Previous Page Next Page 
విరామం పేజి 20


    "చూడు మనిరుజ్జ మాన్ దొంగతనం చేసేనని నువ్వప్పుడే ఓసీ దగ్గిర ఒప్పుకున్నావు. ఇకచేసే దేం లేదు. అయినా నువ్వు దొంగతనం చెయ్యలేదని నాకు తోస్తూంది, నిజం నాతో చెప్పు..."
    అతని కన్నీళ్ళతో తల జోరుగా త్రిప్పుతూ "లాభంలేదు సాబ్, నన్నట్టే బాధ పెట్టకు. నాపనైపోయింది. అని కూలబడ్డాడు.
    "భయపడకు, నాకు నిజం చెప్పు, నీకు మేలు చెయ్యగలనని నా మనస్సుకి గట్టిగా తోచినప్పుడే నువ్వు చెప్పినదాన్ని నే వుపయోగిస్తా. అది బైట పెట్టినందువల్ల నీకు యేమి జరుగదు సరే కదా, పైగా అపకారం జరుగుతుందనిపిస్తే: నువ్వు చెప్పింది నా ప్రాణం వున్నంతవరకూ ఎక్కడా బైట పెట్టను. అల్లా తోడు"
    మనిరుజ్జమాన్ దీర్ఘాలోచనలో పడ్డాడు.
    "నువ్వొకసారి దేవుడు తోడుగా, ఖురాన్ తోడుగా పచ్చి అబద్ధం చెప్పేవు. ఇంకొక అవకాశం యిస్తున్నా. ఈసారి దేవుడు తోడుగా ఖురాన్ తోడుగా నిజం చెప్పు. నా మాటనేను నిలబెట్టుకుంటా..." అతని చేతిలో చెయ్యేసి అన్నా..."
    మనిరుజ్జమాన్ నిట్టూర్చేడు.
    "సాబ్! నిజం చెప్తున్నా. రక్షించినా. చంపినా నీ దయ. ఆ సరుకులు నేను దొంగతనం చెయ్యలేదు. తెల్లవాడు చేసేడు. తెల్లవాళ్ళ రేషన్ స్టోర్సు యజమాని ప్రైవేటు మూరు చేసేడు. నేను చేసింది నిజానికి కూలిపని. అదైనా తీగెదడి కవతల్నించే. దడి వరకూ ఆ మూర్ గాడే మోసి దడిమీంచి నా కందిచ్చేడు. ఇది చాలాకాలం నించీ జరుగుతూంది. కాంటీను వాడు తెల్లవాడి మీద చెప్పడానికి గుండెల్లేక నా మీద పెట్టేడీ నింద. ఇది నిజం సాబ్..."
    నేను నిజం తెలుసుకుని సంతోషించాను.
    "ఇది నిజం మనిరుజ్జమాన్, ఈ నిజం సమయం వచ్చినప్పుడు, యెక్కడ చెప్పవలసొచ్చినా, ఎన్ని సార్లు చెప్పవలసొచ్చినా, జంకు లేకుండా చెప్పు, దీనిమీద యెన్నో వందల వేల ప్రశ్నలొస్తాయి. ప్రతి ప్రశ్నకీ నిజవైన జవాబే చెప్పు. ఒక అబద్ధం చెపితే. దానికోసం వంద అబద్దాలాడవలసొస్తుంది. జాగ్రత్త...నీకే ప్రమాదం రాదు..."
    "సాబ్! నీదయ. అంతా నీదే భారం, పిల్లల వాణ్ణి..."
    "ఫరవాలేదు..."
    నేను నా బాషాకి తిరిగొచ్చి సిగరెట్టుముట్టించి ఆలోచించా. నిజం తెలిసింది. కాని యికమీద ఏం చెయ్యాలి, ఈ నిజాన్ని ఎలా బైటపెట్టడం? ఒక తెల్లవాడిమీద యింత నేరం ఆరోపించడం సామాన్యం కాదు. తెల్లవాళ్ళంతా యేకమై పోవచ్చు. నిజం బైట పెట్టకపోతే, ఒక అమాయకుడికి అన్యాయంగా నాలుగైదేళ్ళు కఠిన ఖైదు శిక్ష పడుతుంది. చివరికి తెగించాను.
    ఎనిమిదైంది, ఆఫీసు వేళకింకా అరగంట వ్యవధుంది. తిన్నగా ఆఫీసర్ల మెస్సుకి వేళల, అక్కడ మా ముగ్గురు ఆఫీసర్లు బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు. నన్ను చూడగానే రమ్మన్నారు,
    "ఏమిటి సంగతి?" నవ్వుతూ అన్నాడు ఓ సి, మెస్సు వెయిటరు నాకు కాఫీ యిచ్చేడు. తాగుతూ సిగరెట్టు ముట్టించా.
    "ఒక అద్భుతమైన విషయం చెప్పడానికొచ్చా....."
    టెలికమ్యూనికేషన్సు ఆఫీసరు నా వంక చూసి ముసి ముసినవ్వు నవ్వేడు. అది అతని కలవాటు, ఓసీ ప్రశ్నార్ధకంగా చూసేడు. "మీ రెవ్వరూ నన్నపార్ధం చేసుకోకూడదు. అలా హామీ యిస్తే చెప్తా..."
    "అపార్ధం యెందుకు...కానీ..." ఓసీ.
    "నిన్న సాయంత్రం మన యూనిట్లో ఒక దొంగతనం జరిగింది..."
    "ఔను, మనిరుజ్జ మాన్ చేసేడు. ఇవాళ ఆ కేసు తయారుచేసి అడ్జంటంటుతో మాట్లాడాలి".
    "క్షమించండి. అక్కడే వుంది సంగతంతా.... ఆ దొంగతనం మనిరుజ్జమాన్ చెయ్యలేదు..."
    "మరి?" ఓసీ ఆశ్చర్యపోతూ అన్నాడు.
    "ప్రైవేట్ మూర్..."
    "క్రిస్టోఫర్ కొలంబస్!" ఓసీ అదిరిపడ్డాడు. అతనితోబాటు మిగిలిన యిద్దరూ వులిక్కిపడ్డారు. నా మీద విరుదక పడతారనిపించింది. నే నూ సిద్ధంగా వున్నా, ఓసీ కాఫీ ముగించి, పైపు ముట్టించి "హవల్దార్" అన్నాడు గంభీరంగా.
    నా కనుమానం లేకపోలేదు. మనిరుజ్జమాన్ మంచివాడు. అంతపని చెయ్యలేడు..." అని వూరుకున్నాడు. నేను మనిరుజ్జమాన్ దగ్గరికి వెళ్ళిన దగ్గిరనుంచీ జరిగిందంతా వివరంగా చెప్పా.
    "మాటకి మనం ప్రైవేట్ మూర్ ని అరెస్టు చేస్తాం అనుకో. మన గార్డు రూం లొ పెట్ట లేమనుకుంటా..." ఓసీ.
    "అతన్ని ఆర్. హెచ్. క్యూకి పంపిద్దాం."
    "రైట్..."
    వెంటనే ఓ సీ ఫోన్ తీసి ఈ విషయమంతా అడ్జటంటుతో పూసగుచ్చినట్టు చెప్పేడు. ఫోన్ "రింగాఫ్" చేసి సార్జెంట్ల మెస్ కి ఫోన్ చేసేడు.
    "సార్జంట్ మేజర్! నేను ఓసీని?"
    .................................
    "ఇద్దరు సార్జంట్లతో సహా ప్రైవేట్ మూర్ ని నువ్వు స్వయంగా యిక్కడికి తీసుకురా"
    ..........................
    "ఔను. తక్షణం"
    ............................
    "ఆఫీసుక్కాదు. నా మెస్సుకే"
    .............................
    "ఒద్దొద్దు. నువ్వేం చెప్పకు. ఉన్నపళంగా రమ్మన్నానని చెప్పు. వేగం.
    నేను గార్డు రూంకి పరుగెత్తి రెండు రైఫిళ్ళు తెచ్చా. నే నొచ్చేసరికంతా వున్నారు.
    "ప్రైవేట్ మూర్..." ఓసీ
    "ఎస్ సర్..."
    "నువ్వు సార్జంట్ల మెస్ కి చెందిన స్టోర్సు లోంచి బియ్యం, పంచదార. పాలడబ్బాలు నిన్న సాయంత్రం సుమారేడు గంటలకి దొంగతనం చేసి, ఒక సివిలియన్ కాంటీను కమ్మేవు..."
    "నో సర్..."
    "షటప్! నీ మీద కేసు జరుగుతుంది. నువ్వు అరెస్టు చెయ్యబడ్డావు.... సార్జంట్ మేజర్! ఇతన్ని బైటికి మార్చిచెయ్యి.....వెంటనే ఆర్. హెచ్. క్యూకి తీసుకెళ్ళి అప్పజెప్పు..."
    "యస్ సర్"
    ఇద్దరు సార్జంట్లు ఖైదీకి రెండు ప్రక్కలా రైఫిళ్ళతో తయారయ్యారు.
    "ప్రిజనర్ అండ్ ఎస్కార్ట్!" సార్జంట్ మేజరు.
    "అటేన్....షన్!.....ట్టర్న్.....క్విక్ మార్చ్..లెఫ్ట్ రైట్. లెఫ్ట్ రైట్..."
    వాళ్ళు వెళ్ళిపోయాక ఓసీ నాతో కరచాలనం చేసేడు.
    "నీకు బుర్రుంది. నేను చాలా సంతోషిస్తున్నా".
    ప్రైవేట్ మూర్ అరెస్టయిన వార్త క్షణంలో యూనిటంతా పాకిపోయింది.
    అది ఒక పెద్ద ఫీల్డు. జనరల్ కోర్టు మార్షల్ కేసు, ప్రోసిక్యూషన్ పక్షం, డిఫెన్సు పక్షం ఎందరో సాక్షులు. చచ్చినంత తంతు. మూరుకి మూడేళ్ళు కఠినశిక్ష పడింది. మనిరుజ్జమాన్ని విడిచిపెట్టేరు.

                                      19

    నేను తిరిగి యూనిటు చేరిన కొద్ది నెలల్లోనే బెర్లిన్ పతనం, హిట్లరు మరణం, యూరోపు యుద్ధం అంతం జరిగేయి.
    తూర్పు రంగంలో మిత్రమండలి సేనలు జపాను సేనల్ని తరిమికొట్టి, శత్రువులకి చిక్కిన ప్రదేశాల్ని తిరిగి వశ పర్చుకుంటున్నాయి, ఈ పురోగమనం ఓవిధంగా సంతోషం కలిగిస్తున్నా తెల్లవాళ్ళు నిరుత్సాహంగా వున్నారు. వాళ్ళలో చాలామంది స్వదేశం వదిలి ఆరేళ్ళవుతూంది. వాళ్ళందరూ ఆత్మబంధువుల కోసం బెంగపడిపోయేరు. ఇళ్ళగురించి కలలుగంటున్నారు. కొందరు వివాహానికి ముందు ప్రధానం చేసుకుని, కొందరప్పుడే వివాహం ఆడి, కొందరు భార్యలు గర్భవతులుగా వుండగా దేశం విడిచి వచ్చేరు.
    "ప్రియా! మన ప్రధానం జరిగి ఆరేళ్ళు కావస్తూంది. ఎప్పుడు వస్తావు?"
    "ప్రియా! మన పెళ్ళినాడు చర్చినించి తిరిగి వస్తూనే నన్నెడబాసి విదేశం వెళ్ళిపోయేవు. ఐదేళ్ళు దాటుతూంది, నిన్ను తలవని పగలు లేదు, కలలో చూడని రాత్రి లేదు. ఎప్పుడొస్తావు!"
    "డార్లింగ్! మన బాబుని వర్సరీ బడిలో ఇవాళే చేర్చా, వాడు నిన్నెప్పుడూ చూళ్ళేదు. వాడితో నీ గురించి యెన్నో గొప్పలు చెప్పా. నీ ఫోటోలు చూసి డాడీ ఎప్పుడొస్తా డంటున్నాడు. త్వరగా రావూ!"
    "హనీ! ఆరేళ్ళైంది. నువ్వు లేని నిముష మొక యుగంలా వుంది. నువ్వు పంపుతూన్న ఆహారపు పార్సెల్సు అందుతున్నాయి. కాని తింటే నోటికి పోదు, నోట్లో ది నోట్లో వుంటుండగానే కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. హనీ, నీకోసం యెదురు చూడని రోజులేదు. ఆరేళ్ళయి పోయింది. నీ అవసరం నాకెంతుందో ఊహించుకోగలవా? నువ్వునాకు కావాలి. నువ్వు రావాలి. రావూ! వేగం రా. మర్చిపోకు."
    ఇలాంటివీ, యింతకన్న భయంకరమైనవి, విచిత్రమైనవి ఉత్తరాలు మా తెల్లసోల్జర్ల కొస్తున్నాయి. అని చదువుకుని వాళ్ళు దుఃఖించి, ఏం చెయ్యలేక, తప్పతాగి ఆ మైకంలో దుఃఖాన్ని మర్చిపోతున్నారు.
    ఇంతలో మా యూనిటు "రామ్రీ ద్వీపాల"కి పురోగమించవలసిందని తాఖీదు వచ్చింది. ఆ సాయంత్రం, తెల్లవాళ్ళ మొహాల మీద కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. ఇంటికి దగ్గిర యూరోపుకో యుద్ధం ముగిసింది. కాని ఇక్కడ యింటికి పదివేల మైళ్ళ దూరంలో.తామున్న దగ్గిర. యింకా యుద్ధం ముగియ లేదు సరికదా. ముమ్మరంగా సాగుతూంది. వాళ్ళకి కూడా యెందుకీ యుద్ధమనిపించింది. నిరాశ కలిగింది. ఏడుపొచ్చింది. గుండె మండింది. కాని యేంలాభం తాఖీదు తాఖీదే.
    రామ్రీ ద్వీపాలంటే అందరికీ సింహస్వప్నం. అక్కడ ఘోర యుద్దం జరుగుతూంది. దొరికిన తెల్లవాళ్ళ నందర్నీ శత్రువులు పెట్రోలు వేసి కాల్చేస్తున్నారు. చెట్లకి విరిచికట్టి శిలువ వేస్తున్నారు. బాంబులు పడి ట్రెంచిల్లో వున్నవాళ్ళు వున్నపళంగా హతమైపోతున్నారు, అక్కడ ముష్టాముష్టి యుద్ధం జరుగుతూంది.
    ఉదయం అయిదుగంటలకి అందరూ పెరేడ్ గ్రౌండులో కలిసేరు. ప్రతి సోల్జరు తను మొయ్యగలిగిన సామాన్లే తీసుకెళ్ళాలి. మిగిలినవన్నీ పూర్తిగా ధ్వంసం చెయ్యాలి. ఆఫీసుకి సంబంధించిన ముఖ్యమైన పది పన్నెండు ఫైళ్ళు తప్ప మిగిలిన వన్నీ ధ్వంసం చెయ్యాలి.

 Previous Page Next Page