దమయంతి మాత్రం దీనికి అభ్యంతరం చెప్పింది. "నేనెలాగూ లేస్తాగా బాబూ, నువ్వెందుకు?" అంది.
"నా కలవాటేనండి. మా ఊర్లో అయితే ఇంతకన్నా ప్రొద్దున్నే లేచేవాళ్ళం."
ఆమె మరి రెట్టించలేదు. నిజానికి ఆమె రాత్రి పడుకునేసరికి పదకొండు దాటేది. అందరి భోజనాలు అయ్యేక తను తిని, అంట్లు కడిగి పడుకొనేసరికి అర్ధరాత్రి కావొచ్చేది. మళ్ళీ ప్రొద్దున్నే నాలుగింటికీ లేవాలంటే నరకం కనపడేది. సోమయాజి వచ్చి ఆ విధంగా ఆమెను రక్షించాడు. మొదట్లో ఆమెకూడా అతడితోపాటే లేచేది. తరువాత క్రమక్రమంగా మానుకుంది. ఆమె కష్టం తెలిసిన సోమయాజి ఆమెను దానికి బలవంతంగా వప్పించాడు.
స్నానాలయ్యాక అతడు సైకిలుమీద చిన్నక్క కొడుకుని వెనకాల, కూతుర్ని ముందూ ఎక్కించుకుని బడివద్ద దింపేవాడు. అక్కడనుంచి కూరగాయలు కొని తీసుకొచ్చేవాడు.
అతడిమీద ఒక్కొక్క పనీ, అది చాలా మామూలుగా జరిగిపోయినట్టూ వచ్చిపడింది. అతడు దేన్నీ కాదనకుండా స్వీకరించాడు. అతడి కప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేది. అది చాలా కాలం నుంచీ వుంది. పల్లెలో ధన్వంతరి యిచ్చిన మందుతో తగ్గలేదు. నెలకో రెండు నెలలకో ఒకసారి వచ్చేది. ఒకటి రెండు గంటలు మనిషి విలవిల లాడిపోయేవాడు. తరువాత సర్దుకునేది.
ఈ ఊరు వచ్చాక, భోజన క్రమం మార్పు వల్ల ఈ మధ్య తరుచు వస్తోంది. చుట్టూ అందరూ గాఢనిద్రలో వుండేవారు. అతడు కడుపు పట్టుకొని మూలిగేవాడు. కంటినుంచి ధారాపాతంగా నీరు కారేది. మరీ బాధ ఎక్కువయితే ప్రక్కవారికి నిద్రాభంగం కాకుండా వుండటం కోసం పెరటి తలుపు తీసుకుని చీకట్లోకి వెళ్ళేవాడు. బిగ్గరగా రోదించేవాడు.
'తాతయ్యా! తాతయ్యా!' అని.
* * * *
అతడా ఊరు వచ్చిన పదిరోజులకు రంగారావు అతడిని తీసుకుని స్కూలుకి వెళ్ళాడు. ఆ రోజు జీతం కట్టి చేర్పించి, తనపని పూర్తయినట్టు సైకిలేసుకుని వెళ్ళిపోయాడు.
గుమాస్తా జీతం కట్టిన రసీదు సోమయాజికిస్తూ 'అదిగో! అలా తిన్నగా వెళ్ళు. ఆ చివరి గదే నీ తరగతి' అన్నాడు సోమయాజి బెదురుతూ చివరి గది దగ్గర ఆగాడు.
లోపల తెలుగు తరగతి జరుగుతూ వుంది.
పాఠం చెప్పేవాడు మాత్రం ఆంగ్ల ఉపన్యాసకుడిలా వున్నాడు. గుమ్మం దగ్గర నీడ పడటంతో అతడి వాక్ప్రవాహానికి ఆనకట్ట పడింది. తలతిప్పి సోమయాజిని చూసి, "మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు తీరికైందా మీకు తరగతికి రావటానికి" అన్నాడు వ్యంగ్యంగా.
"నే .... నే...."
"ఏమిటి న్నెన్నెన్నె" తరగతి ఘొల్లుమంది.
"నేను ఈ రోజే చ్చె.... చేరుతున్నాను."
"ఓహో! అయితే పుస్తకాలేవి?"
సోమయాజి ఖాళీ చేతులవైపు చూసుకున్నాడు. రెండు మూడ్రోజులలో కొందామని రంగారావు చెప్పాడు.
"సరే లోపలికి రా."
సోమయాజి చివర్న వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ పాఠం మొదలైంది.
తరగతి ముందు బెంచీల్లో చిన్నవాళ్ళు, బాగా చదివేవాళ్ళు కూర్చుంటారు. చదువుమీద అంత ఆసక్తి లేనివారు వెనక చేరతారు. సోమయాజి పక్కన కూర్చుని వున్నవాడు రమేష్. ఆ పాఠశాల ఫుట్ బాల్ జట్టుకి నాయకుడు. గళ్ళచొక్కా వేసుకుని రౌడీలా వున్నాడు. కేవలం ఫుట్ బాల్ జట్టుకే కాదు. అక్కడ కుర్రవాళ్ళందరికీ నాయకుడు అతడి పక్కన సోమయాజి తోడేలు పక్కన కుందేలులా వున్నాడు.
"ఏ ఊరు నుంచి వచ్చావ్ రా?"
పక్కనుంచి వచ్చిన ప్రశ్నకి ఉలిక్కిపడి మాస్టారు చెప్తున్న పాఠానికి అడ్డు రాకుండా సోమయాజి స్వరం తగ్గించి సమాధానం యిచ్చాడు.
"పేరు?"
"సోమయాజి."
కిసుక్కున నవ్వాడు రమేష్. అందరూ ఒక్కసారిగా వెనుదిరిగి చూశారు. మాస్టారు చెప్తున్న పాఠం ఆపుచేసి "ఎవరదీ" అన్నారు.
ఎవరూ మాట్లాడలేదు.
"రమేష్!"
రమేష్ నిలబడి క్షణం కూడా తడుముకోకుండా "ఇతనేనండి" అన్నాడు. ఊహించని ఈ పరిణామానికి సోమయాజి బిక్కచచ్చిపోయి, తనూ లేచి నిలబడి "నేను కాదండి" అన్నాడు.
ఆయన ఇద్దరివైపు అనుమానంగా చూశాడు. సోమయాజి ధైర్యం తెచ్చుకుని "ఇతను నా పేరు అడిగాడండి. సోమయాజి అని చెప్పాను. అందుకు గట్టిగా నవ్వాడు" అన్నాడు.
"సరే కూర్చో."
ఇద్దరూ కూర్చోబోయారు.
"నువ్వు కాదు రమేష్. ఈ క్లాసు అయ్యేవరకూ అలాగే లేచి నిలబడి వుండు."
రమేష్ లేస్తూ సోమయాజివైపు చూశాడు. కలుగులో దూరిన ఎలుక వైపు బయటకి రాకపోతావా అన్నట్టు చూసిన పిల్లి చూపులా వుంది అది.
ఆ విధంగా అతడు మొదటిరోజే అక్కడ పెద్దవాళ్ళుగా పేరు మోసినవాళ్ళకీ, ఫుట్ బాల్ జట్టు నాయకుడికీ శత్రువు అయ్యాడు.
అతడి దురదృష్టం అక్కడితో ఆగలేదు.
ఆ తరువాత క్లాసు లెక్కల మాస్టారిది. ఆయనే క్లాసు టీచర్ కూడా.
ఆయన క్లాసుకొస్తే లెక్కలు తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడతాడు. అందులో సగం తన గురించి వుంటుంది. మిగతా సగం తన వంశం గురించి వుంటుంది. ఆ రోజు కూడా అదే విధంగా జరిగింది.
తన తాతగారు ఆసువుగా ఎలా కవిత్వం చెప్పేవారో వర్ణిస్తున్నాడు ఆయన. ఆయన చెప్పే దానిమీద ఉత్సాహం లేకపోయినా, క్లాసు టీచరు కాబట్టి నిశ్శబ్దంగా వింటున్నారు పిల్లలు.
"ఒకరోజు జమీందారుగారు మా తాతగార్ని అప్పటికప్పుడు పద్యం చెప్పమన్నారట! ఆయన మామూలు పద్యం కాకుండా పదహారు పాదాలున్న పద్యం చదివారుట. దాంతో జమీందారు దాదాపు మూర్చబోయాడు. తెలుగులో ఇప్పటికీ - ఎప్పటికీ అదే పెద్ద పద్యం. మా వంశమే అటువంటిది."
సోమయాజి ఇబ్బందిగా కదిలేడు. అది ఆయన దృష్టిలో పడ్డది.
ఈ లోపులో క్రిందనుంచి రమేష్ తన కాలుసాచి వేళ్ళమధ్య వున్న సూదితో అతడి పాదాన్ని గట్టిగా నొక్కాడు. "స్..." అన్నాడు సోమయాజి బాధగా.
లెక్కల మాస్టారు తన తాతగారి ఔన్నత్య ప్రసంగం ఆపి, "లే....." అన్నాడు. సోమయాజి లేచి నిలబడ్డాడు.
"ఇందాకటినుంచీ చూస్తున్నాను. ఎందుకు అలా మెలికలు తిరుగుతున్నావ్? క్రిందేమైనా నల్లులు కుడుతున్నాయా?"
పిల్లలు నవ్వేరు.
"ఏం, చెప్పవేం?"
సోమయాజి రమేష్ వైపు చూసేడు. అతడు ముసిముసిగా నవ్వుతున్నాడు చెప్తే జాగ్రత్త అన్నట్టు.
"బెంచీ ఎక్కు"
"ఆ.....ఆ.... అది కాదండీ."
"మరేమిటండీ" వెక్కిరిస్తున్నట్టూ అన్నాడు మాస్టారు.
"తె.....తె..... తెలుగున పదహారు పాదాలున్నదే పెద్ద పద్యం కాదండీ! అంతకన్నా పెద్దది నా ఎరుకలో ఒకటున్నది. అ......అ.....అల్లసాని పెద్దన సంస్క్రుతాణ పదునాలుగు, అచ్చ తెలుగునా పదునాలుగు పాదాలతో ఒక ఉత్పలమాలిక నాసువుగా చ.....చ.....చదివి గండపెండేరానికి అర్హుడయ్యాడు. మీ తాతగారి పద్యంకన్నా అదే పెద్దది."
మాస్టారు దెబ్బతిని, వెంటనే సర్దుకుంటూ "నీ మొహం నీకు తెలీదు కూర్చో" అన్నాడు దబాయిస్తున్నట్టు.
"అవును మాస్టారూ" అన్నాడు సోమయాజి.
"పెద్ద తెలిసినవాడిలా మాట్లాడకు."
"న్నా....న్నాకు తెలుసండీ."
క్లాసులో పిల్లలముందు అతడి నెలాగైనా ఓడించాలని "ఓరి నత్తి వెధవా - తెలిస్తే చెప్పు చూద్దాం" అన్నాడు.
సోమయాజి చేతులు కట్టుకుని గబగబా చెప్పాడు.
"పూత మెరుంగులుం బసరుపూపబెడంగులు చూపునట్టివా.....వా.....
కైతలు జగ్గునిగ్గు నెనగావాలె - గమ్మున గమ్మునన్ వలెన్
..... అచ్చ తెన్గు లీ రీతిగ ..... సం..... సం......
సంస్కృతంబు పచరించిన పట్టున భారతీ వధూ
టీ తపనీయగ గర్భనికటీ .....
.............
పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుమఘుమార్భటో
.....మృదంగాతత దేహిత త్తహిత హాధితదంధుణుధాణు-ధింధిం-ధింధిమీ....మధుద్రవ గోఘృతపాయస పసా.
రాతిరస ప్రసార రుచిర ప్రతిమంబుగ సారెసారెకున్."