Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 29

   

     జనం!
   
    నిన్నంతా తనని గెలిచేసి హేళన చేసిన జనం!
   
    రాయన్న శ్రీశ్రీని చదవలేదు. లేకపోతే "నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే" అన్న గేయం గుర్తు తెచ్చుకునేవాడే. ఇప్పుడు సరిగ్గా అలాంటి భావమే అతని మనసులో కదలాడింది. తను నేలకి ఒరిగి పోతున్నప్పుడు చీమని నలిపినట్టు నలిపేద్దామనుకున్న ఈ జనం ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
   
    అకస్మాత్తుగా -తనొక యుద్దభూమిలో వున్నట్టు ఫీలయ్యాడు.
   
    వేల వేల కళ్ళు తన విన్యాసాన్ని గమనించటానికా అన్నట్లు వేచివున్నాయి. తనని తాను నిరూపించుకోవాలి. ప్రాణాలు పోయేముందు సైనికుడిలో కలిగే విజ్రుంభణ భావన అది. ప్రపంచంమీదా, మనుష్యులమీదా అతడికున్న కసికి పరాకాష్ట అది.
   
    అతడి దృష్టి రమణిమీద పడింది. పాప్ కారన్ తింటూ ఏదో మాట్లాడుతూంది. బంతి వేయటానికి వస్తున్నాడు బౌలరు. రాయన్నకి మరి ఇక ఏమీ కనిపించలేదు. ఏమీ వినిపించలేదు. తనమీద గొడవలు, జనం నినాదాలూ అన్నీ మర్చిపోయాడు.
   
    కేవలం బంతి మాత్రమే కనిపిస్తూంది.
   
    రాయన్నలో కేవలం ఆటగాడు మాత్రమే మిగిలాడు.
   
    యుద్దంలో మొదటి అస్త్రం శత్రువు కాళ్ళదగ్గిరకి వేసి ప్రారంభ నమస్కారం చేసేవారట. అతడు జనాలకి నమస్కారం పెట్టాలనుకున్నాడు.
   
    క్రికెట్ చరిత్రలో ఆటస్థలం బయటవున్న గడియార స్థంభంవరకూ సిక్సర్ కొట్టి, అద్దాల్ని బ్రద్దలుకొట్టిన వీరులున్నారు. భార్యకు పుట్టినరోజు బహుమతిగా వంద పరుగులు చాలెంజి చేసి కొట్టిన వాళ్ళున్నారు. వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకున్నాడు.
   
    వస్తున్న బంతి 'గుగ్లి' అని అనుమానం.
   
    దాన్ని కొట్టడం ఒక ఛాలెంజి!
   
    అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత కష్టం. క్రికెట్ తెలిసిన వారికే ఆ కష్టం తెలుస్తుంది.
   
    భారత్ క్రికెట్ చరిత్రలో స్కేర్ కట్ కి ప్రధముడు గుండప్పా విశ్వనాథ్. అతడే ఆశ్చర్యపడేట్టూ కొట్టాడు రాయన్న. మోకాలు వంచి, బ్యాట్ ని మెరుపువేగంతో తిప్పి కొట్టిన ఆ షాట్ కి, టి.వి. కెమేరాలు కూడా పట్టుకోలేనంత వేగంతో బంతి దూసుకువెళ్ళి రమణి కాళ్ళముందు పడింది.
   
    స్కేటర్ లో సిక్సర్!
   
    ఆ అపురూపమైన విన్యాసానికి ఎదుటి బ్యాట్స్ మన్ కూడా చప్పట్లు కొట్టాడు. రాయన్న రమణివైపు చూశాడు. నిన్న టమోటాలు, కోడిగుడ్లు విసిరిన అమ్మాయిలు- ఇప్పుడు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు -
   
    ఒక గొప్ప సైకలాజికల్ తృప్తి!
   
    అది సాడిజం కాదు. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ సంతృప్తి!!
   
                                                                      *    *    *
   
    ఆ రోజు ఆట పూర్తయ్యే వరకూ వాళ్ళిద్దరూ అవుట్ కాలేదు. గంటన్నరలో తొంభై పరుగులు చేశారు.
   
    ఆట డ్రా అయింది.
   
    అజారుద్దీన్ తో కలిసి అతడు వెనక్కి వస్తూంటే గౌరవానందనలు మిళితమైన అభిమానంతో ప్రేక్షకులు నిలబడ్డారు. 'స్టాండింగ్ ఒవేషన్' అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నాడు అతడు. అతడి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి. కంటిక్రింద విరిగిన ఎముక పెట్టే బాధకాదది. మనసు బాధకి కంటినుంచి వచ్చిన నీరు అది.
   
    "ప్రేక్షక మహాశయులారా! నాకు ఇది చివరి ఆటే కావచ్చు! నాకు శిక్షపడితే మీరు చెపుతున్న ఈ వీడ్కోలే నా క్రికెట్ జీవితానికి చివరి వీడ్కోలు కావచ్చు!! స్టేడియం నించి నా ఈ నిష్క్రమణ క్రికెట్ ఆటనించి శాశ్వత నిష్క్రమణే అవవచ్చు!!! కాని నా ఈ  చిన్న  విజయాన్ని మీ గుండెల్లో పదిలపరుచుకోండి. నే నెలాంటి  దుర్మార్గుడినని అనుకున్నా  క్రికెటర్ గా మాత్రం మీ మనసుల్లో కాస్త స్థానమివ్వండి చాలు" కన్నీటి పొరలు మధ్య మసగ్గా కనపడుతున్న తనకు తెలియని తన అభిమానులకు నిశ్శబ్ద నివేదన లందించుకుంటూ అతడు లోపలి కెళ్ళిపోయాడు.
   
    'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా భారత రాష్ట్రపతి నించి కప్ అందుకుంటున్నప్పుడు రాయన్న చేతులు వణికాయి. ఉద్వేగంతో గుండె వణికింది.
   
    "ఈ విజయం నాదికాదు కిరణ్మయీ, నీది" అనుకున్నాడు మనసులో విలేఖర్లు అతడిని చుట్టుముట్టారు.
   
    "ఈ ఆటలో భారత టీమ్ లో మీ స్థానం నిలబడుతుందని భావిస్తున్నారా?"
   
    "టీమ్ లో స్థానం నాకే రావాలన్న ఉద్దేశ్యంతో నేనాడలేదు. నాకంటే బాగా ఆడి మరొకరు ఆ స్థానాన్ని పొందలేరన్న నమ్మకం ఏమిటి? నా వరకు నాకు బాగా  తృప్తినిచ్చిన ఆట ఇది. నిజం చెప్పాలంటే గతంలో రంజీట్రోఫీ మ్యాచ్ లలో నేనింకా బాగా ఆడిన ఘట్టాలున్నాయి. ఒకటైంలో నేను నిలబడగలిగినందుకు, వికెట్స్ తీసుకున్నందుకు ఇప్పుడీ కప్ నాకు వచ్చింది."
   
    "భారత జట్టులో మీకు స్థానం యిస్తే యింత అంకితభావంతోనూ ఆడగలనన్న నమ్మకం మీకుందా?"

    "చూడండి. ఏ ఆటగాడయినా సిన్సియర్ గా ఆడి పేరు తెచ్చుకోవాలనే ఆశయంతోటే ఆడతాడు. అయితే అదృష్టమో, దురదృష్టమో ఒకటి ముందుగానే అతడిని వరిస్తుంది. ఈ ఆటలో మొదటి ఇన్నింగ్స్ లో నా అట అతిఘోరం. అది సిన్సియారిటీ లేక కాదు. ఒక్కోసారి అలా జరిగి పోతుంటుంది అంతే."
   
    "మీమీద వచ్చిన హత్యాభియోగం?"
   
    "క్షమించండి. నా ఆటకి, దానికి సంబంధంలేదు. అది కోర్టులో వుంది. కోర్టుకే వదిలెయ్యండి మంచిది" రాయన్న వెళ్ళిపోయాడు.
   
   
           
                                  --* * * *--

 Previous Page Next Page