సుబ్బారావు ఆలోచిస్తూ "మా ఆఫీసులో రమణ మూర్తి అని ఒకతను వున్నాడు. అతను మరీ అందగాడు కాదు గానీ చింపాంజీలా ఉండడు. వాళ్ళు మీ వాళ్ళే!" అన్నాడు.
"మీరు నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా ఎందుకు?"
"మంచి పనులు చేయడానికి నేనెప్పుడూ సిద్దమే!" అన్నాడు సుబ్బారావు.
ఉన్నట్లుండి పార్కులో భోరున వాన ప్రారంభమయింది.
"ఏమిటిది? ఉరుములు, పిడుగులు లేకుండా ఇదేం వాన?" అంది సుహైస్ని, అప్పటికే ఆమె ముద్దలా తడిసిపోయింది.
"ఎక్కడా సరైన నీడలేదు. తడిసి పోతున్నాం?" అన్నాడు సుబ్బారావు.
వాళ్ళు తడిసి ముద్దయిన మరుక్షణంలో వాన ఆగిపోయింది.
సుబ్బారావు ఆకాశం కేసి చూసి "ఆకాశం నిర్మలంగా ఉంది!" అన్నాడు.
"అదే, నాకూ ఆశ్చర్యంగా ఉంది" అంది సుహాసిని.
సుబ్బారావు సుహాసినిని చూశాడు. బట్టలు ఆమె వంటికి అతుక్కుపోయాయి. "అయ్యో- పాపం మీ జుట్టు మంచి నీళ్ళొడుతున్నాయి" అన్నాడతను.
"మీరూ బాగా తడిసిపోయారు" అంటూ సుహాసిని అతడి వంక చూసింది. ఎత్తయిన, బలమైన అతడి ఛాతీ బనియన్ లేకపోవడంవల్ల స్పష్టంగా చొక్కాలోంచి కనబడుతోంది.
వాళ్ళలో వచ్చే మార్పుకోసం రాయుడు ఆతృతగా చూస్తున్నాడు.
"మీరు వణుకుతున్నారు. చలేస్తోందా?" అన్నాడు సుబ్బారావు.
"మీ పెదవులు వణుకుతున్నాయి. మీకూ చలి వేస్తోంది!" అంది సుహాసిని.
"యిప్పుడేం చేయడం?" అన్నాడు సుబ్బారావు.
"బయట బామ్మ ఉందిగా పిలుద్దాం" అంది సుహాసిని ఇద్దరూ పార్కు బయటకు వచ్చి ఆశ్చర్యపోయారు. అక్కడ బామ్మ సుభద్రమ్మల జాడలేదు. వాన పడిన జాడ కూడా లేదు.
ఓసారి ఇద్దరూ తమవంక చూసుకుని "ఇలా బయట కెలా వెడతాం?" అనుకున్నారు. అక్కడే ఉన్న వాచ్మన్ ని చూసి "బయట వాన పడలేదా?" అన్నాడు సుబ్బారావు.
"కుర్రాళ్ళు మీకు తడవాలని సరదాగా ఉంటే కుళాయి కింద కూర్చుంటారు. అంతమాత్రాన అందరూ తడవరుగదా!" అన్నాడు వాచ్ మన్.
"మా బామ్మేది!" అంది సుహాసిని.
"తనొచ్చేదాకా మిమ్మల్ని లోపలే ఉండమన్నారు" అన్నాడు వాచ్ మన్.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు.
"ఇంకా ఎండ కూడా ఉంది. ఇలాంటప్పుడు ఎండవస్తే ఎండా వానా కుక్కల నక్కల పెళ్ళి అని ఆడుకునేవాన్ని" అన్నాడు సుబ్బారావు.
"నన్ను బామ్మ వానలో తడవనివ్వదు. నాకు వాన పడదు. జలుబు చేస్తుంది" అంటూ హాచ్ అని తుమ్మింది సుహాసిని.
"అరే - మీకు అప్పుడే జలుబు చేసేసినట్లుందే" అన్నాడు సుబ్బారావు.
"తడిసిన వెంటనే తల తుడుచుకోవాలి. తలంటుకున్నప్పుడు వెంటనే తల తుడుచుకోకపోతేనే నాకు జలుబు చేసేస్తుంది" అంటూ సుహాసిని మళ్ళీ హచ్ అని తుమ్మేసింది. ఆమె జుట్టు పిండుకుందుకు ప్రయత్నిస్తోంది. కానీ వెంట వెంటనే తుమ్ములు వస్తున్నాయామెకు.
"అయ్యో మీకు అప్పుడే రొంపపట్టేసింది!" అన్నాడు సుబ్బారావు.
"మీరు కూడా చేతులతో తల శుభ్రంగా ఒత్తుకుని నీళ్ళుపోయేలా చెయ్యండి. లేకపోతే మీకూ జలుబుచేస్తుంది" అంది సుహాసిని. సుబ్బరావు ఆమె మాట పాటించాడు.
"నేను వానలో తడుస్తూనే ఉంటాను. అది నాకు అలవాటే!"
"వానలో తడవడం ఎందుకు?" ఆశ్చర్యంగా అంది సుహాసిని.
ఆఫీసు నుంచి ఇంటి కెడుతున్నాననుకోండి. అప్పుడు హఠాత్తుగా వాన వస్తే ఏం చేస్తాం?" అన్నాడు సుబ్బారావు.
"దానికేముంది? కాస్త వాన తగ్గేదాకా ఏ నీడనో ఉంటాం. గొడుగుంటే గొడుగేసుకుని పోతాం. ఈ మాత్రం దానికి తడవక మెందుకు?" అంది సుహాసిని.
"మా యింట్లో మా నాన్నగారి గొడుగుంది. అదాయన జ్ఞాపకార్ధం అమ్మ దాచుకుంది. గొడుగెలాగూ ఉంది. కదా అని వేరే కొనడంలేదు. ఆఫీసు నుంచి ఇంటికెళ్ళేటప్పుడు అయిదు నిమిషాలు ఆలస్యమయిందంటే అమ్మ ప్రాణం కొట్టుకు పోతుంది. అందుకని ముందుగా చెప్పకపోతే ఎలాంటి వానలోనైనా ఇంటికి వెళ్ళిపోతాను. గానీ ఇంటికి ఆలస్యంగా మాత్రం వెళ్ళను" అన్నాడు సుబ్బారావు.
"వానలో తడిస్తే మీకు జలుబు చేయదా?" అంటూ మళ్ళీ తుమ్మింది సుహాసిని.
"ఒకోసారి చేస్తుంది. ఒకోసారి చేయదు." అన్నాడు సుబ్బారావు.
సుహాసిని చలికి వణుకుతోంది. మధ్య మధ్య తుమ్ముతోంది.
"మా అమ్మ. మీ బామ్మ - ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వాళ్ళొచ్చేదాకా మనం ఇక్కడే కూర్చోవాలి, మీకేమో చలిగా ఉంది. దగ్గర్లో తెలిసిన వాళ్ళు ఉండి ఉంటే దుప్పటి అయినా తెచ్చి ఇచ్చి ఉండేవాణ్ణి" అన్నాడు సుబ్బారావు.
"మీరేమీ బాధపడకండి. సాధారణంగా నాకు వానొచ్చేముందు తెలిసిపోతుంది. ఇదేం వానో చిత్రంగా వచ్చిపోయింది. ఎలాగో కాసేపు భరిస్తాను" అంటూ తుమ్మింది సుహాసిని.
"వీళ్ళెప్పుడొస్తారో ఏమిటో?" బాధగా అన్నాడు సుబ్బారావు.
రాయుడు పిడికిలి బిగించి- "వాళ్ళొచ్చేలోగా బంగారంలాంటి ఈ అవకాశాన్నుపయోగించుకోకుండా - వాళ్ళు రారేమని బాధపడతాడేంటయ్యా!" అన్నాడు.
"నాకు జలుబుమీద దృష్టి ఉన్నంతసేపూ తుమ్ములిలా వస్తూనే ఉంటాయి. మా బామ్మకయితే ఏం చేస్తుందంటే ఏదయినా కథ చెబుతుంది. కథ వింటూంటే నాకు చలి, ఆకలి, రోగం- ఏమీ గుర్తుండవు." అంది సుహాసిని.
"నాకు చాలా కథలొచ్చు-" అన్నాడు సుబ్బారావు.
"అయితే చెప్పండి-" ఉత్సాహంగా అడిగింది సుహాసిని.
సుబ్బారావు మొదలు పెట్టాడు.
ఒక రాజకుమారుడు రాజకుమార్తె ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామనుకునేటంతలో ఒక మాంత్రికుడు వచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోయాడు. రాజకుమారుడు ప్రేయసిని వెతుక్కుంటూ బయల్దేరాడు, దారిపొడుగునా అతను అష్టకష్టాలు పడ్డాడు. ఆఖరికి ఓ బ్రహ్మరాక్షసున్ని చంపి ఓ గంధర్వుడికి శాపవిమోచనం చేశాడు. గంధర్వుడు రాజకుమారుడికి ఎన్నో మంత్ర విద్యలు నేర్పి- "ఒక్క శకారుడనే మాంత్రికుడి మీదతప్ప- అందరి మీదా ఇవి పని చేస్తాయి." అని చెప్పాడు.