16
డబ్బు చేతిలో పట్టుకుని తనను సమీపించిన రాజారావును చూస్తూనే విషయం ఊహించిన అనిత ఆ డబ్బు ఎలా సంపాదించగలిగాడో అని ఆశ్చర్యపోయింది.
"నీ డబ్బు నువ్వు తీసుకో. నా బొమ్మ నాకియ్యి" అన్నాడు.
"ఇంత డబ్బు ఎలా సంపాదించావ్?"
"నీకు వివరించవలసిన అవసరం నాకు లేదు. అయినా వివరిస్తున్నాను. తులశమ్మగా రిచ్చారు."
అనిత పకపక నవ్వుతూ "ఎంత బాగుంది? నా దగ్గిర తీసుకోవటం నీకు అవమానకరమూ, వంట మనిషి దగ్గిర తీసుకోవటం గౌరవమూనా?" అంది.
"ఆవిడ వంటమనిషే కావచ్చు. కానీ మా అమ్మ, అంచేత ఆవిడ దగ్గిర తీసుకోవటం నాకు గౌరవమే?"
అనిత కళ్ళప్పగించి చూసింది.
"నీకు తెలిసిపోయిందా?"
"నీకు ముందే తెలుసా?"
"తెలుసు."
"మరి నాకెందుకు చెప్పలేదు"
"అహర్నిశలూ సమాజంలో పరువు ప్రతిష్టలకోసం పాకులాడే నువ్వు ఈ నిజాన్ని విని భరించలేవని. వారిని స్వీకరించలేకా , పరిత్యజించ లేకా సంఘర్షణలో నలిగిపోతావని."
"అనితా! ఒకనాడు 'లజ్జ వడటం నీకు తెలుసునా?' అని అడిగావు. గుర్తుందా? ఈనాడు నీముందు నిజంగా లజ్జపడుతున్నాను. బహిరంగ సభలలో వర్గవిభేదం వుండరాదని వక్కాణించి కొడుకుకు తమ శాఖలో తప్ప సంబంధం చేయని పెద్దలకు వారసుణ్ణి, భార్యను ఇంటిలో తాళం పెట్టి వేదికమీద స్త్రీ స్వాతంత్ర్యం గూర్చి ఉపన్యసించే మహామహుల శిష్యుణ్ణి, మిధ్యా ప్రతిష్ఠల పేర అనుక్షణమూ ఆత్మసంచనతో జీవించే సమాజానికి చిహ్నాన్ని......"
"బావా!"
"అదంతా నిన్నటివరకు! ఈ రోజునుండీ ప్రతిష్టకు నా అర్థం వేరు. లెక్కలేనన్నిగ్రంధాలు చదివి ఏమీ నేర్చుకోలేకపోయాను. ఒక్క మంచి మనసు జీవితానికి అర్థం వివరించింది. ప్రతిష్ఠ ప్రాకులాడి సంపాదించేది కాదు. మన అంతరంగంలో దీపించే దివ్య జ్యోతి."
"బావా! అయితే జానకి...."
"మనతోనే, మనింట్లోనే ఉంటుంది. తులశమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు."
"ఈ సమాజం రహస్యంగా సాగినంతవరకు ఎంతటి అవినీతినైనా సహించగలదు. కానీ దాని కట్టుబాట్లకు విరుద్దంగా ఎవరైనా దైర్యం చేసి కోరింది పొందితే మాత్రం సహించదు. పొడిచి పొడిచి బాధిస్తుంది."
"ఆ బాధకు భయపడి నావారిని వదిలి పెట్టను."
"రమణరావు..."
అనిత చెప్పేది పూర్తి కాకుండానే అడ్డుకున్నాడు రాజారావు.....
"జానకి ఉంటే రానంటాడు. స్పష్టంగా చెప్తాను. జానకి కూడా నా చెల్లెలని - అప్పటికీ అర్థం చేసుకోకపోతే మనం ఆ సంబంధం వదులుకోవలసి వుంటుంది. డబ్బు తీసుకో!"
"నీకు గుర్తుందా? నీ మనసులో నా బొమ్మని తీసేయగలిగినప్పుడు నీ బొమ్మ నీకిచ్చేస్తానన్నాను. నిజం చెప్పు. నీ మనసులో నా మూర్తి మాసిపోయిందా?"
రాజారావు మాట్లాడలేదు.
"అందుకే ఆ డబ్బు నేను తీసుకోలేను."
"ఆ డబ్బు మీ అమ్మగారు కేవలం నీ కుంటుంబం కోసం ఖర్చు పెట్టాలని వీలునామా రాశారట! నా కెందుకిస్తావు? రాణి తండ్రి కియ్యి!"
విసురుగా డబ్బు అనిత ముందు పడేసి కోపంగా వెళ్ళిపోతున్న రాజారావును చిరునవ్వుతో చూస్తూ కూర్చుంది అనిత.
17
రాజారావు చెప్పిన సంగతి విని రమణరావుకు నోట మాట రాలేదు...
కొన్ని క్షణాలు మూర్ఖుడిలా చూస్తూ ఊరుకుని తరువాత అదేదో పెద్ద హాస్యమయినట్లు పకపక నవ్వాడు.
"ఎందుకు నవ్వుతారు?"
చిరాగ్గా అడిగాడు రాజారావు...
"మీ అమాయకత్వానికి నవ్వక ఏడవనుటండీ!"
"ఏడిసినట్టుంది. నా అమాయకత్వం మీ మేధకేం తెలిసిందో సెలవివ్వండి..."
వెటకారంగా అన్నాడు రాజారావు.
"కాకపోతే ఏవిటండీ! వితంతువు. వంటలక్క! ఆవిడికి మీ నాన్నగారొక్కరే అని గ్యారంటి ఏమిటి? జానకి మీ చెల్లెలే అని ఎలా నమ్మగలరు?"
రమణరావుగారూ?"
గర్జించాడు రాజారావు......
"ఇష్టమయితే సుశీలను పెళ్ళి చేసుకోండి లేకపోతే మానెయ్యండి కానీ మా చెల్లెలిని అవమానిస్తే అసలు వూరుకోను."
"లోకమంతా కోడై కూస్తోంటే ఒక్క నా నోరు మూసి ఏం చెయ్యగలరు?"
"ఆ లోకం నోరు కట్టిస్తాను. ఏ కోర్టులో జానకి దోషిగా నిలబడ వలసి వచ్చిందో ఆ కోర్టులోనే జానకినీ నిర్దోషిగా నిరూపిస్తాను. ఏ తుచ్చుడు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడో వాడిని నా చెల్లెలి కాళ్ళమీద పడేయిస్తాను..."
రమణరావు మఖం తెల్లగా పాలిపోయింది. కొన్ని క్షణాలు అతనికి నోటమాటరాలేదు. చివరకు ఎలాగో పెగల్చుకుని "మనలాంటి పరువు గల కుటుంబాలు కోర్టుల కెక్కడం ఏం బాగుంటుందీ? అయిన గొడవ చాలదా? జానకి నిర్దోషి అని రుజువుకాకపోతే..."
అని ఏదో అనబోయాడు.
"జానికి నిర్దోషి అని నాకు నమ్మకముంది, నేను రుజువు చెయ్యగలను. ఆ రికార్డంతా స్టడీ చేశాను . తప్పకుండా రుజువు చేస్తాను"
"మీరీ ప్రయత్నం మానెయ్యాలి."
ఆజ్ఞాపిస్టున్నట్లు అన్నాడు రమణరావు.
"మానను. ఎవరు మానమన్నా మానను."
"అయితే మనమధ్య సంబంధం పొసగదు."
"దట్సాల్ రైట్!"
ప్రక్కగదిలో కూర్చుని ఈ సంభాషణంతా వింటున్న కేశవరావుగారు చటుక్కున లేచొచ్చి లేవబోతున్న రాజారావు చెయ్యి పట్టుకున్నాడు.
"అంత తొందరయితే ఎలాగండీ? కూర్చోండి. ఏరా రమణా మాట యిచ్చి తప్పుతావా? అలాంటిది మనవంశంలో ఉందా?" అని రమణరావును కోప్పడాడు.