గంగరాజు ముఖం గంబీరంగా అయిపొయింది. "నేను వేళాకోళంగా అనడం లేదు సుభద్రా. రంగమ్మ మొగుడే కాదు, ఎవరి మొగుడయినా సరే సంపాదించడం నేర్చుకోవలసిందే!" అన్నాడు.
అక్కడే ఉన్న భద్రానికి ఆ మాటలకు చాలా పౌరుషం వచ్చింది. "ఎందుకు లేవు మావయ్యా. అవసరం లేదని ఇన్నాళ్ళూ ఊరుకున్నాను గానీ లేకపోతె ఎప్పుడో సంపాదించేద్డును."
సుభద్రమ్మ కు మరి మాటలు దొరకలేదు. గంగరాజు నవ్వి, తన మేనల్లుడితో "ఏదైనా వ్యాపారం ప్రారంభించే మార్గం చూడరా " అన్నాడు.
* * * *
"డాక్టరు గారూ, మీతో స్వయంగా మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే అందర్నీ వెళ్ళి పొమ్మన్నాను" అన్నాడు గంగరాజు. "చెప్పండి " అన్నాడు డాక్టర్. గంగరాజు తన కూతురు రంగమ్మకు భద్రానికి ఇవ్వదలచుకున్న విషయం చెప్పాడు.
"వాడినో దారిన పెట్టి రంగమ్మ జీవితం గురించి నేను నిశ్చింతగా వుండగలగాలి. అది సాధ్యపడితే నాకు పెళ్ళి చేసుకోవాలని కూడా ఉంది" ఆఖరి వాక్యం కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాడు గంగరాజు.
డాక్టరు ఆశ్చర్యగా "పెళ్ళి చేసుకుంటారా మీరు-" అన్నాడు.
'అవును డాక్టర్! నా వయసింకా నలభై అయిదేళ్ళు"
డాక్టర్ మౌనం వహించాడు.
"మీరు నా భవిష్యత్తు గురించి ఏమీ చెప్పడం లేదు. నేను నా జీవితం మీ చేతిలో వుంచాను అంతేకాదు.... గంగరాజు ఆగి 'అర్ధాంతరంగా నేను పొతే మీమీద కొన్ని బాధ్యత లుంచ దలిచాను " అన్నాడు.
డాక్టర్ ఆశ్చర్యపోయాడు. పైవారం మంచి రోజు చూసుకుని గంగరాజు ఓ విల్లు రాయబోతున్నాడు. ఆ విలు ప్రకారం డాక్టరు గంగరాజు ఆస్తికి ట్రస్టీ అవుతాడు. రంగమ్మ పెళ్ళి చేసి ఆమె భర్త కా ఆస్తిని సరయిన సమయంలో అప్పగించవలసి వుంటుంది.
"మీ అమ్మాయి పెళ్ళి గురించి మీ రనవసరంగా కలవర పడుతున్నారు. మీ అమ్మాయికేం చక్కగా వుంటుంది. మీరు కావాలనుకొంటే డాక్టరో, ఇంజనీరో దొరక్కపోడు" డాక్టర్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు మోహన్.
"లేదు డాక్టర్. మా భద్రనికదంటే ప్రాణం. దానికంటే బాగా చూసుకునే మొగుడు మరి దానికి దొరకడు."
"మీరు మీ భవిష్యత్తు గురించి ఏం దిగులు పెట్టుకోకండి. మీరు కనీసం మరో పాతికేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతారు. అందుకు నేను హామీ."
"అదే కావాలి డాక్టర్. పాతికేళ్ళక్కర్లేదు. కనీసం పది పదిహేనేళ్ళఅయినా బ్రతికితే చాలు. ఏమైనా నేను బ్రతకాలి...."
9
"ఎలాగో అలా నేను చావాలి!" అనుకొన్నాడు రామారావు. సయనైడ్ ఉన్న ట్యూబు అతని జేబులోనే ఉంటోంది. గత రెండు మూడ్రోజులుగా అయినా ఇంత వరకూ అతను సయనైడ్ నోట పెట్టలేదు. ఏ క్షణాన కావాలన్న ఆ క్షణాన మృత్యుదేవత నన్ను కౌగలించుకుంటుంది. ఆ ధైర్యంతో పాటు మనసులో ఏ మూలనో ఉన్న ప్రాణం మీద తీపి కూడా ఆత్మహత్య ప్రయత్నాన్ని అలా అలా వాయిదా వేయిస్తోంది.
మిత్రుడి గదిలో చావడం అతనికిష్టం లేదు. ఏ రోడ్డు మీదో చావడం మొదలే ఇష్టం లేదు. కావాలంటే ఏ బస్సూ లోనో చావవచ్చు. ఈ ఊహలతో ఓ రోజు అతను బస్సులో వెడుతూ జేబులోంచి సయనైడ్ ట్యూబు తీశాడు.
అతని చేతులు వణికాయి. నెమ్మదిగా మూత తీస్తున్నాడు.
ఈ నేల మీద తన ఆయువు మరికొద్ది క్షణాలు మాత్రమే. ఈ తలంపు అతనికి అదోరకం అనుభూతి కలిగించింది. "మరోసారి ఆలోచించు . నూరేళ్ళ జీవితం?" అని అంతరాత్మ హెచ్చరించింది. కళ్ళ ఎదుట తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు ఇంకా సుందరి మేదుల్తున్నారు.
సరిగ్గా అదే సమయానికి ఒకాయన వచ్చి రామారావు పక్కన కూర్చున్నాడు. ఎవరా అని చూశాడు రామారావు. డాక్టరు! చేతిలో మందుల పెట్టె మెడలో స్టేతస్కోప్ తో కనిపించిన అయన సాక్షాత్తూ డాక్టరు! రామారావుకి అయన తననే పరిశీలనగా చూస్తున్నట్లనిపించింది.
డాక్టరు పక్కనే కూర్చుని విషం మింగి పడిపోతే అయన తన్ను వెంటనే బ్రతికించేసే ప్రమదముంది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు. రామారావు వెంటనే మళ్ళీ మూతపెట్టి సయనైడ్ ట్యూబ్ లోనికి తోసేశాడు. నిజం చెప్పాలంటే అతానప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
అప్పుడే అతనికి అనిపించింది. చావబోయే ముందు ఒక్కసారి తన వాళ్ళందర్నీ చూడాలని. ఈ ఆలోచన వచ్చేక ఎలా చావాలీ అన్న విషయంలో అతనొక పధకం వేసుకున్నాడు.
ఇంటికి వెడతాడు. అందర్నీ చూస్తాడు. సరదాగా ఒక రోజు గడిపేస్తాడు. తన కిష్టమైన వంటకాలు చేయించుకుని తింటాడు. రాత్రి మాములుగా పడుకొంటాడు. ఒకరాత్రి వేళ లేచి కాస్త సయనైడ్ పుచ్చుకుంటాడు.
తన కళ్ళముందు సయానైద్ నోట్లో వేసుకుంటున్న దృశ్యం కనబడినప్పుడల్లా అతనోసారి ఉలిక్కి పడుతున్నాడు.
* * * *
కొడుకు కళ్ళలో ఓ వింత వెలుగుని చూసిన రామారావు తండ్రి ఆశ్చర్యపోయాడు. "ఏరా ఏమంటున్నాడు మీ స్నేహితుడు ?" అంటూ పలకరించాడాయన.
ఆరోజు రామారావుకి చాలా ఉత్సాహంగానూ, దిగులు గానూ కూడా ఉంది. ఈ రాత్రి తను చనిపోబోతున్నానని అతనికి తెలుసు. అందువలన ఆరోజు అతనికి అందరి మనుషులు విలువా మరింగా బాగా అర్ధమయింది. సుందరి అంత అందమైన పిల్ల తనకు భార్య కావాలని రాసిపెట్టి ఉంది. ఆ రాతను అబద్దం చేసి తను వెళ్ళి పోతున్నాడు.
ఆ సాయంత్రం అతను సుందరితో పార్కుకు వెళ్ళాడు. అక్కడ అడిగాడు. "సుందరీ ఈ రోజుల్లో ఏ మనిషికి ఏ క్షణాన చావు రాసి పెట్టి ఉందొ తెలియదు. ఒకవేళ నాకు అర్ధాంతరంగా చావు వచ్చిపడితే......."
"బావా - కాస్త అగు !" అంది సుందరి. "ఇంట్లో మనం రకరకాల కబుర్లు చెప్పుకుంటామంటే అవి నలుగురికోసమూనూ, పార్కులో ఇద్దరం ఏకాంతంగా వున్నామంటే మాట్లాడుకోవలసిన విషయాలు వేరు - ప్రేమ...."
"అది నిజమే ననుకో - కానీ ఒకవేళ ఈ రాత్రే నేను...."
"కొంపదీసి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమిటి" అంది సుందరి అనుమానంగా.
'అబ్బే - అదేం లేదు "అంటూ తడబడ్డాడు రామారావు.
"ఊరికే అడిగాను గానీ ఆత్మహత్యేందుకు చెసుకుంటావ్?' అని ఓ క్షణం ఆగి అంది సుందరి 'ఆత్మహత్య చేసుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం బావా, వలలు ఉత్త చేతకాని వాళ్ళు. చేతనైనవాడు ఎలాగో బ్రతుకుతాడు. బ్రతకడానికి లక్ష మార్గాలున్నాయి. కానీ ఆ మార్గాలన్నీ వదిలి చావును ఆశ్రయించినవాడు ఉత్త చవట....."
సుందరి ఇంకా ఏదో అనబోయింది కానీ ఆ తిట్లన్నీ తనకే తగిలినట్లనిపించడం వల్ల రామారావు విషయం మార్చి 'సరే అదెందుకులే గానీ, ప్రేమ విషయాలు మాట్లాడుకుందాం. ఒక్క ప్రశ్న అడుగుతాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు.
సుందరి విరాగబడి నవ్వింది. "నేనా! నిన్ను ప్రేమించడమా? ఎందుకు ప్రేమించను? ఎలా ప్రేమించను? ఆడదాన్ని పార్కుకు తీసుకొచ్చి చావు కబుర్లు చెప్పినందుకా! ఆడది నోరు విప్పి అడిగేక ప్రేమకబుర్లు మొదలెట్టినందుకా? ఒక ఆడది తన్ను ప్రేమిస్తుందో లేదో - అడిగితె కాని తెలుసుకోలేనందుకా?"
రామారావు సమాధానమివ్వలేదు. అతను నిరుత్సాహంగా లేచి - "పద- పోదాం" అన్నాడు.
* * * *
ఒకరాత్రి వేళ రామారావుకు మెలుకువ వచ్చింది. అతనికి తన పధకం గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా లేచి కొట్టు గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో బట్టల స్టాండు మీదున్న తన పాంటు జేబులో సయనైడ్ ఉన్న ట్యూబు ఉంది. అతను కొట్టుగది లోనికి వెళ్ళి తలుపులు జేరవేయబోతుండగా "బావా!క్" అన్న పిలుపు వినబడింది. పిలుపు వెనుకనే సుందరి కూడా ఆ గదిలో జొరబడింది.
"ఏమిటిది బావా - అర్ధరాత్రి వేళ గదిలో దూరి తలుపులు వేసుకొంతున్నావు. ఎవరున్నారేమిటి లోపల?" అంది సుందరి వేళాకోళంగా.
"సంతోషించాంలే గానీ - ఇక వెళ్ళు "
"వెళతాను గానీ - ఇంత రాత్రి వేళ - ఇంత రహస్యంగా ఈ గదిలో ఎందుకు దూరావో చెప్పాలి. చెప్పకపోతే అందరినీ లేపి...."
రామారావు కళవేళపడ్డాడు. 'చెప్పడానికేముంది నిద్ర పట్టడం లేదు . ఈ గదిలో అయితే పడుతుందేమోనని "
నలుగురూ లేస్తారేమో నన్న భయం కొద్దీ సుందరి నవ్వాపుకుని "ఆరు బయట చల్లని గాలిలో నిద్ర పట్టని వాడికి కిటికీ లైనా లేని ఈ కొట్టు గదిలో నిద్ర పడుతుందా? బావా గడ్డి కోసం కొబ్బరి చెట్టేక్కావన్న మాట!" అంటూన సుందరి ముఖంలో హటాత్తుగా విషాదచాయలు అలుముకున్నాయి. "నాకు తెలుసు బావా! నువ్వీ గదిలో కేందుకోచ్చావో, చేతకాని వాళ్ళు చేయాల్సిన పనిచెయడానికొచ్చావ్ ! నిన్ను నమ్ముకున్న నన్నేం చేసిపోదామనుకుంటున్నావో చెప్పి మరీ....."
"సుందరీ !' ఆశ్చర్యంగా అన్నాడు రామారావు.
'అవును బావా! నేను నిన్ను మనసారా ప్రేమించాను - సాయంత్రం పార్కులో నీ మాటలు విన్నప్పట్నించీ నిన్నో కంట గమనిస్తూనే వున్నాను. ఏదో అఘాయిత్యం తలపెడుతున్నావని నాకు అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమవుతుందేమో ననే భయం నన్ను నిద్ర పోనివ్వలేదు !"