సూర్నారాయణ గెలుపు కోసం పడే ఆరాటం ఏకాంతకి స్పష్టంగా తెలుస్తూంది.
సహకరించాలా వద్దా అన్న మీమాంసలో అరా నిమిషం గడిచింది. ఆ తర్వాత ఓటమి నుంచి బ్రతుకు గెలుపుదాకా నడవటానికి సమాయత్తమై అతడ్ని చుట్టింది ఏకాంత శబ్దంలాంటి నిశ్శబ్దంలో.
* * *
"సర్వ భూతస్థ మాత్మానం సర్వ భూతానిచ ఆత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనం"
గీతని చదువుతున్న సవ్యసాచి తనకు అభిముఖంగా నేలపై కూర్చున్న భార్య లక్ష్మిని చూస్తూ అన్నాడు వేదాంతిలా. "అంతటా సమదృష్టి కలిగి యోగమును ఏకత్వమును పొందినవాడు తనను అందరిలో అన్నిటిలోనూ తనను చూసుకుంటాడు. ఇలా పరిపూర్ణమైన స్పృహ కలిగినవాడు సమాజాన్ని, జగత్తును పరిపూర్ణం చేస్తాడేగాని తన వెలితితో ఎవరికీ వ్యధ కలిగించడు. జీవితాన్ని, ఉనికిని అలాగే ప్రపంచాన్ని తన స్వార్ధానికి తనకు పరిమితం చేసుకోవాలనుకోవడం ఆధ్యాత్మికంగా భ్రాంతి, అజ్ఞానము... సాంఘికంగా అధర్మమూ, సంఘర్షణ అవుతుంది"
భర్త చెబుతున్న తాత్పర్యం వింటుంటే నలభై అయిదేళ్ళ లక్ష్మి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. వినమ్రంగా భర్తకి చేతులు జోడించిందామె. ఆమె అలా కన్నీళ్ళు చిందించటానికిగాని, పరవశంతో ప్రణామాలు అర్పించటానికిగాని కారణం ఒక్కటే- తన భర్త ఓ మానవాతీతుడన్న భావం. ఆయన ఒకవేళ పోలీస్ డిపార్ట్ మెంటులో చేరి వుండకపోతే ఈ దేశం గర్వించదగ్గ మరో వివేకానందుడు అయ్యుండేవాడు. భారతదేశ వేదాంత సంస్క్రుతిని విదేశాలదాకా వ్యాపింపచేసేవారు. ఇది ఆమె ఖచ్చితమైన అభిప్రాయం.
పెళ్ళయిన కొత్తలో మామూలు పోలీసాఫీసరుగా వుండేవాడుకాని ఓ దశాబ్దంగా సవ్యసాచి చాలా మారిపోయాడు. పాపభీతి మూలంగా మారాడని కొందరంటే కాదు, చుట్టూవున్నా మనుషుల్ని మభ్యపెట్టటానికని మరి కొందరు అనుకుంటుంటారు. ఏది ఏమైతేనేం! హఠాత్తుగా సవ్యసాచి మొదలెట్టిన వేదాంత చర్చలు, ప్రతి ఆదివారం రామకృష్ణ మఠాన్ని సందర్శించడాలు, అడపా తడపా స్వామీజీలని ఇంట్లో పెట్టుకుని భక్తితత్పరతల్ని ప్రకటించడాలూ చాలామందికి చర్చనీయమైన అంశాలయ్యాయి.
లక్ష్మి అంతగా చదువుకొని భార్య కావడం కూడా అతనికి చాలా ఉపయోగపడింది. అసలు అతను పెరిగి పెద్దయ్యింది మేనమామ మేనత్తల దగ్గర అయుండకపోతే మేనకోడలు లక్ష్మిని పెళ్ళి చేసుకుని వుండేవాడు కాదు. అది వేరే విషయం కానీ అంత గొప్ప భర్త దొరకడం అదృష్టంగా భావించిన లక్ష్మి తరచు తన భర్తని గురించి, అతని నిజాయితీ గురించి ప్రముఖుల భార్యల ముందు, పనివాళ్ళ ముందు మాట్లాడడంతో సవ్యసాచికి అది గొప్ప పబ్లిసిటీ అయ్యింది.
పెళ్ళయిన కొత్తలో మూడువేల జీతంతో మొదలైన తన భర్త అరకోటి ఆస్తిని ఎలా సంపాదించాడా అన్నది ఆమెకు అవసరంలేదు. అంతా దేవుడి దయనుకోవడం ఆమెకు చాలా ఇష్టమైన విషయం సాక్షాత్త్హూ దేవుడు దిగివచ్చి 'నా దయ కాదు మీ ఆయన పనిచేసే డిపార్ట్ మెంటు అలాంటిది' అని చెప్పినా నమ్మదామె. అవసరమైతే ఆ వచ్చింది దేవుడే కాదంటుందేమో కాని తన భర్తొక అవినీతిపరుడంటే ఆమె సహించలేదు. మళ్ళీ మాట్లాడితే నా భర్తని ఆడిపోసుకున్న వాళ్ళ కళ్ళు పోతాయని ఘంటాపథంగా చెబుతుంది దేవుడికయినా.
ప్రతిరోజూ సాయంకాలం లైట్లు వెలిగించాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భర్తకి వచ్చిన పోలీస్ మెడల్స్ ని చూసి కూడా కళ్ళకద్దుకునే ఆమె ఆ రోజు యథాప్రకారం లైట్లు వెలిగించి కళ్ళకద్దుకునే కార్యక్రమంలో నిమగ్నమై వుండగా లోపలికి వచ్చాడు వశిష్ట.
అసలు తన కొడుక్కూడా పెద్ద పోలీసాఫీసరు కావటానికి కారణం భర్త పుణ్యఫలమే అని తలపోసే లక్ష్మి "ఏమైందిరా... ఏంటి అలా వున్నావు?" అంది వశిష్ట మొహం చూస్తూ.
అతను ఎందుకలా వున్నాడో సవ్యసాచికి తెలుసు. కానీ ఏమీ తెలీనట్టు సాత్వికాభినయాన్ని ప్రదర్శించాడు "ఏంటి నాన్నా?" అన్నాడు మృదువుగా కొడుకుని చూస్తూ.
"రాజేష్ మరణానికి సంబంధించీ మీ నుంచి కొన్ని వివరాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను డాడీ!"
సవ్యసాచికన్నా ముందు రియాక్టయింది లక్ష్మి.
"ఓ అలగా వెధవ గురించి నీ తండ్రిని అడిగేదేమిటి?" అనేసింది భర్తతో కొడుకు అలా మాట్లాడ్డం ఇష్టంలేనట్టు.
వశిష్ట నిశ్చేష్టుడిలా చూశాడు. రాజేష్ గురించి అమ్మకెలా తెలుసు?
సవ్యసాచి ఇబ్బందిగా కదిలాడు లక్ష్మి అనవసరమైన జోక్యంతో.
"ఈ విషయం మీ మమ్మీకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా వశిష్టా" మృదువుగా అడిగాడు సవ్యసాచి. "నువ్వు రాకముందే మీ అమ్మతో ఈ విషయం చర్చించాను... ఒక పోలీసాఫీసరుగా కాదు... ఓ తండ్రిగా...
నిజమే... రాజేష్ ని గూండాలు కాలేజీనుంచి లాక్కుపోయాక రాజేష్ తండ్రి రాజారాంగారు నాకు ఫోన్ చేసి సహాయాన్ని కోరారు. ఒక ఆదర్శవంతుడైన ఉపాధ్యాయుడుగా రాజారాంగారి గురించి తెలిసిన నేను అసలు అలాంటి బిడ్డకి ఆయన తండ్రి కావడమేమిటా అని ఆశ్చర్యపోయాను.
ఇలా ఎందుకంటున్నానూ అంటే అప్పటికే రాజేష్ మీద రెండు మూడు 'ఈవ్ టీజింగ్ కేసులు' డిఫరెంట్ పోలీస్ స్టేషనల్లో రికార్డయి వున్నాయి కాబట్టి అవి పర్సనల్ గా నేను స్టడీ చేశాను వశిష్టా... అయినా ఎలాంటి చర్యా తీసుకోవద్దన్నాను. ఎందుకంటే రాజారాంలాంటి మహానుభావుడి మనస్సు గాయపడుతుందని. అయితే రాజేష్ పోలీసుల మౌనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. సాక్షాత్తు హోంమినిష్టర్ గారి కూతురి మీదే దాడి ప్రారంభించాడు. నేను ఓ తండ్రిగ తండ్రి మనసుతో రాజారాం అనే ఓ తండ్రి గురించి ఆలోచించి ఉపేక్షించినాగాని మరి సూర్యానారాయణగారూ ఓ తండ్రేగా... శ్వేతకి అవమానం జరిగితే ఎలా సహించగలరని... అందులోనూ శ్వేతంటే నాకు కాబోయే కోడలు"
ఆ చివరి వాక్యంతో వశిష్ట ముఖంలో రంగులు మారాయి.