Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 24

    "దయచేసి ఒకసారి వెళ్ళి మన లీగల్ అడ్వయిజర్ ప్రకాశం గార్ని పిలుచుకు రండి!"    
    రమేష్ తెల్లబోయి, మన లీగల్ అడ్వయిజర్ రాజారావుగారు కదూ?" అన్నాడు.    
    "కాదు. అతడ్ని తొలగించాను. అతడు అత్యంత రహస్యంగా ఉంచవలసిన విషయాలు డబ్బుకాశపడి ఇతరులకు చెప్పినట్లు తెలిసింది. అతడు వ్రాసిన విల్లు కూడా రద్దు చేయించాను. మరొ వీలునామా వ్రాయించటానికే ప్రకాశంగారిని పిలిపిస్తున్నాను."    
    ఆమె మాటలు కర్కశంగా ఉన్నా, కళ్ళలో హేళనతో కూడిన నవ్వు వుంది. అది గుర్తించాడు రమేష్.    
    "అలాగే! పిలుచుకోస్తాను" అని బయటపడి, "ఎంత అసాధ్యురాలివి ముసలిదానా!" అని గుండె బాదుకున్నాడు.
    
                                                         16
    
    ఫ్యాక్టరీ వదిలారు. కూలీలంతా బిల బిలలాడుతూ బయటికొస్తున్నారు. శర్మ చెయ్యిపట్టుకుని ఫ్యాక్టరీ ఆవరణలో నిలబడి ఆ దృశ్యం చూస్తోంది శకుంతల. కూలీలలో ఎక్కువ భాగం చిన్నపిల్లలు కావడం గమనించింది. చింపిరి జుట్టులతో, మాసిన పరికిణీలతో దైన్యానికి మారుపేరులా కనిపిస్తున్నారు వాళ్ళు. చదువుకొని వృద్దిలోకి రావలసిన ఆ పిల్లలు. అలా పసితనంలో బ్రతుకు భారంతో కృంగిపోవటం చాలా బాధ కలిగించింది ఆమెకి. అంతలో ఆమెకొక విచిత్ర దృశ్యం కనిపించింది. ఒక నడివయసు ఆడది, ఒక పసిపిల్లతో ఘర్షణ పడుతోంది. ఆ పసిపిల్ల ఏడుస్తోంది. నడివయసుది బెదిరిస్తోంది.    
    శర్మ వారించేలోగానే శకుంతల వాళ్ళ మధ్యకు వచ్చింది. పసి పిల్ల ఏడుపూ, నడివయసుదాని జోరూ - రెండూ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇద్దరిలో ఎవరూ నోరు మెదపక భయం భయంగా చూశారు. పసిపిల్ల కళ్ళలోనే బెదురు ఎక్కువగా కనిపిస్తోంది. శకుంతల విషయ మేమిటో తెలుసుకోకుండా ఊరుకోలేకపోయింది.    
    "పాపా! ఎందుకేడుస్తున్నావ్? ఏ మమ్మా! ఎవరు నువ్వు? పసిపిల్ల నెందుకిలా బెదిరిస్తున్నావ్?"    
    "ఏటమ్మో! నేనేటి బెదిరిస్తున్నాను? దాసయ్య నాకాడ ఏభైరూపాయలు బాకీ పడ్డాడు. దాని జీతం రాగానే ఇస్తానన్నాడు. ఒకసారి ఈళ్ళు జీతం డబ్బులు ఇంటికట్టుకెళ్ళారంటే మల్లా నా కళ్ళబడతారా? నా పైసలిస్తారా? అందుకే జీతాలరోజు ఫ్యాక్టరీ కాడకే వచ్చి, నా బాకీ వసూలు చేసుకుంటున్న ఈ దొంగ సచ్చినది ఇయ్యనంటాది. మీరే చెప్పండమ్మా నాయం?"    
    ఆ మాటలు వింటోంటే శకుంతల కేదో కడుపులో దేవినట్లయింది. ఆ పిల్లవంక తిరిగింది. నిండా పదేళ్ళు వుండని ఆ పసిపిల్ల జీతం ఉన్న గుడ్డసంచీ గట్టిగా చేతితో పట్టుకొని బెదురు కళ్ళతో కళ్ళనీళ్ళతో - "నే నియ్యననలేదు. పై వారం ఇస్తానన్నా! అమ్మకి జరం కాస్తోంది. దేశం డాక్టర్ మందిస్తే తగ్గుతాదంట. ఆయనకీ పైసలియ్యాలి. మా వెజ్జుమందు గుణమియ్యటం లేదు. ఇంట్లో ఏం లేవు. వున్నదంతా మా అయ్య తాగేశాడు."    
    "అసలు నీ దగ్గిర వీళ్ళనాన్న ఎందుకు అప్పుచేశాడు" అడిగింది శకుంతల.    
    "ముంతలు ముంతలు తాగేస్తావుంటే అప్పుకాదేంటమ్మా మీరెల్లం డమ్మా! ఈ విషయాలన్నీ మీ కేందుకూ?" విసుక్కుంది ఆ మనిషి?    
    శకుంతలకి విషయం అర్ధమయింది. తండ్రి తాగి అప్పులు చేసాడు ఈ పసికూన బండ చాకిరీ చేసి ఆ అప్పులు తీర్చాలి. ఇంట్లో తల్లికి మందులు కొనే దారీ, ఇల్లు గడిచే దిక్కూలేదు. భరించలేకపోయింది.    
    "నీ బాకీ ఎంతో చెప్పు నేను తీరుస్తాను."    
    "సెప్పాను గదమ్మా! యాభయి రూపాయలు."    
    శకుంతల బాగ్ లో చెయ్యి పెట్టబోతోంటే, ఎవరో యువకుడువచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. శకుంతల కోపంగా చూసేటంతలోనే చెయ్యివదిలి దూరంగా నిలబడ్డాడు. "సారీ" అని. "ఈ సమస్యకిది పరిష్కారం కాదు. ఇలాంటి దయవలన చిక్కులు తీరవు. పెరుగుతాయి."    
    "మీరిలా యాభయి రూపాయలు బాకీ తీర్చారని తెలియగానే -ఆ తండ్రి నూరు రూపాయల సారా తాగుతాడు. ఈ పసిపిల్ల బరువు మరింత పెరుగుతుంది" అని ఆపసిపిల్లవేపు తిరిగి "పాపా! నువ్వు వెళ్ళమ్మా" అని ఆ నడివయసు మనిషితో, "నీ బాకీ, పై వారం తీర్చేలా నేను చూస్తాను లేమ్మా ఇంకవాడికి అప్పు పెట్టకు" అన్నాడు. తన చేతులతో పడబోయే యాభై రూపాయలూ, తనకు దక్కకుండా పోయినందుకు చిటపటలాడుతూ సణుక్కుంటూ పోయింది ఆ మనిషి.
    అప్పటి వరకూ మౌనంగా ప్రేక్షకుడిలా వున్న శర్మ అప్పుడు కల్పించుకొని, "తండ్రి బాకీ ఈ పిల్ల ఎందుకు తీర్చాలి? నువ్వు ఎవరికి అప్పిచ్చావో వాళ్ళనే అడుగు అనవచ్చుగా" అన్నాడు సగం కోపంతో సగం ఆవేదనతో.    
    "ఒకటి - ఆ పిల్లకు ఇన్నిమాటలు మాట్లాడగలిగే పరిజ్ఞానం లేదు. రెండు అలా మాట్లాడితే వాళ్ళ నాన్న చావతంతాడు"
    ఇవన్నీ మామూలే అన్నట్లు మాట్లాడుతున్నాడు అతడు.    
    "మరి, ఈ సమస్యకు పరిష్కారం లేదా!"    
    "ఉంది. ఆ తల్లిని ఆస్పత్రిలో చేర్పించాలి. ఆ పిల్లలను ఏ హాస్టల్లోనయినా పెట్టి చదివించాలి. ఆ తండ్రిచేత చావదన్ని పనిచేయించాలి"    
    "మరి అలా ఎందుకు చేయకూడదు?"    
    "ఇందులో ఏదీ సాధ్యంకాదు. ఇక్కడి వాళ్లకు ఆస్పత్రి అంటే విపరీతమయిన భయం, ఆస్పత్రికి వెళ్ళినవాళ్ళు ప్రాణాలతో తిరిగిరారని వాళ్ళ నమ్మకం. అసలు అలోపతి డాక్టరుతో వైద్యం చేయించుకోవటమే ఇప్పుడిప్పుడు మొదలు వాళ్ళవన్నీ మూలికల వైద్యాలే చాలా వరకు ఆ మూలికలే బాగా పనిచేస్తాయి. అలాగే పిల్లలను హాస్టల్లో చేర్చటమూ అంత తేలికకాదు, ఎక్కడికక్కడే బోలెడన్నిపాలిటిక్సు. ఫైనల్ గా ఆ తండ్రితో కూలిపని చేయించటం ఎవడి తరమూ కాదు. వాడు తనకు తాను ఒకదొర ననుకుంటాడు. వాడు వ్యవసాయం చేస్తాడు. వేటాడతాడు, తాగుతాడు, అంతేకాని కూలిపనిమాత్రం చెయ్యడు. ఆ గోచీ దొరకి అది పరువు తక్కువ. అంచేత తన పిల్లలని కూలికితోలతాడు వీళ్ళకుఎప్పుడూ రోజు కూలే తప్ప పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండదు. చిన్న పిల్లలని వంక ఇది సార్, మన పుణ్యభూమి"    
    నవ్వాడు అతడు ఆ నవ్వులో, బాధ, కోపం కసి అన్నీ కలగలసి ఉన్నాయి.    
    "మీరెవరూ?" అప్పుడడిగింది శకుంతల.    
    "నేను లేబర్ యూనియన్ ఆర్గనైజర్సు లో ఒకడిని ఇక్కడి విషయాలు తెలుసుకొని ఇక్కడకు వచ్చాను? ఇక్కడ వర్కర్స్ కూడా మా యూనియన్ లో చేరితేగాని, నేనేమీ చెయ్యలేను. కానీ, ఇక్కడ యూనియన్ ఆర్గనైజ్ చేసేదెవరు! యూనియన్ లో చేరేదెవరు? అందరూ పసివాళ్ళు సంపాదించిన దంతా తల్లితండ్రుల చేతిలలో పోసి కడుపునిండా తిండికి గూడా నోచుకోక చావు దెబ్బలు తినే పసివాళ్ళు"

 Previous Page Next Page