మోహన్ చిన్న ఉద్యోగంలో చేరాడు. కాని అతడిలో సంతోషం లేదు. అన్నిటికీ చిరాకు పడుతుంటాడు. త్రాగుడికి కొద్దిగా అలవాటు పడ్డాడు. మేలుకొని వున్నాడంటే సిగరెట్ పొగ పీలుస్తూ వుండాల్సిందే. వద్దంటే రెచ్చిపోయి ఏదో ఒకటి అనేస్తాడు. అతడిలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు, తనకంటే భార్య అధికురాలయి పోతుందనే బాధ కూడా మొదలయ్యాయి. రాధ పట్టించుకోవడం మానేసింది.
మరో రెండేళ్ళు గడిచాయి. పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళయ్యేసరికి రాధకు ఆలోచించుకోవడానికి సమయం దొరికింది.
వయసు పాతికేళ్ళు దాటింది. ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో తను సాధించినదేమిటి?
ఆలోచన అనేది ఈ సృష్టిలో కేవలం మనిషికి మాత్రమే ఉన్న స్పెషల్ క్వాలిఫికేషన్. వర్తమానాన్ని, భవిష్యత్తుని ఆలోచించినంతగా మనిషి భూతకాలాన్ని గురించి ఆలోచించడు. గతంలోని అనుభవాల పునాదిమీదే భవిష్యత్తు ఆధారపడాలన్న సత్యాన్ని మర్చిపోతుంటాడు. అనూరాధలో తలెత్తిన ప్రశ్న ఎంతమంది విద్యావంతుల్లో తలెత్తుతుంది? కొందరిని ఈ ప్రశ్నలు యిబ్బంది పెట్టవచ్చు కానీ అంతరాత్మకయినా జవాబు యిచ్చుకోలేనివాడు మనిషి కాడు.
భర్త బాధ్యతలను తనవిగా చేసుకుని నెరవేర్చిందానికి దొరికిన ప్రతిఫలం ఏమిటి? ఇంకా ఏదో కొరత చేసినట్లు వాళ్ళలో చులకన భావం మాత్రమే మిగిలింది. కనీసం భర్తలోనయినా ఆ గుర్తింపు లేదు. తను సాధించానని చెప్పుకోగలిగింది ఇద్దరు పిల్లలను! అందులోనూ మగపిల్ల వాడిని కనలేదని నింద ఈనాటికీ కొనసాగుతూనే వుంది. ఇల్లు కాస్త పెద్దది తీసుకునేసరికి అతిధుల సంఖ్యా పెరిగింది. మోహన్ కి తనవాళ్ళలో మంచిపేరు తెచ్చుకోవాలనే స్వార్ధం చాలా వుంది. వాళ్ళను ప్రతిబంధకాలుగా చూడలేదు. వాళ్ళకు మంచి చెయ్యడంలో తను పోగొట్టుకున్న దేమిటో అతడికి అర్ధంకాలేదు. రాధకిప్పుడు మోహన్ మీద ప్రేమలేదు. ఒక యింట్లో వుండే సహచరులు వాళ్ళు అంతే.
పెళ్ళి అంటే కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడమొక్కటేనా? పిల్లల్ని కనటం, దంపతులు ఒకరినొకరు వదలకుండా వుండే సెక్యూరిటీయేనా? అసలు జీవితం అంటే పెళ్ళీ, పిల్లలూ, ఉద్యోగం, డబ్బు, హోదా...ఇవేనా?
ఒకప్పుడు ఎన్ని పుస్తకాలు చదివేది తను? పెళ్ళయిన ఎనిమిదేళ్ళలో పట్టుమని పది పుస్తకాలయినా చదవలేదు. ఎలా బ్రతకగలిగిందిలా? కృష్ణశాష్త్రినీ, నండూరినీ తలచుకోని రోజు వుండేదికాదు. వాళ్ళ గేయాల్ని పాడడమే మరచిపోయిందేం? ఎంత హీనంగా దిగజారిపోయింది తనలోని ఆశయం?
ఆమెకు దుఃఖం వచ్చింది.
ఈ ఆలోచన తర్వాత రాధలో చాలా మార్పు వచ్చింది. తనకంటూ తనకు ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి అది నాంది అయింది. జీవితంలో పైకి రావాలంటే ఆర్ధికంగా ఉచ్చస్థితిలో వుండడం మొదటి అవసరం.
"డిపార్టుమెంటు పరీక్షలు వ్రాస్తే ప్రమోషన్ వస్తుంది. ఎందుకీ చదువు?" మోహన్ ముందే అడ్డుపుల్ల వేశాడు.
"నాన్నగారు నన్నెంతో చదివించాలనుకున్నారు. ఇప్పటికి ఆయన కోరిక నెరవేర్చగలుగుతున్నానని నాకు ఆత్మ సంతృప్తి" అని జవాబిచ్చింది రాధ. ఆమె ఆలోచించిన తర్వాత విషయం తన పిల్లల చుదువు. మోహన్ మాట వినకుండా మల్లికను రెసిడెన్షియల్ స్కూలుకి పంపేసింది. రోజాకు నృత్యమంటే చాలా ఆసక్తి ఆమెను నాట్యనిలయనికి పంపుతోంది. దానికి అడ్డుపడ్డాడు మోహన్.
"ఏ సంగీతమో నేర్చుకోనీ, కానీ డాన్స్ అంటే ముందు ముందు బాధపడాల్సి వస్తుంది. పెళ్ళయ్యాక అటు ప్రదర్సనలివ్వలేక, మానుకోలేక అవస్థ పడాలి. ఆలోచించకుండా పనులు చెయ్యకు".
"నేను దానికి డాన్స్ నేర్పిస్తున్నది దాని కోరిక తీర్చడానికి - దానికి కాబోయే మొగుడికోసం కాదు".
"నీ యిష్టం నీ సంపాదనమీద ఆధారపడుతున్న వాడిని - నా మాట చెల్లాలని ఎలా అనుకుంటాను?" నిష్టూరపడి వెళ్ళిపోయాడు. నాలుగు పెగ్గులు పుచ్చుకున్నాక ఆవేశం చల్లారింది. సామాన్యంగా అలాగే జరుగుతున్నదా యింట్లో ఆ తరువాత చీకటి ఎలాగో వస్తుంది కదా మరో ఆవేశం తీరటానికి.
* * *
"రాధా! నీ కోసం ఎవరో వచ్చారు చూడు" అత్తగారు అరిచింది ముందు గదిలోంచి.
వంటింట్లో చేస్తున్న పనిని ఆపి బయటకు వచ్చింది రాధ. ఎదురుగా ఆమె చిన్నాన్న కొడుకు-తనతోపాటు చదువుకున్న అతను.
"అన్నయ్యా! నువ్వా లోపలకురా" సంతోషంగా ఆహ్వానించింది. ఆమె మాట పూర్తికానే లేదు. అత్తగారు అందుకుంది.
"మీ అన్నయ్యా? ఏమిటబ్బాయ్, యిన్నాళ్ళకు గుర్తొచ్చిందా మీ చెల్లెలు? మంచి ఉద్యోగంలో వున్న విషయం తెలిసిందా? ఏం పనిమీద వచ్చావు?"
అతడేమీ తక్కువ తిన్నవాడు కాదు.
"మాకు ఆడవాళ్ళ సంపాదనమీద ఆశ లేదండీ వాళ్ళమ్మగారు పోయారు. ఆ విషయం చెబ్దామని వచ్చాను" అన్నాడు కటువుగా.
"అమ్మ చనిపోయిందా?" షాక్ తిన్నది అనూరాధ. ఆమె ఇంకా తేరుకోలేదు. అత్తగారు అందుకుంది.
"అయితే ఇప్పుడేం చేయమంటావ్ ఒక్కగానొక్క బిడ్డ ఇన్నాళ్ళూ ఎలాగుందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు దేనికట కబురు చెయ్యడం? అది రాధ. మీ అయ్యతో చెప్పుకో" ఆవిడ కర్కశస్వరంలో మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది.
"నువ్వుండన్నయ్యా నేను వస్తున్నాను" చెప్పులు వేసుకుని బయలు దేరింది రాధ.
"ఏం మొహం పెట్టుకు వెళుతున్నావు? ఇప్పటికయినా వచ్చి పిలిచాడా మీ నాన్న? నువ్వెళ్ళడం మోహన్ కిష్టం వుండదు. నేను ముందే చెపుతున్నా".
"నేను వెళుతున్నది చివరిసారిగా కన్నతల్లిని చూడడం కోసం ఆవిడ నన్ను చూసే స్థితిలో లేదు. నా తృప్తికోసం వెళుతున్నా! మీ అబ్బాయి కిష్టమని నాకు యిష్టంలేని పనులు ఎన్నోచేశాను. ఈ పని మాత్రం ఆయనకు నచ్చకపోయినా చేసి తీరతాను" వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
తల్లి మృతదేహం అగ్ని దేవుడికి ఆహుతి కావడానికి అలంకరించబడి సిద్దంగా వుంది.
రాధకు దుఃఖం రాలేదు. "ఆమె నా తల్లి భర్తే దైవంగా కొలుచుకుంది. అందుకే ఒక్కగానొక్క బిడ్డని చూడాలని ఎంత తపనపడ్డా పైకి ఎప్పుడూ చెప్పుకోలేకపోయింది. తన బాధను తనలోనే దాచుకుని కుమిలిపోయి చివరకు ప్రాణత్యాగం చేసుకుంది. భర్తకు ఎదురాడక పవిత్ర భారత నారీమణిగా ఈమె సాధించుకున్నదేమిటి?" తల్లి కాళ్ళకు నమస్కరించింది చివరిసారిగా.
ఆమెరాగానే పెద్దగా ఏడుస్తుందని, తండ్రి అప్పుడయినా ఆమెతో మాట్లాడతాడో లేదో చూడాలని ఎదురుచూస్తున్న బంధుజనానికి నిరాశే మిగిలింది.
"ఎంత కఠినమో చూడు. కళ్ళల్లో నీళ్ళయినా రావటంలేదు. దానికసలు తల్లిమీద ప్రేమనేది వుంటేగా?" రాధ ఆ మాటలకు చలించలేదు. లోపల గదిలో వున్నాడు తండ్రి. ఆయనను చూడగానే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక ఆత్మీయురాలిని పోగొట్టుకున్న బాధని పంచుకునే దుఃఖం అది. ఈ పదేళ్ళలో ఆయన చాలా ముసలివాడయిపోయాడు.
రాధ వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంది. ఆయన మాట్లాడలేదు. ఆమె తలమీద నిమిరాడు.
చూసేవాళ్ళకు అది చాలా చిన్న సామాన్యమైన చర్య. కాని ఆ స్పర్శలో ప్రేమ, దుఃఖం, సానుభూతి అన్నీ మిళితమై వున్నాయి. నువ్వు నాకిచ్చే సానుభూతి నేను నీకిచ్చే ఓదార్పుకి మిళితమై విధి కట్టిన మంచు పర్వతాన్ని కరిగిస్తుందా? దావానలంలా మండుతున్న ఆమె గుండె ఆ స్పర్శకు చల్లబడి అశ్రురూపంలో ప్రవహించసాగింది.
స్మశానంలో దూరంనుంచే తల్లి శరీరం అగ్నికి ఆహుతి అవడం చూసి తన యింటికి తిరిగి వచ్చింది.
"అలా బాత్రూంలోకి తగలడు. బట్టలు తెచ్చిస్తాను. స్నానం చేస్తూండు" అరిచింది అత్తగారు. రాధ సరాసరి లోపలకు రావడం ఆమె వళ్ళు మరిచేలా చేసింది.
"శవాన్ని ముట్టుకుని వచ్చావా, ఇల్లు మైలుపడుతుందే బయటకుపోముందు".
రాధ సరాసరి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది.
"మా అమ్మ దేవత. ఆమె బ్రతికున్నా చనిపోయినా దేవతే. ఆమెను ముట్టుకుంటే మైలపడుతుందా? తను తిన్నా తినకపోయినా పదిమందికి అన్నంపెట్టిన చెయ్యి అది. కన్నది ఒక్కరినే అయినా పదిమందికి తల్లి అయి పోషించింది. అలాంటి దేవతామూర్తి దేహాన్ని తాకితే పుణ్యం వస్తుంది. ఆమె చనిపోయిన ప్రదేశం దేవాలయం అవుతుంది. అలాంటి పవిత్ర ప్రదేశాన్ని శుభ్రపరచాలా? ఆమెను చివరిసారిగా స్పృశించిన చేతులవి. ఆ స్పర్శ మరిక లేదు.
అలాంటప్పుడు ఆ చేతుల్ని కడిగి అంటిన పవిత్రతను పోగొట్టుకునే అవివేకురాలు కాదు. కళ్ళనించి జారుతున్న అశ్రుధారల్ని కూడా ఆ చేతులతో తుడుచుకోలేకపోయింది అనూరాధ. చాలాసేపు ఆ చేతులవంకే చూస్తూ కూర్చుండిపోయింది.