ఆ కొత్త వాతావరణంలోనే సోమయాజి కూడా అలాగే ఇమడలేక కొట్టుకుంటున్నాడు.
ఇక్కడ మనుష్యులు ఎప్పుడూ హడావుడిగా పరిగెడ్తారు. ఆప్యాయతలు వుండవని కాదు. కానీ చిరునవ్వు వెనుక కృత్రిమంగా కనబడుతుంది. పలకరింపు వెనుక పరోక్షంగా నొసటి విరుపు కనబడుతుంది.
సోమయాజుల్ని తీసుకుని వచ్చిన బావగారి పేరు రంగారావు. అతడెప్పుడూ సహజంగా నవ్వడు. 'నీ కోసం నవ్వుతున్నాను సుమా' అన్నట్టు వుంటుంది అతని నవ్వు. అతడి కిద్దరు పిల్లలు. వీరుగాక విధవప్పగారు వుంది. ఆమెని చూడగానే సోమయాజికి మంచి అభిప్రాయం కలిగింది. అతనిలాగే ఆమెకూడా మరెక్కడా చోటు దొరక్క ఈ గూటికి వచ్చి చేరింది. ఆమె పేరు దమయంతి. ఆ ఇంటిలో ఒక వంటమనిషి స్థాయిలో చూడబడుతూంది. ఆప్యాయత, బంధుత్వం పేరుతో గుప్పెడు తిండి పెడితే అంతపని చేసేవారు పట్నంలో దొరకటం కష్టం. నాలుగిళ్ళ చావిడి అది. కుడివైపు ఇంటిలో రంగారావు. మరో అన్నగారూ వారి కుటుంబం వుంటుంది. వారిది గంపెడు సంతానం. భార్య పొరపాటున ఈ లోకానికి వచ్చినట్టూ, ఎప్పుడు పై లోకానికి వెళ్ళిపోదామా అన్నట్టు వుంటుంది. ఆమె వయసు కూడా పెద్దదికాదు. అయినా స్త్రీ తాలూకు సున్నితత్వపు భావాన్ని పురుషుల్లో పోగొట్టటానికి కంకణం కట్టుకున్నట్టు ప్రవర్తిస్తూ వుంటుంది. నడి లోగిలిలో కూర్చుని పేల దువ్వెనతో జుట్టు గీరుతూ, ఒక్కొక్క పేనుని పట్టి కసిగా చంపుతుంది. ఉతికిన లంగాలు గుమ్మం పక్కనే ఆరేస్తుంది. అన్నిటికన్నా ఘోరమైనది మరొకటి వున్నది. ఎప్పుడూ ముక్కునో, పళ్ళనో, చెవునో వరుసగా వేలు, సూది, పుల్లతో గెలుకుతూ వుంటుంది. అలవాటయిన వాళ్ళకు ఆహ్ది కొత్తగా కనిపించదు. కానీ కాస్త పరీక్షగా చూస్తే మరి ఆమెనుంచి పారిపోవాలనిపిస్తుంది. స్త్రీలలో కూడా ఇంత అనూహ్యమైన పదార్ధాలుంటాయా అనిపిస్తుంది.
ఈమె పెద్ద కుమారుడు రాజా. అతడు ఏడోతరగతి ఎన్ని సంవత్సరాల్నుంచీ చదువుతున్నాడో అతనికే తెలీదు. ఆ ఇంటికి - ఒక్క ఇంటి కనేమిటి - ఆ పేటకే అతడు నాయకుడు. ఎన్నెన్నో పన్లు అవన్నీ ముగించుకుని రాత్రి ఏ పదింటికో ఇంటికి చేరుకుంటాడు. మళ్ళీ ప్రొద్దున్నే బయల్దేరతాడు. సాయంత్రంపూట వీధి మొదలులో నలుగురు అయిదుగురు స్నేహితులతో నిలబడి, దాదాపు మూడు గంటలు చర్చిస్తాడు. చర్చలంటే రాజకీయాలూ, సాహిత్యమూకాదు విడుదలవబోయే చిత్రంలో అభిమాన నాయకుడి యుద్దాలనుంచీ పక్కపేట రౌడీలతో పోరాటాల వరకూ ఆ చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకుంటాయి.
అతడి చెల్లెలు వైదేహి ఆమె కూడా చదువుతూన్నది. అదే వీధిలో వున్న ఒక కుర్ర రచయిత ప్రేమలో ఆమె తలమునకలయ్యేటంతగా మునిగి వున్నది. ఆ రచయిత ఈమె మీద గేయాలల్లి పత్రికలకి పంపిస్తూంటాడు. అవి క్రమం తప్పకుండా తిరిగి వస్తూ వుంటాయి. తన ప్రేయసి పాదపద్మాలకి వాటిని అర్పిస్తూ వుంటాడు.
ఆ ఇంట్లో మూడోభాగం ఈ అన్నదమ్ముల నాయనగారిది. ఎవరికీవారు విడిపోయిన తరువాత ఆయన ఆ భాగంలో వుంటున్నాడు. భార్య పోయాక వంటరివాడయ్యాడు. స్త్రీలతో కూర్చుని వంటింట్లో కబుర్లు చెప్పటం ఆయన అలవాటు. పల్లెటూర్లో తాతయ్య గంభీరత్వపు నీడలో స్త్రీ అంటే రవ్వంత మొహమాటాన్ని, స్త్రీ పట్ల గౌరవాన్నీ నేర్చుకున్న సోమయాజికి ఈ తాతగారు ఒక అర్ధంకాని ప్రహేళికగానే మిగిలారు.
ఇక నాలుగోభాగం.
మిగిలిన మూడు భాగాలకంటే అది విలక్షణమైనది. పైగా దానికి మధ్య లోగిలి గుండా వెళ్ళే అవసరం లేకుండా అట్నుంచి బయటకు దారి వుంది. గచ్చు నాపరాయితో చేసినది. అద్దెకూడా ఎక్కువే వస్తుంది. ఆ అద్దెను ఇద్దరు కొడుకులూ, ఆ తండ్రీ సమానంగా పంచుకుంటారు. కొడుకు లిద్దరికీ వేర్వేరు ఉద్యోగాలూ, సంపాదనలూ వున్నా అది పూర్వీకుల ఆస్థి కాబట్టి రెండొంతులు తాము తీసుకుంటారు. ముసలాయనకి మూడోవంతు మాత్రం హక్కు భుక్తంగా ఇస్తారు. మానవత్వం నుంచి న్యాయం విడిపడి చట్టం రూపేణా జనాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకుంటున్న రోజులివి. అందరూ కలిసే వుంటారు. కలిసే మాట్లాడుకుంటారు. కానీ మానసికంగా విడివిడిగా వుంటారు. అంతే తేడా. ఆ ఇంటి భాగాల్లోనే వారి మనస్సులో కూడా గదులు.
ఆ భాగం ఖాళీ అయి నెలరోజులు కావొస్తున్నది. ఇంకా ఎవరూ రాలేదు.
ఆ ఇంటికి ముందువైపున జాగాలేదు కానీ వెనుక పెరడు వుంది. అక్కడే స్నానాల గది, చిక్కుడుపాదులు వున్నాయి. అవతలవైపు స్నానాల గదిగోడ పడిపోయి వుంది. దాని గోడ ఎవరు కట్టించాలా అన్నది పెద్ద సమస్య. అయితే అటువైపు గోడ కాబట్టి, వెంటనే వచ్చే ప్రమాదం లేదు కాబట్టి, రాబోయే అద్దెతో దాన్ని బాగుచేయిద్డామని ఎవరికీ వారు వూరుకున్నారు.
ఇవీ ఆ ఇంటి సంగతీ - ఆ ఇంటిలో వున్న వ్యక్తుల సంగతీ......
* * * *
మధ్యాహ్నం రెండుగంటలకీ - ఎండ పెళ పెళ కాస్తుండగా గుర్రబ్బండి వచ్చి ఇంటిముందు ఆగింది. చిన్నక్క, బావా దిగారు. సామాన్లు లోపలికి వెళ్ళాయి. 'ఊరుకో అమ్మా - ఊరుకో ఏడిస్తే పోయినవారు వస్తారా' అని ఆవిడ చిన్నక్కని ఓదార్చింది. ఆ తరువాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు.
అందరికన్నా చివర్న ఆ ఇంటిలో ప్రవేశించినవాడు సోమయాజి అతడి నెవరూ లోపలికి పిలవలేదు. చిన్నక్క ఏడ్చే నిమిత్తం బిరబిరా లోపలికి పోయింది. సామానులు సరీగా వున్నాయో లేదో చూసుకునే హడావుడిలో బావ వున్నాడు.
సోమయాజి బిక్కుబిక్కుమంటూ లోపలికి ప్రవేశించాడు. ఆ రోజు ఆదివారం అవటంతో అందరూ ఇంట్లోనే వున్నారు. రంగారావు చిన్న కొడుకూ, కూతురూ....అతడి అన్న రాజా, వైదేహి....అంతమంది జనం, అతడు ప్రవేశించగానే ఒక్కసారి తలతిప్పి చూశారు. అన్ని చూపుల తూపుల నెదుర్కోలేక అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు.
రాజా లేస్తూ "ఎవరు కావాలి?" అని అడిగాడు.
"మా తమ్ముడు రాజా" అంది చిన్నక్క పరిచయం చేస్తున్నట్టు, "మేం తీసుకొచ్చాం. మాతోనే వుంటాడు" అని, సోమయాజివైపు తిరిగి "లోపలికి రారా. పరాయివాడిలా అక్కడ నిలబడిపోయావేమిటి?" అంది. అతనికి కొత్తగా వుంది. రంగారావు పిల్లలకి మాత్రం మరొక జతగాడు చేరటం హుషారుగా వుంది.
"ఆ గదిలో నీ సామాన్లు పెట్టుకో" అన్నాడు రంగారావు.
పెద్ద సామాన్లేమీ లేవు. నాలుగు జతల బట్టలు, సంచి, కొన్ని పుస్తకాలు. అంతే. వాటిని పట్టుకుని సోమయాజి ఆ గదిలోకి వెళ్ళాడు. అటక మీద వున్న చెత్త సామానూ, కాగితాల తడీ కలిసి అక్కడ అదోరకమైన వాసన వస్తూంది. ఒక మూలగా రెండు పెద్ద మంచాల్లాగా వున్నాయి. మంచానికీ, గోడకీ మధ్య పాత పత్రికల కట్ట వుంది.
విశాలమైన గోదావరి తిన్నెలాంటి ఇంటినుంచి ఇరుకు కాలువలోకి వచ్చిన అనుభూతి.
అతడితోపాటే ఆ గదిలోకి ప్రవేశించిన రాజా "నీ పేరేమిట్రా?" అని అడిగాడు. మొదటి ప్రశ్నలోనే తన ఆధిక్యతని నిరూపించుకోవటానికి చేసిన ప్రయత్నం కనపడింది.
"స్సో..... స్సో..... సోమయాజి."
"ఏం చదువుకున్నావ్?"
సోమయాజి తడబడుతూ చెప్పాడు.
"ఎక్కడ?"
"అగ్..... అగ్.... అగ్రహారం పాఠశాల."
రాజా అతడివైపు పరీక్షగా చూస్తూ "నీకు సత్తా?" అని అడిగాడు.
"ల్లే.... ల్లేదు" మరింత తడబడ్డాడు సోమయాజి.
"లేకపొవట మేమిటి? నీకు నత్తే ఏదీ అను చూద్దాం విష్వక్సేనుడు......"
సోమయాజి మాట్లాడలేదు. అతడి మొహం ఎర్రగా మారింది.
"అనూ" అన్నాడు చిన్నక్క కొడుకు చొక్కాపట్టి గుంజుతూ.
పిల్లలందరూ తనవైపే చూస్తూ వుండడంతో సోమయాజి నోరు తెరిచాడు. మాట తడబడకుండా వుండటానికి శాయశక్తులా ప్రయత్నించాడు. మనసుమీద మరింత వత్తిడి ఎక్కువైంది. నాలుక నిరాకరించింది.
"విష్వక్.....క్.....సేనుడు" అన్నాడు. అందరూ ఘొల్లున నవ్వారు. రాజా పక్కగదిలోకి తొంగిచూస్తూ "పిన్నీ నీ తమ్ముడికి నత్తేవ్" అని అరిచాడు.
ఆ తరువాత సోమయాజి దాన్ని పోగొట్టుకోవటానికి చాలా ప్రయత్నించాడు. కానీ అది వచ్చిందన్న భావం మానసిక వ్యధకి గురిచేసి, మరింత మాట తడబడేట్టూ చేసింది.
ఆ విధంగా అతడికి శాశ్వతంగా నత్తి వచ్చింది.
* * * *
సోమయాజి ఆ ఇంటికి రావటంతో చాలామందికి చిన్న చిన్న బాధలు తప్పినయ్. ముఖ్యంగా రంగారావు పెద్దన్నగారికి ప్రొద్దున్నే లేచే బాధ తప్పింది. తెల్లవారకుండానే వెళ్ళాలి. లేకపోతే పాలు దొరకవు.
సోమయాజికి అది అలవాటే. నాలుగున్నరకే లేచి వెళ్ళి పాలు తీసుకొచ్చేవాడు. అంతకుముందు అప్పుడప్పుడు ఆయన ఆలస్యంగా వెళితే అవి అయిపోయేవి. సోమయాజి వచ్చాక ఆ ఇంటిల్లిపాదీ మరెప్పుడూ పాలురాక బాధపడలేదు.
అయిదింటికల్లా పాలు తీసుకొచ్చి ఇచ్చి, తరువాత పెరట్లో ఎండు కట్టెలతో పొయ్యి వెలిగించి నీళ్ళు పెట్టేవాడు. కాగు వేడెక్కేసరికి గంట పట్టేది. అప్పటికి తెల్లవారేది. రంగారావు అన్నగారికి ఎంత వేసవికాలమైనా వేన్నీళ్ళు కావాలి. రాజా, వైదేహిల సంగతి సరేసరి. సోమయాజి తెల్లవార్నే లేచి ఈ పని చెయ్యటం ఆడవాళ్ళకి కూడా ఎంతో తెరిపినిచ్చింది. అంతకుముందైతే స్నానాలు పూర్తయ్యేసరికి ఎనిమిదయ్యేది.