Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 31

 

      "నీకు శుభవార్త, నీ విషయం తెలిసి మా అమ్మ వచ్చింది. అందుకే రాలేకపోయాను" అన్నాడు.
   
    "ఏరీ, తీసుకురాలేదా?" ఉత్సాహంగా అడిగింది.
   
    "హాస్పిటల్ వాతావరణం ఆమెకు ఎలర్జీ, రానంది. రేపెలాగూ ఇంటికి వచ్చేస్తావుగా? నేను వెడతానిక" వెళ్ళిపోయాడతను. పాపమీద ఒక చూపు పడేసేడంతే.
   
    రాధకు దుఃఖం పొర్లివచ్చిందీసారి. శారీరక సుఖాన్ని ఇద్దరూ అనుభవించారు. ఒక విధంగా అతను అనుభవించిన సుఖాన్ని తను పొందలేకపోయింది. అయినా దాని పర్యవసానాన్ని తొమ్మిది నెలలపాటు మోసినందుకు అతడినుంచి ఒక్క ఓదార్పు మాటలేదు. ప్రసవం స్త్రీకి రెండోజన్మ అంటారు. తను పడ్డ బాధని పాప నవ్వులూ, భర్త ఆదరణా తుడిచిపెట్టెయ్యాలి. అందులో మొదటిదొక్కటే తనకు దక్కింది.
   
    అతడు డబ్బుకి ఇబ్బందిపడతాడని జనరల్ వార్డులోనే వుండిపోయింది. అక్కడ తను పడ్డ అవస్థ అతడికి తెలియదు. ఒక అరగంట సేపు కూడా వాళ్ళమ్మ ఆ వాతావరణంలో వుండలేదన్న విషయం మాత్రమే అతడికి తెలిసింది.
   
    'ఎందుకీ కంపారిజన్?' మనసు ప్రశ్నించింది. ఇలాంటివాటికి తట్టుకోవాలనే కదా తన నిర్ణయం? పోనీ ఇంటికి వెళ్ళగానే అత్తగారు అమ్మలా ఆదరిస్తుంది. అమ్మ దూరమయిన లోటుని భర్తీ చేస్తుంది. మరొక్క రోజేగా అని సర్దుకుంది.
   
    ఇంటి గుమ్మంలో ఎదురయిన స్త్రీని చూడగానే ఆమె ఉలిక్కిపడింది. 'అమ్మ' అంటే ఆమె దృష్టిలో ఒక దేవతా స్వరూపం కాని ఈవిడ? ఆమె తన అత్తగారిని చూడటం అదే మొదటిసారి.
   
    అంత మొరటుగా వుండే స్త్రీలను రాధ చూడలేదెప్పుడూ బీదరికం మనుష్యులను మొరటుగా చెయ్యదు. సంస్కారహీనత అలా చేస్తుందన్న సత్యం తెలియడానికి ఎక్కువరోజులు పట్టలేదు.
   
    అత్తగారనబడే ఆ స్త్రీలో కొంచెమైనా మార్దత్వం, సున్నితత్వం లేవు పొలాల్లో పనిచేసే అలవాటేమో శరీరం దృఢంగా వుంది. ఆమె రూపం ఎలాంటిదో స్వరం కూడా అలాగే వుంది. శరీరం ఎలా వున్నా కొందరిలో స్త్రీత్వం తొణికిసలాడుతుంది. కాని ఆవిడలో అదీ లేదు. మాటలూ చేతలూ కూడా మొరటుగానే వున్నాయి. ఆమె కెందుకో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు గుర్తొచ్చారు.
   
    గులాబీ రంగులో మెరిసిపోతున్న పాప ఆవిడ చేతుల్లో బ్రహ్మ రాక్షసి కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాకుమారిలా వుంది.
   
    వచ్చిన రోజున మాత్రం కాస్త నిశ్శబ్దంగా వుందావిడ. రెండో రోజు నుంచీ ఆవిడ వాగ్ధాటి ప్రారంభమయింది. ఆవిడ అంటున్నదేమిటో అర్ధం చేసుకోవడానికి అనూరాధ చాలా శ్రమపడవలసి వచ్చేది.
   
    'మోహన్ కి చాలా కట్నం ఇస్తామని రెండు, మూడు సంబంధాలు వచ్చాయి. అదంతా నష్టపోయాడు. ఏదో ఇష్టపడి చేసుకున్నాడు. ఒక్కతే కూతురు. తండ్రి ఆఫీసరు అంటే ఆస్తి కలిసివస్తుందనుకున్నాను కాని కట్టుగుడ్డతో పంపి చేతులు కడుక్కున్న బికారులనుకోలేదు. రేపు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడో తెలియటంలేదు' ఇదీ ఆవిడ గొణుగుడు తాత్పర్యం. ఆమె కూతుళ్ళామెకు తీసిపోలేదు. ఆకారాల్లో కాస్త నాజూగ్గా వున్నారంతే. మిగతా అంతా డిటో. అన్నయ్యలాంటి అందగాడిని ఏ రాజకుమార్తో మోహించి వివాహం చేసుకుంటుందని వాళ్ళూ ఎప్పటినుంచో అనుకున్నారు. కాని ఆస్తి వదులుకు వచ్చిన అభాగ్యురాలు అనుకోలేదు.
   
    అతడికంటే ఎక్కువ చదువుకుని మరింత అందంగా, అన్నివిధాల మంచి పొజిషన్ లో వున్న అనూరాధ కావాలనుకుంటే ఏ డాక్టర్నో ఇంజనీర్నో కట్టుకునేదన్న విషయం వాళ్ళ ఊహ కందనిది. తమాషాగా మాట్లాడుతున్నట్లు మోహన్ కూడా వాళ్ళకు వంత పాడటం పెద్ద దెబ్బ మానసికంగా తన భర్తలో ఈ ఆలోచన వున్నదని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
   
    రెండు గదుల ఆ యింటిలో రెండు నెలలపాటు అంచులులేని నరకం చవిచూసింది అనూరాధ. ప్రసవించిన పదిహేను రోజులకే ఆమె ఇంటిపనిలో ప్రవేశించవలసి వచ్చింది. అంతమందిని కన్నా కూడా, అత్తగారికి పాపకు స్నానం చేయించడం తెలీదు. పైగా అన్నింటికీ వంకలు, వెక్కిరింతలు. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో ఎప్పుడూ అరుస్తూనే వుంటారు. 'వాళ్ళు ఆ ఇంటికి అతిధులు కాబట్టి అన్నీ పడాలి'. ఇది మోహన్ వాదన.
   
    "పాపకు పాలు సరిపోవడంలేదు. పాల డబ్బాలు కొనాల్సి వస్తుంది".
   
    "బావుంది నీ డెలివరీ నుంచి ఇప్పటికి రెండువేలు అప్పుచేశాను. డానికి వడ్డీయే కట్టలేక చస్తుంటే ఇదో ఖర్చుకూడానా? నా వల్లకాదు ఏదో నువ్వే చూడు" అన్నాడు చిరాగ్గా.
   
    ఆమె ప్రసవ నిమిత్తం ఖర్చయింది జనరల్ వార్డ్ లో కేవలం నూటయాభై రూపాయలే మిగతా అప్పు అతడి అమ్మనీ, చెల్లెళ్ళనీ మెప్పించడం కోసం చేసింది.
   
    నిర్లిప్తతకు నిస్పృహ తోడయింది. ఆమె ఉన్మదావస్థలోకి చేరకమునుపే అదృష్టం వరించింది. ఎప్పుడో అప్లయి చేసిన ఒక పబ్లిక్ రంగసంస్థలో మంచి ఉద్యోగం వచ్చిందామెకు.
   
    "మంచి ఉద్యోగం ప్రమోషన్ చాన్స్ లు కూడా బాగా వుంటాయట. నీ కిష్టమయితే చేరిపో" అన్నాడు మోహన్ రాధ మాట్లాడలేదు. ఆమె కోపంలో వుందని గ్రహించాడు.
   
    "క్షమించు రాధా! ఏదో చికాకులో వుండి నీ విషయం పట్టించుకో లేకపోతున్నాను. నిన్ను కష్టపెడుతున్నాను. కాని నన్ను నమ్ము మనకీ కష్టాలు ఎక్కువ రోజులుండవు. కొన్నాళ్ళు నువ్వు సహకరించావంటే ఈ బాధ్యతలు పూర్తిచేసుకుందాం ఆ తర్వాత వీళ్ళందరికీ దూరంగా మనకోసం మనం బ్రతుకుదాం. ప్లీజ్! నా మాట నమ్ము రాధా!" ఆమె కరిగిపోయింది.... స్త్రీ కదా.
   
    "నేను కేవలం నీ సుఖాల్లో పాలుపంచుకోవడానికి రాలేదు మోహన్! నాకు కావలసింది నీ ప్రేమ, నేను పోగొట్టుకున్న తల్లిదండ్రుల ప్రేమ మీదగ్గరనుంచి ఆశించానంతే నా సంపాదన కూడా నాకొద్దు నగలూ, చీరలమీద నాకు మోజులేదు. అంతా మీ వాళ్ళకోసమే ఖర్చు పెడతాను నన్ను మీరందరూ మీలో ఒకదానిగా చూసుకుంటే చాలు" కళ్ళనీళ్ళతో అన్నది.
   
    "పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినవాళ్ళు వాళ్ళలో సంస్కారం అంత కంటే పెరిగే అవకాశం లేదు. నేను మందలిస్తాలే నీ మనసు కష్టపెట్టుకోకు".
   
    అతడేం చెప్పాడో తెలియదుకాని వాళ్ళ గోల తగ్గింది. ఆ తర్వాత ఎక్కువ రోజులుండలేదు వాళ్ళు.
   
    "మమ్మల్ని గుర్తుంచుకో అమ్మా! ఏదో పల్లెటూరి బైతులం మీలాగా నాగరికత తెలియదు పేరుకి నేనే తల్లినిగాని మా ఆడపిల్లలకు నువ్వే అమ్మవి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే చాలు. నా మనసు కుదుట పడుతుంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను" అంది వెళ్ళిపోతూ అత్తగారు.
   
    ఆమె ఎంత అవకాశవాదో అప్పటికే గ్రహించింది రాధ అయినా ఆవిడ నొచ్చుకునేటట్లు మాట్లాడలేకపోయింది. హ్యూమన్ రిలేషన్స్ కి అర్ధాలు కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి.
   
    ఆమె మొదటి ఆరునెలలు జీతం అప్పులు తీర్చడానికి సరిపోగా తర్వాత అయిదేళ్ళు ఆమె చాలా కష్టపడింది. ఓవర్ టైం వర్క్ చేసింది. ప్రమోషన్ కోసం చదివి పాసయింది. మరో అమ్మాయిని కూడా కన్నది. రెండోసారి గర్భం రాకుండా వుండటానికి జాగ్రత్తపడుతూనే వచ్చింది. కాని పని అలసటలో నెగ్లెక్ట్ చేయడంతో ఆ ప్రమాదం వచ్చింది. అబార్షన్ చేయించుకుంటానంటే మోహన్ ఒప్పుకోలేదు.
   
    "రెండో బిడ్డకూడా వుంటే ఒకరికొకరు తోడుగా వుంటారు. అమ్మకూడా మనవడు కావాలని ముచ్చటపడుతోంది ఇప్పుడు మనకేం పెద్ద యిబ్బందిలేదు. నీకు మెటర్నిటీ లీవు కూడా దొరుకుతుంది. కాదనకు రాధా!" అన్నాడు.
   
    "కాని మన బాధ్యతలు యింకా పెరుగుతాయి".
   
    "అయితే ఏం చేస్తాం అన్ని బాధ్యతలూ తీరాలంటే నేను ముసలి వాణ్ని అయిపోతాను. అసలే మనసు వయసులో పదేళ్ళ తేడా వుందీ. అదీ ఆలోచించుకోవాలి కదా నీకెందుకు? మంచి పనిమనిషిని తీసుకొస్తాగా".
   
    రాధ మరి జవాబు చెప్పలేకపోయింది. పెద్దపాప మల్లికకు తోడుగా 'రోజా' పుట్టింది. జీవితమే ఒక పెద్ద రాజీ. నిర్ణయానికీ, అమలుకీ మధ్య బీటలుపడ్డ వంతెన.
   
    రాధకు ప్రమోషన్ వచ్చింది. కొంతవరకు బాధ్యతలు తీరిపోతాయనుకుంటుండగా మరో అవాంతరం వచ్చిపడింది. మోహన్ వర్క్ షాప్ పూర్తిగా నష్టం వచ్చి మూతపడటం అనే అవాంతరం అది.
   
    అతడు చాలా డిప్రెస్ అయిపోయాడు. రోజంతా ఉదాసీనంగా ఒంటరిగా కూర్చుంటున్న అతడిని రాధే ఓదార్చవలసి వచ్చింది.
   
    "బాధపడకు మోహన్! నాకు మంచి జీతమే వస్తోంది. ఇంకొంచెం కష్టపడితే మరో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. మనకేం ఇబ్బంది వుండదు. మన నలుగురికోసం ఎంత కావాలేమిటి?"
   
    కాని ఆమె జీతం పెరిగినకొద్దీ ఖర్చులూ పెరగసాగాయి. వాళ్ళకు సహాయంగా వుండటానికి అత్తగారు రాదుగానీ, ఆమె అవసరార్ధం వస్తూనే వుంటుంది. వచ్చినప్పుడల్లా కూతుళ్ళ కోసం అదీ, ఇదీ కావాలనే కోరికలే బయటపడతాయి. చిన్నకొడుకులిద్దరూ సంపాదిస్తున్నారు. కాని వాళ్ళని యిబ్బంది పెట్టడం ఆవిడకు యిష్టం వుండదు. కొడుకుకంటే యిప్పుడు పెద్దకోడలే ఎక్కువయిపోయిందావిడకు.

 Previous Page Next Page