Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 2

    అపరాత్రిదాకా హాస్పిటల్ లాన్ లో పచార్లు చేస్తూ గడిపింది. చుట్టూ ఆవరించిన చీకటి...ఆకాశంలో నిర్వికారంగా చిరుకాంతుల్ని వెదజల్లుతున్న నక్షత్రాలు....సమూహం మధ్య ఏకాంతం లాంటి ఒంటరితనం....అలసటగా అర్ధనిమీలితాలౌతున్న నేత్రాలు...బాల్యంలోనే దూరమైన తల్లిదండ్రులు- ఇంపోర్టెడ్ కార్లు రెసిడెన్షియల్ స్కూల్స్, విదేశాల్లో చదువు- కలల హవేలీలో పరిమళం కోల్పోతున్న పూలకొమ్మలాంటి జీవితం- ఆకుపచ్చని యౌవన వనంలో వాడిగా రగులుతున్న వెన్నెల రెక్కల కోసం సంకీర్ణంగా సాగిస్తున్న ఒంటరి ప్రయాణం- అసలిది బ్రతుకో లేక వూపిరి ఉద్వేగాల్ని రంగులుగా అద్ది ఆనందించు కోవాలనుకునే శూన్యపు కేన్వాసులాంటి భ్రమో తోచడంలేదు.    
    "మేడమ్" ఎవరో వచ్చారు ఉద్విగ్నంగా. "మీ గ్రాండ్ పా స్పృహలోకి వచ్చారు-"
    క్షణం ఆనందం. వెనువెంటనే అదోలాంటి ఆందోళన.    
    సన్నగా కంపిస్తూ ఐసియులో అడుగుపెట్టింది.    
    తననే చూస్తున్నాడో లేక చూస్తూ ఆలోచిస్తున్నాడో అర్ధం కావడం లేదు.    
    "గ్రాండ్ పా" అంది శక్తిని కూడగట్టుకుంటూ.    
    ఆయన మొహం విభ్రమం.... చాలా సేపటి నిశ్శబ్దం తర్వాత అన్నారు "ఐ నెవ్వర్ ఎక్స్ పెక్టెడ్"    
    అది ఆనందమో లేక వచ్చినందుకు అయిష్టతో ఆమెకు బోధపడలేదు. కాని అలాంటి ప్రతిస్పందన ఆమె కోరనిది.   
    అంతకన్నా "నువ్వు వస్తావని ఊహించలేదు బేబీ" అంటే ఎక్కువ ఆనందించేదేమో.    
    పదాల్ని కూడగట్టుకుంటున్నట్టుగా అంది. "యూ ఆర్ ఓకే గ్రాండ్ పా"    
    "సైనికుడు మరణించాలనుకునేది యుద్ద రంగంలోనే కృషి-"    
    ఉక్రోషంగా చూసిందామె. సెంటిమెంట్స్ కి అతీతంగా బ్రతకడమే ధ్యేయంగా పెట్టుకున్న ఉపాధ్యాయ సిద్డంతాలకీ ఆమెకూ మధ్య ఘర్షణ ఈనాటిది కాదు..... "మీరు రిలాక్స్ కండి"    
    ఆమె బయటికి నడిచేదే...    
    "ఆగు" ఆయన కంఠం మృదువుగా పలికినా అందులో అణువంత మొండితనమూ ధ్వనించింది. "పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్నావు. శాశ్వతంగా స్టేట్స్ లోనే సెటిలవ్వాలని వెళ్ళావు కదూ."    
    "ఇప్పటికీ ఆ అభిప్రాయంలో మార్పులేదు"    
    "మరిప్పుడెందుకొచ్చావ్"    
    "అది మీకు అర్ధం కాదు గ్రాండ్ పా- " అందామె కళ్ళ నీళ్ళ పర్యంతమవుతుంటే ఇలాంటి ఆహ్వానాన్ని అందుకున్నందుకు బాధగా బయటికి వచ్చేసింది.    
    ఎంతసేపు చీకటిలోకి చూస్తూ నిలబడిందో ఆమెకే గుర్తులేదు.    
    "బాధ పడుతున్నానా" డాక్టర్ మహంతి గొంతు వినిపించింది.    
    "మీ గ్రాండ్ పా తత్వం నీకు తెలుసు"    
    ఇక నిభాయించుకోలేక పోయిందామె. "తెలుసు అంకుల్- జీవితమంటే వ్యాపార బంధాలే తప్ప అనురాగ బంధాలు కావని గ్రాండ్ పా ఆలోచిస్తారని తెలుసు. అది నిరూపించటానికి ఏ స్థాయికయినా వెళ్ళగలడు నా గ్రాండ్ పా అని నాకు తెలుసు. కాని ఇన్ని నెలల తర్వాత, అభిమానం చంపుకుని చూడడానికి వచ్చిన నన్ను 'ఇంత సాదరంగా ఆహ్వానిస్తారని మాత్రం తెలుసు కోలేకపోయాను."        
    ఏ గతపు స్మృతి శకలాలు కదిలి ఆమెను కలవర పరుస్తున్నాయో ఆమె కళ్ళు నీటి కుండలయ్యాయి.   
    "పిచ్చి పిల్లా- తాతయ్యపై అభిమానం వుండాలే కాని స్వాభిమానం ఏమిటమ్మా- నిజమే ఉపాధ్యాయ దశాభ్దాల కృషిలో చాలా అనుబంధాలకి దూరమయ్యాడు. సామ్రాజ్య విస్తరణే ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రపంచంలో తనకున్నది నువ్వొక్తర్తివే అన్న విషయాన్నీ విస్మరించాడు. అంత మాత్రం చేత నీ మీద ఆయనకి అభిమానం లేదని ఎలా అనుకుంటున్నావు"    
    "వద్దు అంకుల్- ఇక ఆ విషయాలను మనం చర్చించుకోవద్దు"    
    చాలా సేపటి నిశ్శబ్దం తర్వాత అడిగాడు "ఇప్పుడెం చేయాలనుకుంటున్నావ్"    
    "స్టేట్స్ కి వెళ్లిపోతాను. ఇక మళ్ళీ జన్మలో ఈ దేశంలో అడుగుపెట్టను."    
    "అప్పుడు నీకూ మీ తాతయ్యకీ తేడా ఏముందీ! ఓ భ్రాంతిని జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్న మీ తాతయ్యకి నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా. 'నా కెవరున్నారూ' అని కాదు, 'తాతయ్యకి నేను తప్ప ఎవరున్నారూ' అని ఆలోచించగలిగితే నీ జీవితానికి ఓ కొత్త లక్ష్యమూ గమ్యమూ దర్శనమిస్తాయి. నీకు తెలీదు కృషి! మీ తాతయ్య ప్రపంచంలో దేన్నయినా కొనగలననే స్థాయికి ఎదిగాడేమో కాని మృత్యువుని బేరం చేయగలననేటంతగా మాత్రం కాదు"    
    ఇంతకు మించి అవకాశం రాదన్నట్టుగా చెప్పుకుపోయాడాయన.    
    "ఇప్పుడు మీ తాతయ్య ఏ స్థితిలో వున్నదీ నీకు తెలీదు. అసలు మానసికంగా అతడెంత క్రుంగిపోతున్నది నీకు అర్ధం కాదు. ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వం మీ తాతయ్య ప్రత్యర్దులకి అనుకూలంగా వుంది. దానితో మీ తాతయ్య బిజినెస్ ఎంపైర్ లో సమస్యలు మొదలయ్యాయి. ఆ సమస్యలే ఈ రోజు మీ గ్రాండ్ పా కొలాప్స్ కావటానికి కారణమైంది కూడా. ఇదంతా నీకు చెప్పకూడదనుకున్నాను కృషి! మీ గ్రాండ్ పాకి సైతం చెప్పని అనారోగ్యం వివరాలు నాలోనే సమాధి చేసేసుకోవాలనుకున్నాను."  
    చెప్పాడు ఉపాధ్యాయ అనారోగ్యం గురించి వివరంగా. "మెదడులోని స్పెసిఫిక్ ఏరియాకి రక్తాన్ని తీసుకుపోయే ఆర్టిరీ బ్లాకయ్యే స్థితి TIA (TRANSIENT IS CHAEMIX ATTACK)    
    ఈ అటాక్ సింప్టమ్స్ మాట తడబడడం దృష్టి కోల్పోవడం లాంటివి అయినా ఒక్కోమారు హెమరేంజ్ కి దారి తీయవచ్చు. సర్జరీలో బ్లాకేజ్ ని తీసేయడం సకాలంలో జరగడంతో ఉపాధ్యాయ ఇప్పుడు యధాస్థితికి రాగలిగాడు కాని మరోసారి ఇలాంటి అటాక్ రాదన్న గ్యారంటీ లేదు. వస్తే ఇక బ్రతికే అవకాశమూ లేదు.    
    "మీ తాతయ్య కోసం నిన్ను శాశ్వతంగా ఇక్కడే వుండి పొమ్మనడం లేదు కృషి! ఈ స్థితిలో ఆయన్ని విడిచివెళ్ళడం న్యాయం కాదంటున్నాను. నిజానికి ఉపాధ్యాయకి సెంటిమెంట్స్ పై నమ్మకం వున్నా లేకపోయినా ఇప్పుడాయనకి కావలసింది అటాచ్ మెంట్. ఒకవేళ ఆయన కోరిక ప్రకారం నువ్వు పెళ్ళి చేసుకుని వుంటే బహుశా ఆయన..."    
    అర్దోక్తిగా అంది కృషి "అసంభవం అంకుల్"    
    ఉద్విగ్నంగా కదిలిపోయింది. "ఇక ఈ జన్మకి అలాంటి ఆలోచన లేదు. ఉండబోదు." అచేతనంగా వుండిపోయాడు డాక్టర్ మహంతి.    
                                                               *     *    *    *    
    రాత్రి ఎనిమిది గంటలు కావస్తూంది. శూన్యాకాశపు కేన్వాసుపై పేరుకున్న నక్షత్రాలు హుస్సేన్ సాగర్ లో ప్రతిఫలిస్తుంటే నిశ్శబ్దంగా చూస్తుంది కృషి.   
    గ్రాండ్ పా సింగపూర్ వెళ్ళి రెండు రోజులైతే ఆయన హాస్పిటల్ నుండి విడుదలై నాలుగు రోజులైంది. పట్టుదలలో ఆ తాతయ్యకి మనవరాలైన ఇదే టెన్షన్ లో ఆయన పని చేస్తే ఇక ఎక్కువకాలం బ్రతకడన్న ఆలోచన ఆమెను తాత్కాలికంగా ఇక్కడే వుండేట్టు చేసింది కూడా.    
    ఏం చేయాలో ఇదమిత్తంగా నిర్ణయించుకోలేదామె. తాతయ్య ముభావం బాధ పెడుతున్నా నిగ్రహించుకుంటోంది. హాస్పిటల్ నుంచి విడుదలయ్యాక మళ్ళీ వ్యాపారంలో మునిగిపోయాడు. తన స్థితి ఏమిటి అన్నది ఆయనకి తెలీదు. తెలిసినా పట్టించుకుంటాడన్న నమ్మకం లేదు.   
    కృషి ఇక ఇంటికి బయలుదేరింది.    
    సరిగ్గా అప్పుడు జరిగిందో అనుకోని సంఘటన.....ఆదమరచి కూర్చున్న కృషి చేతిలోని వేలెట్ ని లాక్కుని పరుగెత్తాడో వ్యక్తి.   
    ఆమె కేకలు పెట్టలేదు.    
    కాని దొంగ దొంగ అంటూ మరో వ్యక్తి అటుగా దూసుకుపోయాడు.    
    చుట్టూ చేరిన జనం అనవసరమైన సానుభూతిని ప్రదర్శించడాన్ని యిష్టపడనట్టు మెట్లెక్కి టాంక్ బండ్ పైకి వచ్చింది ఆమె.    
    ఓ వారగా పార్క్ చేయబడిన కారులో కూర్చోబోయింది.    
    "మేడమ్" పిలిచారెవరో.
    సమీపంలో నిలబడి వున్నాడో యువకుడు. సుమారు ఆరడుగుల పొడవులో పోతపోసిన విగ్రహంలా అనిపించాడు. మాసిన గెడ్డం, విషాదాన్ని మోస్తున్నట్టు కనిపించే చూపుల్తో చేతిని ముందుకు చాచాడు.

 Previous Page Next Page