భావం, లేక అనుభూతి అనేదాన్ని మాటల్లో వెలువరించటం అనే అతి పురాతనమైన పద్దతిలో తప్ప నేను ఏ రకంగా నీకు ఈ వివశత్వాన్ని తెలుపగలను?
పెళ్ళికాని అమ్మాయిగా ఈ ఫీలింగ్స్ అన్నీ సహజమే! నా వివాహం మామూలుగా జరిగిపోయినా నువ్వు మళ్ళీ నాకు కనపడకపోయినా-ఆ ముద్దు ఒక తీపి జ్ఞాపకంగా మనసుపుటల్లో నిలిచి పోయేది. రాజకీయాల్లో పూర్తిగా నశించిపోయిన నాన్నగారు ఆఖరి ఎత్తుగా, వయసు ఎక్కువగా వున్న శర్మగారితో - వివాహం జరిపించకపోయినా, శర్మగారి మొగతనమంతా గుర్రాలకీ, తాగుడికీ అంకితం కాకపోయినా పరాయి పురుషుడికి అలా మనస్సు విప్పి వ్రాసి చులకన అయ్యే స్థితి నాకు కలిగేది కాదేమో!
నా మీద నీకు అసహ్యం కలిగితే క్షమించు దాహంతో వున్న మనసు నైతిక విలువల్ని గుర్తించదు.
ఎవరో ఒక కుర్రవాడు షోకేసులో బొమ్మకి అద్భుతంగా చీర కట్టాడు అని మా ఆయన చెప్తే, ఒక టెక్స్ టైల్స్ యజమానినే అంతగా స్పందింపజేసిన ఆ కుర్రవాడు ఎవరా అని నేనే స్వయంగా వచ్చి మళ్ళీ రెండోసారి నిన్ను చూసిన క్షణం...
మనిషి తను పొందిన అనుభూతిని, లేక అతను అనుభవించిన ఉద్వేగాన్ని తనకు చేతనైన ఛానెల్స్ లో వెల్లడించటానికి చేసే ప్రయత్నంలో 'మాటలు' తప్ప మరే దాన్నీ ఉపయోగించటానికి వీలు కల్పించలేకపోవటం మనిషికి దేవుడిచ్చిన పెద్ద శాపం. ఈ 15 సంవత్సరాల్లోనూ నువ్వు పెద్దవాడవయ్యావు. (నాకు నవ్వొస్తూంది. ఈ టైమ్ లోనే మొట్టమొదటిసారి నువ్వు కనిపించి వుంటే అప్పడు చేసినంత సాహసం చెయ్యగలిగేదాన్నికాదేమో) ఇన్నాళ్ళూ నా మనసులో గూడు కట్టుకున్న భావాలకి నిన్ను చూడటం సముద్రం మధ్యలో అగ్నిపర్వతం బ్రద్దలైన ఫీలింగ్ నైతిక విలువలు నీళ్ళలా ఆవిరయిపోకుండా ఉంచటానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది.
అప్పటినుంచీ ప్రారంభమైంది నరకం!
అంచెలంచెలుగా నువ్వు పెరిగిపోవటాన్ని-తెరచాటు నుంచి ప్రేక్షకురాలిగా గమనిస్తూ వచ్చాను. శిథిలమయిపోతున్న మా కుటుంబ ఆర్ధిక వ్యవస్థని నువ్వే నిలబెట్టావని నాకు తెలుస్తూనే వుంది. అన్నిటికన్నా నాకు విస్మయాన్నీ, ఆనందాన్నీ కలిగించిన విషయం- నువ్వుకూడా భావుకత్వాన్ని ఆస్వాదిస్తావని తెలియటం! భావుకత్వాన్ని ప్రదర్శించేవాళ్ళు చాలా తప్పుదార్లో లోకాన్ని అప్రోచ్ అవుతున్నారనీ, జీవితం వాళ్ళకి పూలపానుపు కాదనీ నేను అనుకుంటూ వుండేదాన్ని నా అభిప్రాయం తప్పు అని నాకు తెలియజెప్పావు. క్రమక్రమంగా నా ఆలోచన్లన్నీ నీ చుట్టూ తిరగసాగాయి. ఎన్నో సంవత్సరాలు కంట్రోలు చేసుకున్నాను. ఇక చేసుకోలేక ఈ ఉత్తరం!
నేను తప్పు చేస్తున్నానా?
లేదనే నా అభిప్రాయం. ఇన్నాళ్ళ మానసిక ఘర్షణ తరువాత నేను చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నిన్ను కలుసుకోకుండా వుండలేను. ముద్దుతో ప్రారంభమైన మొక్క- ఆయన నిరాసక్తతతో మహావృక్షమై- మనసంతా ఆక్రమించుకున్న ఈ క్షణాన- ఇంకా నైతిక విలువల్ని పట్టుకుని వేలాడటం- నా నిస్సారమైన జీవితానికి పరాకాష్టగా, నరకంగా అవుతుంది నిజం!
నిన్ను రెండోసారి చూసినప్పుడు నా డైరీలో- 'మలయమారుత తూగుటుయ్యాలలో పులకించు పుష్పాలు..... అంచెలంచెలుగా సొగసు చిలకరించు మంచు భాష్పాలు'.
అని వ్రాసుకున్నాను. ఒక వివాహిత యిలా వ్రాసుకోవటం మన సమాజం హర్షించదు. డబ్బుకోసం కూతుర్ని ముసలివాడికిచ్చిన సమాజం.....వ్యసనంలో భార్యని నిర్లక్ష్యం చేసిన సమాజం.....దీన్ని గౌరవించే ఓపిక నాకు పోయింది ఈ ఉత్తరం ఇలా వ్రాయటం నాకు ఒకవైపు భయంగానే వుంది. నన్ను నువ్వెలా అర్ధం చేసుకుంటావో అని, మళ్ళీ ఇంకోవైపు అనిపిస్తోంది.
పొగలెక్కిన అగరు తెరలెత్తి - పొగరెక్కిన వగలు మరులొత్తి పెదవుల నదిమి, ముద్దును చిదిమి- చైత్రం సుగంధ వీచిక.... చిత్తం ప్రబంధ మాలిక-
అని.
"మెత్తని సిల్కుచీరె శరీరాన్ని చుట్టేసినట్టు, ఏదో మధుర భావన. జీవ దర్శనంతోపాటు ఒక తాదాత్మ్యత కావాలి మనిషికి. వేణువులో దూరిన ప్రతి వెర్రిగాలీ ఒక పాటగా మారినట్టు- నాలో కదిలే ప్రతీ భావం ఇప్పుడు మృదుమంజుల భావం అవుతోంది. నవ్వితే సిరిమల్లి- నడిస్తే పిల్లగాలి- పలికితే పాలవెల్లి- నీ తలపు నా మనసంతా వెదజల్లి... మనసుకు మించిన కళాఖండం లేదు గదూ రవీ! ఇదంతా అసలు నీకు ఆగమ్య గోచరంగా వుండవచ్చు. నిచలంగా వున్న నీ మనోతటాకంలోకి ఈ ఉత్తరం ఒక అవసరమైన రాయి అవ్వొచ్చు కానీ అయిదారు సంవత్సరాలు ఈ అంతర్ సంఘర్షణతో విసిగిపోయాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు, ఆయన కాఫీ ఇమ్మన్నా నేను బయటకు రాలేకపోవటానికీ, రవితేజా టెక్స్ టైల్స్ వారు కుటుంబాల్తో సహా ఏర్పాటు చేసిన ఫంక్షన్ లని నేను ఉద్దేశపూర్వకంగా ఎవాయిడ్ చేయటానికీ వెనుక యింత సంఘర్షణ వుందని నువ్వు గ్రహిస్తే చాలు. నన్నొక లేకి స్త్రీగా మాత్రం చూడకు. నన్ను నేను బంధించుకోవటానికీ, సామాజిక న్యాయలకి విలువ నివ్వటానికీ ఎంత కష్టపడ్డానో నువ్వు గుర్తిస్తే చాలు. ఈ భావాలన్నీ వెకిలిగానూ, నా కోర్కె అర్ధరహితంగానూ కనిపిస్తే ఈ ఉత్తరం సంగతి మర్చిపో. మనసు మాత్రమే కోరుతుంది. శరీరానికి కోర్కె వుండదు అనుకోవటం హిపోక్రసీ నీకేం గమ్మత్తుగా లేదుకదూ నేనిలా వ్రాయటం. నాకు నువ్వే మీ కొత్త కాదు అన్న భావన నన్ను ఇలా తోచింది తోచినట్టు వ్రాయటానికే పురిగొల్పుతుంది. పదిహేను సంవత్సరాల క్రితం ఆ రోజు ఇంకా నీకు గుర్తుంటే- నన్ను కలుసుకోవటం నైతిక విలువలని అగౌరపర్చటం కాదని నువ్వు అనుకుంటే-మనం కలుసుకుందాం. ఇక ఈ సంఘర్షణని నేను భరించలేను. ఎల్లుండి ప్రొద్దున్న తాజ్ లో పదింటికి నీ కోసం ఎదురు చూస్తూ వుంటాను. నువ్వు చెక్కిన శిల్పం నీకు గుర్తులేకపోతే, నా యీ భావాలన్నీ నీకు అర్ధరహితంగా కనిపిస్తే, కట్టుబాట్లనుంచి బయటపడటానికి నేను పడిన బాధ నీకు బరితెగింపుగా కనిపిస్తే- ఈ ఉత్తరం చింపెయ్యి.
ఇంకేం వ్రాయను?
గుండె గోదారై, హృదయం కావేరై, సముద్రాన్ని కంటి చివర చుక్కగా మిగుల్చుకుని ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాననీ, ఇది క్షణికావేశం కాదనీ నువ్వు గ్రహిస్తే చాలు నాకు కలుసుకోకపోయినా ఫర్వాలేదు-తేలిక భావాల్ని మాత్రం ఏర్పర్చుకోకు ఒకప్పటి....
-మిస్ విజయవాడ.
ఉత్తరం చదవటం పూర్తిచేసి అతడు శిలాప్రతిమలా చాలా సేపు అలాగే కూర్చుండిపోయాడు. మనసంతా ఏదో మంచు ముద్ద మధ్య పెట్టినట్టు ఘనీభవించింది. అతడు ఏం ఆలోచిస్తున్నాడో అతడికే తెలియదు. అర్దరాత్రి కావొస్తూంది.
ఆ చీకటి నిశ్శబ్దంగా, అతడి ఆలోచనాతరంగాల్ని పరిశీలిస్తున్నట్టు స్థబ్దంగా వుంది. సోఫా వెనక్కివాలి, నుదుటిమీద చెయ్యిఆన్చి కళ్ళు మూసుకుని వున్నాడు అతడు.
అతడా అమ్మాయిని మర్చిపోలేదు. పదిహేనేళ్ళక్రితపు స్త్రీమూర్తి ఒక సజీవాకృతిలా అతడి మనోఫలకం మీద చిత్రంచబడే వుంది. అయితే ఒక అనూహ్యమైన మలుపులో ఆకస్మికంగా ఇలా బయటపడుతుందని మాత్రం అనుకోలేదు. అతఃడికి సంబందించినంత వరకూ అదొక జ్ఞాపకం. అంతే అంతకు మించేమీ లేదు. కానీ ఈ ఉత్తరం వచ్చిన తరువాత...
అప్పటివరకూ ప్రశాంతంగా వున్న తటాకంలో ఒక హంస ఇట్నుంచి అటు కదలగా ఏర్పడిన వయ్యారపు తరంగాలు....
అతఃడికి బాధ వుంది. కానీ ఐదేళ్ళుగా ఆ బాధని అలవాటుగా మార్చుకుని సహజీవనం చేస్తున్నాడు. ఇంటిలో సుఖంలేని మొగవాళ్ళు బయట వ్యసనాలకు దాసులవ్వొచ్చు. అతడు అలా 'పని'కి దాసుడయ్యాడు. అతడికి సుఖాలకు కొనుక్కోవటంగానీ, జీవితాన్ని అనుభవించటం గానీ తెలీదు. ఇంటిలో లేని ప్రశాంతత అతడికి పనిలో దొరికేది.
అతడు ఆ ఉత్తరాన్ని అప్పటికే పదిసార్లు చదివాడు. ఆమె అక్షర శిల్పం, మనో సంచలనాన్ని బహిర్గత పరిచిన విధానం, అతడిని కదిలించి వేసింది. శూన్యత ఎలా వుంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆమె ఎంత మధనపడి, ఎంతకాలం కొట్టుమిట్టులాడి ఆ నిర్ణయానికి వచ్చిందో ఆ ఉత్తరం చెపుతూంది.
-బట్టల కొట్టులో గోపీమాధుర్ కి ఉద్యోగం ఎందుకుపోయిందో ఇప్పుడు అర్ధమైంది. శర్మగారితో మాట్లాడుతూ వుంటే తెర వెనుకే కదలికల కర్ధం ఇప్పుడు తెలిసింది.
ఎడారిలో ఎంత ఎండ కాసినా ఫర్వాలేదు. కానీ కాస్త వర్షం వచ్చి నాలుగు చినుకులు పడ్డాక తిరిగి ఎండా భరించటం కష్టం. అప్పటివరకూ ఎండకు సిద్దపడి ఎడారిలో ప్రయాణం చేస్తున్న వాడికి అనుకోని విధంగా మబ్బుతునక కనపడ్డట్టు అయింది. అది వర్షమే కురిపిస్తుందో- తుఫానే రేపుతుందో, లేక గాలికి తేలిపోతుందో కాలమే నిర్ణయించాలి.
11
'ఎల్లుండి పది గంటలకి'అని ఆమె వ్రాసింది. ఆ ఉత్తరం వ్రాసిన తారీఖు అతడికి పిడుగుపాటులా తోచింది.....రేపే!