"రాజూ" వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ కూర్చుంది ఎంతోసేపు ఇందిర మౌనంగా.
* * * *
"భార్గవీ! భార్గవీ.....!" ఎవరిదో పిలుపుతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది భార్గవి.
"భార్గవీ! అన్నం తిందువు గాని రా " తనను తట్టి లేపుతున్న శేఖరాన్ని చూడగానే తానేక్కడుందీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది.
"పొద్దున్నేం తినలేదు-- ఆకలిగా లేదూ! రా!" అంటున్న శేఖర్ ని చూసి గబుక్కున లేచింది భార్గవి. అక్కడే ఉన్న టైం పీస్ రెండు గంటలు చూపిస్తున్నది. ప్రొద్దున పది గంటలకు పడుకున్న తనకి రెండు గంటల దాకా మెలుకువ రాలేదన్న మాట, అనుకుంటూ అతని వెనకాలే నడిచింది.
బాగా ఆకలిగా ఉండటం వల్లనెమో -- ఏమీ మాట్లాడకుండా భోజనం చేసింది. భోజనం దగ్గర ఏమీ మాట్లాడించలేదు శేఖర్. నిద్ర వల్ల భారంగా ఉన్న ఆమె విశాలమైన కళ్ళను చూస్తూ మౌనంగానే భోజనం ముగించాడు. వాష్ బేసిన్ లో చేతులు కడుక్కున్న భార్గవి కి రంగడు టవల్ అందించాడు.
'అమ్మా! అయ్యగారు రమ్మంటున్నారు?" అని చెప్పి టవలందుకున్నాడు ఆమె చేతిలోంచి.
ముందు గదిలో సోఫాలో కూర్చున్నాడు శేఖర్. భార్గవి వచ్చి పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కూర్చుంది.
పొద్దున్న టైపు మిషను దగ్గర ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి చూస్తూ కూర్చుంది. అతనేవో కాగితాల మీద శేఖర్ చేత సంతకాలు పెట్టించుకుంటున్నాడు.
"శివరాం! ఇప్పుడింటికేం వెళ్తావ్ 2 గంటలు దాటిపోయింది. ఇక్కడే భోజనం చెయ్యి" అన్నాడు శేఖర్ కాగితాలు అతని కందిస్తూ.
ఫరవాలేదు లెండి!" మొహమాటంగా అన్నాడు శివరాం.
"రంగా! శివరాం భోజనం చేస్తాడు. వడ్డించమను" అని భార్గవి వైపు తిరిగాడు.
"భార్గవీ ఇతను సెక్రటరీ. పేరు శివరామ్" అని పరిచయం చేసి శివరామ్ కి భార్గవి ని పరిచయం చేశాడు.
వక్కపొడి వేసుకుని భార్గవి తన గది వైపు నడిచింది. వెనకాలే శేఖర్ కూడా మెట్లేక్కాడు. కొంపతీసి తన వెనకాలే తన రూములోకి రాడు కదా!"
శేఖర్ సరాసరి భార్గవి గది పక్కనే ఉన్న తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
భార్గవి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నది. సరాసరి వెళ్ళి మంచం మీద పడుకుని నిద్రపోయింది. శారీరకంగానే కాక, మానసికంగా కూడా అలసి పోయిన భార్గవి కి ఎంతకీ మెలకువే రాలేదు.
భార్గవి కి మెలకువ వచ్చేసరికి గదిలో లైటు వెలుగుతున్నది.
టైం పీసులో ఏడు గంటలు అయింది టైము.
"అమ్మో ఏడు గంటలే! తన గదిలో లైటు వేసిన వాళ్ళేవరు? తనకసలు మతి లేదు. లోపలి తలుపు గడియ పెట్టుకోవద్దు!" అనుకుంటూ బద్దకంగా అలాగే పడుకుంది.
"అమ్మా! అయ్యగారు రమ్మంటున్నారు" రంగడు తలుపు సందులో నుంచి తల లోపలికి పెట్టి అన్నాడు.
"రంగా! లోపలికి రా" పక్క మీద నుంచి లేవకుండానే పిలిచింది. రంగడు లోపలి కొచ్చి చేతులు కట్టుకు నిలబడ్డాడు.
"నా గదిలో లైటు వేసిందేవరు?"
"అయ్యగారేనమ్మా! శానా సేపట్నుంచి ఇక్కడే కూర్చున్నారు. మీరు లేవలేదు. అందుకని కింద కొచ్చేశారు."
అయ్యగారికి నా గదిలో ఏం పని?" అని అనబోయి మళ్ళీ వాడితో ఎందుకు అనటం అని "ఇప్పుడయ్యగారేం చేస్తున్నారు?" అంది.
"బట్టలేసుకుని రెడీగా ఉన్నారు. ఎక్కడికో వెళ్ళాలిట. త్వరగా రండమ్మా-- నేను పోతున్నాను. నన్ను తిడ్తారు'" అంటూ బయటకు పరుగు తీశాడు.
ఆ గదిలో పొద్దుటి నుంచీ పడుకుని పడుకుని విసుగ్గా ఉంది భార్గవి కి. అందుకని నెమ్మదిగా లేచి కిందకు వచ్చింది.
శేఖర్ గదిలో పచార్లు చేస్తున్నాడు. పుల్ సూట్ లో ఉన్నాడతను. సన్నగా సూది మొనలా ఉన్న అతని ముక్కు- నుదిటి మీద దోబూచులాడుతున్న అతని జుట్టు -- భార్గవి ఎంత వద్దనుకున్నా చూడకుండా ఉండలేక పోయింది.
ఎంతైనా శేఖర్ డి మెచ్చుకో దగ్గ అందం -- అందాన్ని మించిన ఠీవి. భార్గవి కి మనసుతో ఏకీభవించక తప్పలేదు.
ఇంతలోనే మనసు మళ్ళీ ఎదురు తీరిగింది -- పైకి అందంగా ఉంటె సరా? మనిషిలో మంచితనం లేకపోయినా తర్వాత ఎంతదంఉంటె ఏం లాభం? ఆలోచిస్తూ మెట్ల మీదే నిలబడింది భార్గవి.
'భార్గవి! అక్కడే నిలబడ్డావెం? నేను బైటకు వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కదానివి ఉండాలి-- లేదా వస్తానంటే నాతోరా -- సిటీ చూసినట్టూ అవుతుంది" అన్నాడు. అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనబడుతున్నది.
పొద్దుటి నుంచీ ఇంట్లో కూర్చుని బోర్ గా అనిపించిందమెకు. "ఇప్పుడే పది నిమిషాల్లో వస్తాను"
సిద్దంగా ఉంచిన వేడి నీళ్ళు స్నానం చేసి అన్నట్లు గానే గబగబా పది నిముషాల్లో తయారయి వచ్చింది.
పాల నురగ లాంటి తెల్లని చీర -- తెల్లని బ్లౌజు వేసుకుంది. చెవుల కున్న ముత్యాల జూకాలు కదిలినప్పుడల్లా తళతళ లాడుతున్నాయి.
భార్గవి ని రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు శేఖర్.
శేఖర్ ని అలా వదిలేస్తే ఎన్ని సంవత్సరాలైనా అలాగే నిలబడేట్టున్నాడనుకుని "నేను వచ్చాను" పెద్దగా అంది భార్గవి.
"ఓ! పద - పద" అని "రంగా" అని కేకేశాడు. రంగడు గబగబా దగ్గర కొచ్చాడు.
"టేబిల్ మీద అన్నీ సర్ది "వేలూ" ని వెళ్ళి పొమ్మను. మేము ఇంటి కొచ్చేసరికి పొద్దు పోతుందేమో" అని కారు స్టార్టు చేశాడు.
ఫ్రంటు డోర్ తెరచి పట్టుకున్న శేఖర్ ని పరిశీలనగా చూసూ మారు మాట్లాడకుండా అతని పక్కనే వచ్చి కూర్చుంది భార్గవి. కారు నెమ్మదిగా మెత్తని రోడ్డు మీద పాదరసం లా జారిపోతోంది.
మూడు గంటల ప్రాంతంలో నీరజ వచ్చి పిల్చే దాకా ఇందిర అలాగే కూర్చుని ఉంది.
"ఇందూ! అట్లా ఉన్నావెం"
"అసలిదంతా నీ మూలం గానే! నీ కాపురం దిద్దుకోలేని దానివి -- నా సంగతి నీకెందుకు" కస్సుమంది ఇందిర.
నీరజ నిస్సారంగా చూసి "ఇందూ! నువ్వు కూడా నన్ను...."
నీరజ కన్నీళ్లు చూసిన ఇందిరకు తనేం మాట్లాడిందో తెలిసింది.
"నీరూ! క్షమించు -- ఏదో ఆవేశంలో అన్నాను" పశ్చాత్తాపంగా అంది.
"పోనీలే! ఏవైనా ఉత్తరాలు వచ్చినాయా?" అంది నీరజ.
లేదు. నీకేమో గాని సురేంద్ర విషయం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకేమిటోగా ఉంటుంది. ఎక్కడున్నాడో ఏమో"
నీరజ మాట్లాడలేదు.
"అది కాదు నీరజా! అయిందేదో అయిపొయింది , ఎందుకు నీకీ పట్టుదల"
ఆ సున్నితమైన భావం నీకర్ధం కాదులే. అయన దగ్గర కెళ్ళమంటే మళ్ళీ సంసారం మొదలవుతుంది. ఏ చేతులైతే నా భుజాల చుట్టూ ఆక్రమించుకుని నాకు రక్షణ నిచ్చాయో -- ఆ చేతుల్లో మళ్ళీ నేను ఒదిగి పోలేను. ఆ చేతులతో నన్ను దగ్గరకు తీసుకుంటే ఆ చేతులు నాకు సర్పల్లా వుండి కాటేస్తున్నట్టు భీతి కల్గుతుంది. సరోజ తో గడిపిన ఆ శరీరాన్ని నేను భరించలేను. దీనికి నువ్వేమయినా అనుకో , నాది మూర్ఖర్వమే. కాదనటం లేదు. కాని నా మనస్తత్వం అది. అన్ని విధాల సరిపెట్టు కుందామనుకున్నా ఆయనతో జీవితం నేను గడపలేను. ఆ ఇంట్లో ప్రతి అణువు నన్ను వెక్కిరిస్తుంది. ఆ జీవితాన్ని గురించి ఆలోచనలే నాకు భయంకరం"
నీరజ కళ్ళు జ్యోతుల్లా అయిపోయినాయి.
"కాని, అతను క్షేమంగా ఉండటమన్నా అవసరం కదా"
"ఎందుకు అవసరం కాదు- కాని, నేనేం చెయ్యను. అన్ని విధాలా అయన నన్ను బాధిస్తున్నారు. హాయిగా గడిచి పోతున్న జీవితంలో సరోజను తీసుకొచ్చి అనాడలా వేధించారు. ఏదో రకంగా జీవితంతో రాజీ పడి బ్రతుకుతున్న నన్ను ఈనాడి లా సాధిస్తున్నారు" ఆవేశంగా నీరజ పెదవులు వణకసాగినాయి.
"పైకి ఇంత గంబీరంగా ఉన్నా మనసులో సురేంద్ర మీద కోపం పోలేదన్న మాట?"
"ఇందూ , నీకు తెలియదు. ఆయన్ని కన్నబిడ్డలా కంటికి రెప్పలా చూసుకున్నాను. నా గుండెలో దాచుకున్నాను. అయన పసి బిద్దలాంటి వారు. అమాయకమైన ఆ ముఖం, ఆ కళ్ళు చూస్తె నేను లొంగి పోతాను. అయన పట్ల కఠినంగా ప్రవర్తించలేను నేను. నాకు పిల్లలు పుడ్తే శాంతి గతేమిటి? తల్లిగా నేను స్వార్ధ పరురాలనవుతానేమో! ఈ ప్రపంచంలో మాతృత్వాన్ని మించింది లేదు గదా? నా పిల్లల ముందు నేను శాంతికి అన్యాయం చేస్తే! తల్లిగా నేను పూర్తీ ప్రేమని శాంతి కివ్వలేక పొతే -- ఏమో- ఇందూ! ఆలోచిస్తుంటేనే నాకు భయంగా ఉంది. సరోజ కిచ్చిన మాట కోసం నేను- నేను నాకింత కంటే మార్గం లేదు"
కళ్ళు రెండు అప్పగించి చూస్తూ కూర్చుండి పోయింది ఇందిర. ఎంతో సేపటివరకు అసలేం మాట్లాడాలో తెలియలేదు.
"నీరజా! అదా కారణం -- కాని, నీరజా నీ త్యాగం ....'
అమాంతం నీరజను కౌగలించుకుంది ఇందిర.
"అనవసరంగా అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి నన్ను కించపరచకు. నేను త్యాగం అనుకోవటం లేదు. అది నా ధర్మం. శాంతి ఎవరు? సురేంద్ర రూపం కాదా! ఆయనేవరు? నేను కాదా ఆ విధంగా శాంతి నా కనుపాప -- నా హృదయం తెలిసిందా"
"నీరజా! ఈ ప్రపంచంలో జన్మ ఎత్తినందుకు నీలాంటి స్నేహితురాలు నా కుండటమే నా జన్మకు సార్ధకత. నిజంగా నాకెంత గర్వంగా ఉందో తెలుసా?"
"ఇప్పుడేగా చెప్పాను. స్తోత్ర వచనాలు కాస్త తగ్గించమని" మలినమైన ముఖం మీద చిరునవ్వును బలవంతంగా రుద్దుకుంటూ అంది నీరజ.