"ఇతను మా బాబాయి కొడుకు రమేష్ మా ఊరినుంచి వచ్చాడు. ఏదో ఇంటర్వ్యూ కోసం" పరిచయం చేశాడు మోహన్.
రాధకు చాలా సంతోషంగా అనిపించింది. తమ పెళ్ళయ్యాక ఇంటికి వచ్చిన మొదటి అతిధి అతడు. మనస్ఫూర్తిగా అతడిని ఆహ్వానించింది.
ఇంటర్వ్యూ అయిపోయింది. రమేష్ కి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నంలో అతడక్కడే వుండిపోయాడు.
రెండు గదుల యిల్లు మూడో మనిషి రాకతో యిరుకైపోయింది. ఏకాంతం, ప్రశాంతత లేకుండా పోయాయి.
రాధలో నిర్లిప్తత మొదలయింది. అదే సమయంలో మరొక సంఘటన జరిగింది.
* * *
నిర్లిప్తత స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. నూటికి తొంభయి మందిని అంతర్లీనంగా వేధిస్తూ అతి నెమ్మదిగా కృంగదీసే మానసిక వ్యాధి యిది.'
పగలంతా అనూరాధ నవ్వుతూ చలాకీగా పని చేసుకుంటూ కనిపించినా, రాత్రివేళ భర్త దగ్గరకు తీసుకుని ఉద్రేకంగా తనలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే-"ఇతడికి నేను మొదటిదాన్ని కాదు. ఇలాగే మరొక స్త్రీతో..." అన్న సత్యం గుర్తొచ్చి గుండెల్లో ముల్లులా గుచ్ఛసాగింది. భర్త మాట్లాడమనేవాడు- సిగ్గుకన్నా ఎక్కువగా...కేవలం సన్నటి గోడ అడ్డుగా వుండి పక్కగదిలో పడుకున్న రమేష్ కి ఈ మాటలు వికృతంగా వినిపిస్తున్నాయేమోనని శంక వేధించేది. మోహన్ కిదంతా పట్టదు. శరీరం అతడి చేతలకు ఉద్రేకంగా ఎగిరెగిరి పడుతుంటే మరోపక్క భయం-ఆమె ఆవేశాన్ని అణిచేసేది. సెక్స్ లో అసంతృప్తి మనిషినెంత బాధపెడుతుందో అనుభవించిన వాళ్ళకుగాను తెలియదు. తెల్లారేక మరిది మొహం చూడాలంటే సిగ్గు. తన వయసువాడే అయిన అతడు తనవైపు ఆసక్తిగా చూస్తున్నాడేమోనని అనుమానం. అతడిని పంపేయమని అడగాలంటే ధైర్యం చాలలేదు.
"ఇంకొంచెం పెద్దిల్లు తీసుకుందాం మోహన్. నాకేమిటో సిగ్గుగా వుంది. మన మాటలు అతడికి వినిపిస్తున్నాయేమోనని, అసహనంగా కూడా అనిపిస్తోంది" అంది.
"బాగానే వుంది. ఈ ఇంటికి అద్దె ఇవ్వడానికే అవస్థపడుతున్నా, ఒక పక్క వర్క్ షాప్ లో పనిలేక నేను బాధపడుతుంటే నీకేమో కోరికలు ఎక్కువవుతున్నాయి" అన్నాడతను.
ఆమె తెల్లబోయింది.
అతడి మాటల్లో జరుగుతున్నదానికి బాధ్యత అంతా- నీదేనన్న భావం ధ్వనించింది.
తను ఉద్యోగం మాని పొరపాటు చేసిందా? ఆ మర్నాటినుంచే ఆమె తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నెల తిరక్కుండానే మరో పెద్ద కంపెనీలో నెలకు అయిదు వందలకు జాబ్ దొరికింది.
"ఎందుకీ స్థితిలో ఉద్యోగం? నాలుగు నెలలవగానే మళ్ళీ సెలవు అడిగితే ఇస్తారా?" మోహన్ కోపంగా అన్నాడు.
"జీతం నష్టం మీద ఇస్తారుట. అడిగే వచ్చాను".
"ఏమో మరి నీ యిష్టం. ఇబ్బంది పడుతున్నావని నాతో అనకు మళ్ళీ".
హిపోక్రసీ... అతడికి తను ఉద్యోగంలో చేరడం ఆనందాన్ని కలగచేస్తోంది. కాని పైకి ఆ విషయం ఒప్పుకోడు. అంతా నీ యిష్టానికే వదిలేస్తున్నానంటూనే తన యిష్టప్రకారం జరిపించుకునే నైపుణ్యం వుందతనిలో రేప్పొద్దున్న ఏదయినా జరిగితే "చూసేవా నేను చెప్పలేదూ" అనటానికి వీలుగా వాదనని ఇప్పుడే నిర్మించుకుంటున్నాడు. ప్రస్తుతం తన ఉద్యోగం కావాలి.... ఆ విషయం ఆమె నెలజీతం అయినా అందుకోక మునుపే బయటపడింది. ఆమెని ప్రేమగా పిలిచి-
"అమ్మ ఉత్తరం రాసింది రాధా! పెద్ద తమ్ముడికి చదువు సరిగ్గా కుదరడం లేదట. మన దగ్గరకు పంపాలనుకుంటోంది. నీతో సంప్రదించి ఏ విషయమూ తెలియచెయ్యమని రాసింది. నువ్వూ సంపాదిస్తున్నావు. మనకి ఆర్ధికంగా ఇబ్బంది వుండదనుకో, కాని నీకే ఇబ్బంది కలుగుతుందో ఆలోచించుకుని చెప్పు. అమ్మ మరీ మరీ రాసింది. నీకెలా ఇష్టమయితే అలా చెయ్యమని, మొహమాట పడవద్దనీ".
"రమ్మని రాసెయ్ మోహన్! ఇంత ఆలోచన దేనికి? మనతోపాటే వుంటాడు. అతడిని చదివించడం మన బాధ్యత" అంది.
"నిజమేననుకో కాని నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పటికే పనెక్కువయింది".
"ఫరవాలేదు, మరోమాట ఆలోచించకు వెంటనే రమ్మని వ్రాయి" అంది ఉత్సాహంగా తన యిబ్బందిని భర్త గుర్తిస్తున్నాడు. అంతకంటే కావల్సిందేముంది. ఉత్తరానికి జవాబుగా మనిషే వచ్చాడు. రమేష్ వెళ్ళిన నాలుగు నెలలకి.... రాధ అతడిని ఆప్యాయంగా ఆహ్వానించింది. అతడి పేరు రవి. అతడిని కాలేజీలో చేర్పించారు. రాధ మొదటి జీతం అందుకు ఉపయోగపడింది. రవికి చదువు తప్ప మరే ధ్యాసా వుండదు. దాంతోపాటే టైపు షార్టుహాండు కూడా నేర్చుకుంటున్నాడు. రవి ఒక్క పనీ ముట్టుకోడు ఎప్పుడూ 'బిజీ' అని అనడం అతని ఫేషను. 'పనిలేనివాళ్ళు అనే ఏకైన మాట అది' అని ఆమె ఉద్దేశ్యం.
ఉదయం లేవగానే కాఫీ, టిఫిన్ లు - తర్వాత భోజనాలు పూర్తిచేసి ఆఫీసుకి పరుగు పెట్టేది రాధ. సాయంత్రం తిరిగి వచ్చేసరికి మొగవాళ్ళు యిద్దరూ ఆమెకోసం ఎదురు చూస్తూండేవారు.
"నీ కోసమే చూస్తున్నాం వదినా! తల బద్దలయిపోతోంది టీ యివ్వు" అనేవాడు రమేష్ రవి కూడా టీ తీసుకుని బయటకు వెళ్ళిపోయేవాడు.
వాళ్ళు మధ్యాహ్నం తిన్న భోజనం పళ్ళేలు ఎండిపోయి ఎదురు చూస్తుండేవి. అన్నీ సర్దుకుని, మళ్ళీ వంటపనిలో పడాలి. పనంతా అయ్యేసరికి ఒళ్ళు అలసిపోయి విశ్రాంతి కోరుకుంటోంది. కాని మోహన్ అంత త్వరగా వదలడామెను. పొరపాటున చెప్పుకుంటే....
"నువ్వేగా వాడిని ఆహ్వానించింది. ఇష్టం లేకపోతే డైరెక్టుగా చెప్పేయ్ వెళ్ళిపొమ్మని...... నేను ముందే వార్నింగిచ్చాను" అనేవాడు.
నేను ముందే వార్నింగిచ్చాను...... నేను ముందే.... నేను.....
"నిజమే ఇదంతా స్వయంకృతం" అనుకునేది మళ్ళీ అదే నిర్లిప్తత స్లో పాయిజన్.
రాధకి నెలలు నిండుతున్నాయి. ఈ విషయం తెలిశాక అయినా తల్లిదండ్రులు వస్తారని ఆశపడింది. అదీ కల్లే అయింది.
"అత్తగారిని రమ్మని వ్రాయి మోహన్! నాకేమిటో భయంగా వుంది" అని బ్రతిమాలింది.
"బావుంది ఆవిడెలా వస్తుంది? పొలం పనులేమీ జరగవు. అయినా వయసులో వున్నా చెల్లెళ్ళను ఆ ఊళ్ళో వదిలి రాదు. పోనీ ఒక పని చెయ్యరాదూ?"
"ఏమిటి?" ఆశగా అడిగింది.
"మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళిరా నీ పరిస్థితి చూస్తేనన్నా మీ అమ్మ మనసు కరుగుతుందేమో చూద్దాం".
"ఊహు నాకు కావలసింది వాళ్ళ సానుభూతి కాదు, ప్రేమ అదే వుంటే నేను పిలవకుండానే వస్తారు. వాళ్ళంతట వాళ్ళు వచ్చేవరకు నేను మాత్రం వెళ్ళి చులకన అవను" అంది స్థిరంగా.
"వాళ్ళూ అలాగే అనుకుంటారేమో?"
"నన్ను ఇంట్లోంచి కట్టుబట్టలతో పంపేసింది వాళ్ళు. ఇప్పుడు వచ్చి పిలవాల్సిన బాధ్యత వాళ్ళదే".
"ఏమిటో, కూతురిని దూరం చేసుకుని ఊరి వాళ్ళందరినీ తెచ్చిపోషిస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులని నేనెక్కడా చూడలేదు. అయినా నువ్వేం తప్పుచేశావని? పెళ్ళిచేసుకున్నావు లేచిపోలేదుగా?"
రాధ మనసుకి కష్టం కలిగింది. అతడన్న మాటల్లో నిజం వుంది. కాని ఇతడిమీద ప్రేమతోనేగా తను తల్లిదండ్రులని ఎదిరించి వచ్చింది. తన కష్టం, సుఖం ఆలోచించాల్సిన బాధ్యత ప్రస్తుతం అతడిదే కదా!
పనిమనిషయినా లేకుండా, ఉద్యోగం చేసుకుంటూనే ఇంటిపనంతా తనొక్కతె చేసుకోవడం అతడికి చీమకుట్టినట్లయినాలేదు. అతడితో పాటు తను అతడి కుటుంబ భారాన్ని సమంగా మోయడం సంతోషాన్ని కలిగించడం లేదు. ఇవన్నీ తన బాధ్యతలుగానే భావిస్తున్నాడు.
ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కాని, అంతలోనే వివేకం మేల్కొంది.
ఈ బాధ్యత తను సమంగా పంచుకుంటాననే మాట ఇచ్చింది. అతడి మెప్పుకోసమో, ప్రేమ కోసమో కాదు. అది తన కర్తవ్యం అనుకుందప్పుడు కొద్ది నెలల్లోనే ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే తనలో స్వార్ధం పెరిగిందా లేక ఆదర్శంలోనే లోపం వుందా? లేక ప్రేమ వేడి తగ్గిందా?
మనసుకు ఆనందం కలిగించేది వివేకం, తెలివీ, పట్టుదల కావు. చిన్న గుర్తింపు. వీటి భారాన్ని వదిలించుకుని ఆకాశం తెరిపిన పడినట్టు భారంతో నిండి హృదయం ఒక్క ప్రేమ పలుకుతో తేలికపడుతుంది. అది లేనప్పుడు నిర్లిప్తత కార్చిచ్చులా రగులుకుంటుంది.
పెళ్ళయి సంవత్సరం కాకుండానే ఆమెకు పాప పుట్టింది. అమ్మాయి పుట్టినందుకు బాధ కలగలేదు. నిరాశపడలేదు. మోహన్ కి ఆ భావం కలుగుతుందని కలలో కూడా అనుకోలేదామె. డెలివరీ అయ్యాక జనరల్ హాస్పిటల్ వార్డులో పడుకుని అతడికోసం రెండు రోజులు ఎదురు చూడవలసి వచ్చింది. వచ్చాక కూడా పాపనతడు దగ్గరకు తీసుకోలేదు.