Home » Vasundhara » సుహాసిని


    గౌతమ్ ఉలిక్కిపడి "ఊఁ" అన్నాడు.

    "సర్, ఈ విషయంలో మీకు లాగే నేను ధైర్యం చేయలేకపోతున్నాను. కానీ యిలా ఎన్నాళ్ళు సార్?" అంది చరిత.

    ఈ సారి ఏమీ అనకుండా ఆమె వంక ప్రశ్నార్ధకంగా చూశాడతను.

    చరిత కొన్ని కాగితాలు తీసి ఫైల్లో పెట్టింది. టైపు మిషన్ మీద కవరుంచింది. లేచి నిలబడి గుమ్మందాకా వెళ్ళి, "మీరూ వస్తున్నారా సర్!" అంది.

    గౌతమ్ తనూ లేచి నిలబడ్డాడు.

    అతడు గుమ్మం సమీపిస్తుండగా ఆమె, "సర్! నేనడగదల్చుకుంది అడిగేసి, చెప్పదల్చుకుంది చెప్పేసి, ఆ తర్వాత మీకేసి చూడకుండా ఇక్కణ్నించి వెళ్ళిపోతాను. జవాబివ్వాలనుకుంటే ఇప్పుడే మీరూ నన్నాపొచ్చు. లేదా వీలు చూసుకుని తర్వాత బదులివ్వొచ్చు. ఇకముందు నేను మీతో ఈ విషయం మాట్లాడను. మీరే మాట్లాడాలి!" అంది.

    అతను కుతూహలంగా, "ఏమిటది?" అన్నాడు.

    "సర్, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదూ! అని అడగాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను."

    అతను తెల్లబోయాడు.

    ఆమె అడుగులు వేగం హెచ్చింది. అతడు తన్నాపుతాడేమోనన్న భయంతో పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిందామె.

    కానీ అతడామెనాపే ప్రయత్నం చేయలేదు.


                                  21


    పార్కులో స్నేహితురాండ్రు హోటల్ కెళ్ళి ఫోన్ చేసి ఎవరి దారి వారు పట్టారు. ప్రతిభ మాత్రం ఇంటిదారి పట్టకుండా మళ్ళీ సరోవరా పార్క్ చేరుకుంది.

    అక్కడ తనూ, దేవేంద్ర కలుసుకునే కనకాంబరాల పొద ప్రక్కనే కాసేపు కూర్చుందామె.

    దేవేంద్రతో భావిజీవితం గురించి ఎన్నో కలలు కందామె. ఆ కలలు నిజమవుతాయని మనస్పూర్తిగా నమ్మింది.

    కానీ తనకంత అదృష్టమా!

    కాసేపు తన దురదృష్టాన్ని నిందించుకుని, అయినా అటువంటి కిరాతకుడి బారినుండి తప్పించుకోగలగడం, అదీ వెంట్రుకవాసిలో చాలా గొప్ప అదృష్టమని సరిపెట్టుకొని అక్కణ్ణించి లేవబోతుండగా__

    "హలో, ప్రతిభా!" అన్న పలకరింపు వినబడింది.

    గొంతు విని ఆమె గుర్తు పట్టింది. అందుకే తలెత్తి అతణ్ని చూడలేదు.

    "నామీద కోపమా?" అన్నాడతను దీనంగా.

    "ఇంకా నన్ను వేటాడుతున్నావా?" అంది ప్రతిభ అతణ్ని చూడకుండానే.

    "ఇది వేట కాదు.... పాట్లు."

    ప్రతిభ మాట్లాడలేదు.

    "నా మాట నమ్ము ప్రతిభా. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను"

    "సారీ! నేను నిన్ను ప్రేమించడంలేదు...."

    "నా ప్రేమబలం నీకు తెలియదు. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా మన పెళ్ళి జరుగుతుంది...." అన్నాడు దేవేంద్ర.

    "ఆ విషయం నాకెందుకు చెప్పడం...."

    "జరగబోయేదానికి మానసికంగా సిద్ధపడతావని!"

    ప్రతిభ అప్పుడు తలెత్తి దేవేంద్రను చూసి, "నా పెళ్ళి నీ చేతుల్లో లేదు. నా చేతుల్లో ఉంది...." అంది.

    "నీ పెళ్ళి నీ చేతుల్లోలేదు. ఎవరి చేతుల్లో ఉందీ నాకు తెలుసు...."

    అప్పుడు ప్రతిభ కతని మాటలర్ధం కాలేదు.


                                                     *    *    *    *


    ఇంటికి వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది సవతితల్లి రమ. అందుకు ప్రతిభ ఆశ్చర్యపడింది.

    "నాకు మంచి పేరు తేవాలి. నువ్వు సుఖపడాలి. ఇదీ నీ పెళ్ళి గురించి నా కోరిక. ఇది జరిగి తీరుతుంది" అంది రమ ఆమెతో.

    ప్రతిభ బదులివ్వకుండా ఆమె చెప్పే మాటలన్నీ విని దేవేంద్ర ఆమెను కలుసుకుని పెళ్ళి ప్రసక్తి తెచ్చాడని అర్ధం చేసుకుని.

    "నా పెళ్ళికిప్పుడేం తొందర?" అంది చివరికామె.

    "ఆ మాట మీ నాన్నగారినడుగు" అంది రమ.

    తండ్రికి వేరే మాట తెలియదని ప్రతిభకు తెలుసు. ఆ ఇంట్లో మాట్లాడేది రమ మాత్రమే!

    పదేపదే రమ చెప్పిందాన్ని బట్టి దేవేంద్ర వయసు ఇరవై ఎనిమిదనీ, మొదటి భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనీ, అతడికి తాగుడు, వ్యభిచారం అలవాటుండడం వల్ల పెళ్ళి సంబంధాలు రావడం లేదనీ ప్రతిభకు అర్ధమయింది. ఇవన్నీ అతడు రమను ఇంప్రెస్ చేయడానికి చెప్పాడో, లేక నిజాలో మరి!

    రమ మాత్రం, "నాలుగు డబ్బులున్న వాణ్ని చూస్తే నలుగురికీకన్నెర్ర. లేనిపోనివి సృష్టించి దుష్ప్రచారం చేస్తారు. పెళ్ళికి ముందు మీ నాన్న గురించీ ఇలాంటివే విన్నాను. అవన్నీ నిజాలయ్యాయా?" అంది.

    ప్రతిభ మాట్లాడలేదు. భవిష్యత్తునూహిస్తోంది. 

    దేవేంద్రకూ తనకూ పెళ్ళయింది.

    అప్పుడు తను....

    రోజుకో హోటల్లో నృత్యం చేస్తూ అసభ్య ప్రదర్శనలిస్తోంది.

    రోజుకో వ్యక్తితో పడుకుంటోంది.

    తన సంపాదనతో దేవేంద్ర గొప్పవాడవుతున్నాడు.

    ఊహించుకుంటూనే ప్రతిభ వళ్ళు జలదరించింది.

    దేవేంద్ర బారినుంచి తప్పించుకోవాలి.... ఎలా? ఎలా?

    ముందు తన్ను దేవేంద్ర ఒంటరిగా వేటాడాడు. ఫలించలేదు.

    ఇప్పుడు ఇంటికొచ్చి వేటాడుతున్నాడు.

    ఇకముందు ఇంటిదాన్ని చేసి వేటాడుతాడు.

    అతడి బారినుంచి తప్పించుకోవాలి. అందుకు తలిదండ్రులు సహకరించరు సరికదా వాళ్ళే అతడివైపు తరుముతారు.

    మరి తనకు దిక్కేమిటి?

    ప్రతిభకు ఆ రాత్రి నిద్రపట్టలేదు.


                       *    *    *    *


    అదే విధంగా ఆ రాత్రి నిద్రపట్టని వ్యక్తి మరొకడున్నాడు.

    అతడు గౌతమ్!

    అతడు హాస గుండె చప్పుడు వింటూంటే అందులో రమణ పట్ల ప్రేమానురాగాలు పలుకుతున్నాయి. ఆ రమణకు అందం, ఆస్తి అన్నింటికీ మించి ఆమె పట్ల ప్రేమా ఉన్నాయి. అన్నివిధాలా అతడు తనకంటే అధికుడు.

    అతడ్ని కాదని తన్ను చేసుకోమని అడగడం న్యాయం కాదు.

    "ఆమెకూ, నాకూ రాసిపెట్టి లేదు" అనుకున్నాడతడు.

    అసలు తనకు కళ్యాణయోగముందా అని కూడా అతడి కనుమానం వచ్చింది.

    తలిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. తను ఒప్పుకోవడం లేదు. అసలు మొదట్లో తనకు వివాహేచ్చ లేదు. సీత తనలో ఆ వాంఛను పుట్టించింది. ఆమెను పెళ్ళాడతానంటే తిరస్కరించింది. అప్పుడు తను హాసను చూశాడు. విచిత్రంగా జరిగింది తమ పరిచయం.

    ఇప్పుడు హాస కోసమే తను పుట్టాననిపిస్తోంది. ఆమె లేకుండా తను జీవించలేడనిపిస్తోంది. దురదృష్టవశాత్తూ ఆ ప్రేమలో స్వార్ధం లేదు.

    అతడామెనుకాక ఆమె సుఖాన్ని కోరుతున్నాడు.

    అందుకే ముందు ప్రకాశరావు కోసం ప్రయత్నించాడు. అది ఫెయిలై అతడిలో ఆశలు చిగిర్చాయి.... తనామెను కలుసుకుందామనుకుంటూండగా రమణ ఆమెను కలుసుకున్నాడు.

    హాస అభిప్రాయంలో తనొక అశరీరవాణి. తనే రమణను పంపినట్లామె నమ్మకం. అది రమణ అదృష్టం. 

    ఇప్పుడు ఆమెకూ, రమణకూ కళ్యాణం జరుగుతుంది.

    ఆమెను ప్రేమించే తను మనస్పూర్తిగా ఆమెనాశీర్వదించాలి.

    కానీ అది తన వల్లవుతుందా?

    ప్రకాశరావు సంబంధం చెడిపోతే తను సంతోషించాడు. అంటే తన మనసులో స్వార్ధముంది. ఆమె తనది కావాలన్న కోర్కె ఉంది.

    ఇప్పుడు కూడా తనలో అలాంటి కోర్కె ఉండి ఉండవచ్చు.

    ఆమెను ప్రేమిస్తూ, ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ ఆమె కోరిన హాస వరుడామెకు దక్కకుండా పోవాలని కోరుకోవడం తనకు తగదు.

    కానీ తన మనసునదుపు చేయడమెలా?

    "మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదూ అని అడగాలనుకుంటున్నాను. నేనూ మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను...."

    చరిత గొంతు అతడి చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.

    ఆ అమ్మాయి చరిత అతడికి చాలాకాలంగా తెలుసు.... ఆమెను సహోద్యోగిగా తప్ప ఆడపిల్లగా అతడెప్పుడూ ఆలోచించలేదు. ఆమెను చూస్తే అతడికి టైపు మిషన్, స్టెనో గ్రాఫర్సు నోట్ బుక్కో గుర్తుకొస్తుంది. చాలాసార్లతడికామె దగ్గరగా వచ్చినా ఆమెనో ఆడపిల్లగా అతడు ప్రత్యేకంగా గుర్తించలేదు. అలాంటిది అప్పుడామెనూ ఆమెప్రేమనూ కలిపి ఆలోచించాలి.

    హాసను తను ప్రేమిస్తూంటే ఆ ప్రేమ నిస్వార్ధమయినదయితే ఆమె ప్రేమను గౌరవించడం కోసం తను తనను ప్రేమిస్తున్నానన్న చరితను ప్రేమించాలి. ప్రేమ లేకపోయినా ఆమెకు దగ్గరవ్వాలి.

    అప్పుడే తను రమణకూ, హాసకూ చెడిపోవాలని కోరుకోడు.

    గౌతమ్ చరితకు తన మనసులో స్థానాన్ని కల్పించాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. అయితే బలంగా అక్కడ పాతుకుపోయిన హాస ఆమెను గెంటేస్తోంది.... వారిద్దరి మధ్యా జరిగే పోరాటాన్ని ఊహించుకుంటూ క్రమంగా నిద్రకు పడ్డాడు గౌతమ్. అప్పుడా పోరాటం కలలోకి మారింది.

    ఉదయం మెలకువ వచ్చాక ఆ పోరాట ఫలితం కలలో ఏమయిందో మర్చిపోయాడు గౌతమ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra