Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 20

    మొత్తంమీద బయటివాళ్ళెవరూ హోంలో వాళ్ళని తమలాంటి మనుష్యుల్లా చూడరు. శకుంతలకు చదువుకునే అవకాశాలుండటం -ఆమె అవసరాలకు బయటనుంచి డబ్బు రావడం.... అక్కడి చాలామందికి శకుంతలపట్ల అసూయ కలగడానికి కారణాలయ్యాయి. ఆ అసూయతో, ఎవరి గాధలు వాళ్ళకున్నా సిగ్గులేకుండా శకుంతల ఇద్దరు తండ్రుల ప్రస్తానవ ఎవరో ఒకరు వెటకారంగా తీసుకొచ్చేవారు. ఆ మనుష్యులను చూసి జాలి పడాలో అసహ్యించుకోవాలో అర్ధమయ్యేది కాదు శకుంతలకి.    
    తన సూట్ కేస్ సర్దుకుని వార్డెను రూంలోకి వచ్చేసరికి, అక్కడ కుర్చీలో కూర్చుని వున్నాడు శ్రీధర శర్మ. శకుంతలను చూడగానే "బేబీ" అని చేతులు చాపాడు.    
    ఇద్దరి కళ్ళలోనూ నీళ్ళు - ఆ నీళ్ళలో పొంగులు వారే మమకారాలు.    
    శకుంతల ముందుకు ఉరకబోతుంటే, "శకుంతలా" అని అటు పక్క కుర్చీలో కూర్చున్న వ్యక్తి పిలిచాడు. ఆర్ద్రతకంటే - మందలింపు ఆప్యాయతకంటే - హెచ్చరింపు ఉన్నాయి.    
    ఆగిపోయింది శకుంతల. ఆ పిలుపు వచ్చినా వేపు వింతగా చూసింది ఎవరో గుర్తురాలేదు.    
    అతడే అన్నాడు ఒక విధమయిన నవ్వుతో__"గుర్తు పట్టలేదా నీ తండ్రిని?"    
    ఆ మాటలు వింటూనే మనసు భగ్గుమంది శకుంతలకి. వేటగాడిని చూసిన లేడిలా ఒక్క పరుగున శ్రీధరశర్మ దగ్గిరకు వచ్చేసింది. ఒక చెయ్యి ఆమె చుట్టూ వేసి బుజ్జగింపుగా ఫీట్ చేశాడు. "రా అమ్మా?" అన్నాడు బయటికి దారితీస్తూ."    
    శకుంతల మరోసారి రమేష్ ముఖం చూడలేదు. "డాడీ" అని ఆగిపోయింది.... 'అమ్మ ఎక్కడుందీ!" అని అడగబోయింది అడగలేదు. అక్కరలేదు. అమ్మ తిరిగి వచ్చివుంటే తన దగ్గిరకు రాకుండా ఉండగలిగేదా!    
    ఇద్దరికీ కళ్ళలో నీళ్ళు _ ఒకరి మనసులో భావం మరొకరు పంచుకొన్న ఆప్యాయతలో ఆవేదన__    
    ఆటో పిలిచాడు శ్రీధర్ శర్మ. శకుంతల అతనితో ఆటోలో కూచున్నాక, తన స్కూటర్ తో ఆటోకి అడ్డుగా వచ్చాడు రమేష్. ఆటో ఆగింది. అతని కళ్ళలో ఎర్రజీరలు చూసి భయంతో శర్మకు దగ్గిరగా జరిగింది శకుంతల.    
    "శకుంతలా! ఇప్పుడా యింట్లో మీఅమ్మకూడా లేదు. ఏదయినా జరగరానిది జరిగితే నీ జీవితం సర్వ నాశనమవుతుంది నాతోవచ్చేయ్?"     
    శకుంతల ఆలోచించి కిందకురికి, రమేష్ ఆ చెంపా, ఈ చెంపా టపటప వాయించేసింది.    
    "ఇక వెళ్ళు"    
    రోడ్డుమీద వచ్చేపోయే వాళ్ళంతా విచిత్రంగా చూశారు కొందరు ఏమిటేమిటని దగ్గిరగా మూగారు.    
    రమేష్ "యూ! బ్రూట్" అని పళ్ళు కొరికి, జనాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు.    
    ఆటో శర్మ ఇంటిముందు ఆగింది. అన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లోకి__ఒకప్పుడు తనదని అనుకున్న ఇంట్లోకి.... ఇప్పుడు తనది అవునో కాదో తెలియని ఇంట్లోకి అడుగు పెడుతోంటే, శకుంతల కాళ్ళు వణికాయి. ఆ ఇల్లు వెనుకటిలా లేదు. దేవుడులేని పాడుబడ్డగుడిలా వుంది. గోడమీదబూజులు, మాసిచిరిగినగుమ్మం తెరలు, ఇంటినిండాచిందరవందరగా ఉన్న వస్తువులు, ఎటు చూసినా చెల్లా చెదురుగా ఉన్న పుస్తకాలు.....బహుశా తండ్రి తన కాలమంతా చదువులో గడుపుతున్నాడేమో! హాలులో గోడమీద శకుంతలను చేతులలో ఉంచుకొన్న మేనకను కాదంటున్న చిత్రం అల్కాగే ఉంది, చాలా పాతకాలపుది. రవివర్మ చిత్రాన్ని చూసి మరెవరో తీసిన కాపీ అది.    
    శకుంతల నిలబడిపోవడం చూసి, "ఏమిటి బేబీ చూస్తున్నావు" అని శర్మ తనూ ఆ చిత్రాన్ని చూసి నిట్టూర్చి "ఆ విశ్వామిత్రుడేనయం కనీసం తన దారిన తాను పోయాడు." అన్నాడు.    
    "నానమ్మ ఏది?"    
    "ముందు స్నానంచేసి భోజనం చేయి. నేనే వండాను."    
    "కాదు__ ముందు నాయనమ్మను చూసి....."    
    "నా తల్లిగా! స్నానంచేసి భోజనం చెయ్యమ్మా......"    
    "అహ ముందే నానమ్మ"    
    "నానమ్మా" ని అరుచుకుంటూ గదులన్నీ తిరగసాగింది.    
    "ఎవరూ?" అని ప్రతి సమాధానం వినిపించింది పూజగది పక్క గదిలో నుంచి. ఆ గదిలోకి వెళ్ళింది. మంచంలో పడుకుని ఉంది ఈశ్వరి. శకుంతలను గుర్తు పట్టలేక పిచ్చిగా చూడసాగింది.    
    "నానమ్మా, నేను శకుంతలని!"    
    మంచంమీద కూచోబోయింది.    
    "ఆగు" కర్కశంగా వినిపించింది ముసలమ్మ గొంతు,    
    అంతకుముందు తానెప్పుడూ వినని ఆ స్వరానికి కంపించింది శకుంతల.    
    "ఎవరే నీకు నాయనమ్మ! నువ్వు ఎవడి కూతురివే! నువ్వూ, మీ అమ దాపురించారు నా కొంపకి శనిలా పండంటి నా బిడ్డ  బతుకు సర్వనాశనం చేశారు. స్వచ్చమయిన మా వంశాన్ని అప్రతిష్టపాలు చేశారు. హయ్యో  అప్రతిష్ట పోవే పాడు ముండా! ఎక్కడ చస్తావో చావు. నా కంటికి కనపడకు."    
    లేవలేక మంచంలో పడుకున్న ఆవిడ వంట్లో ఓపికంతా కూడదీసుకుని, ముఖం వికృతంగా చేసుకుని కసిగా తిట్టిపోస్తోంది, తనను ఎంతో ఆప్యాయంగా చూసిన నాయనమ్మ తను ఒక్క రోజు కనపడకపోయినా తల్లడిల్లి పోయే నాయనమ్మ. తను బడినుంచి వచ్చేసరికి రకరకాల ఫలహారాలతో కాచుకుని కూచుని, తనను బతిమాలి తినిపించే నాయనమ్మ - తను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఏడ్చే నాయనమ్మ.    
    నిర్ఘాంతపోయి నిలబడిపోయింది శకుంతల.    
    ఆ ముఖం చూసి. "పో-పో" అంటూనే ఏడవసాగింది. ఈశ్వరి మధ్యమధ్యలో తిడుతూ సేతుపతి అక్కడే కూచున్నాడు. చేతిలో భగవద్గీతతో! అతను శకుంతలను తిట్టలేదు. కానీ పలకరించనూ లేదు. ఎవరో పరాయి వాళ్ళను చూసినట్లు చూసాడు. అందరిమధ్యా శర్మ దోషిలా తలదించుకుని మౌనంగా ఉన్నాడు.    
    శకుంతల తల్లిగదిలోకి వచ్చేసింది. గోడమీద ఫేమిలీ ఫోటో ఉంది. అందరి మధ్యలో తను, నాయనమ్మ వళ్ళో....ఏడుపు ఆపుకోలేకపోయింది.    
    "బేబీ" శర్మగొంతు అనునయంగా కళ్ళు తుడుచుకుంది.    
    "నానమ్మకేం జబ్బు? ఎన్నాళ్ళ నుంచీ?"

 Previous Page Next Page