Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 25

    ఆలోచిస్తూ నిలబడిపోయిన శకుంతల దగ్గరకు శామీ వచ్చింది. "అమ్మాయిగారూ! చీకటి పడిపోయింది. అమ్మమ్మగారు రమ్మంటున్నారు అని చెప్పింది? అప్పుడు గమనించింది. జీప్ తమకు సమీపంలోనే ఉన్నట్లు జీప్ డ్రైవర్ తనను జీప్ లో రమ్మని అడిగే సాహసం కూడా లేక, తన రాకకోసం ఎదురుచూస్తూ వినయంగా నిలబడ్డాడు. శర్మకూడా "రా బేబీ! ఎప్పుడూ అమ్మమ్మగారి మాట కాదనకు, యీ లోకంలో ఆవిడకంటే నిన్ను అభిమానించే వాళ్ళులేరు." అన్నాడు.    
    "మీకంటేనా?" అంది శకుంతల శర్మ నవ్వాడు.    
    "డాడీ! నిజం చెప్పండీ, నా కంటే మీరు అభిమానించే వాళ్ళు ఉన్నారా?"    
    "ఉన్నారు"    
    "ఉన్నారా! ఎవరు?"    
    "మీ అమ్మ"    
    "డాడీ"    
    బాధగా తండ్రి భుజంమీద తలవాల్చింది,    
    "టేకిట్ ఈజీ బేబీ! ఇకమీదట నువ్వు ఫ్యాక్టరీకి రాకు, ఈ పరిస్థితులు నువ్వు భరించలేవు"    
    "డాడీ"    
    "చెప్పు"    
    "ఇంత చిన్నపిల్లలను కూలీలుగా పెట్టుకోవచ్చునా?"    
    "కూడదు?"    
    "మరి?"    
    "ఇది పైవేట్ మేనేజ్ మెంట్ చట్టాలు ఒప్పుకోనివి ఎన్నో జరుగుతూనే వుంటాయి. అధీగాక ఇదీ మరీమారుమూల ప్రాంతం ఇక్కడిప్రజలుఇంకా నాగరికత అలవరచుకొని అమాయకులు."    
    "ఇదిలా సాగటానికి వీల్లేదు డాడీ! మనం ఈ పరిస్తితులు చక్కదిద్దాలి."    
    "ఇందులో చాలా చిక్కులెదురావుతాయి బేబీ"    
    "మనం ఫైట్ చేద్దాం"    
    "ఎవరితో? ఈ ఫ్యాక్టరీలు మనవి, అంటే నీవి. ఇప్పుడు జరుగుతున్నదంతా నీ పేరుమీదుగానే జరుగుతోంది."    
    "ఓ గాడ్"    
    "బేబీ! నువ్వు ఇవన్నీ మరిచిపో, ఇలాంటి విషయాలు అసలు ఆలోచించకు! మీ అమ్మమ్మ నీకొక మంచి సంబంధం చూస్తుంది పెళ్ళి చేసుకుని హాయిగా బ్రతుకు."    
    "నో"    
    "ఎస్. నువ్వు రాజునీ మరచిపోవలసిందే! బి హేపీ"    
    శకుంతల మాట్లాడలేదు, బిగించిన పెదవులతో కన్నీళ్ళను వెనక్కు నెట్టడానికి వ్యర్ధ ప్రయత్నంచేసింది.
    
                                                               17
    
    రెండు మోకాళ్ళపైనా, చేతులాన్చి, ఆ చేతులలో ముఖం పెట్టుకుని దిగాలుగా కూచుంది శకుంతల.    
    "అమ్మా? శకూ!" లాలనగా పిలిచింది రాజవల్లి. శకుంతల తల ఎత్తలేదు. సమాధానం చెప్పలేదు.    
    "శకూ! నువ్వలా దిగాలుగా వుంటే నేను భరించలేనమ్మా? ఈ చివరి రోజులలో నేను కోరేది నీ ఆనందం ఒక్కటే. నేను ఏంచేయాలో చెప్పు?"    
    అప్పుడు తల ఎత్తింది శకుంతల.    
    "అమ్మమ్మా! మనఫ్యాక్టరీలో అంతంత చిన్నపిల్లలు పనిచెయ్యటం నేను చూడలేను. చదువుకొని వృద్దిలోకి రావలసిన పిల్లలు అలా అణగారి పోవటం నాకెలాగో ఉంది."    
    తెల్లబోయింది రాజవల్లి. శకుంతల బాధపడుతున్నఃది. కూలీల గురించా? ఆ విషయం ఎప్పుడూ ఆవిడ ఆలోచనలలోకే రాదు.    
    "ఫ్యాక్టరీ విషయాలు నేను కల్పించుకోనమ్మా! అన్నీ మన మేనేజర్ చూసుకొంటాడు. అతడ్ని పిలిపించి మాట్లాడదాము" అంది.    
    ఆ మధ్యాహ్నమే మేనేజరుని పిలిపించింది. అప్పుడు రమేష్ శర్మ కూడా వున్నారు. మేనేజరు పేరు రాబర్ట్. ఆంగ్లో ఇండియన్ తెలుగు బాగానే వచ్చుగాని, ఇంగ్లీషు మాటలు కలిపిగాని మాట్లాడడు. శకుంతలకు ఫ్యాక్టరీలలో చిన్న పిల్లలు పనిచెయ్యటం ఇష్టంలేదని చెప్పింది రాజవల్లి.    
    "అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు రన్ చెయ్యటం ఇంపాజిబుల్. యిక్కడ మగవాళ్ళు కూలీకి రారు. వచ్చినా వాళ్ళతో అన్నీ తగవులే! తెలియదు-చెప్పితే అర్ధంకాదు. చంపటానికీ చావటానికీ కూడా రెడీగా వుంటారు. దెక్రియేట్ ప్రోబ్లమ్స్ చైల్డు లేబరు మనకు చాలాకన్వీయెన్టు. తక్కువ పే చెయ్యొచ్చు. ఎక్కువ వర్క్ యెక్స్ ట్రేట్ చేసుకోవచ్చు."
    
    హుషారుగా చెప్పుతున్న రాబర్ట్ కి అడ్డు తగిలింది శకుంతల.    
    "మన కన్వీనియెన్స్ మాట వదిలెయ్యండి వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి"    
    "వాళ్ళ జీవితాలూ?......ఎస్! ఏమైంది వాళ్ళ జీవితాలకి? మన ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు గనుక డబ్బులయినా వస్తున్నాయి. లేకపోతే వీధులంట తిరుగుతూ ఉంటారు__అల్లరి చిల్లరగా."    
    "చదువుకుని వృద్దిలోకి రావలసిన వాళ్ళు__"శకుంతల ఆమాట అనగానే అదేదో పెద్దజోక్ అయినట్లు విరగబడి నవ్వాడు రాబర్ట్.    
    "చదువుకుని - అహ్హహ్హ.....వాళ్ళు చదువుకుని.....ఓహ్ హ్...."    
    అతడు నవ్వు ఆపెవరకూ కోపంగా చూస్తూ మాట్లాడక కూచుంది శకుంతల. శకుంతల కోపం చూసి అతడు నవ్వు ఆపాడు. వెటకారంగా చెప్పసాగాడు.    
    "మన ఘనత వహించిన ప్రభుత్వం వారు యిక్కడ ఒక బడి కట్టారు. కానీ పంతులు లేడు. కుర్చీలు లేవు; బల్లలు లేవు, బ్లాక్ బోర్డులేదు పిల్లలూ లేరు. అవన్నీ ఎక్కడయినా కాగితాలమీద వున్నాయేమో నాకయితే తెలియదు. మనం ఈ ఫారెస్టు ఏరియాకి వెళ్ళి చదువులుచెప్పలేము. ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి రాలేరు. ఈ కొండజాతి వాళ్ళు ఎవ్వరినీ నమ్మరు. ఎవ్వరినీ దరిదాపులకు రానీయరు. ప్రతీవాడి దగ్గర రహస్యంగా పదునైన కత్తి వుంటుంది. అందరూ విల్లు ఎక్కుపెట్టి గురిచూసి బాగా వెయ్యగలరు. ఎంత అమాయకంగా కనిపిస్తారో అంత క్రూరంగా వుండగలరు. వీళ్ళకు చదువా? ఎవరు చెప్తారు."    
    కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

 Previous Page Next Page