బందీగా చేసిన ప్రయత్నం ఎలా ఫెయిలయిందీ!    
    కారు వీధి మలుపు తిరుగుతూండగానే హారన్ శబ్దం గుర్తుపట్టిన సౌదామిని సంతోషంగా ఎదురొచ్చింది గేటు దగ్గరికి. అతనూ మొహానికి నవ్వు పులుముకున్నాడు!    
    "మీ కోసం ఎంత ఎదురుచూస్తున్నాడో తెలుసా!" అంది సౌదామిని.    
    "కళ్ళు ఎర్రగా వున్నాయే? రాత్రి నిద్రపోలేదా!" అంది అభిమానంగా.    
    "నా కళ్ళు ఎర్రగా వున్నాయా" అన్నాడు బాలూ నీ కళ్ళే ఎర్రబడి వున్నాయి. వాటి ఎరుపే నా కళ్ళలో రిఫ్లెక్టు అవుతుందేమో! ఏం రాత్రి నిద్రపోలేదా?"    
    తడబడింది సౌదామిని. "అబ్బే! అదేంలేదు. రండి మీ కోసం కాఫీ ప్లాస్కులో పోసి వుంచాను. తీసుకురానా?"    
    పెద్దగా నవ్వాడు బాలూ.    
    "కాఫీ-ఊరికే మాటవరసకు చెప్పాను. పొద్దున్నే కాఫీ తాగి వెళతానని, దానికోసం అంత మధనపడిపోతున్నావేమిటి?"    
    "మధనపడనా మరి? మీ మాట అంటే నాకు ఆర్డరే కదా!"    
    "కాఫీ మేడమీద వుంచు".    
    సౌదామిని లోపలికి వెళ్ళింది.    
    కారు గేరేజ్ లో పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. సౌదామిని వంటింట్లో లేదు. కాఫీ ప్లాస్కుతో మేడమీదికి వెళ్ళినట్టుంది.    
    గ్యాస్ సిలిండర్ దగ్గరికెళ్ళి చూశాడు. ట్యూబ్ కోసేసే వుంది. సిలిండర్ ఆఫ్ చేసి వుంది. పక్కనే కిరోసిన్ మీద పులుసు కాగుతుంది.    
    ఏం జరిగి వుంటుంది? ఏం జరిగి వుంటుందో అతనికి చప్పున స్ఫురించింది. సిలిండర్ లో గ్యాస్ నిన్నటికే అయిపోయి వుంటుంది.    
    తను సిలిండర్ ఆప్ చేసి, ట్యూబ్ కోసెయ్యగానే మిగిలివున్న కొద్ది గ్యాసు బయటికి వచ్చేసి వుంటుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాసు గాలికంటే బరువు కాబట్టి అది నేల బారుగా పయనిస్తూ ఏ తూములో నుంచో ఎస్కేపు అయివుంటుంది.    
    అతను త్వర త్వరగా సిలిండర్ కి వున్న తెగిపోయిన పాత ట్యూబ్ ముక్క పీకేసి, స్టవ్ కి వేలాడుతున్న ట్యూబ్ ని సిలిండర్ కి జాయిన్ చేశాడు.    
    ఇప్పుడు మామూలుగానే కనబడుతున్నాయి స్టవ్, సిలిండర్ కూడా.    
    అటూ, ఇటూ చూసి జేబులోని మష్ రూమ్స్ తీసి మరుగుతున్న పులుసులో వేశాడు బాలూ.    
    సౌదామిని జీవితం అంతం చెయ్యడానికి రెండో ప్రయత్నం మొదలయింది.    
    మరుగుతున్న పులుసులో విషపూరితమైన మష్ రూమ్స్ వేసేసి మేడమీద కెళ్ళి కూర్చున్న తరువాత తట్టింది బాలూకి.   
    అసెయ్య కూడా రోజూ ఇక్కడే భోజనం చేస్తాడు.    
    అతను కూడా ఇవాళ ఈ విషాహారం తిన్నాడంటే?    
    అన్యాయంగా ఒక అమాయకుడిని తను బలి ఇచ్చినట్లవుతుంది. భోజనం టైముకి తను యింట్లో వుండకుండా వెళ్ళిపోతాడు. ఆసెయ్యని కూడా తనతో బాటు తీసుకెళ్ళాలి లేదా ఇంకేదన్నా పని పురమాయించి అతన్ని తరిమెయ్యాలి.    
    "కాఫీ?" అంది సౌదామిని వచ్చి ఎదురుగా నిలబడుతూ.    
    ఉలిక్కిపడి, కాఫీ గ్లాసు అందుకున్నాడు బాలూ. జంకుతూ ఆమె మొహంలోకి చూశాడు.    
    ఆమె మొహంలో ఏ భావమూ కనపడలేదు. కళ్ళు నిర్మలంగా వున్నాయి.    
    సౌదామినిని చంపడానికి తను చేసిన ప్రయత్నం ఆమె గ్రహించలేదా?    
    గ్రహించనట్లే వుంది.    
    అంతవరకూ తను అదృష్టవంతుడే? అందువల్ల ఇంకో అవకాశం మిగిలింది తనకి.    
    అతను ఏమన్నా మాట్లాడతాడేమోనని ఎదురు చూస్తున్నట్లు అక్కడే ఉండిపోయి, అదీ ఇదీ సర్దడం మొదలెట్టింది సౌదామిని.    
    ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తూ ఏదన్నా మాట్లాడాలని అతనికీ వుంది. కానీ నోరు పెగలడంలేదు. కొత్త మనిషిని చూసినట్లు భావన- సౌదామినిని చూస్తూ వుంటే, కొత్తగా వుంది.    
    "బాబు ఏడి?" అన్నాడు అతికష్టంమీద.    
    "పొద్దున్న లేచీ లేవగానే ఎదురింటికి ఊరేగినట్లున్నాడు".    
    "ఎదురింటికా?" అన్నాడు బాలూ వెంటనే లేచి నిలబడుతూ.    
    "వాళ్ళింటి కెందు కెళ్ళాడు?"    
    "ఎదురింటామె దగ్గర వీడికి చనువెక్కువవుతున్నట్లుంది ఈ మధ్య ఊ అంటే పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు".    
    "అలా వాళ్లిల్లూ, వీళ్ళిల్లూ పట్టుకు వేళ్ళాడం అలవాటు చెయ్యకు, అసహ్యంగా వుంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తానుండు" విసుగ్గా అని, చరచర మెట్లుదిగి, ఎదురింటి గేటు దగ్గరకి నడిచాడు బాలు.    
    అతని మనసు అతన్ని చూసి నవ్వుతోంది. తను ఇప్పుడు ఇక్కడకు రావడానికి అసలు కారణమేమిటి? బాబు వచ్చాడనేనా?    
    "బాబూ?" అని పిలిచాడు సంకోచంగా.    
    సమాధానంగా ముసలాయన దగ్గు వినబడింది. వెంటనే ఫిరంగి గుండులా ఒక బంతి వచ్చి బాలూని తాకింది. దాన్ని తడుముతున్నట్లు బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వెనకనే జానకి వేగంగా వచ్చేదల్లా అతన్ని చూసి చప్పున నిలబడిపోయింది.    
    బాలూ నవ్వుతూ "ఇంటికి వస్తావా" అన్నాడు కొడుకుతో.    
    వాడు జవాబివ్వలేదు.    
    ఆమె ఒకసారి వంగి బాబుని ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుంటూనే కళ్ళెత్తి బాలూ వైపు చూసింది.    
    "దా?" అన్నాడు బాలూ, బాబుతో.    
    అయిష్టంగానే మొహం పెట్టి దగ్గరికి వచ్చాడు బాబు.    
    వెనక్కి తిరగబోతూ ఆగి జానకితో అన్నాడు బాలూ- "అల్లరి చేసి మిమ్మల్ని విసిగించాడా?"    
    "కొంటెకృష్ణుడి అల్లరి చేస్తే ఎవరికైనా విసుగొస్తుందా? మురిపెంగా వుంటుంది గానీ" అని బాబువైపు తిరిగింది ఆమె. "అన్నం తిని మళ్ళీ వచ్చెయ్! ఏం? మనిద్దరం అష్టా చెమ్మా ఆడుకుందాం సరేనా?"    
    సీరియస్ గా ఆలోచించి, "నాకు రాదుగా?" అన్నాడు బాబు.    
    నవ్వింది జానకి "నేను నేర్పిస్తాగా?"    
    "మధ్యాహ్నం నాకు పనుంది".    
    "ఏం పనో?"    
    "అర్జున్ తో ఆడుకోవాలి".    
    "వాడితో సాయంత్రం ఆడుకోవచ్చుగా!"    
    "రాత్రికి వస్తాలే?" అన్నాడు బాబు తేల్చేస్తూ.    
    నవ్వింది జానకి.    
    "రాత్రిళ్ళు నిద్రపోవా ఏం?"    
    "అమ్మా, నాన్నా నేను నిద్రపోయానో లేదో తట్టి చూస్తుంటారు. కానీ నేను నిద్రపోనుగా? గట్టిగా కళ్ళు మూసుకుని అంతా చూస్తుంటా". అప్పటివరకూ బాబు మాటలు వింటూ నవ్వుమొహంతో బాలూవైపు చూస్తున్న జానకి చెంపలు ఈ చివరి సమాధానానికి ఎర్రబడిపోయాయి చటుక్కున మొహం పక్కకు తిప్పుకుంది.    
    "నోర్ముయ్ వెధవా!" అని గబగబా బాబు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు బాలు.    
    ఒక్కక్షణంలో కుంకుమపువ్వు రంగుకి తిరిగిపోయిన జానకి చెంపలే అతని కళ్ళముందు మెదులుతున్నాయి.    
    సిగ్గుపడితే మొహం ఎందుకు ఎర్రబడుతుందో ఎక్కడో చదివాడు. అది గుర్తొచ్చింది.    
    సిగ్గుతో మొహం కందిపోవడం అనేది పుట్టుకతో రాదట. ఆ 'రిఫ్లెక్స్ యాక్షన్' రెండేళ్ళు, నాలుగేళ్ళ మధ్య వయసులో వృద్ది చెందుతుంది. మనసు కేంద్రీకరించి దీన్ని కంట్రోలు చేసుకోవడం సంభవం అట.    
    సిగ్గుపడటం మొగపిల్లలకంటే ఆడపిల్లలలోనే ఎక్కువగా ఉంటుంది. అవమానం కలిగినా, ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోయినా, మెదడు నరాల ద్వారా సంకేతాలు పంపుతుంది. దానివల్ల ఒక శక్తివంతమైన వెస్టయిడ్ అనే రసాయనం విడుదల అయి మొహం, మెడా, ఛాతిమీద ఉండే చర్మంలోని చిన్న రక్తనాళాలను వ్యాకోపింపజేస్తుంది. దీన్నే 'సిగ్గుతో కందిపోవడం' అని వ్యవహరిస్తాం. బాబుగాడి మాటలకి అంత రియాక్టు అయిందన్న మాట జానకి? బాబు వైపు చూశాడు.    
    దువ్వెనకు లొంగని బిరుసు ఉంగరాలజుట్టు బాబుది. విశృంఖలంగా కనబడుతోంది. మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి    
    తనది సాఫీగా ఉండే మెత్తటి జుట్టు. సౌదామినిది కూడా అంతే. కానీ ఈ బాబుగాడికి మాత్రం ఉంగరాల జుట్టు వచ్చింది. ఎలా? జెనెటిక్ సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం చూస్తే, డామినంట్ గా ఉండే కొన్ని రకాల శారీరక లక్షణాలు పిల్లలకి కూడా సంక్రమిస్తాయి. "రిసెసివ్" అనబడే లక్షణాలు పిల్లలకి సంక్రమించే అవకాశాలు తక్కువ.

 Previous Page Next Page