భక్తులు కొందరు పూజారుల చేత పూజలు చేయిస్తున్నారు. వాళ్ళందరి ముందు రాగని ఏమి చేయలేక ముఖశాలలో స్థంభం వెనక దాక్కున్నాడు. గుడిలోంచి బయటికి అటునుంచే రావాలి. శంభు వెళ్ళిపోయాడనుకుని రాగ నెమ్మదిగా బయటికి వస్తుంటే శంభూ చటుక్కున ఆ పిల్ల భుజం పట్టుకుని గుడి వెనక్కి చంద్రభాగా నది ఒడ్డుకి ఈడ్చుకుపోయి పిడికిలి బిగించి ఆ పిల్ల ముఖం మీద పోట్టలోను, డొక్కలోను యిష్టం వచ్చినట్లు గుద్ది కింద పడేసి డబ్బులు లాగేసుకున్నాడు. ఏడుస్తూ అతడి కాలు గట్టిగా పట్టుకోబోయింది. ఆ కాలితో రాగ ముఖం మీద తన్ని పారిపోయాడు. అలసట, నీరసం బాధ, ఉడుకు మోత్తనం అయినా పట్టుదలగా లేచింది. మళ్ళీ ముఖశాల దగ్గిరకు వచ్చి గుళ్ళో కెళ్ళబోతున్న ఒక పెద్దమనిషి చెయ్యి పట్టుకుని, "అంకుల్! మా మమ్మీకి ఫోన్ చెయ్యాలి. ఫిప్టి ఎన్ పి ఇస్తారా! మమ్మీ దగ్గిరకి వెళ్ళాక మళ్ళీ యిచ్చేస్తాను, "అంది యింగ్లిషు లో మాసి పోయిన గౌను, ముఖం నిండా వొంటి నిండా బురద, యేడ్చి యేడ్చి యెర్రగా వుబ్బి దీపంగా వున్న కళ్ళు స్వచ్చంగా వున్న ఇంగ్లీషు ఆ పెద్దమనిషి ఆశ్చర్యంగా ముందుకు వొంగి "ఎవరమ్మా మీ మమ్మీ!" అని అడిగాడు.
రాగ సమాధానం చెప్పేలోగానే "పాపా" అనే గర్జన వినబడుటము జాన్ గోవింద్ రాగ ఎదురుగా నిలబడటము, రాగని భుజాల మీదకి ఎత్తుకోవడము ఒక దాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఆ పెద్దమనిషి నుద్దేశించి జాన్ గోవింద్, "ఏం అనుకోకండి ఈ మధ్యే వాళ్ళమ్మ చచ్చిపోయింది. అప్పడి నుంచి దీనికి కాస్త మతిస్థిమితంతప్పింది.
ఇంట్లోంచి పారిపోయి వస్తుంది" అని చకచకా గుడి దాటి బయటికి వొచ్చేసి అటో మాట్లాడి ఎక్కి కూర్చున్నాడు. ఆ పెద్దమనిషికి నిదానంగా ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లనిపించింది. ఇంకా బాగా ఆలోచించాక డైలీలో పాప ఫోటో చూసినట్లు స్పురించింది. "అరెరే", అని నాలుక్కరచుకొన్నాడు. అప్పటికే జాన్ గోవింద్ యెక్కిన అటో కనుమరుగైపోయింది. పోలీసులకు తెలుయ బరుద్దామా అనుకున్నాడు. మొదట ఆ పెద్దమనిషి అతనిది వూరు కాదు, ఆ రాష్ట్రం కాదు కేవలం కోణార్క దేవాలయం చూడడానికి వొచ్చాడు పోలీసులతో పెట్టుకుంటే సాక్ష్యాలు వివరాలు అంటూ తననిక్కనుంచి కదల నివరు. అవతల బోలేడు పనులున్నాయి చివరికి దేశంలో నూటికి తొంభై మంది లాగే, "ఎవరి ఖర్మకి ఎవరు కర్తలు", అని వేదాంతాన్ని ఆశ్రయించి, రాగ విషయం మర్చిపోయాడు.
గుడిసెల ముందు అటో దిగిన జాన్ రాగని ఎత్తి నేలమిదకి విసిరీశాడు దబ్బున నేలమీద పడి "అమ్మా!" అని అరిచింది పాప. రాగ దురదృష్టవ శాత్తు ఆ సమయంలో సుబ్బయ్య, యమ్మాయమ్మ ఎవరూ లేరు. ఒళ్ళు తెలియని కోపంతో రాగని చేతుల్తో గుద్దాడు. కాళ్ళతో తన్నాడు. జుట్టు పట్టుకు గుంజాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రవధ చేసేశాడు. కొంత సేపు "అమ్మా! అమ్మా!" అని యేడ్చిన రాగ చివరికి ఏడవడానికి శక్తి లేక తెలివి తప్పి పడిపోయింది. ఆ పిల్ల ముక్కుల్లోంచి నోట్లోంచి నెత్తురు బయటకొచ్చి చారికలు కట్టింది. ఒళ్ళంతా దెబ్బలతో ఎక్కడి కక్కడ కదుములు కట్టింది. అప్పుడొచ్చింది యమ్మాయమ్మ రాగని ఆ స్థితిలో చూసి కేవున కేక పెట్టింది.
"మనిషివా పశువా! పసిపిల్లని యిలా చావబాదుతావా?" అని జాన్ మీద విరుచుకుపడింది.
"నోర్ముయ్! ఏం జరిగిందో తెలిస్తే నునిలా వాగవు. ఈ లం......నేరుగా గుడికే పోయింది. దీని మూలంగా మనం పోలీసువాళ్ళ చేతుల్లో చిక్కుకుంటే ఇంతకు మించి చావబాదుతారుమన్ని. అసలు యీ సుబ్బయ్యగాణ్ణి అనాలి. ఎక్కడకు పోయాడు దీన్నోదిలి?" సరిగ్గా మాటల్లోనే లోపలికి అడుగు పెట్టాడు సుబ్బయ్య. జాన్ తోడేల్లా అతని వేపు గుర్రుగా చూస్తూ "ఈ పిల్లని యెక్కడికి పోకుండా కాపలా వుండమంటే యెక్కడ చచ్చావు?" అన్నాడు మింగేసేలా. సుబ్బయ్య సమాధానం చెప్పలేదు. అతడి చుపులు దెబ్బలు తిని తెలివి లేకుండా పడి వున్న రాగ మీదనే ఉన్నాయి. రాగ పక్కన యమ్మాయమ్మ కూర్చుని వుంది.
"ఎవరు? యీ పాపని యిలా చావగొట్టింది?" నెమ్మదిగానే అన్నా సర్రున కత్తి దుస్తున్నట్లు పదునుగా వున్నాయి మాటలు.
"నువే!" క్రూరంగా అన్నాడు జాన్.
"నేనా! ఏం పిచ్చెక్కిందా?"
"ఎక్కే వుంటుంది. లేకపోతే యీ పిల్లని యీ డోదిలి షికార్లు కొడ్తావా? ఈ పిల్ల బయటోళ్ళ కళ్ళల్లో పడితే మన కొంప మునుగుద్దని తెల్దా? ఎడ సచ్చినావు?"
"నా గాళ్ ఫ్రెండ్ దగ్గరికి పోయాలే, ఏం జరిగిందో చెప్పు?"
"ఎవరా గాళ్ ఫ్రెండ్ ఈడ యేవర్తి దొరికింది?"
"దొరుకుతుందిలే రేపో ఎల్లుండో నువూ పొదువు గాని ఆడకి. ముంది పిల్లని యిట్టా ఎవరు కొట్టారో? యెందుకు కొట్టారో చెప్పాలి!" జాన్ బండ బూతులతో జరిగిందంతా వర్ణించి చెప్పాడు.
"అలా అయితే శంభూగాడ్ని చావబాదాల్సింది. ఈపసిదాన్నెందుకు కొట్టావు. శంభూ గాడు తీసుకెళ్ళకపొతే యీ పాపకి గుడెక్కడో, వూరేక్కడో యేమైనా తెలిసేదా?"
"శంభూగాడ్ని కొడ్తే యీ గుడిసేల్ల్లో వొళ్ళంతా మన్ని చావబాత్తారు."
"నా అనేవాళ్ళు దగ్గిర లేక నిస్సహాయంగా మన చేతుల్లో పడి వుందని యీ పసిదాన్ని చావబాదావా? ఈ గుడిసెల్లో వాళ్ళు నిన్ను చావబాదడానికి వెయ్యి రెట్లు దేవుడు నిన్ను చావబాత్తాడు."
"దేవుడు! ఏడున్నాడు దేవుడు? దేవుడనే వాడెక్కడన్నా వుంటే మనందరి బతుకులిట్టా తగలబడేవా?" ఈ మాటలంటున్నప్పుడు జాన్ కళ్ళు రోషంతో భగ్గుమన్నాయి. అతడి మొహంలో పట్టరాని కసి తొంగి చూసింది. మాట్లాడలేదు సుబ్బయ్య. ఈలోకంలో ప్రతి ప్రాణికి వెనుక ఒక వింత కధ, మనిషి అచ్చంగా మంచివాడు కాదు చెడ్డవాడు కాదు. పరిస్థితులు, వాతావరణం, ఎమోషన్స్ అతన్ని యిష్టం వచ్చినట్లు ఆడిస్తుంటాయి. ఈ విచిత్ర విధి హేలతో ఆత్మబలంతో తనని తాను కుడదిసుకుని విధికి ఎదురు నిలిచి మనిషిగా ఎదగగలిగేవాళ్ళు ఎంత శాతం? కోపంతో రగిలే జాన్ హృదయాన్ని ప్రేమతో ఒక్కసారి ఓదార్చాలనిపించింది. కాని కారణాలు యేవైనా ఒక పసిపాప విషయంలో అంత అమానుషంగా ప్రవర్తించిన అతనిని సమిపించడానికి కూడా అసహ్యమేసింది.
గుడిసేలోంచి బయటికి వెళ్ళబోయాడు సుబ్బయ్య. జాన్ అడ్డగించి "ఎక్కడికి?" అన్నాడు. సుబ్బయ్య అతడ్ని ఎడమ మోచేతితో పక్కకి నెట్టాడు. మడిచిన ఎడమ చెయ్యి జాన్ డొక్కలో గుచ్చుకుని క్రింద కూలబడ్డాడు, "అబ్బా!" అంటూ.
అతడి మొహంలోకి చూసి వెటకారంగా నవ్వి "గాళ్ ఫ్రెండ్ దగ్గిరికి నిన్ను పంపిస్తారు త్వరలో" కన్ను కొట్టి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. ఏంటి సెప్టిక్ స్కిన్ ఆయింట్ మెంట్ తెచ్చాడు. పాప పక్కన కూర్చుని దెబ్బలకి, ఆయింట్ మెంట్ పూసాడు. బాధకి కాస్త అటూ యిటూ కదిలింది కాని తెలివి రాలేదు రాగకి.
"డాక్టరు దగ్గరికి తీసికెళ్తే?......" సంకోచిస్తూ సపోర్టు కోసం సుబ్బయ్య కేసి చూస్తూ అడిగింది యమ్మాయమ్మ.
"మక్కిలిరగదంతాను. ఇది చచ్చినా, బతికినా , దీన్నిక్కనుంచి బయటికి కదపటానికి యీల్లేదు" క్రూరంగా అన్నాడు జాన్.
సుబ్బయ్య పాప ఒంటిమీద దెబ్బలని ఒకసారి పరిశీలనగా చూసి మాట్లాడకుండా వూరుకున్నాడు. "అంత ప్రమాదం లేదన్నమాట" మనసులో అనుకుంది యమ్మాయమ్మ పైకి గాయం కనబడకుండా కుదుములు కట్టిన చోట వేడి వేడి నీళ్ళతో కాపడం పెట్టింది. పాప కాస్త అటూ ఇటూ కదిలింది. కానీ కళ్ళు తెరవలేదు. ఏమి మట్లాడలేదు. ఒకరాత్రి వేళ పాప అస్పష్టంగా ఏదో మాట్లాడడం వినిపించి లేచి కూచుంది యమ్మాయమ్మ ముందుకు వొంగి, ఏం కావాలమ్మా?" అడిగింది.