"ఫైనల్ ఇయర్ ఇది...."
"ఉండు! ఇప్పుడే టీ తెస్తాను!" లోపలకు నడుస్తూ అందామె.
"ఇప్పుడవన్నీ ఎందుకు లేండి!" అని అతనంటున్నా వినిపించుకోలేదామె. పది నిమిషాల తర్వాత 'టీ' తీసుకుని తిరిగివచ్చిందామె. "ఇదిగో!" అంటూ కప్పు అతని కందించింది.
తనకు అతి సమీపంగా వచ్చిన ఆమె మొఖంలోకి చూసి వులికిపడ్డాడతను. "అరె! మొఖం మీద ఆ బొబ్బలేమిటి?" కలవరపాటుతో అడిగాడతను. ఆమె మొఖం వాడిపోయింది. ఏం జవాబు చెప్పగలదతనికి? ఏం దాచగలదు అతని దగ్గర! అలా దాచడం తన అభిమతంకాదు. స్త్రీ పరిస్థితి ఈనాటికి ఇంత దారుణంగా వుండడానికి ఓ ముఖ్యకారణం తను అనుభవిస్తున్న దుస్థితిని ఆమె దాచివేయడం! తనలో తనేకుమిలిపోవడం! బయటకు తెలీనీకపోవడం!
"హేమగారు! ఏమైంది?" మరింత ఆతృతగా అడిగాడతను.
"అది నేను చేసుకున్న కర్మ!" బాధగా అన్నదామె.
"అంటే?" అనుమానంగా అడిగాడతను.
"నాగొడవ ఎందకులే ఇప్పుడు! ముందు మీ విశేషాలు చెప్పు!" విషయం మార్చడానికి ప్రయత్నిస్తూ అందామె.
"హేమగారు! దయచేసి నన్నుపరాయివాడిగా భావించకండి! మీ మాటలు నన్నెంత ఆవేదనపాలు చేసాయో మీకు ఇసుమంత బాధకలగడం కూడా నేను సహించలేను. చెప్పండి హేమగారూ! ఏం జరిగింది అసలు?" ఆవేదన నిండిన స్వరంతో అన్నాడతను.
అతని అభిమానానికి ఆమె చలించిపోయింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళవెంబడి నీళ్ళుతిరిగినయ్. నిశ్శబ్దంగా వుండిపోయిందామె.
చంద్రకాంత్ లేచి ఆమెకు సమీపంగావచ్చాడు. "హేమగారూ! ఏమిటిది? కన్నీరు పెట్టేంతదుస్థితి మీకు ఎందుకువచ్చింది? నాకేమీ అర్ధంకావటం లేదు అంతా అగమ్యగోచరంగా వుంది. మీరెందుకిలా ఉన్నారు? అదివరకటి మీ ఉత్సాహం, ఆవేశం అవన్నీ ఏమైపోయినయ్?"
ఆమెరాలిపోతున్న కన్నీళ్ళుతుడిచేసుకుంది.
"చెప్పేందుకేముంది చంద్రకాంత్! నేను యే ఆశయాల కోసం పోరాడాలని అనుకున్నానో వాటన్నిటికీ బద్దవిరోధి మావారు! ఆయన చెప్పినట్లునడుచుకాకపోతే ఎంతటి దారుణానికయినా ఒడిగట్టగల స్వభావం ఆయనది! ఆయన దృష్టిలో ఆడదిమగాడి చెప్పుచేతల్లో మెలగాల్సిన ఓ బొమ్మ! అంతే. అంతకన్నా మరోఅర్ధం తెలీదు! మరోదృష్టి లేదు. ఆయనమాటకు ఎదురు తిరిగినా, నిర్లక్ష్యం చేసినా ఇదిగోనా మొహం చూశావుగా! ఇదీ శిక్ష!....
చంద్రకాంత్ నివ్వెరపోయాడు. "కాని.....మీరేం చేశారని మీకింత పెద్ద శిక్ష?"
హేమ జీవంలేని నవ్వు నవ్వింది.
"ఏంచేసినాతప్పే! మరో మగాడితోమాట్లాడితే తప్పు! సమాధానాలు చెప్పటం తప్పు! సొంత అభిప్రాయాలు ఉండడం తప్పు! ఒకటేమిటి? తప్పులుఎన్నాలనుకున్నప్పుడు నేనేం చేసినా చేయకూడనిదిగానే కనబడుతుంది......"
"హేమగారూ! ఇవన్నీ ఎలా భరిస్తున్నారు? ఇంత రాక్షసత్వం ఎందుకు సహిస్తున్నారు?" అసహనంగా అడిగాడతను.
"అదే నాకూ ఆశ్చర్యంగా ఉంటుందొకోసారి! ఓడిపోయి పారిపోవడంకంటే ఎదుర్కొని బుద్దిచెప్పాలన్న మొండితనమే బహుశా నన్నిక్కడినుంచీ కదలనీయడంలేదనుకుంటాను...."
చంద్రకాంత్ ఆవేదన ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. అతని గుండెల్లోబాధ పేరుకుపోతోంది.
హేమ తన ఆరాధ్యదేవత ఆమెను చూడకుండా ఇన్ని రోజులు గడిచిపోయినా ఆమె మీద ఆరాధ్యభావం చెక్కు చెదరలేదు. తన దేవతను అంతగా హింసిస్తోన్న ఆమె భర్త మీదకోపం, ద్వేషం ప్రజ్వరిల్లినాయతనిలో "హి మస్ట్ బి ఎ రోగ్!" కోపం అణుచుకుంటూ అన్నాడతను.
ఆమె చిన్నగా నవ్వింది.
"ఇప్పుడేమనుకుని ఏం లాభం?"
"కానీ హేమగారూ ఇలాంటివాడనితెలిసికూడా వివహం ఎందుకు చేసుకున్నారు?" "బావుంది! తెలిసినిప్పు ఎవరయినా ముట్టుకుంటారా?"
"మరి వివాహానికి ముందే మీ ఇద్దరకూ పరిచయం ఉందికదా!"
"అది కేవలం 'పరిచయమే'! అతనెవరో మా బావా స్నేహితుడు! అంతవరకే! అంతకంటే ఎక్కువగా అతన్ని గురించినేనాలోచించలేదు. అతను ఆ రోజునుంచే నన్ను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు ముందే తెలిసివుంటే కొంతవరకూ అతనినీ పరిశీలించడానికి వీలయేది. అంతా అకస్మాత్తుగా జరిగిపోయింది. అతను కేవలం నారూపం చూసి మోహించాడనీ, అతని భార్యనవగానే ఆ మోహం రూపు మాసిపోయిందనీ వివాహమయినకొద్ది రోజులకే తెలిసింది నాకు. అప్పుడిక ఏం తెలుసుకుని మాత్రం ఏం లాభం? అయినా ఇందులో అతని తప్పుకూడా పూర్తిగా లేదు మా బావనన్ను వివాహం చేసుకోనని చెప్పగానే అతనిమీద ఆగ్రహంకొద్దీ నాన్నగారే వెంటనే ఈ వివాహం జరపడానికి ఏర్పాట్లు చేసేశారు. చివరికేమనిపిస్తోందో తెలుసా? ఈ మగాడి బుద్దే అంతేమోనని!"
ఆమె మాటలు చలనం లేకుండా వింటూండిపోయాడతను. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయినయ్.
"ఇప్పుడెక్కడదిగావ్?" అడిగిందామె.
"మాఫ్రెండ్ ఇంట్లో!"
"ఏం పనిమీద వచ్చావిక్కడకు?"
అతను నవ్వాడు.
"నిజంచెప్పేయమంటారా?"
"అంటే అబద్దాలు చెప్పడంకూడా నేర్చుకున్నావన్నమాట ఈ మధ్య!" "నేర్చుకున్న మాట నిజమేకాని మీ దగ్గర అబద్దాలు చెప్పడం నా వల్లకాని విషయం!"
"అలాగయితే నిజమే చెప్పు మరి!"
"కేవలం మిమ్మల్ని చూడడానికొచ్చేను!"
ఆమె చలించిపోయింది. అతనికి తనమీదున్న అభిమానం అంత ప్రగాఢమయినదా!" ఎప్పట్నుంచో ఎదుర్చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసం! అందుకే మీకు ఉత్తరం కూడా రాశాను. మీరు జవాబిస్తేకదా! ఇంక చేసేదిలేకబయల్దేరి వచ్చేశాను." హేమ సిగ్గుపడింది.
"జవాబు రాద్దామనుకుంటూనే ఆలస్యం చేశాను" అంది నొచ్చుకుంటూ.
"జవాబురాయనందుకు మిమ్మల్ని నిందించనులెండి! మీ పరిస్థితులన్నీ అర్ధమయినాయి కదా!" చనువుగా అన్నాడతను.
"పోనీలే! నా మీద అంత అభిమానంఉంటే అదే చాలు" నవ్వుతూ అంది ఆమె.
క్రమేపీ చీకటి అల్లుకోవడం ప్ర్రారంభించేసరికి గదిలో లైటు స్విచ్ వేసిందామె.
"మరి మీ విషయాలన్నీ మీ వాళ్ళకు తెలుసా?" అడిగాడు చంద్రకాంత్.
"ఊహు! వాళ్ళను లేనిపోనికలతలు పాలుజేయడం నాకిష్టంలేదు అంతగా పరిస్థితి విషమిస్తే అప్పుడే చెప్తాను."
కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఆమెను ఆ పరిస్థితిలో వదిలితనదారిన తానువెళ్ళడం తనకుతనే ద్రోహం చేసుకోవడం అనిపించసాగిందతనికి. కాని ఇందులో తనుచేయగలిగింది మాత్రం ఏముందీ? ఒకరి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత స్వేచ్చ తనకెక్కడిది? అందువల్ల మేలుజరుగకపోగా ఆమె పరిస్థితి మరింత క్షీణించే అవకాశాలు ఎక్కువగా వున్నాయ్.
"ఏరీమీవారు?" అడిగాడతను.
"ఇంతకుముందే యుద్ధం జరిగింది. ఎక్కడికో వెళ్ళారు?"
"నేనింకవెళ్ళడం మంచిదనుకుంటాను!" అన్నాడతను లేచి నిలబడుతూ.
ఆమెకుకూడా అదే మంచిదనిపించింది. శ్రీనివాసరావ్ చంద్రకాంత్ ని చూశాడంటే ఏం జరుగుతుందో తనకి తెలుసు. అతని ఉత్తరానికే నానారభసా అయింది.
"హైద్రాబాద్ ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్?" అడిగిందామె.
"ఈరాత్రికే వెళ్ళిపోతాను".
"వసుంధరని అడిగానని చెప్పు".
"సరే..." అతను బయటికినడిచాడు.
అతనితోపాటు ఆమెకూడా గేటువరకూ నడిచింది.
"హేమగారూ!" ఆగిపోయి పిలిచాడతను.
"ఊ!"
"మీరు నాకోమాట ఇస్తారా?" దీనంగా అడిగాడతను.
"ఏమిటది?"
"మీకు ఎలాంటి ఇబ్బందికలిగినా, ఎలాంటిసహాయం అవసరమయినా నాకు తెలియజేస్తానని".