Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 22


    రాములు పూటుగా తాగేసి వున్నాడు. తనముందు అమాయకంగా నిలబడ్డ కుర్రవాడి టైట్ పాంటూ, టెరిలీన్ షర్టుల వెనుక ప్రతీరోజు కసరత్తు చేసిన శరీరం వుందని తెలియకపోవటం అతని తప్పుకాదు.
    కుమార్ ని కొట్టడానికి ఎత్తిన చెయ్యి గమ్యం చేరే లోపులో రెండు మణుగుల వస్తువేదో వాడి నెత్తిన పడ్డట్టు అయింది- రూపాయిన్నర మైకం క్షణంలో దిగిపోయింది. విషయం అర్ధమయ్యేలోపులో యింకో దెబ్బవచ్చి మొహంమీద తగిలింది. మసకబారిన కళ్ళకి పొట్టవైపు వస్తున్న చెయ్యి కనబడలేదు. ఆ తరువాత జరిగిందేమిటో రాములుకి తెలియదు.
    మొదట మునిసిపాలిటీ కొళాయి వాడి నుదుర్ని సుతారంగా ముద్దుపెట్టుకొంది. సరిగ్గా దానికి నాలుగడుగుల దూరంలోనే వున్న చెత్తకుండీలో పడ్డాడు ఆ తరువాత దెబ్బకి.
    చెత్తకుండీ పక్కనే మురికికాలువ వుండటం నిజంగా వాడి దురదృష్టం. చెత్తకుండీలోంచి రాముడు తాలూకు మాంసపు ముద్దని బయటకి తీసి, క్లయింట్ ఈస్టువుడ్ స్టయిల్లో ఇచ్చిన లాస్టుబ్లోతో వెళ్లి ఆ కాలువలో పడ్డాడు. చెత్తకుండీకన్నా అక్కడే కొద్దిగా సుఖంగా వుండటంవల్ల మరి కదల్లేదు ఆ శరీరం.
    గుండెలకి పుస్తకాలు అదుముకొని, అప్పటివరకూ జరిగిందంతా వూపిరి బిగపట్టి చూస్తూన్న అనూరాధ, కొళాయి దగ్గర చేతులు కడుక్కుంటున్న కుమార్ వైపు అడుగులువేసి, "థాంక్స్" అంది.
    సీరియస్ గా "కర్చీఫ్ వుందా?" అని అడిగాడు. పుస్తకాల మధ్య నుంచి తీసి యిచ్చింది. దాన్ని అందుకొని చేతులు తుడుచుకొని యిచ్చేస్తూ "వెళ్ళండి, ఇక ఫరవాలేదు" అన్నాడు, ఆమెవైపు చూడకుండానే.
                                            *    *    *
    "ఇది అన్యాయం" అన్నాడు వీళ్ళిద్దర్నీ చూస్తూ ఇంద్రుడు.    
    "ఏం?" విల్లు తుడుచుకుంటూ అడిగాడు అంగజుడు.
    "భూమిమీద కూడా విశ్వామిత్రులేమిటి? ఇంపాజిబుల్" అన్నాడు ఇంద్రుడు.
    "పాపం చాలా మంచి కుర్రాడు సార్!"
    "మంచివాళ్ళని పాడుచెయ్యటమేగా మన పని" అంటూ నవ్వాడు ఇంద్రుడు.
                    *    *    *
    "ఇది అన్యాయం" అంది అనూరాధ సీరియస్ గా.
    కుమార్ రెండడుగులు వేసిన వాడల్లా ఆగి- "ఏది?" అన్నాడు అర్ధం కానట్టు చూస్తూ.
    "అదే.... కర్చీఫ్ యిచ్చినందుకు థాంక్స్ చెప్పకుండా వెళ్ళి పోవటం" అంది.
    మొట్టమొదటి సారి ఆమెవైపు సూటిగా చూశాడు. ఆమెకు గబుక్కున సిగ్గు ముంచుకొచ్చింది. తల వంచుకొని తనలో తానే ఎందుకో నవ్వుకుంది. ఆ మసక చీకట్లో పెద్ద పెద్ద కళ్ళమీద విల్లులా వంగిన ఆ కనురెప్పల్నీ, విరిసీ విరియనట్లు ఆ పెదవుల మీద కదిలే దరహాస చంద్రికల్నీ చూస్తుంటే ఏదో రాగరంజిత రసానుబంధపు అస్థిత్వంలో అతని హృదయం నిండిపోయింది. అంతలో ఆమె నెమ్మదిగా కళ్ళెత్తి అతనివైపు చూసింది. క్షణం పాటు ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. "అమ్మాయిలంత అందంగా వుంటారా!" అనుకొన్నాడు కుమార్.
                                             *    *    *
    "వదులు" అన్నాడు ఇంద్రుడు. టపటపా అయిదు బాణాలు గురిచూసి కొట్టేశాడు మన్మధుడు. ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకొని గుంభనంగా నవ్వుకొన్నారు.
    "ఇక పోదామా?" చెరుకు విల్లు సర్దుకుంటూ అడిగాడు.
    "పద మన పనయిపోయిందిగా? ఇక వాళ్ళే పడతారు వాళ్ళ పాట్లేవో" అంటూ లేచాడు ఇంద్రుడు.
                                            *    *    *
    "నువ్వు వెధవ్వి" అన్నాడు వెల్లకితలా పడుకొని ఇంటి కప్పుకేసి చూస్తూ- అప్పారావు.
    కుమార్ మాట్లాడలేదు. సిగరెట దమ్ము పీల్చి, "అయినా అమ్మాయితో సిరిగ్గా మాట్లాడలేనివాడివి నువ్వు దేనికి పనికొస్తావురా?" అన్నాడు మళ్ళీ తనే.
    "అదికాదు గురూ! అసలు" అంటూ ఏదో చెప్పబోయాడు కుమార్.
    "ఇంకేం హరికథ చెప్పకు గురో! నువ్వా అమ్మాయిని ప్రేమించేశావు. లేకపోతే ప్రతిరోజూ సాయంత్రం ఆ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఎందుకు తచ్చాడతావు. చెప్పు?"
    "నేన్నిజంగా ఆ అమ్మాయిని...."
    "కాదన్ను, యు లవ్ హర్. కానీ, నచ్చనిదల్లా నా కొకటే. ఆ రాత్రి మాట్లాడే ఛాన్స్ వదిలిపెట్టి, మళ్ళీ మరుసటిరోజు నుంచీ ఫ్రెష్ గా ఫైల్ ఓపెన్ చెయ్యటం ఏమిటి చెప్పు. దాదాపు మళ్ళీ కొత్తకేసు మొదలు పెట్టినట్లు అన్నీ చేసుకొంటూ రావాలి కదా ఇప్పుడు?"
    "అప్పుడు భయం వేసిందిరా. కానీ, ఇంటికొచ్చిన తరువాత ఆ అమ్మాయే మాటిమాటికీ గుర్తుకొచ్చి...." అని నీళ్ళు నమిలాడు.
    "ఏడ్వలేకపోయావు! అయినా హీరోకి వుండవలసిన లక్షణం ఒకటీ లేదేంట్రా నీకు?"
    "క్షమించాలి" అన్న కొత్తకంఠం గుమ్మం దగ్గర వినిపించటంతో ఇద్దరూ అటు చూశారు. లాల్చీ, పైజామా వేసుకొని అక్కడ ఓ మనిషి నిలబడి వున్నాడు.
    ఏమిటీ?" అని అడిగాడు అప్పారావు.
    "క్షమించాలి. ఆ కథలో హీరో కుమార్ కాదు. మీరే" అన్నాడు వినయంగా. "అది చెప్పటానికే వచ్చాను."
    "మీరెవరు?"
    "ఈ కథ రచయితని"
    "హల్లో... హల్లో" అని లేచాడు అప్పారావు.
    "సారీ, సారీ. నేను ముళ్ళపూడిని కాను" అని బిక్కమొహం పెట్టాడు ఆ లాల్చీ వ్యక్తి.
    "పోనీ ఒక్క హల్లో - ఎట్ లీస్టు టూ - టూ - రుపీస్" అని దగ్గిరగా వచ్చాడు.
    "సారీ, వెరీ సారీ" అంటూ మాయమైపోయాడు ఆ లాల్చీ తాలూకు మనిషి.
    "గురుడు బెదిరిపోయాడు" అనుకొంటూ తలుపు గడియవేసి వచ్చి కూర్చుని, "ఊఁ చెప్పు" అన్నాడు.
    "నేను చెప్పటానికేమీ లేదు. పరిష్కారం నువ్వే చెప్పాలి" అన్నాడు కుమార్.
    "సరే, ఒక సిగరెట్టుంటే అప్పియ్."
    "ఇంతదానికి అప్పెందుకు! తీసుకో!" అంటూ పాకెట్టిచ్చాడు.
    "అమ్మమ్మ. ప్రిన్సిపుల్ ప్రిన్సిపులే" అని సిగరెట వెలిగించి, "కాగితమూ, కలమూ తీసుకో. విషయం అటో ఇటో తేల్చేద్దువుగాని" అన్నాడు.
    "ఏమిటీ" అని అర్ధంకానట్టు అడిగాడు కుమార్.
    "ఆ రచయిత చెప్పింది నిజంగా నిజమే. నువ్వు హీరోవి కావు! లవ్ లెటర్ అంటే తెలియనివాడివి నువ్వు హీరోవేమిటి నా మొహం!" అంటూ విసుక్కొన్నాడు అప్పారావు.
                                             *    *    *
    "చాలా ఫ్రాంక్ గా వ్రాశాడు- ప్రతి వాక్యంలోనూ సిన్సియారిటీ కనబడుతోంది" అంది భారతి, పదోసారి చదివి.
    "నిజమే కానీ..." అంటూ పదోసారి సగంలో ఆపుచేసింది అనూరాధ.
    "వెళ్ళు. మరేం ఫర్వాలేదు" అంటూ పదోసారి ధైర్యం చెప్పింది భారతి.
    "భయంగా ఉంది, బాబూ" అని పదోసారి అనలేదు అనూరాధ. ఒక నిశ్చయానికి వచ్చినట్టు "సరే వెళతాను" అంది.
                    *    *    *   
    "గురో- గురో" అని అరుచుకొంటూ లోపలికి విసురుగా వచ్చాడు కుమార్-" ఒప్పుకొంది గురూ, అనూరాధ వస్తోంది".
    "నిజమా" అంటూ పక్కమీదనుంచి లేచాడు అప్పారావు.
    "నిజం. నీ మీదొట్టు. ఉత్తరం చింపలేదు సరికదా కొద్దిగా నవ్వింది కూడాను. పైగా కనపడీ కనబడనట్టూ తల వూపింది." అంటూ ఏదో అనుమానం వచ్చి, "అలా డల్ గా వున్నావేమిటి?" అని అడిగాడు.
    అప్పారావు భారంగా లేచి, రెండు చేతులూ వెనక్కి కట్టుకొని సినిమాలో గుమ్మడిలా గంభీరంగా - "కుమార్! నువ్వు అనూరాధనెక్కువ ప్రేమిస్తున్నావా? నీ తండ్రినా?" అని అడిగాడు.
    కుమార్ బిత్తరపోయి "ఏమిటి?" అన్నాడు అర్ధంకానట్టు.
    రెండడుగులు వేసి, స్నేహితుడి భుజంమీద చెయ్యివేస్తూ బరువుగా "నాకు తెలుసు కుమార్, నీది కళంక రహితమైన ప్రేమ. కానీ, మీ నాన్నమీద కూడా నీకు అకుంటితమైన భక్తి వుందనీ, ఆయన మాట దాటవనీ, ఆయన మనస్సు నొప్పించే పనేదీ నువ్వు చెయ్యవనీ నాకు తెలుసురా! ఒకవైపు ప్రేమ, యింకోవైపు గౌరవం. ఈ రెండింటి మధ్య నలిగిన నీ జీవితం...." అన్నాడు.
    "రేయ్! చంపీగల్ను. అసలు విషయమేమిటో చెప్పకుండా ఇలా బరువైన డైలాగు ఇంకొక్కటి మాట్లాడేవంటే ఈ గోడకే నీ ఫోటో కట్టించి, నేనూ అనూరాధా హారతి ఇవ్వవలసి వస్తుంది జాగ్రత్త. అసలు విషయం చెప్పు" అన్నాడు.
    "చెప్పలేన్రా! ఈ బాధాతప్తమయిన హృదయంతో నేనేమీ చెప్పలేను- ఈ రోజు నీ కొచ్చిన ఉత్తరం ఇదిగో- ఎక్స్ ప్రెస్ డెలివరీ కాబట్టి నేనే విప్పి చదివాను" అంటూ ఉత్తరం ఇచ్చాడు.
    కుమార్ ఆత్రంగా ఉత్తరం అందుకొని చదవసాగాడు.
    "చిరంజీవి కుమార్ కి.
    నువ్వు క్షేమమని తలుస్తాను. ఇక్కడంతా క్షేమం. అమ్మ ఆరోగ్యం మాత్రం ఏమీ బాగాలేదు.    

 Previous Page Next Page