ఆహుతులందరి మధ్యా విరజపేరు పిలవగానే, గర్వంగా నడుచుకుంటూ వెళ్ళి బహుమతి అందుకుంది. ఆమె కళ్ళల్లో తృప్తి, సంతోషం.
అవిచాలు అభినయ్ కోపం ఇట్టే కరిగిపోడానికి.
* * *
"స్టేట్స్ కి వెళ్ళక తప్పదా?!" అభినయ్ బట్టలను సర్దుతూ అంది విరజ.
"సింగిల్ గా నేను వెళ్ళే లాస్ట్ ట్రిప్.... నెక్స్ట్ టైం మనిద్దరం వెళ్దాం. ఎగ్జాక్ట్ లీ సెప్టెంబర్ పదకొండున ఇక్కడుంటాను. అదేరోజు బిర్లామందిర్ లో మన పెళ్ళి... ఓ.కే.నా!"
"అంటే... సెప్టెంబర్ పదకొండు వరకూ నేను ఒంటరిగా ఉండాలా.....ప్చ్...." అంది నిట్టూరుస్తూ విరజ.
"పోనీ క్యాన్సిల్ చేసుకునేదా?" అడిగాడు అభినయ్.
"వద్దొద్దు నాకోసం బిజినెస్ లాస్ కాకూడదు వెళ్ళిరా. ఎలాగూ వెళ్తున్నావ్ గనుక అన్నీ చూసిరా..."
"మరి నువ్వు?"
"నువ్వు అన్నీ చూడాలి. నేను నిన్ను చూసుకుంటే చాలు... నీలోనే నాకు విశ్వ ప్రపంచం కనిపిస్తుంది. చిన్ని కృష్ణుడి నోట్లో బ్రహ్మాండం కనిపించినట్టు..." అంది విరజ.
"విరూ... నేనంటే నీకెందుకింత ప్రేమ... నువ్వెప్పుడూ నాకు మిస్టరీవే..."
"అవును!... నేనెప్పుడూ మిస్టరీనే" అంది విరజ అనాలోచితంగా.
ఆ మాట నిజమవుతుందని ఆ క్షణం తెలియదు వాళ్ళకు.
* * *
అభినయ్ కు అవసరమైనవన్నీ నీట్ గా సర్దింది.
ఏ ఒక్కటీ మిస్సవ్వలేదు. ప్యాంట్, షర్ట్.... కుర్తా... పైజామా.... ఏరోజు ఏ డ్రెస్ వేసుకోవాలో? ఎప్పుడు సూట్ వేసుకోవాలో డిటైల్డ్ గా ఓ స్లిప్ మీద రాసింది.
"విరూ.... ఎంత బాగా సర్ధావు" మెచ్చుకోలుగా అన్నాడు అభినయ్.
"నీకు సంబంధించిన ఏపనైనా సరే... చెయ్యడమంటే చాలా యిష్టం. అందులోనూ బట్టలు సర్దడం... ఎప్పుడూ నాకన్నా ముందే సర్దేస్తావ్.... నీక్కావల్సినవి సర్ధాలన్నా, నీక్కావలసినవి యివ్వాలన్నా నాకు చాలా యిష్టం" అంది విరజ.
"నిజం చెప్పు విరజా! నీకిష్టం లేకుంటే మానేస్తానంటున్నానుగా!"
"వద్దొద్దు.... సరదాగా అన్నానంతే..."
"పోనీ నువ్వూ రాకూడదు".
"ఇంత అర్జెంటుగా పాస్ పోర్ట్, వీసా ఎలా వస్తుంది. ఈసారికి నువ్వెళ్ళు...."
"అందుకే నా పాస్ పోర్టుకు అప్లయ్ చేసినప్పుడే నీదీ చేస్తానంటే వద్దన్నావ్".
"చేద్దాంలే... తొందరేంటి? సరేసరి... గానీ... ముందు బయటకువెళ్ళి షాపింగ్ చేసొద్దాం. పద" అంది విరజ హడావిడి చేస్తూ.
"ఎక్కడికి?" అనాసక్తిగా అడిగాడు అభినయ్...
"సెండఫ్ పార్టీ యివ్వడానికి"
"వారం రోజులు కూడా వెళ్ళటం లేదు. ఈ దానికే యింత హడావిడా?"
"వారం రోజులంటే నూట ఇరవై ఎనిమిది గంటలు.... అంటే పదివేల ఎనభై..."
"చాల్చాలు నీ లెక్కలు..." చెప్పబోతుంటే వారించాడు అభినయ్...
* * *
"విరూ టైం లేదు ఈ షాపింగ్ అదీ... ఎందుకు చెప్పు...." అభినయ్ అన్నాడు.
"తర్వాత నువ్వె బాధపడతావ్.... అయినా స్టేట్స్ కు వెళ్ళేవాడివి కొత్త లుంగీలు, కొత్త నైట్ డ్రెస్ లు, ఆఖరికి కొత్త అండర్ వేర్ లూ తీసుకెళ్ళాలి" అంది.
అభినయ్ చెప్పినా వినకుండా షాపింగ్ చేసింది. పికిల్స్, మిక్చర్ లాంటివి తీసుకుంది. గెలాక్సీలో మంచి పార్టీ యిచ్చింది.
"ఇవన్నీ ఎందుకు విరూ..." అన్నాడు అభినయ్ లాస్ట్ ఐటెమ్ వెనీలా ఐస్ క్రీమ్ తింటూ...
"నా చివరి సెండాఫ్... నీకు అనుక్షణం గుర్తుండాలి. నువ్వెక్కడున్నా నా జ్ఞాపకాలే నిన్ను వెంటాడాలి. అది సరే... నా కోసం నువ్వేం కట్టిస్తావ్ అభీ? తాజ్ మహలా? భాగ్యనగరమా?" అడిగింది విరజ.
అభినయ్ నవ్వి... "విరజ నగర్ మహల్ కట్టిస్తాను. మరి నువ్వు?" అన్నాడు.
విరజ నవ్వలేదు. సీరియస్ గా.... చాలా సీరియస్ గా అంది.
"నేనేమీ కట్టించను. నా గుండెని నీ కోసం పదిలంగా దాచి వుంచుతాను. నేను పోయినా, నా గుండె మాత్రం యింకా నీ కోసం కొట్టుకొంటూ వుంటుంది. నా గుండె సవ్వడి నీకు ఎంత దూరంలో వున్నా వినిపిస్తూనే ఉంటుంది. నీకోసం అహరహం సవ్వడి చేసే నాగుండె నేను నీకిచ్చే అపురూప బహుమతి".
అభినయ్ విరజవంక చూసేడు. ఆమె చాలా సీరియస్ గా ఆ మాటలంటున్నది.
"విరూ...!" అంతకు మించి ఏమనాలో తోచలేదు అభినయ్ కు.
"యస్ అభీ... ఐ లవ్ యు... నేను చచ్చినా నా గుండె యింకా... యింకా నిన్ను ప్రేమిస్తూనే వుంటుంది ప్రామిస్..." అంది అభినయ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
అభినయ్ విరజ చేతిని ఆత్మీయంగా తన పెదవులకు ఆన్చుకున్నాడు.
ఆ క్షణం ఆమె మాటలు విని తథాస్తు దేవతలే చలించి, తథాస్తు అన్నారేమో!
* * *
"విరూ! నేనొకటి చెప్తాను... చేస్తావా?" రిక్వెస్టింగ్ గా అడుగుతున్న అభినయ్ ని చూస్తూ...
"చెప్పు.... నువ్వేది చెప్పినా చేస్తాను".
"అయితే ఇప్పుడు ఎయిర్ పోర్ట్ కు వచ్చేప్పుడు మొన్న ఆ మధ్య నేను కొన్న మైసూర్ క్రేప్ శారీ కట్టుకుని రా...! ఆ చీరలో నువ్వెంత బావుంటావో తెల్సా?"
"అంటే... మిగతా డ్రెస్సుల్లో నేను బావుండనా?" బుంగమూతి పెడుతూ అంది.
"అదేం కాదు. అసలు డ్రెస్ లేకున్నా బాగానే వుంటావనుకుంటా...." ఆలోచిస్తూ అన్నాడు అభినయ్.
"ఆ... ఏమిటి! బావుంటాను....' కన్ ఫర్మ్ చేసింది విరజ.
"సరే గానీ, టైమవుతోంది వెళ్ళు వెళ్ళి ఆ చీర కట్టుకుని నేను నీ బర్త్ డే కి ప్రెజెంట్ చేసిన చెయిన్ వేసుకొని రా! నిన్ను ఆ గెటప్ లో చూడాలని వుంది....." మురిపెంగా విరజ వంక చూస్తూ అన్నాడు అభినయ్.
"ఓ....కె.... సర్.... వెళ్ళి ఫైమినిట్స్ లో వస్తా! సరేనా?"
"వెరీగుడ్..... త్వరగా రా!" అన్నాడు అతను ఆఫీసుకు సంబంధించిన ఫైల్స్ అన్నీ మరోసారి చెక్ చేసుకుంటూ....
విరజ లోపలికి వెళ్ళింది.
* * *
అభినయ్ విరజ సర్దినవన్నీ, తన లిస్ట్ లో ఉన్నవీ... అనీ చెక్ చేసుకుని, పెట్టినవన్నీ టిక్ చేసి, కట్టేస్తున్నాడు.
"అభీ! వెళదామా?" అంది విరజ. అన్నీ సర్దుతున్న అభినయ్ వెనక్కి తిరిగి చూశాడు. కనకాంబరం కలర్ మైసూర్ క్రేప్ శారీలో విరజ అప్పుడే విరిసిన విరజాజిలా వుంది.
మెడలో సింపుల్ గా తను చెప్పిన చెయిన్ వేళాడుతోంది. అతని మనసులో ప్రేమ ఉవ్వెత్తున పొంగింది.
"ఇటురా!" అంటూ దగ్గరకు లాక్కుని చీర అంచు మడతపడ్డచోట సవరిస్తూ...
"ఎంత బావున్నావో తెలుసా? అచ్చు నేనూహించినట్లే.... ఈసారి మాత్రం ఈ చెయిన్ కి బదులు మంగళసూత్రం వేలాడుతూ వుంటుంది నీ మెడలో...." అన్నాడు.
అనుకోకుండా, అప్రయత్నంగానే విరజ అభినయ్ కాళ్ళకి దణ్ణం పెట్టింది.
"ఏయ్ సిల్లీ! ఏమిటి?"
"దీవించు" అంది లేవకుండా.
అభినయ్ ఆమె భుజం పట్టి లేపుతూ "ఏయ్ విరూ! ఇదేమిటి? అల్లరిగా, చిలిపిగా వుండే నువ్వు, ఆరిందాలా ఇలా..." ఆపై మాటలు రాలేదు అతని నోటివెంట.
అప్పటికే విరజ అతని భుజం చుట్టూ చేయివేసి, అతని పెదవులకి తన పెదవులు తాకింది.