Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 22

           

                                                     అధ్యాయం -3
   
   
    పదహారు గంటల సమయం ఎంత భారంగా గడిచిందో ఆ తర్వాత రెండు గంటలు అంత వేగంగా గడిచిపోయాయి. లాయర్ వెంకటరత్నం బయటకు రావడమే ఆలస్యం- బెయిల్ కోసం పర్సనల్ బాండ్ యివ్వాలనగానే రాయన్న తండ్రి వచ్చి ఆ పని చేశాడు. ఆ తర్వాత పనులన్నీ వేగంగా జరిగిపోయాయి.
   
    సాయంత్రం అయిదున్నరకి రాయన్న కస్టడీ నుంచి బయటకు వచ్చాడు. మనిషి చాలా క్రుంగిపోయి వున్నట్లు అతడి వాలకం చెబుతోంది. రాయన్న తండ్రి కంటనీరు పెట్టుకోవడం తప్ప నోరు విప్పి ఒకమాటయినా అనలేదు. చేయాల్సిందంతా తన చేతిలోనే వుందని కిరణ్మయికి అర్ధమయిపోయింది.
   
    "పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. మీరు రెండు మూడు రోజుల తర్వాత వచ్చి నన్ను కలవండి" అని వెంకటరత్నం రాయన్నవైపు తిరిగి - "మీరు బాధపడాల్సిందీ, భయపడాల్సిందీ ఏమీలేదు. ఆట మీద దృష్టి కేంద్రీకరించండి. విష్ యు గుడ్ లక్" అంటూ, అతనితో కరచాలనం చేసి వెళ్ళిపోయాడు.
   
    కిరణ్మయి మామగారి దగ్గరగా నడిచింది. "మామయ్యా, మీరు మా యింటికి వెళ్ళి, నా గురించి దిగులు పడవద్దని మా వాళ్ళతో చెప్పండి. బహుశా రేపు రాత్రి ఢిల్లీ మా అప్రయనం వుంటుందేమో నేను వచ్చి బట్టలన్నీ తెచ్చుకుంటాను."
   
    "మరి ఇప్పుడు ఎక్కడకు వెళదామని?" అడిగాడాయన.
   
    "ఈయన అద్దెకు తీసుకుని వుంటున్న ఇల్లుందిగా అక్కడకు వెళతాం. మా ఇంటికి వస్తే అక్కడ మా వాళ్ళ ప్రవర్తన ఈయనకు మనస్తాపం తప్ప మనశ్శాంతి నివ్వదు. అందుకే చెపుతున్నా మామయ్యా, మా వాళ్ళను ఎవర్నీ రానివ్వకండి ఏదో సర్ది చెప్పెయ్యండి" అంది వేడుకోలుగా.
   
    "అలాగేనమ్మా నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి ఇదుగో ఇదుంచు" జేబులోంచి కొంత డబ్బు తీసి అందించాడు. "ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందో ఏమిటో రేపు తీసుకొచ్చి ఇస్తాను. దేనికీ ఇబ్బంది పడకండి."
   
    కిరణ్మయి కృతజ్ఞత నిండిన కళ్ళతో అతడికి సమస్కరించింది. ఆయన కదిలిపోయాడు. నిజానికి ఇవన్నీ తను చేయాలి. చదువుకున్న అమ్మాయి తన కోడలవాలనే కోర్కె ఎంత ఉచితమైందో ఇప్పుడు అర్ధమవుతోంది. కిరణ్మయి తన నమ్మకాన్ని వమ్ముచేయడం లేదు. అది తృప్తికరంగా వుందాయనకు.

    "వస్తానమ్మా జాగ్రత్త" చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు మాత్రం మిగిలారు.
   
    పగలంతా తలఎత్తి సూర్యుడి గమనాన్ని అనుసరించి చూస్తూ, అతడు కనుమరుగవగానే అలసటతో తలలు వాల్చేసిన పొద్దు తిరుగుడు పువ్వుల్లా వాడిపోయి వున్నారిద్దరూ రాయన్న మరీనూ.
   
    కిరణ్మయి చిరునవ్వుల ఉత్సాహాన్ని మొహాన పులుముకుని అతడి దగ్గరగా నడిచింది. "మనింటికి వెళదామా?" అడిగింది మెల్లగా.
   
    రాయన్న మాట్లాడలేదు. మనసులో బాధ ముఖంలో ప్రతిబింబిస్తుంటే బొమ్మలా నిలబడిపోయాడు. కిరణ్మయి ఆటో పిలిచి అడ్రసు చెప్పింది.
   
    అలాంటి పరిస్థితిలోనూ రాయన ఆమె దురాలోచనను అభినందించకుండా ఉండలేకపోయాడు. పరిస్థితి ఇలా వస్తుందని తెలిసినట్లుగా అడ్రసు తీసి దగ్గిర పెట్టుకుంది. ఈమె తన భార్య అనుకోగానే ఏదో తెలియని రిలీఫ్ అంతలోనే 'ఇలాంటి అమ్మాయిని కూడా కష్టపెడుతున్నానే' అని ఏదో దిగులు.
   
    రెండు గదుల చిన్న పోర్షనది. చిన్న వంటిల్లు. మరొ గది పెద్దది. పక్కనే బాత్రూము.
   
    కిరణ్మయి అంతా చూసి వచ్చి ఓ కుర్చీలో కూర్చుంటూ "బావుంది" అంది. రాయన్న తలుపు దగ్గర నుంచి కదల్లేదు. అతడి చూపులు నిస్తేజంగా శూన్యంలో నిల్చిపోయాయి.
   
    ఘనీభవించిన దుఃఖం చిరుస్పర్శకి పగిలి బద్దలవుతుంది. కిరణ్మయి కూడా కదల్లేదు. ఆమె అతడికి అందించాలనుకుంటున్నది సానుభూతి, జాలి కాపు ధైర్యం, ఆత్మవిశ్వాసం.
   
    "అలా నిలబడ్డారేం? వచ్చి కూర్చోండి. మనింట్లో మనకు మర్యాద లెందుకు" అంది నవ్వుతూ రాయన్న మెల్లగా కదిలివచ్చాడు. నెమ్మదిగా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె ఒళ్ళో తల పెట్టుకున్నాడు. కిరణ్మయి చలించిపోయింది.
   
    వద్దంటే వచ్చే కన్నీళ్ళకూ..... పోనీ పోనిమ్మనే వ్యర్ధ వైరాగ్యాలకూ కానీ కానిమ్మనే అసందర్భ నిర్లిప్తతకూ.....గోడమీద రాలిపోతున్న కాలం ఏమీ చెప్పదు.
   
    గడియారం గుండె విప్పదు.
       
    కథంటే-కావల్సినచోట ఆనందాన్ని అతికించొచ్చు. వద్దనుకుంటే విషాదాన్ని తీసెయ్యొచ్చు. జీవితం అలాకాదే. అది రచయిత జ్యూరిస్ డిక్షన్ లోంచి జారిపోయిన చేదు సత్యం.
   
    వసంతాలు లేకుండానే వర్షాలు గడిచిపోయినయ్. కొత్త చిగుళ్ళకి కాలమింకా రాలేదనుకుని కోకిలలు వెనుదిరిగాయి. ఓ క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవటానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవడానికి జీవితకాలం పడుతుంది.
   
    నాలుగురోజుల్లో ఎన్ని మార్పులు?
   
    సంతోషం అగరొత్తిలా వెలిగింది. విషాదం బూడిదలా మిగిలింది.
   
    ........
   
    తలుపు చప్పుడయితే వెళ్ళి తీసింది. స్నేహితుడు వచ్చాడు. "రిజర్వేషన్ దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ లో ఇచ్చాడు. బెర్త్ దొరకటం కష్టం కాదన్నాడు."
   
    "టిక్కట్టేమిటి?" ఇంతసేపటికి మొట్ట మొదటిసారి మాట్లాడాడు రాయన్న.
   
    "అదంతా సిస్టర్ చెపుతారు." అని వెళ్ళబోయి ఆగి వెనక్కొచ్చి, "నువ్వు చాలా అదృష్టవంతుడివి రాయన్నా అదృష్టాన్ని అందుకోవటం సులభం నిలుపు కోవటం నీ చేతుల్లో వుంది. సిస్టర్ ని బాధపెట్టకు" అని వెళ్ళిపోయాడు.
   
    రాయన్న కిరణ్మయి వైపు అర్ధంకానట్టు చూశాడు.
   
    "మనం ఢిల్లీ వెళ్తున్నాం. టెలిగ్రాం వచ్చింది" అంటూ ఆ కాగితాన్ని అందించింది. అతడు సెలక్టయినట్టు టెలిగ్రాం అది. చదివి, నెమ్మదిగా తలపైకెత్తాడు. అతడి చేతివేళ్ళ కంపనం స్పష్టంగా తెలుస్తూంది. అతడి కళ్ళల్లో తడి స్పష్టంగా తెలుస్తూంది.
   
    పిలవకుండానే.
   
    ఎన్ని స్వప్నాలో ఈ కళ్ళకి!
   
    తెల్లవారి దుప్పటి దులిపితే   
   
    సాక్ష్యం దొరక దొక్క స్వప్నానికీ!
   
    ఆ శోభనంరోజు అర్ధరాత్రి పోలీసులు కాకుండా పోస్ట్ మాన్ వచ్చి ఈ టెలిగ్రాం అందించి వుంటే - ఎం..... త.... బావుండేది!
   
    మల్లెపూల పానుపుమీద ఆనందం అక్షరాలుగా విచ్చుకునేది.
   
    ప్రతిమనిషికీ జీవితంలో కొన్నే మధుర ఘడియలుంటాయట. మిగతా జీవితమంతా దానికి ఉపోద్ఘాతమూ, స్మృతీ మాత్రమేనట. ఎంత నిజం!
   
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అడిగింది కిరణ్మయి.
   
    "ఏమీలేదు" నిర్లిప్తంగా అన్నాడతడు.
   
    "మన ఒప్పందం సంగతి మర్చిపోయారా? అడగ్గానే చెప్పేయాలని నిర్ణయించింది మీరే" నవ్వుతూ అంది.
   
    "నేనిప్పట్లో ఆడలేను కిరణ్. నన్ను బలవంతం చేయకు"
   
    కిరణ్మయి ముఖంమీద చిరునవ్వు చెరగలేదు. "మీరు, ఎందుకలా అనుకుంటున్నారు? మీరు ఆడాలి. ఆడతారు" ఆమె స్వరం మంద్రంగా మారిపోయింది.
   
    " 'నేనీ హత్య చేయలేదు. నువ్వయినా నన్ను నమ్ము' అన్నారు మీరు. నేను నమ్మాను. ఎలాంటి తప్పూ చేయలేదని మీ అంతరాత్మకే తెలుసు. అలాంటప్పుడు ఎవరో మీమీద చేయని నేరం మోపడానికి ప్రయత్నిస్తే, దానికి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవడం సమంజసమా? ఈ జీవితం మనది. మన సుఖం, సంతోషం, విజయం మనం అనుభవించినట్లుగా మరొకరు అనుభవించలేరని తెలుసుకోవాలి. మన కోసం మనం బ్రతకాలి. ఈ పరిస్థితిలో మీ లక్ష్యం క్రికెట్ మీ దృష్టి ఆ లక్ష్యం మీద కేంద్రీకరింపబడాలి."
   
    "నువ్వు చెప్పేది నిజమే కిరణ్. కానీ ఈ పరిస్త్య్త్య్లో పదిమందిలోకీ వెళ్ళి ఆడటం నావల్ల కాదేమో అనిపిస్తోంది."
   
    "మీరలా భయపడేకొద్దీ ఈ జనం 'నిజంగా తప్పుచేసేడేమో' అనుకుంటారు. మీ వ్యతిరేకులు మరింత ప్రచారం చేస్తారు. ఈ జనం ఫాస్ట్ బౌలర్ చేతిలో బంతిలాంటివాళ్ళు. మనం లాగిపెట్టి కొడ్తే ఎక్కడో వెళ్ళి పడతారు. కొంచెం బెదిరితే మనమీదనుంచి దూసుకుపోతారు."
   
    రాయన్న మాట్లాడలేదు.
   
    "ప్రొద్డున్నుంచీ మనం ఏమీ తినలేదు. ముందు టీ తీసుకొస్తాను. ఈ లోపులో మీ ఆలోచన ముగించండి" నవ్వుతూ అని లోపలికి వెళ్ళింది.
   
    రాయన్న పిరికివాడు కాదు. ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోయేవాడూ కాదు. అనుకోకుండా తగిలిన ఈ దెబ్బనుంచి తట్టుకోలేకపోతున్నాడు.
   
    ఆమెమాత్రం తన మొహంలో చిరునవ్వు, ధైర్యమూ ప్రతిక్షణమూ కనపడేలా ప్రయత్నిస్తోంది.

 Previous Page Next Page