ఫౌండేషన్ మాత్రం పూర్తి అయిన ఒక ఇంటిముందు ఆగి దాని ప్లాన్ ఏమిటో కనిపెట్టాలని ప్రయత్నిస్తూండగా కనబడ్డాడు ఆసెయ్య. సన్నగా వున్నా దృఢంగా కనబడుతున్నాడు. ముతక బట్టలు......నిష్కపటంగా వున్నచూపులు.....ఏదో పల్లెనుండి కొత్తగా సిటీకి వచ్చాడనీ, సిటీ వాసనలు ఇంకా పూర్తిగా పట్టలేదని అర్ధమైపోతోంది.
"ఎవరిదయ్యా ఇల్లు?" అన్నాడు బాలు.
"మైసూర్ రెడ్డిది దొరా! దొర బేస్ మెంట్ తోనే ఆపుజేస్తా" అంటున్నాడు. "ఇక నాకు గీడ కొలువు దొరకునా - అనీ పరేశాన్ లో వున్న లేకుంటే మళ్ళీ మళ్ళీ మా కరీంనగరం పోబడతది" ప్రపంచంలోని దిగుళ్ళన్నీ తననే ఆవరించినట్లు చెప్పాడతను.
"ఏం పని చేస్తావు నువ్వు?"
"ఈడ వాచ్ మెన్ ని దొరా!"
బాలు యింకా ఎక్కువ ఆలోచించలేదు. "మా ఇంట్లో పనిచేస్తావా" అని అడిగాడు. ఆసెయ్య మొహం వికసించింది. ఆనందంగా తల వూపాడు.
మరుసటిరోజు డ్యూటీలో చేరాడు ఆసెయ్య.
ఆసెయ్యలాంటి నౌఖరు బాలూకి దొరికినందుకు ఈర్ష్య పడని వాళ్ళు లేరు. ఒక ఫ్రెండు ఆ సంగతే ఫోన్ చేసి చెప్పాడు సరదాగా. "అలాంటి నమ్మినబంటుని నాకూ ఒక్కణ్ణి చూసిపెట్టవోయ్! ఇవాళ ఎరక్కపోయి మీ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు. నువ్వొచ్చేదాకా వెయిట్ చేద్దామని వరండాలో కూర్చున్నాను. ఇహ జూస్కో! నన్ను శల్యపరీక్ష చెయ్యటం మొదలుపెట్టాడు. దొంగని కదలనివ్వకుండా కాపలా వున్న అల్సేషియన్ కుక్కలాగా ఫెరోషియన్ గా నన్ను చూడ్డం మొదలుపెట్టాడోయ్! మా చెల్లెలు వచ్చి నన్ను రిసీవ్ చేసేలోపల నేను ఒక్క అడుగు వేసినా, కదిలినా, మెదిలినా అతను నన్ను కండలు కండలుగా పీకేసి వుండేవాడనుకుంటున్నాను."
నవ్వి ఫోన్ పెట్టేశాడు బాలు.
ఫోన్ వెంటనే రింగయింది మళ్ళీ.
"హలో!" అన్నాడు.
అవతలివైపు ఒక్కక్షణం మౌనం. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయిపోయింది ఫోన్.
అవతలివాళ్ళు మళ్ళీ రింగ్ చేస్తారేమోనని కాసేపు వెయిట్ చేశాడు బాలు.
మళ్ళీ కాల్ రాలేదు.
ఇంక ఆ సంగతి పెద్దగా పట్టించుకోలేదు అతను.
అన్నీ బాగానే వున్నాయి. కానీ ఆసెయ్యతో వచ్చిన చిక్కల్లా అతని కల్తీలేని గ్రామీణభాష, నాగరీకులు అశ్లీలాలనుకునే కొన్ని పదాలు అతనికి నిత్య వ్యవహారికం.
సౌదామిని మెల్లిగా ఒకరోజు "అసెయ్యని మనం తీసేస్తే బెటరు" అంది బాలూతో.
"అదేమిటి?" అన్నాడు బాలూ - ఆశ్చర్యంగా.
"అతని వెధవభాష అంతా మన బాబుకి అంటుకుంటోంది"
"ఏమయిందేం?"
"వాడి రైలు బొమ్మని ఆ తెల్ల బంగళా కుర్రాడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయాడు అన్న విషయాన్ని వీడు.... ఎలా చెప్పాడో తెలుసునా! అంతా అసెయ్య ఇన్ ఫ్లూయెన్సు" అంది 'పదం' చెప్పలేక -
విని, విరగబడి కళ్ళంబడి నీళ్ళొచ్చేదాకా నవ్వాడు బాలు. సీరియస్ గా చూసింది. "నాకు అతన్ని ఇంట్లో వుంచుకోవటం ఇష్టంలేదు" అంది ఖచ్చితంగా.
బాలూ నవ్వాపుకుని "గోరంత విషయాన్ని కొండంతలు చేసుకుని బాధపడటం అనవసరం సౌదామినీ! అసెయ్యకు నేను చెబుతాలే" అన్నాడు.
ఆమె అయిష్టంగా మొహం పెట్టింది. టైమ్ చూసుకున్నాడు బాలు.
"అరె, మాటల్లోపడి మర్చేపోయాను. కొంతమంది ఆర్గరైజర్సు వచ్చి హోటల్ బంజారాలో దిగారు, కలకత్తాలో మన ప్రోగ్రామ్ ఏర్పాటు చెయ్యటానికి వాళ్ళతో డిన్నర్ తీసుకుంటూ డిటెయిల్స్ డిస్కస్ చెయ్యాలి. వెళ్ళిరానా" అని అడిగాడు.
"కలకత్తా ప్రోగ్రామా!" అంది సౌదామిని నుదురు చిట్లిస్తూ-"ఎప్పుడూ?"
ఇబ్బందిగా మొహం పెట్టి కాసేపు ఆలోచించింది ఆమె.
"చాలా రెస్ట్ లెస్ గా గడిపాం ఇన్నాళ్ళూ ఇంకో రెండు వారాలపాటు వూరు వదలకుండా విశ్రాంతిగా వుండాలని వుంది నాకు" అంది.
చిత్రంగా ఆమె వైపు చూశాడు బాలు.
ఎప్పుడూ "వర్క్ ఫస్ట్- రెస్ట్ నెస్ట్" అని తనను ఉరుకులు పరుగులు పెట్టించే సౌదామినేనా ఇవాళ యిలా మాట్లాడుతుంది?
అంటే యిన్నాళ్ళూ సహనంగా, బయట పడకుండా శ్రమని భరిస్తోందన్న మాట.
అతనికి ఆమెమీద చెప్పలేనంత జాలీ, అభిమానం ముంచుకువచ్చాయి.
"నువ్వన్నది కరక్టే సౌదామినీ! మర మనుషుల్లాగా అయిపోతున్నాం మనం. వీ నీడ్ హాలిడే! చెప్పు! నీ ఇష్టం ఎక్కడి కంటే అక్కడికి వెళదాం! సిమ్లా వెళదామా? కులూ? కోవలం? రెండు వారాలు కేవలం తిని పడుకోవటమే చెప్పు."
మెల్లిగా నవ్వింది - సౌదామిని.
"అవేమీ వద్దు, ఇల్లు కదలకుండా కొన్నాళ్ళు వుందాం. హైద్రాబాద్ ఎంగేజ్ మెంట్స్ మాత్రమే ఒప్పుకుందాం. సరేనా?"
తల పంకించాడు. అతను ఒప్పుకోగానే ఒక్కసారిగా రిలీఫ్ కనబడింది సౌదామిని మొహంలో. "థాంక్యూ! యూ ఆర్ సచ్ ఏ డియర్" అంది అతనికి దగ్గరగా జరుగుతూ.
* * *
కొత్త యింటికి వచ్చాక దినచర్య కొద్దిగా మారింది బాలూకి. అతను యిప్పుడు ప్రతిరోజూ నాలుగింటికల్లా నిద్ర లేచేస్తున్నాడు. బ్రష్షుమీద పేస్టు వేసుకుని డాబామీద కెళ్ళిపోతాడు. చీకటి మెల్లిగా తరుగుతూ వుంటుంది. ఆ సమయానికి ఎదురింటిలో నుండి పారిజాతపు పూలవాసన మేడెక్కి వచ్చి అతని నాసికా పుటాలకు చేరుతుంది. ముసలాయనగారి పడుచు భార్య భక్తి గీతాలు నెమ్మదిగా గానం చేసుకుంటూ పనులు చేసుకుంటూ వుంటుంది. నాగరికత తాలూకు రొద యింకా మొదలవదు, ఆ సమయానికి.
చాలా ఆహ్లాదకరంగా వుంటుంది వాతావరణం.
కానీ ఇంకెన్నాళ్ళు! అనుకున్నాడు బాలు. సిటీ కేన్సరులా అదుపు లేకుండా పెరిగిపోతూ, ఇదీ ఒక బిజీ లొకాలిటీ అయిపోయాక ఇంత నిర్మలంగా ఉండదు. అప్పుడింక రాత్రికీ పగలుకీ తేడా వుండదు. నిర్విరామంగా రొద.... రొద.....రొద.
అతని ఆలోచనలకి అడ్డుకట్టవేస్తూ ఎదురింటి జానకి పాట వినబడింది.
అప్రయత్నంగానే చెవులు రిక్కించి విన్నాడు బాలు.
ఏం పాట అది?
అసమర్దుడైన పోస్ట్ మాన్ ఉత్తరాలు కొన్ని సరిగా బట్వాడా చేసి కొన్ని చెయ్యనట్లు, ఆ పాటలోని పదాలను కొన్నిటిని మాత్రమే చేరవెయ్యగలుగుతోంది గాలి.
"......పించెపుజల కల....
.......................
.......................
మురిపెపు గరముల మొక్కిరి నీకు"
ముఖారి రాగం! ఏమిటా పాట! నోట్లో ఆడుతుంది గానీ సరిగా గుర్తురావడం లేదు.
తీవ్రంగా ఆలోచించాడు బాలూ.
చటుక్కున స్ఫురించింది అన్నమయ్య కీర్తన అది.
"కొలనిలోన మునుగోపికలు
మొలక నవ్వులతో మొక్కిరి నీకూ" యస్! దటీజ్ యిట్!
ఇప్పుడింక ఆమె పాడుతున్న పాతలోనో ప్రతి పదమూ స్పష్టంగా వినబడుతున్నట్లు అనిపించింది అతనికి. అప్రయత్నంగానే తనుకూడా పెదిమలు కదల్చసాగాడు మెల్లిగా.
"పిరుదులు దాటిన పించెపుటలకల
తురుములు వీడగ దొయ్యలులు
అరిది నితంబములందునె దాచుక
మురిపెపు గరముల మొక్కిరి నీకు
నిద్దపు మానము నెలతల లోగుచు
గద్దరి తొడలనె కట్టుచును
ముద్దుటుంగరంబుల కరములలో
ముద్దులు గునియాను మొక్కిరి నీకు.
పాలింట్ల పెను భారంపొల కర
మూలపు మెక్షగులు ముంచగను
వెలవు బ్రియముల వెంకటేశ నిను
మూలకు బిలుచుచు మొక్కిరి నీకు"
ఆమెకి..... ఆమె పేరేమిటి.. జానకి... యస్..... జానకికి కొద్దో గొప్పో సంగీతం వచ్చి వుండాలి.
చాలా చక్కగా పాడుతోంది.
అంతలోనే అతనికి నవ్వొచ్చింది.
ఉధృతమైన భక్తి పారవశ్యాన్ని కూడా యెంత శృంగారమయంగా గానం చేశాడు అన్నమయ్య!
అతనికి యింకో ఆలోచన కూడా వచ్చింది.
ఆ పాటలని పాడుకునే ఈ సగటు సంసార స్త్రీలకు దానిలోని భావం అర్ధం అవుతుందా! లేక ఊరికే మూఢభక్తితో పాడుకోవడమేనా!
ఆ పదాల భావం అర్ధమైతే అంత నిస్సంకోచంగా.....పాడలేదేమో ఆమె.
మళ్ళీ యింకో పాట అందుకుంది జానకి.
అదీ అన్నమయ్య కీర్తనే. మంగళకౌశిక రాగం.
"క్షీ రాబ్ది కన్యకకు - శ్రీ మహాలక్ష్మికిని..."
ఈసారి పాట వినడంలేదు అతను. దానిలోని విడిపదాలే వింటున్నాడు.
"జక్కువ కుచంబులకు, ఆడిది జఘనంబునకు..... అతివ నిజనా ఎకిని..."
అంటూ ఎందుకో తలెత్తిన ఆమెకు ఎదురింటి పిట్టగోడ మీద బాలూ కనపడ్డాడు. అటే చూస్తున్న బాలూ దొరికిపోయాడు. చేతిలో పూలసజ్జ వదిలేసి ఆమె రివ్వున పరుగెత్తింది.
* * *
మరుసటిరోజు ప్రొద్దున్న వాహ్యాళికి వెళుతూంటే ఆ ముసలాయన ఇంటిముందు నిల్చుని వున్నాడు. ఆయననే పలుకరించాడు. తనని తానే పరిచయం చేసుకుని "మీ పేరు "బాలూ" కదూ పేపర్లో మీ ఫోటో అప్పుడప్పుడు చూస్తూ వుంటాను. నాకు పాటలంటే అంత ఉత్సాహం లేదు. మా ఆవిడ మాత్రం చెవికోసుకుంటూ వుంటుంది.....రండి" అంటూ లోపలికి ఆహ్వానించాడు.
చిన్న ఇల్లు పొందిగ్గా వుంది. అగరొత్తుల పరిమళం హాలులోకి కూడా వ్యాపిస్తూంది. తమ ఇంట్లో ఎప్పుడూ రికార్డ్ ప్లేయరో, టేప్ రికార్దరో మ్రోగుతూ వుంటుంది. దానికి వ్యతిరేకంగా ఈ ఇల్లు నిశ్శబ్దంగా వుంది.
"ఇదిగో జానకీ -" గట్టిగా అరిచాడు. చెవిటివాళ్ళు మామూలు కన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడతారేమో అనుకున్నాడు బాలు. ఆమె హాల్లోకి రావటానికికాస్త తటపటాయించినట్టు వంటింట్లోంచి గాజులశబ్దం వినిపించింది. రెండోసారి పిలిచినప్పుడు ఆమె వచ్చింది. చేతులు జోడించి అతడికి నమస్కారం చేసింది.