Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 23

   

    పావుగంట తరువాత కిరణ్మయి ట్రేతో ముందుగదిలోకి వెళ్ళింది. రాయన్న కూర్చున్న స్థితిలో ఎలాంటి మార్పూలేదు. "నేను ఓడిపోయానా?" అనుకుంది. మనసంతా బాధ. ఏం చెయ్యాలి? ఏం చేసి తన భర్తని తిరిగి ఈ పనికి ఉద్యుక్తున్ని చేయాలి. గెడ్డం పెరిగి, కళ్ళు  పీక్కుపోయి, మూర్తీభవించిన నైరాశ్యంలా వున్న అతడిని ఎలా మార్చాలి?
   
    ఆమె అతడివైపే చూస్తోంది. అతడు నెమ్మదిగా తలతిప్పాడు. ఆమెవైపు చూసి నవ్వేడు. ఆ నవ్వు - పువ్వు రేకులు విచ్చుకుంటున్నట్టు వుంది. బాక్సింగ్ బరిలో ప్రత్యర్ధి కొట్టిన దెబ్బకి కుప్పకూలిన మనిషి సర్వశక్తులూ కూడగట్టుకుని లేస్తున్నప్పుడు ప్రేక్షకులిచ్చే స్ఫూర్తిలా ఆమె కూడా నవ్వింది.
   
                                               *    *    *   
   
    తనలో తానే చాలాసేపు ఏదో ఆలోచించుకుంటున్నట్టు అతడు మౌనంగా వుండి, ఒక నిర్ణయానికి వచ్చినట్టు హఠాత్తుగా తలెత్తి "అపురూపలక్ష్మి గురించి నీకు చెప్పాలి" అన్నాడు. అంతసేపు అతడు దేనిగురించి ఆలోచిస్తూ సందిగ్దావస్థలో వున్నాడో ఆమెకి అర్ధమైంది. ఉత్సాహంగా ముందుకు వంగి, "గుడ్ ఐడియా! నాకూ ఆమె గురించి తెలుసుకోవాలని వుంది. చెప్పండి" అంది. మనిషి బాధలో వున్నప్పుడు ఆ విధంగా "ఎక్కువగా మాట్లాడి" మనసులో వున్నదంతా వెలిగక్కటం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా ఇంట్రావర్ట్స్ కి.

    రాయన్న చెప్పటం ప్రారంభించాడు.
   
    "అపురూపలక్ష్మితో నా పరిచయం సంవత్సరం క్రితం జరిగింది."
   
    కళాకారులూ, క్రీడాకారులూ సాధారణంగా మధ్యతరగతిలోంచే ఎక్కువ వస్తూ వుంటారు. కృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపన- కాలే కడుపుకే ఎక్కువ వుంటుంది. తమ రంగంలో కొద్దికొద్దిగా పైకివచ్చే కొద్దీ పరిధి విస్తృతమవుతూ వుంటుంది. కొత్త పరిచయాలూ, సమాజంలో పేరు, పెరుగుతున్న కీర్తి-అన్నింటికన్నా ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్, వ్యక్తుల కళ్ళలో మెచ్చుకోలు..... అదంతా కేవలం, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఆనందం వ్యాపారవేత్తలకూ, రాజకీయ నాయకులకూ దొరకదు. అదొక ట్రాన్స్ అదే కళాకారుడికీ, క్రీడాకారుడికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరింత సాధించాలన్న తపననిస్తుంది. ఆ పిరియడ్ లో తను ఎవరెస్ట్ శిఖరం మీదున్నంత గొప్పగా ఫీలవుతాడు.
   
    కిరణ్మయికి ఇదంతా తెలుసు. దీనికి సైకాలజీ చదవక్కర్లేదు.
   
    అతడు చెప్పేది వింటూ ఆమె అదే ఆలోచిస్తూంది.
   
    "ఆ రోజు మొట్టమొదటి సెంచరీ చేశాను." అన్నాడు రాయన్న. "......మేము డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తూండగా కొంతమంది అమ్మాయిలొచ్చి ఆటోగ్రాఫు లడిగారు. చాలా కొత్త అనుభవం అది. ఒకపక్క ఆనందం, మరోపక్క ఏదో తెలియని ఉద్వేగం! అందరికీ గబగబా సంతకాలు పెట్టి ఇచ్చాను. కొంత అనుభవం వున్న నాతోటి ప్లేయర్సు నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు. నాకంతా కొత్తగా వుంది. గబగబా అన్ని పుస్తకాల్లోనూ సంతకాలు పెట్టి ఇచ్చాను. అందరూ వెళ్ళిపోయినా ఒక అమ్మాయి మాత్రం అక్కడే వుండిపోయింది. నాకేం మాట్లాడాలో తెలియలేదు."
   
    "మీ పేరు?" అన్నాను.
   
    "అపురూపలక్ష్మి."
   
    "ఏం చదవుతున్నారు?"
   
    చెప్పింది ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలియలేదు. చుట్టూ అందరూ నాకేసే చూస్తున్నారేమో అన్న భయం. "లోపలికి వెళ్ళాలి" అన్నాను.
   
    "నా పెన్ను" అంది.
   
    నాలిక్కర్చుకున్నాను. పొరపాటున సంతకాలు చేసి జేబులో పెట్టేసుకున్నాను తీసి ఇచ్చేను. ఇచ్చేస్తూ ఆ పెన్ వైపు చూశాను. చాలా సాధారణమైన పెన్ను. నా చూపుని మరోలా అర్ధం చేసుకున్నట్టు - "అది మా తాతగారు ప్రెజెంట్ చేసిన పెన్ను. ఆయన ఈ మధ్యనే పోయారు" అంది.
   
    నేను నొచ్చుకుంటున్నట్టు "ఐ యామ్ సారీ" అన్నాను. అప్పుడే మొదటిసారి ఆ అమ్మాయి మొహంలోకి పరికించి చూశాను. పద్దెనిమిదేళ్లుంటాయేమో....."అమాయకమైన కళ్ళు, గుండ్రటి మొహం.... ఆ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ వుంది. ఉహూ - కాదు. అది ఆకర్షణ కాదు- ఏదో బేలతనంతో కూడిన అందం" రాయన్న కొంచంసేపు ఆగాడు.
   
    కిరణ్మయి తలవంచుకుని వింటూంది. మనసులో ఏమూలో కాస్త విషాదం మొహంలో కనపడదు. భర్త స్నేహితురాలి గురించి భార్య వినవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ సైకాలజీ పుస్తకంలోనూ వ్రాయబడలేదు.
   
    అతను తిరిగి చెప్పసాగాడు.
   
    "ఆమె పెన్ తీసుకుని 'థాంక్స్' చెప్పి వెళ్ళిపోయింది. తలవంచుకుని ఆమె అల అనడిచి వెళ్ళిపోవటం ఎందుకొ బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పటినుంచీ నేనుకూడా ఇలాంటి ఆత్మీయతకి దూరంగా పెరగటం దానికి కారణం కాబోలు. అయిదు రూపాయల పెన్నుని కూడా అంతగా అబిమానించే అపురూపలక్ష్మి సెంటిమెంటు నన్ను చాలాకాలం వెంటాడింది. కొన్ని భావాలకి తర్కాలు వుండవు.
   
    వారంరోజుల తరువాత రాజారావు ఓ పార్టీ ఇచ్చాడు. అతడి స్నేహితురాలు రమణితో పాటే మరో నలుగురు స్నేహితురాళ్ళు వచ్చారు. అందులో అపురూపలక్ష్మి కూడా వుంది. అదే రెండోసారి ఆ అమ్మాయిని చూడటం మాటల్లో ఆమె వివరాలు మరిన్ని తెలిశాయి. ఆమె తండ్రి బి.డి.వో రాయలసీమలో పనిచేస్తున్నారు. లక్ష్మికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, చెల్లి వున్నారు. వాళ్ళింట్లో కుటుంబ సభ్యులమధ్య చాలా సన్నిహిత సంబంధాలు వున్నాయి. కొన్ని కుటుంబాల్లో అంతే. ఇంటిలో భోజణం దగ్గర్నించీ అందరూ కలిసేచేస్తారు. తమలో తామే మిత్రుల్లాగా ఆప్తుల్లాగ కలిసిమెలసి వుంటారు.
   
    అంత చక్కటి కుటంబం నుంచి వచ్చిన అపురూపలక్ష్మి ఒక్కసారిగా తనవాళ్ళనంధర్నీ వదిలి బయట ప్రపంచంలో వుండవలసి వచ్చేసరికి నీటినుంచి బయటపడ్డ చేపలా విలవిల లాడిపోయింది. బెంగతో చాలా రాత్రిళ్ళు ఏడ్చేదట.
   
    అప్పుడే పరిచయం అయింది ఆ అమ్మాయికి రమణితో.
   
    సాధారణంగా మనం ఒక క్లాసులోగానీ, హాస్టల్ లోగానీ చేరగానే ముందు ఒకరిద్దరు పరిచయం అవుతారు. మొదటిరోజే "గొప్ప స్నేహం" అయిపోతుందది. తరువాత నెమ్మదిగా వాళ్ళు రాలిపోయి, తమ అభిరుచులతో సరిపోయే అసలు స్నేహితులు ఏర్పడతారు.
   
    అపురూపలక్ష్మి తన బెంగా మర్చిపోవటానికి రమణివెంట తిరిగేది. ఈ రమణి అనే అమ్మాయి డేర్ డెవిల్. తెలివిగలదే, కానీ ఆమెది ఒక నాయకురాలి ప్రవృత్తి, పర్ వెర్డెడ్. పాప్ కారిన్ తింటూ పదిమందిని వెంటేసుకుని మోర్నింగ్ షోలకి వెళ్ళటం....బోయ్ ఫ్రెండ్స్-రకరకాల అనుభవాలనే పేకముక్కల్తో కట్టిన మేడలాంటి జీవితం....
   
    'అప్పట్లో' రమణి నాకు గొప్ప వ్యక్తిగా కనిపించేది. కానీ తొందర్లోనే ఆమెంటే విసుగూ, అసహ్యం కలిగింది. మరోవైపు అపురూపలక్ష్మి అంటే జాలి.....ఏదో తెలియని అభిమానం! మన స్వంత మనిషి చెడిపోతూంటే మనకి కలిగే ఫీలింగ్. బహుశ లక్ష్మిని రమణినుంచి దూరంగా లాగటంకోసమే లక్ష్మితో పరిచయం పెంచుకొన్నట్టున్నాను."
   
    - అది ఆత్మవంచన అని కిరణ్మయికి తెలుసు. కానీ మొగవాడిలో ఆ మాత్రం ఈగో, స్త్రీని ఆకర్షించటానికి చేసే ప్రయత్నం క్షమార్హం! రాయన్న చెప్పసాగాడు.
   
    "లక్ష్మి నాకు దగ్గిరైంది. నెమ్మదిగా తన తల్లిదండ్రులమీద బెంగ కూడా తగ్గినట్టు కనిపించేది. కానీ నాకు రోజురోజుకీ 'సమయం' విలువ తెలియసాగింది. మునుపటిలాగా కుదిరేదికాదు. క్రికెట్ కోసం ఎక్కువ టైమ్ వెచ్చించవలసి వచ్చేది. ఈ లోపులో మన పెళ్ళి సెటిల్ అయింది. హాస్టల్ కి వెళ్ళి స్వీట్సు ఇచ్చి వచ్చాను. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా సంతోషంగానే వుంది. పెళ్ళికి తప్పకుండా వస్తానంది కాని రాలేదు. నేనూ అంతగా పట్టించుకోలేదు. మన పెళ్ళయిన మర్నాడు ఒకసారి కలవమని చీటీరాసి పంపింది. అప్పుడు వీలుకాక మర్నాడు వెళ్ళాను. వారం రోజులకే మనిషి అదోలా అయిపోయింది. నీరసంగా వుంది. బాగా ఏడ్చినట్లు కళ్ళు ఉబ్బిపోయున్నాయి. కారణం అడిగితే చెప్పలేదు. ఇంటినించి ఏమైనా దుర్వార్త తెలిసిందా అంటే అలాంటిదేమీ లేదంది. 'చాలా విరక్తిగా ఉంది. కారణం మాత్రం ఏమీలేదు' అనేసింది. నేను కాస్త ధైర్యం చెప్పాక నవ్వుతూనే మాట్లాడింది. ఓ పది నిముషాలు మాత్రం ఉండి వచ్చేశాను అంతే. అదే నేనామెను చివరిసారిగా చూడడం. ఆ రాత్రి పోలీసులు వచ్చేవరకు లక్ష్మిని ఇక చూడలేననే చేదునిజం నాకు తెలియదు. ఇంత ఘోరం జరుగుతుందని కలలోకూడా అనుకోలేదు." రాయన్న స్వరం వణికింది. అపురూపలక్ష్మి మరణంవల్ల తన మీదపడ్డ అబాండానికి కలిగిన బాధ మాత్రం కాదది. కిరణ్మయి మాట్లాడలేదు. అతడిని ఓదార్చే ప్రయత్నమూ చేయలేదు. కొన్ని బాధల్ని సమయమే తగ్గించాలి.
   
    "లక్ష్మి మిమ్మల్ని ప్రేమించిందా? మీతో తనపట్ల ప్రేమలేనందుకు బాధపడి వుంటుందా?.... అంటే మన పెళ్ళి ఆమెకు మనఃక్లేశాన్ని కలిగించే అవకాశం వుందా?" అడిగింది కిరణ్మయి అతడు కాస్త తేరుకున్నాక.
   
    "ఛ, అలాంటిదేమీలేదు. నా పెళ్ళి గురించి వస్తున్న సంబంధాలు వివరాలన్నీ చెప్పేవాడిని. ఆమెలో అలాంటి ఉద్దేశ్యం వుంటే అప్పుడే తెలిసి పోయేది."
   
    "అంటే మన పెళ్ళికిముందు వారం, పదిరోజుల్లోనే ఏదో జరిగి వుండాలన్న మాట" అడిగింది కిరణ్మయి సాలోచనగా.
   
    "నిజమే. ఆ రోజు కాస్త రెట్టించి అడిగితే, కాస్సేపు అక్కడే వుంటే జరిగిందేమిటో చెప్పేసేదనుకుంటాను. నా దగ్గిర ఏదీ దాచదు" అన్నాడు.
   
    కిరణ్మయి మాట్లాడలేదు. ఆమెకు బాధగా అనిపించింది. ఆత్మహత్య అనేది ఒక రకమైన తాత్కాలిక ఉన్మాదవస్థలో మనుష్యులు అమలు జరిపేది. ఆ "ఫిట్" మూడ్ పోగానే మళ్ళీ అంత ఆవేశం వుండదు. తన ఆత్మహత్య రాయన్న కెరీర్ ని అంతలా దెబ్బ తీస్తుందనిగానీ ఆ అమ్మాయికి తెలుసుంటే ఈ ప్రయత్నానికి పాల్పడి వుండేది కాదేమో!
   
    కిరణ్మయికి అతడిమీద అనంతమైన జాలిపొంగింది. అప్రయత్నంగానే చేతులు సాచింది. అతడు చిన్న కుర్రవాడిలా ఒదిగిపోయాడు.
   
    ఆమె కిదంతా తమ మంచికి వచ్చిందో, చెడుకి వచ్చిందో అర్ధం కాలేదు.
   
    ఒక సాయంత్రం నుంచి మరొక సాయంత్రానికి చేరుకోవాలంటే చీకటి వాకిటి తలుపులు తెరిచి ఓ ఉదయాన్నీ ఓ మధ్యాహ్నాన్నీ దాటాలట. ఒక కోయిలపాట వినాలంటే అయిదు ఋతువుల్ని దాగాలట.
   
    నిజమైన ఒక ప్రేమని నెగ్గాలంటే ఎన్ని పరీక్షలు దాటాలో! ఇది నిజంగా అదృష్టమేనేమో! ఎందరో దంపతుల్ని ఏళ్ళ తరబడి కలపలేని సహచర్యం, ఒక 'కష్టం' రూపంలో వచ్చి తమని రెండురోజుల్లో దగ్గిర చేసింది.
   
    When you sleep, with your head upon my Breast,
    with a smile on your lips.....
    A melting, aching tenderness encircles me.
    For then, you are my child,
    you clasp my unworthy feet
    And emotion over-powered,
    With tears in my eyes, its God that you become
    Father, Son, Lover God
    My beloved, what are you?
   
   
   
                                    ----* * * *----

 Previous Page Next Page