Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 31

 

    'చెబితే అర్ధం చేసుకోగలవా అని నా అనుమానం. అయినా చెబుతున్నా విను.ఒకే సోల్యూషన్లో ఇనుమూ, అల్యూమినియము ఉన్నాయనుకో , రెండూ ఎంతెంతున్నాయో కనుక్కోవాలనుకో- దాన్ని ఎస్టిమేషన్ అంటాం. అల్యూమినియం ఎస్టిమేషన్లో ఇనుము ఇంటర్ ఫియ రవుతుంది. ఈ సయనైడ్ వేస్తె ఇనుము చస్తుంది కానీ అల్యూమినియం చావదు. ఆ చవదాన్ని మేము మాస్కింగ్ అంటాం. ఆ మాస్కింగు కోసం ఈ సయనైడ్ వాడుతున్నాను."
    తర్వాత లాబొరేటరీ అంతా చూపించాడు. రవి స్నేహితుడికి. కానీ రామారావు దృష్టంతా సయనైడ్ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఎలాగో అలా తను కొంత సయనైడ్ సంపాదించి అనువైన చోట ఆరగించాలి. లాబొరేటరీ లో పుచ్చుకుంటే అనుమానము రవి మీదకు పోతుంది. కాబట్టి తన చావు ఎవరికీ ప్రమాదాన్ని కలిగించని ప్రదేశాన్నేన్నుకుని అక్కడ ఆత్మహత్య చేసుకోవాలి.
    లాబొరేటరీ చూడడమయ్యేకఇద్దరూ రవి ఉండే ఎయిర్ కండిషన్డ్ గదికి వెళ్ళి కూర్చున్నారు. రవి కాఫీ తెప్పించాడు. కాఫీలో కొద్దిగా పంచదార తక్కువయింది.
    "ఇప్పుడు పంచదారెక్కడి నుంచి వస్తుంది తాగేద్దాం !" అన్నాడు రామారావు.
    "వుండు , పంచదారేక్కడి నుంచి వస్తుందో చూద్దువు గానీ " అంటూ రవి లేచి వెళ్ళి అక్కడున్న ఓ స్టీలు అల్మారా తలుపు తీసి అందులోంచి ఓ పోలితీన్ శాంపిల్ ట్యూబు తీశాడు. అది ఇందాకటి లాంటిదే! దాన్ని చూస్తూ రామారావు "ఈ ట్యూబూ ...." అంటూ ఏదో అనబోగా "ఆ ఇలాంటి ట్యూబులోనే ఇందాక నీకు సయనైడ్ చూపించాను. ఇందులో ఉన్నది సయనైడ్ కాదులే పంచదార !" అన్నాడు రవి.
    అందులో ఉన్నదేమిటో చెప్పనవసరం లేకుండానే ఆ ట్యూబు మీద లాబొరేటరీ గుర్తు , పేరు రాసి వున్న గమ్ లేబిల్ వుంది. దాని మీద షుగర్ అని రాసి వుంది. ఇద్దరూ ఆ ట్యూబు లోంచి కొద్దిగా పంచదార కాఫీలో వేసుకున్నారు.
    కాఫీలు తాగడం అయిన అయిదు నిమిషాలకు రవికి అతని బాస్ వద్ద నుండి పిలుపు వచ్చింది. "ఇప్పుడే వచ్చేస్తా . ఇక్కడే వుండు" అంటూ రవి అక్కణ్ణించి లేచి వెళ్ళాడు.
    రవి వెళ్ళిపోయాక రామారావు ఆలశ్యం చేయలేదు. అతను పంచదార ఉన్న పోలితీన్ ట్యూబు ను తీసుకుని ప్రయోగశాల లోకి వెళ్ళాడు. అక్కడ బాబురావు శ్రద్దగా ఏదో టైట్రేషన్ చేస్తున్నాడు. అతను రామారావుని గమనించే పరిస్థితిలో లేడు. అదీకాక సయనైడ్ ఉన్న ట్యూబు వైపు బాబూరావు వీపు ఉంది.
    తన అదృష్టాన్నభినందించుకుంటూ రామారావు పంచదారని అక్కడున్న సింక్ లోనికి వంపేశాడు. అక్కడున్న ట్యూబు లోని సయనైడ్ ను తన పంచదార ట్యూబు లోనికి మార్చాడు. ఆమార్పిడి చేస్తున్నప్పుడతని చేతులు విపరీతంగా వణికాయి. ఏమయితేనేం , రామారావు జయప్రదంగా సయనైడ్ ను పంచదార ట్యూబు లోకి మార్చేసి ఆ ట్యూబు ను తన జేబులోకి తోసేయగలిగాడు. అప్పుడతని గుండెల్లో బెదురు ప్రారంభమైంది. తన జేబులో మృత్యుదేవత ఉందిప్పుడు. ఏక్షణన కావాలంటే ఆ క్షణంలో ఆమె తనకు ప్రసంనురాలవుతుంది. తన జేబులో ఒక త్రాచు పామున్న అనుభూతి కలిగి వళ్ళు జలదరించింది రామారావుకి.
    బాస్ దగ్గర్నించి తిరిగి వచ్చిన రవి తన స్నేహితుడి లోని మార్పును గమనించాడు కాని ఆ మార్పుకు కారణభూతమైన మార్పును గమనించలేక పోయాడు.
    
                                    8
    "మిమ్మల్ని అభినందిస్తున్నాను గంగరాజుగారు! మీ అజీర్ణ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది" అన్నాడు డాక్టర్.
    "మీకు కృతజ్ఞుణ్ణి  డాక్టర్. మీ రుణమేలా తీర్చుకోవాలో నా కర్ధం కావడం లేదు. నాకూ నలుగురిలా బ్రతకాలని ఉంది. ఆ అవకాశం మీ వల్లనే ఇప్పుడు కలిగింది."
    "నాదేముందండీ అన్నింటికీ దైవకృప ఉండాలి. నేను మానవయత్నం చేశాను."
    "మళ్ళీ మాములుగా తిరగొచ్చు నన్నమాట నేను" అన్నాడు గంగరాజు . అతని కళ్ళలో ఆశ కనబడుతోంది.
    "తిరగొచ్చు ననుకోండి. కానీ ఇంతకాలం మిమ్మల్ని మంచాన పడవేసి ఉంచినది అజీర్ణ వ్యాధే ననుకుంటూన్నారా?"
    "మరి."
    "మీకు నరాల నిస్సత్తువ , బ్లడ్ ప్రెషర్ , హార్ట్ వీక్ నెస్ వగైరాలన్నీ ఉన్నాయి."
    'అయితే నేను కోలుకోవడమన్నది ఈ జన్మకు జరగదు" గంగరాజు నిస్పుహగా అన్నాడు.
    'అలా నిరుత్సాహ పడకండి . మీకు విశ్రాంతి చాలా ఎక్కువగా అవసరం. ప్రశాంతమైన ఆలోచనలే మీరు చేస్తుండాలి. పులుపూ, కారం అట్టే తినకూడదు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసే మనుషులు కూడా మీకు అవసరం. వేళకు మండులిస్తూ, చేయవలసిన సపర్యలు చేస్తూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండగల మనుషులుంటే మీరు చాలా త్వరగా కోలుకుంటారు ."
    "నన్ను చూసుకుందుకు మా ఇంట్లో ముగ్గురు మనుషులున్నారు" అన్నాడు గంగరాజు.
    "మీరేమీ అనుకోనంటే నాడో చిన్న సలహా గంగరాజు గారు. తొందరగా కోలుకోవాలనుకుంటే డబ్బిచ్చి మనిషిని పెట్టుకోవడం మంచిది. మీ అమ్మాయి అమాయకురాలు. మేనల్లుడు బద్దకస్తుడు. మీ చెల్లెలు పెద్దావిడ. మిమ్మల్ని శ్రద్దగా కనిపెట్టుకుని ఉండగల సామర్ధ్యం ఈ ముగ్గురికీ ఉందని నేననుకోను. సాయంత్రానికి నేనో మనిషిని పంపిస్తాను. మాట్లాడి చూడండి. నెలకు ముప్పై రూపాయ లడుగుతుంది. కానీ ముప్పై వేలు విలువచేసే సపర్యలు చేస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్ళు కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది" రాత్రిళ్ళు అన్న పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు డాక్టర్.
    అప్పటికి గంగారాజేమీ మాట్లాడలేదు గానీ సాయంత్రం ఆ మనిషిని చూసి గంగారాజు గంగావేర్రు లేత్తిపోయాడు.
    ఆమెకు పాతికేళ్ళ వయసుండవచ్చు. అందానికి అప్సరస అనవచ్చు. అమాయకమైన ముఖం. పేరు సుగుణ.
    సుగుణ పేదవాళ్ళ పిల్ల. ఆమె పెళ్ళి చేయడానికి సరిపడ డబ్బు తండ్రికి లేదు. ప్రస్తుతం ఆమె మోహన్ దగ్గర నర్సుగా పని చేస్తోంది. సుగుణ తలిదండ్రుల గురించి విన్నాక వాళ్ళు తనకు దూరపు బంధువు లేనని హటాత్తుగా గంగారాజును గుర్తు కొచ్చింది.
    ఏ క్షణాన సుగుణ ఆ ఇంట్లో పాదం పెట్టిందో అప్పట్నించీ గంగరాజు మనసు వశం తప్పింది. ఆయనకు ఇదివరకటి కంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. తిండి విషయంలో సుగుణ చెప్పినవి కూడా పాటించే వాడు. సుగుణ కూడా అయన అవసరాలన్నీ శ్రద్దగా గమనిస్తూండేది.
    సుగుణ నచ్చేక రంగమ్మకూ, భద్రానికి సుభద్రమ్మకూ కూడా కొంచెం సుఖంగా వుంటోంది. వాళ్ళ బాధ్యతలు చాలా వరకూ తగ్గిపోయాయి. ఎవరీ దగ్గర ఎలా మసులు కోవాలో తెలిసిన సుగుణకు ఇంట్లో అందరితోనూ స్నేహం కలిసింది. అయితే ఆ స్నేహ బంధానికి గంగరాజు కూ ఆమెకూ వున్న స్నేహబంధానికి తేడా వుంది.
    తన గదిలోనే తనతో పాటు పడుకుంటున్న సుగుణ రాత్రి సమయంలో గంగారాజును చాలా కలవర పరుస్తుండేది. ఒకోసారి ఆయనకు సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. లేచి వెళ్ళి ఆమెను సమీపించి తాకాలని వుండేది. కాని ధైర్యం చాలేది కాదు. ఒకరాత్రి ఆయనకు ధైర్యం రాగా, లేచి వెళ్ళి ఆమె బుగ్గలు నిమిరాడు. ఆమాత్రం స్పర్శకి అయన శరీరమంతా గగుర్పొడిచింది. సుగుణకు మెలకువా వచ్చింది. "ఏమిటిది?" అందామె.
    "నిన్ను చూస్తె నాకేదోలా వుంది."
    "ఉద్రేక పడకండి. మీ కసలే బ్లడ్ ప్రెషర్ ."
    "నువ్వెదురుగా వుండి అంత దూరంగా వుండకు. మన మధ్య దూరానికీ నా బ్లడ్ ప్రేషరుకూ సంబంధ ముంది. దూరం తగ్గితే ప్రేషరూ తగ్గుతుంది"అన్నాడు గంగరాజు.
    "నేను మీకేమవుతానని దగ్గరగా రాను" అంది సుగుణ.
    గంగరాజు ఒక్క క్షణం అలోచించి "నీ జీతం ఇప్పుడు ముప్పై రూపాయలు. అది పగటి పూట నీ పనికనుకో. రాత్రికి వేరే జీతం ఏర్పాటు చేస్తాను" అన్నాడు.
    "నా పేరు సుగుణ ." అంది కోపంగా ఆమె.
    "ఏం కావాలి నీకు?" గంగరాజు అడిగాడు.
    "గంగరాజు గారూ, నిజంగా మీకు తెలియదా? పాతికేళ్ళ వయసు దాటినా ఇంకా కన్నేపిల్లగానే వుండిపోయాను. డబ్బు లేక! కాబట్టి నాకు డబ్బు కావాలి. కానీ ఆ డబ్బెందుకు? పెళ్ళి కోసం. మరి పెళ్ళెందుకు ? సంఘం ఆమోదించిన పద్దతిలో దాంపత్యం నేరవేర్చడానికి . నాకూ వయసుంది. వయసుకి తగ్గ కోరికలున్నాయి. కానీ సంఘం ఆమోదించిన పద్దతిని కాదనేటంత చపలచిత్తను మాత్రం కాదు. కాబట్టి నాక్కావలసినదేమిటో మీకు అర్ధమయిందనుకుంటాను ."
    గంగరాజు ఒక్క క్షణం ఆలోచించాడు. "సుగుణా నిన్ను పెళ్ళి చేసుకుంటే నన్ను మనస్పూర్తిగా నీ భర్తగా అంగీకరించగలవా?" అన్నాడు.
    'అంగీకరించడమేం కర్మ. అది నా అదృష్టమానుకొంటాను" అంది సుగుణ.


                           *    *    *    *

    "ఒరేయ్ భద్రం, రంగమ్మను పెళ్ళి చేసుకుంటావట్రా "
    "ఏమిటి మామయ్యా! రంగమ్మనే, నేనే ....పెళ్ళే....నువ్వు నిజంగానే అంటున్నావా ?"
    "ఆ నిజంగానే అడుగుతున్నాను, చెప్పు."
    'భలేవాడివి మావయ్యా అంతకంటే నాక్కావలసిన దేముంది?"
    'చాల్లే సంతోషించాం గానీ నీ పెళ్ళాన్ని నువ్వెలా పోషించుకుంటావో చెప్పు."
    భద్రం ఊహించని ప్రశ్న ఇది. ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచలేదు. అతను ఒక్క నిముషం అలోచించి "ఉండు మావయ్యా మా అమ్మ నడిగోస్తాను " అంటూ అక్కణ్ణించి పరుగెత్తాడు.
    మరుక్షణం లోనే చేటంత ముఖం చేసుకుని సుభద్రమ్మ అక్కడికి వచ్చి "ఎమిటన్నయ్యా! పెళ్ళంటూన్నావుట మేనల్లుడితో వేళాకోళలాడుతున్నావుట. నీకు తెలియదూ రంగమ్మ మొగుడికి సంపాదన కోసం వెతుక్కోవలసిన అవసరం లేదనీ....' అంది.

 Previous Page Next Page