Previous Page Next Page 
రెండోమనసు పేజి 24


    "మీ పనులన్నీ అయాక చెప్పండి! నేనలా నడుం వాలుస్తాను" అంటూ హల్లో సోఫాలోనే పడుకున్నాడతను.
    సావిత్రి స్నానం ముగించి కాఫీ తయారు చేసి అతనికివ్వడానికి వచ్చింది. గాడంగా నిద్రపోతున్నాడతను.
    "శ్రీకాంత్ గారూ!" దగ్గరకు వెళ్లి పిలిచింది.
    ఆ పిలుపు అతనికే మాత్రం చలనం కలిగించలేదు! కప్పు టేబుల్ మీదుంచి అతని చేతిని తట్టి లేపబోయింది. అతని చెయి తగులుతూనే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వేడిగా వుందతని శరీరం. చాలా ఎక్కువ జ్వరమే ఉండుండాలి. ఏం చేయడానికి తోచలేదు సావిత్రికి. ఇంత జ్వరంతో ఉండి కూడా ఈ మనిషి తనని తీసుకెళ్ళడానికి ఉదయమే లేచి వచ్చారా? రాకపోతే ఏం పోయింది? తనోక్కర్తే ఏ రిక్షాలోనో వెళ్ళి వచ్చేది కదా.....?


                                                            * * *

    "ఏమండీ!" అతన్ని కదుపుతూ లేపింది సావిత్రి.
    నెమ్మదిగా కళ్ళు తెరచి సావిత్రిని చూసి త్వరగా లేచి కూర్చున్నాడు శ్రీకాంత్.
    "మీ వళ్ళు వేడిగా వుందేం! బాగా జ్వరం వచ్చినట్లుంది ......." ఆందోళనగా అందామె.
    "అవును, కొంచెం వేడిగా వుంది. ఫర్వాలేదు లెండి. నాలుగు టాబ్ లెట్లు వేసుకొంటే అదే తగ్గిపోతుంది......"
    "ఇలా నిర్లక్ష్యం చేయకండి! ఇప్పుడు మీరిక ఇంట్లో నుంచి కదలడం కూడా మంచిది కాదు! అటునుంచి హాస్పిటల్ కి వెళ్ళి మధ్యాహ్నానికి కోస్తాను! మీరు అంతవరకూ విశ్రాంతి తీసుకోండి!"
    "భలేవారే! కొంచెం జ్వరానికి అంత హడావుడి చేస్తారేం! పదండి. మళ్ళీ చలపతి ఎదురు చూస్తుంటాడు మీ కోసం!! కారులో అయితే త్వరగా వెళ్ళగలరు........."
    "ముందు మీరు కాఫీ తీసుకోండి" అందామె.
    అతనికి ఆశ్చర్యం , నవ్వూ రెండూ వచ్చినాయ్. నిన్నటివరకూ తనంటే అదో విధమైన అయిష్టాన్ని పెంచుకుంది సావిత్రి.
    చలపతి క్షేమంగా ఉంటాడన్న నమ్మకం కలగగానే అదివరకటి మాములు మనిషయిపోయింది! ఇప్పుడు తనని మళ్ళీ అడివరకటి అభిమానంతో చూడటం మొదలు పెట్టింది. బహుశా అంతకంటే ఎక్కువగా కూడా చూసుకొంటుందేమో!
    కాఫీ తాగి ఆమెతో పాటు బయటకు నడిచాడతను. కారు గుడి దగ్గర ఆపి "మీరు వెళ్ళిరండి" అన్నాడు తనక్కడే కూర్చుని.
    "మీరు కూడా రాకూడదు! అయన క్షేమంగా వుండాలని ఈ గుడికి తీసుకొచ్చే దేముడిని కోరుకున్నాను. మీరు వస్తే మీ జ్వరం కూడా తగ్గిపోతుంది......."
    శ్రీకాంత్ చలించిపోయాడు. చలపతి క్షేమం కోరినట్లే తన క్షేమం కూడా కోరుతొందన్న మాట! అంటే చలపతి మీదున్న అభిమానం తనమీద కూడా వుంది!
    ఆమె వెనుకే గుళ్ళోకి నడిచాడతను.
    "ఇలా నుంచోండి" తన పక్కనే స్థలం చూపుతూ అందామె. ఆమె పక్కనే నిలబడ్డాడు శ్రీకాంత్.
    "మీరూ దణ్ణం పెట్టుకోండి!" అంది చిరునవ్వుతో చేతులు జోడించాడు శ్రీకాంత్.
    సావిత్రి కళ్ళు మూసుకుంది. అయిదు నిముషాల వరకూ అలాగే ద్యానంలో ఉండిపోయాడు. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఓ వింత వెలుగు కనిపించింది శ్రీకాంత్ కి.
    "పదండి వెళదాం......." కళ్ళు తెరుస్తూ అందామె.
    ఇద్దరూ బయటకొచ్చి కార్లో కూర్చున్నారు. హాస్పిటల్ చేరుకొనేసరికి చలపతి ఇంకా నిద్ర లేవలేదు.
    "మీరు డాక్టర్ దగ్గరకెళ్ళి మందులేమయినా తీసుకొని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి" అంది సావిత్రి శ్రీకాంత్ తో.
    "వాడిని లేవనీయండి, ఓసారి మాట్లాడి వెళతాను......" నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్.
    కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు చలపతి.
    "ఎలా వుంది.....బాధగా ఉందా?" అడిగాడు శ్రీకాంత్ ఆదుర్దాగా.
    "కొంచెం!"
    సావిత్రి చేతిని తన చేతుల్లోకి తీసుకొని నిమిరాడు చలపతి. కొద్దిసేపు నెమ్మదిగా మాట్లాడతను.
    శ్రీకాంత్ చలపతితో మాట్లాడుతూ కూర్చోడం చూసి సావిత్రి వారించిందతన్ని" మీరు జ్వరంతో ఉంది ఎందుకిక్కడ? ఇంటికెళ్ళండి త్వరగా!" మందలింపుగా అంది.
    ప్రశ్నార్ధకంగా ఆమె ముఖంలోకి చూశాడు చలపతి.
    "ఆయనకు జ్వరం, మందూ మాకూ తీసుకోకుండా తిరుగుతున్నారు" అంది సావిత్రి అతనితో.
    "వెళుతున్నానండీ, మీతో చిక్కొచ్చి పడింది . పోతున్నారా! సాయంత్రం వస్తాను.... అంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
    మధ్యాహ్నం పదకొండింటికల్లా తనూ ఇల్లు చేరుకుంది సావిత్రి. శ్రీకాంత్ తనగదిలో రగ్గు కప్పుకొని పడుకొని వున్నాడు.
    "మందు తెచ్చుకొన్నారా?" ఆదుర్దాగా అడిగిందామె.
    "ఆ! లేకపోతే మీరూరు కొంటారా!......."టాబ్ లెట్లు చూపుతూ అన్నాడు.
    "భోజనం చేయవచ్చన్నాడా డాక్టర్?"
    "ఊ! హూ! బ్రెడ్ వేయించి తెస్తాను! తిని హార్లిక్స్ తాగి పడుకోండి! జ్వరం తగ్గేవరకూ మంచం వదలడానికి వీల్లేదిక........."అధికార స్వరంతో అందామె.
    "మీ రూల్స్ మరి కఠినంగా ఉన్నాయ్!" నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. సావిత్రి కూడా నవ్వేసిందతనితో పాటు.
    "లేకపోతె ఏమిటి? మా మూలానే కదా మీకీ కష్టాలు. మీ సంగతి మీరు పట్టించుకోకపోతే ఎలా?" వంటింటి వేపు వెళుతూ అందామె.
    అతను రొట్టె తినేవరకూ అతని దగ్గరే కూర్చుంది సావిత్రి. మరికాసేపట్లో రాజ్యలక్ష్మి వచ్చిందక్కడికి.
    "చలపతి దగ్గర కెళ్ళరు? అతను మీకోసం ఎదురు చూస్తుంటాడెమో!" అన్నాడు శ్రీకాంత్.
    "వెళతాను లెండి! నేను వెళ్ళిపోతే మీరు రొట్టె తినరూ, ఆ మందులూ వేసుకొనే వారు కాదు. అందుకే ఉన్నాను....."
    శ్రీకాంత్ నవ్వి ఊరుకున్నాడు.
    "ఇంక నేను వెళుతున్నాను" సాయంత్రం వస్తాను తిరిగి! అంతవరకూ మీరు మళ్ళీ బయటికెళ్ళకండి."
    "సరే.....ఇదిగో చూడండి" వెళ్ళిపోతున్న సావిత్రిని మళ్ళీ పిలిచాడు శ్రీకాంత్.
    "ఏమిటి?"
    "మీరు బస్సుల్లో వెళుతున్నట్లున్నారూ హాస్పిటల్ కి, ఇంటికి నూ. అలా చేయకండి చాలా టైమూ, శ్రమ తీసుకుంటుంది ఆ పనికి. టాక్సీలో గానీ, ఆటోలో గాని వెళ్ళి వస్తుండండీ. ఇలాంటి సమయాల్లో డబ్బు కంటే సమయం ముఖ్యం. ఒకవేళ మీ దగ్గరేమయినా డబ్బు తక్కువుంటే నా దగ్గర తీసుకోండి. ఆ బీరువా సోరగులో ఉంటుంది. తాళం చెవి బీరువా పైనే వుంటుంది! డబ్బు మీకేదో దానం చేస్తున్నానని సిగ్గుపడకండి! అంతా లెక్క చూసిం తరువాత చలపతి దగ్గర వసూలు చేసుకుంటాను......."
    "సరే........."నవ్వుతూ అని బయటకు నడిచిందామె.


                                                               * * *

    రోజులు గడిసిపోతున్నాయ్. సావిత్రి కనిపెట్టి వుండటంతో శ్రీకాంత్ నాలుగు రోజులకే లేచి తిరగసాగాడు.
    ఆరోజు చలపతిని డిశ్చార్జి చేశారు. కార్లో ఇద్దరినీ ఇంటివేపు బయలుదేరాడు శ్రీకాంత్.

 Previous Page Next Page