మోహన్ వచ్చాడు కాబోలు. ఆవిడ బండగొంతుతో తను చేసిన పాడు పనిని వర్ణిస్తోంది. అతడొచ్చి తలుపు తట్టాడు. రాధ తీయలేదు.
"ఈ ఒక్క రోజుకి నన్ను విసిగించకు మోహన్!" అని మాత్రం చెప్పగలిగింది.
కాస్సేపు అరిచి అతడు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రలేదు. తన తల్లి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంది. ఉదయం బయటకురాక తప్పలేదు. వెళ్ళి పెరట్లో కూర్చుంది. చేతులవైపు చూసుకుంది. ఆ అరచేతుల్లో తల్లి రూపం కనిపిస్తోంది.
"ఎంతకాలం వుంచగలదు ఈ భావాన్ని?" చిన్నగా నవ్వుకుంది. ఇదేనేమో స్మశాన వైరాగ్యం అంటే.
ఆమె తలమీదుగా చల్లటినీళ్ళు గుమ్మరించారెవరో, ఒక్కసారిగా వణికిపోయింది రాధ కోపంతో, చలితో.
వెనక్కు తిరిగి చూస్తే అత్తగారు.
4
మనసుకి తగిలిన ఒక చాలా చిన్న గాయం కూడా మనిషి జీవితపథాన్ని ఎంతగానో మార్చేస్తుందనడానికి అనూరాధ జీవితం ఉదాహరణ.
ఉదయం అత్తగారు చేసినపనికి ఆమెకు కోపంరాలేదు. ఎదుటివారిని బాధపెట్టాలనే ఆలోచన తప్ప, దానివల్ల తమమీద ఏమాత్రమో మిగిలి వున్నా అభిమానాన్ని కూడా చంపుకుంటున్నామనే ఆలోచన కూడా లేని మూర్ఖురాలామె అత్తగారు. కానీ మోహన్? అంతా చూస్తూ అదేదో జోక్ లా అతను నవ్వుతుంటే, ఆ ప్రవర్తన ఆమెలో ద్వేషాన్ని రగిలించింది. కోపంకన్నా భయంకరమైనది ద్వేషం!
"ఇవాళ కూడా ఆఫీసుకి పోతున్నావా? నలుగురూ ఏమనుకుంటారు!" అంటూన్న వాళ్ళ మాటలను లెక్కచేయకుండా ఇంట్లోంచి బయటపడింది.
"నలుగురూ ఏమనుకుంటారు?" అన్నమాట మనిషిలోని బలహీనతనూ, పిరికితనాన్నీ తెలుపుతుంది. వాళ్ళనుకునే ఆ నలుగురిలోనూ తమ కుటుంబం ఎంత నవ్వులపాలవుతుందో తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం అవుతుంది. రోజంతా అత్తగారు కోసే కోతలతో, రాత్రిళ్ళు తాగి తూలుతూ వచ్చే భర్త ప్రవర్తనతో అందరిలోనూ తమ కుటుంబం హాస్యాస్పదమై పోయిందిప్పటికే, నలుగురేమిటి? నలభైమంది అనుకుంటున్నారు.
ఇంతకాలం "భర్తా, పిల్లలూ, తమ కుటుంబం, వాళ్ళ సుఖం" అన్న చిన్న పరిధిని గీసుకుని, బయట ప్రపంచంతో ఎలాంటి అనుబంధాలు పెంచుకోలేక పోయిందామె. ఈ రోజు తన చిన్న ప్రపంచంలో 'ప్రేమ' అనేది దొరకదని తెలుసుకున్నప్పుడు ఏకాంతం కోసం పారిపోయింది. ప్రేమరాహిత్యం పెద్ద జబ్బయితే, స్నేహరాహిత్యం ఒక పెద్ద శాపం. మంచి స్నేహితుడు లేకపోవడం మనిషిని అనాధను చేస్తుంది. ఎవరూ లేకుండా బ్రతగ్గలగడం వేదాంతులేక్ సాధ్యం.
పదిమంది తిరిగే పబ్లిక్ గార్డెన్ లో కూర్చున్నా, హోటల్ కి గాని, సినిమాకి గాని వెళ్ళినా స్త్రీకి ఏకాంతం దొరకదు. ఆమె ఏదో కారణంతో (ఏదో ఏమిటి అదే) అలా తిరుగుతోందని, అవకాశం కోసం ప్రయత్నిస్తారే తప్ప ఆమె తమలాంటి మనిషేనని తమలాగే ఆత్మశాంతికోసం ఏకాంతాన్ని కోరుకుంటుందనే ఆలోచనేరాదు. అందుకే కాబోలు స్త్రీ "పురుషుడు" అనే రక్షణకు దూరమయి ఒంటరిగా బ్రతకడానికి భయపడుతుంది. ఆమెలో ఈ బలహీనతను ఆసరా తీసుకుని అతడు మరింత సాధించడం మొదలు పెడతాడు...
సాయంత్రం ఆఫీసునుంచి రాధ ఇంటికి తిరిగిరాక తప్పలేదు.
* * *
పట్టాభిరామయ్య స్వంత ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు రాదని పిలిపించి కొన్ని నగలు, కొంత డబ్బు చేతిలో పెట్టాడు.
"చిన్న ఇల్లు కట్టుకోవాలని ణ అచేత బలవంతంగా ఒక ప్లాటు కొనిపించింది. మీ అమ్మ నేను ఎలాగూ కట్టలేకపోయాను. నువ్వయినా కట్టుకో - అది నీ పేర రిజిష్టర్ చేయించాను" కాగితాలు చేతిలో పెట్టాడాయన.
"అలాగే కడదాం నాన్నా! కాని మీరుకూడా మాతోతే వుండండి".
"నేనెందుకమ్మా! మా ఊరివాళ్ళకే నా అవసరం వుందిప్పుడు. ఈ చివరిరోజుల్లో వాళ్ళకేదైనా ప్రయోజనం కలిగే పనులు చేసి వాళ్ళ మధ్యనే వెళ్ళిపోతాను. నాకు తృప్తి, వాళ్ళూ సంతోషిస్తారు".
"నా దగ్గరుంటే నాకు మాత్రం సంతోషం కాదా నాన్నా?"
"అసలు నువ్వు సంతోషంగా వున్నావా అమ్మా?" అడిగాడాయన సూటిగా "నీకు లేని సంతోషాన్ని నువ్వు నాకెలా ఇవ్వగలవు?" అన్న ప్రశ్న వుందా చూపులో
రాధ కళ్ళు కిందకు దించుకుంది.
ఏ ప్రశ్నయితే ఆయన నుంచి రాకూడదనుకుందో అదే వినవలసి రావడం బాధ కలిగించింది. ఆయన తన పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడన్న సత్యం అర్ధం అయిపోయింది.
ఆ ప్రశ్నకు సమాధానం లేదామె దగ్గర.
తనకు ఏమీకాని ఊరిజనం తనే సర్వస్వం అవడానికి వెళుతున్న ఆయనను నిస్సహాయంగా చూస్తూండిపోయింది...
...ఆయన డబ్బు ఇచ్చారని తెలియగానే అత్తగారి ధోరణి మారిపోయింది.
"నా పిచ్చిగాని ఎవరికైనా బిడ్డమీద ప్రేమ వుండదేమిటి? కొంత మంది పైకి చెప్పుకుంటారు, కొందరు మనసులోనే దాచుకుంటారు" అని తండ్రిని మెచ్చుకోవడం ప్రారంభించింది. వారంరోజుల తర్వాత మోహన్ మెల్లిగా విషయం కదిపాడు.
"వాళ్ళదగ్గిరా, వీళ్ళదగ్గిరా పనిచేసి ఏమీ జరుగుబాటు కావడంలేదు రాధా! డబ్బు అప్పుగానే ఇవ్వు. కొంత డబ్బు బ్యాంక్ లోన్ తీసుకుంటాను. మళ్ళీ చిన్న వర్క్ షాపు పెట్టుకుంటాను. భాగస్థులు ఎవరూ వద్దు కష్టపడి పనిచేసుకుంటాను. ఈ అవకాశం ఒక్కటీ ఇవ్వు" అని ప్రాధేయపడ్డాడు.
రాధ ఆలోచించింది. ఈ మధ్య పని సరిగ్గా దొరకక బద్దకస్తుడుగా మారిపోతున్నాడు మోహన్. దాంతో ఇంట్లోనే వుండడం, అత్తగారిమాటలకు వంతపాడడం జరుగుతోంది. అతడు మారతాడంటే డబ్బు పోయినా ఫర్వాలేదు.
నిర్లిప్తంగా డబ్బు ఇచ్చింది. రెండు నెలలవరకు అతడి ప్రవర్తన బాగానే వుంది. మొదటినెలలో పిల్లలకు బట్టలు కొనుక్కొచ్చాడు. రెండవ నెలలో రాధకో చీర కొన్నాడు. మరుసటి నెలలో చెల్లెళ్ళకు పెట్టకపోతే బావుండదని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బట్టలు కొనుక్కొచ్చాడు. ఆ తర్వాత అమ్మ ఎప్పటినుంచో అడుగుతోందని టేప్ రికార్డర్ కొనుక్కొచ్చి యిచ్చి ఆమెను వూరికి పంపేడు. ఆరునెలలయినా తిరక్కముందే అంతా నష్టం వచ్చిందంటూ వర్క్ షాప్ మూసేశాడు.
పదివేలు గంగలో కలిసిపోయాయి. అతడిలో మరిన్ని కొత్త అలవాట్లు మిగిలిపోయాయి.
5
"నమస్తే నా పేరు సుభాష్ పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్" అన్నాడతను. అనూరాధ తలెత్తి అతడివైపు చూసింది. తన వయసే వుండవచ్చు. అందంకంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.
"అదేమిటి మేడం? అలా చూస్తున్నారేం?" అతడి స్వరంలో చిలిపితనం తొంగిచూసింది.
"బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదన్న విషయం నిజమేనన్నమాట" అంది సీరియస్ గా నటిస్తూ, అతడూ తడువుఁలేదు.
"మరేనండీ! హిమాలయాల్లో ఆకులు, అలములు తింటూ తపస్సు చేశాను కదండీ! వయసు పెరగటం మని తరగడం మొదలుపెట్టింది. ఇంకా కొన్నాళ్ళాగితే పసివాన్నయిపోతానేమోనని దిగులువేసి ఏదో యీ వయసయితే సమాజాన్ని ఉద్దరించవచ్చుననిపించి తిరిగి వచ్చాను".
స్పాంటేనియస్ గా యిచ్చిన అతడి జవాబుకు చాలారోజుల తర్వాత స్వచ్చంగా సంతోషంగా నవ్వింది అనూరాధ.
"వారం రోజులుగా ఈ సెక్షన్ లో కనిపిస్తున్నారు. ఇవ్వాళ కొత్తగా వచ్చి పరిచయం చేసుకుంటున్నారేం?" అడిగింది.
"బాబోయ్! మీతో చాలా జాగ్రత్తగా వుండాల్సిందే!"
"ఏం ఎందుకనిట?" అంది.
"వారంరోజుల్నుంచి గమనిస్తున్నాను. మీ పక్కసీటులో కూర్చున్న సుమతిగారిని కూడా ఎరగనట్లు కనిపించారు. ఇప్పుడేమో ఉనికిని కనిపెట్టేశానంటున్నారు. పైకి కనిపించకుండా గుంభనంగా వుండే వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలని గాంధీగారు చెప్పారు ఓ సందర్భంలో!"
"అలాగా! మంచి సలహాయే కాని అప్పట్లో నాలాంటివాళ్ళు ఆయనకీ ఎవరు కనిపించారబ్బా?" అంది నవ్వుతూ.
"మహమ్మదాలీ జిన్నా అని వుండేవాడులెండి. తను కొద్దినెలల్లో చనిపోతానన్న విషయం తెలిసినా మరో పురుగుకి తెలియనివ్వకుండా దేశవిభజన కోసం కష్టపడ్డాడు. ఆయన జబ్బు విషయం బయటపడితే యీ పార్టిషనే వుండేదికాదు- అని చరిత్రకారుల అభిప్రాయం. అంత గుంభనం. ఆ విషయం గాంధీగారే నాకు చెప్పారు ఆ రోజుల్లో".