శేఖర్ వెనకాలే భార్గవి లోపలికి నడిచింది. పది పదిహేనేళ్ళ పిల్లవాడు ఎదురుగా వచ్చి శేఖర్ కి నమస్కరించాడు.
"రంగా, అమ్మాయి గార్ని లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపించు" అన్నాడు శేఖర్ ముందు వరండా లో అలసటగా కుర్చీలో కూర్చుంటూ.
భార్గవి లోపలి ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది. శుభ్రంగా ఎక్కడి వస్తువులక్కడ అమర్చబడి ఉన్నాయి. ముందు హాలు లోంచి మేడమీదకు మెట్లున్నాయి. హాలుకి కుడి వైపు అనుకుని ఉన్న గది కర్టెను తొలగించి చూసింది. అది ఆఫీసు రూము ఏవో ఫైల్సు కాగితాలు కట్టలుగా పడి ఉన్నాయి బల్ల మీద ఒక పక్క టైపు మిషను ఉంది దాని ముందోకతను కూర్చుని సీరియస్ గా టైపు చేస్తున్నాడు.
ఇదేవరిల్లబ్బా అని ఆలోచిస్తూ బయటకు వచ్చిన భార్గవి కి శేఖరం ఎదురు వచ్చాడు.
"భార్గవీ! ఎట్లా ఉంది మా ఇల్లు!ఈ ఇల్లు కాక మాకు ఇంకో ఇల్లు కూడా ఉంది - అది తర్వాత చూపిస్తాను."
'చాలా బాగుంది. గొప్పవాళ్ళ ఇల్లు కదా. ఎందుకు బాగుండదు" వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అంది భార్గవి.
"ఇంతకీ నీ కోపం గొప్ప వాళ్ళ మీదా? నా మీదా? పద భార్గవి, స్నానం చేసి రా -- ఆకలిగా ఉంది? అని నవ్వేసి ఆఫీసు రూములోకి వెళ్ళాడు శేఖర్.
"రండమ్మ గారూ -- రంగడి పిలుపుతో స్నానానికి బయలుదేరింది భార్గవి.
తీరుబడిగా తలకి స్నానం చేసి నెమ్మదిగా తల దువ్వుకుని కావాలనే ఆలస్యంగా వచ్చింది బయటకు. డైనింగ్ హాలులో రెండు చేతులూ గడ్డం కింద పెట్టుకుని కూర్చుని ఉన్నాడు శేఖర్.
"రా! భార్గవీ రా" భార్గవి రాకను గమనించి "వేలూ" అని వంట వాడ్ని కేకేశాడు.
భార్గవి కూర్చున్న వెంటనే రెండు ప్లేట్ల లో టిఫిను తీసుకొచ్చి ఒకటి శేఖర్ ముందు -- ఇంకొకటి భార్గవి ముందు పెట్టాడు -- వంటవాడు.
స్వీట్స్ కూడా తీసుకురా" అన్నాడు బెంగాలీ లో.
ప్లేటు లో రస గుల్లాలు పెట్టి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు.
"ఇది మా కలకత్తా లో స్పెషల్ -- తీసుకో అని భార్గవి ముందుకు నెట్టాడు ప్లేటును.
"నాకు ఆకలిగా లేదు. నేను తినను."
"అదేమిటి? ఎందుకని" తినబోతున్న వాడల్లా స్పూను ప్లేటు లో పడేసి ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం.
"ఎందుకేమిటి? నేను తిననంటే. ప్రతి దానికీ కారణం ఉంటుందా?"
"ఎందు కుండదు" భార్గవీ. అనవసరంగా మొండి తనం చేసి తినకపోతే తినిపించాల్సి వస్తుంది." కొంచెం గట్టిగా అంటున్న శేఖర్ ని విస్తుపోయి చూసింది కాసేపు.
భార్గవి లో పట్టుదల పెరిగింది. ఏమిటీయన గొప్ప -- తను తినమంటే నేను తినాలా! అసలు తిననే తినను. గట్టిగా అనుకుంది అనుకోవటమే తడవుగా తటాలున లేచి వెళ్ళబోయింది. శేఖర్ గబుక్కున లేచి వచ్చి భార్గవి రెక్క గట్టిగా పట్టుకుని కుర్చీ దగ్గరకు లాక్కుని వచ్చి "ముందు తిను. తరువాత నాతొ తీరుబడిగా పోట్లాడుదువు గాని" అన్నాడు.
"ఏమిటి మీ దౌర్జన్యం- మీరు చెప్పినట్టుగా నేను చెయ్యటానికి నేనేం మీ నౌకరునా -- అసలు నా మీద మీకీ స్వతంత్యం ఎవరిచ్చారు? అయ్యో భగవంతుడా -- ఏ ఆడపిల్లకూ ఇటువంటి కష్టం రాకూడదు." ముఖం రెండు చేతుల్లో కప్పుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది భార్గవి.
"ఛీ! ఛీ ! ప్రతిదానికి ఏడుపే . విసుగ్గా టిఫిను వదిలేసి వెళ్ళిపోయాడు శేఖర్.
భార్గవి కూడా గబగబా తనకు రంగడు చూపించిన రూములోకి వెళ్ళి మంచం మీద పడుకుంది.
కడుపులో ఆకలి నకనక లాడుతున్నది. అనవసరంగా పేచీ పెట్టుకున్నాను-- పాపం అతను కూడా తినకుండానే వెళ్ళిపోయాడు -- అవుననుకున్నా కాదను కున్నా ఈ రెండు రోజులూ తను శేఖరం నీడలో ఉండక తప్పదు.
మొదటిసారిగా అతని గురించి జాలిపడ్డ తనను చూసి తనే నవ్వుకుంది భార్గవి.
ఆకలి- రైలు లో శ్రమ - కిటికీ లోంచి వచ్చే చల్లని గాలి- అన్నీ తోడై భార్గవి కళ్ళ మీదకు నిద్ర ముంచు కొచ్చింది. బరువుగా రెప్పలు మూతలు పడిపోయినాయి.
* * * *
"నాకు 'ఉమెన్ వెల్ ఫేర్ లో ఉద్యోగం వచ్చింది జాయినవుతా" కానీ అంది నీరజ.
"నీరూ! నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీ జీవితం ఇలా తయారవుతుందని కలలో కూడా అనుకోలేదు.
నీరజ మౌనంగా నవ్వి ఊరుకుంది. రంగు రంగుల బొమ్మలు బంతులు అన్నీ చిన్న చిన్న చేతులతో విసిరి పడేస్తూ కేరింతలు కొడ్తూ ఆడుకుంటున్నది చిన్నారి "శాంతి". పాపను ముద్దుగా "శాంతి' అని ఇందిరే పేరు పెట్టింది. శాంతి వంకే చూస్తూ కూర్చుంది నీరజ మిగతా ప్రపంచంతో సంబంధం లేనట్టు తనలో తనే నవ్వుకుంటూ నీరజ చీర కుచ్చిళ్ళ ల్లో దూరి , ఆడి ఆడి అలసిపోయి అమాయకంగా నిద్రపోయింది శాంతి.
శాంతిని లేవదీసి పక్క మీద పడుకోబెట్టి వచ్చింది నీరజ.
"ఇందూ ఇవాళ అడివారమేగా! రామనాదంగారింటికి వెళ్దామా?" అంది నీరజ.
"నీరజా! ఇదంతా ఎవరికిస్తాను నేను-- "శాంతి" నీకెంతో నాకంతే. ఈ ఇల్లు నీది కదా! నా మాట విను నీరజా!
"ఇందిరా! ఏమిటి నీ పిచ్చి. రాజారావు ఇంట్లోనే ఉన్నాడు వింటే బాగుండదు - పద పోదాం.
"నేను పెళ్ళి చేసుకుంటాననే అనుకుంటున్నావా?"
రాజారావు రాకతో ఇద్దరూ మౌనం వహించారు.
"ఇందూ! నేనిప్పుడే వస్తాను మీనాక్షమ్మ గారు కబురు చేశారు" అని నిద్రపోతున్న పాపని భుజాన వేసుకుని గబగబా చెప్పులేసుకుని వెళ్ళిపోయింది నీరజ.
వాళ్ళిద్దర్నీ ఏకాంతంగా వదిలి పెట్టాలనే నీరజ ఉద్దేశం. అని గ్రహించిన ఇందిర చిన్నగా నవ్వుకుంది.
ఇందూ! నీతో మాట్లాడాలి. నేనూ ఈ అవకాశం కోసమే చూస్తున్నాను పైకి వస్తావా" అన్నాడు రాజారావు.
"వస్తాను- పద" అని తలుపులు వేసి పైకి వెళ్ళింది ఇందిర.
ఇందిర లోపలికి రాగానే తలుపు గడియ వేసి ఇందిరకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు రాజారావు.
"ఇందూ! నీమనసులో విషయం దాచకుండా చెప్పు. మామయ్యా ఆఖరి క్షణాల్లో కూడా నీవు ఎందుకలా ప్రవర్తించావు. కేవలం నా మీదే విముఖతా! లేక అసలు పెళ్ళి మీదేనా"
"రాజూ! నీకు సమాధానం కావాలంటావా"
"అవును- కావాలి చిన్నప్పటి నుంచీ మన మధ్య చనువు లేకపోయినా మీరు ఇండియా వచ్చిన దగ్గర నుంచీ నేను మీ ఇంటికి వస్తూనే ఉన్నాను. మనిద్దరి సంబంధమూ మామయ్య అనేక సార్లు మన ముందే అన్నాడు కూడా అప్పుడు నువ్వు మౌనంగానే ఉన్నావు. అంటే నా ఊహ అప్పటికి నీ కింకా వివాహం మీద అయిష్టత కలగలేదనే- అవునా?" అవునన్నట్టు తలూపింది ఇందిర.
"మరిప్పుడెందుకా విముఖత -- చెప్పు ఇందిర " లాలనగా అంటున్న రాజారావు మాటలకు ఇందిర కళ్ళు నీళ్ళతో నిండిపోయినాయి.
"రాజూ! నేను కారణం చెప్పలేను. కాని నేను పెళ్ళి చేసుకోను."
"అదే ఎందుకని- నువ్వు చెప్పాలి"
"నేను చెప్పను. నీకనవసరం కూడా"
"ఇందూ! కారణం లేకుండానే నువ్వు పెళ్లి చేసుకోను అంటే నిన్ను బలవంతంగా చేసుకోవలసి వస్తుంది. సరైన కారణం చూపిస్తే నీకేదైనా సహాయం చెయ్య గలిగితే చేస్తాను."
"బలవంతంగా చేసుకుంటావా?' ఆశ్చర్యంగా అంది ఇందిర.
"అది నా జన్మ హక్కు ఇందూ! నేను మీ మేనత్త కొడుకుని- తెలుసా.
ఇందిర నవ్వకుండా ఉండలేక పోయింది అతని అమయాకత్వానికి.
"రాజూ! ప్రేమ మీద నీకు నమ్మక ముందా"
"ఉంది కాని ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే నాకు చెడ్డ చిరాకు. హాయిగా తల్లి దండ్రులు కుదిర్చిన పెళ్ళాం మెళ్ళో తాళి గట్టి తీరుబడిగా ప్రేమిస్తే బాగుంటుంది. అనవసరంగా ముందు నుంచే హైరానా పడటం నా కిష్టం లేదు.
"అంటే నా విషయంలో కూడా అంతేగా రాజూ! ఇప్పటి వరకూ నా మీద నీకు ప్రేమ లేదుగా. మనకి వివాహం జరిగితే అప్పుడు కదా నువ్వు నన్ను ప్రేమించేది?' నవ్వుతూ అంది ఇందిర.
రాజారావు ఇబ్బందిగా బుర్ర గోక్కున్నాడు.
"నీ విషయం వేరు -- అదీ గాకుండా మన విషయం పెద్దల నిర్ణయం అయిపొయింది కాబట్టి నేను ప్రేమించవచ్చు."
ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు.
"ఇందూ! అసలు విషయం పోయి హాస్యం లోకి దిగుతున్నది వ్యవహారం" సీరియస్ గా అన్నాడు రాజారావు.
"రాజూ! నీకు నచ్చిన మంచి పిల్లను చూసి పెళ్ళి చేసుకో. మనిద్దరం చదువుకున్నవాళ్ళం. ఆత్మ వంచన చేసుకోవటం మంచిది కాదు గదూ"
"ఆ విషయాన్ని గ్రహించలేనంత తెలివి తక్కువవాడిని కాదు ఇందిరా. నాకు తెలుసు . నిన్ను నేను బలవంతం చెయ్యటం లేదు. అతనెవరో చెప్పు. అతనితో మాట్లాడి వస్తాను-- నా మేనమామ కూతురివి కాబట్టి ఈ విషయంలో స్వతంత్రించి అడుగుతున్నాను. చెప్పు ఇందిరా ఎవరతను? "రాజూ! అనవసరంగా కదలల్లకు ఎవరున్నారు? -- ఎవ్వరూ లేరు-- నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు అంతే"
"క్షమించు ఇందిరా! ఈ డైరీ నీదేనా. నేను చదివాను. నీకు ఈ మానసిక సంక్షోభం నుంచి విముక్తి కలిగించాలనే ఈ పని చేశాను. నాకు మరింకే దురేద్దేశం లేదు. నన్ను అపార్ధం చేసుకోవు కదూ"
రాజారావు చూపించిన డైరీ చూసిన ఇందిర తెల్లబోయింది. అంతలోనే ఆమెకు దుఃఖం ముంచు కొచ్చింది.
కొంతసేపటికి తేరుకున్న ఇందిరకు తలెత్తి రాజారావు ని చూడాలంటే ధైర్యం చాలలేదు. తలవంచుకుని అలాగే చూస్తూ కూర్చుంది.
"ఇందూ! మనసులోనే దిగమింగి కుళ్ళి పోవడం కంటే తెలివిగా వివేకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి గాని-- భీష్మ ప్రతిజ్ఞలు చేసుకొని కూర్చుంటే ఏం లాభం చెప్పు! అయినా విదేశాల్లో ఉండి వచ్చావు. ఇది చాలా చిన్న విషయంగా తీసుకుంటావనుకున్నాను-- కాని ఇంత ప్రాధాన్యం ఇస్తావనుకోలేదు. అల్ రైట్ ఇచ్చావు సరే . ఏదీ అది మాత్రం పరిష్కరించుకోగలిగావా! అదీ లేదు"
"రాజూ! అప్పటికి నాకు చిన్న తనం. ఇంత దూరం వస్తుందనుకోలేదు."
"కాని, అతను మాత్రం నీకు తీరని ద్రోహం చేశాడు.
"లేదు రాజూ! పోరబడుతున్నావు. పొంగి ప్రవహిస్తున్న నదికి ఆనకట్ట కట్టాడు. జీవిత సత్యాలను తెలియజేశాడు. మనసుని సక్రమమార్గంలోకి తిప్పాడతను. నాలోని మనిషిని గుర్తింపచేశాడు.
"పిచ్చిదానివి ఇందూ! ఒక అల్లరి పని నువ్వు చేశావో అనుకో! అందుకని స్త్రీ జీవం అయిన శీలాన్నే అపహరిస్తాడా? అందుకే ప్రేమ గుడ్డిదంటారు"
"రాజూ " బాధగా అంది ఇందిర.
"ఆ డైరీ అంతా చదివావా" నిస్సహాయంగా అంటున్న ఇందిరను జాలిగా చూశాడు రాజారావు.
"ఇందూ! నేను మనస్పూర్తిగా చెప్తున్నాను. భగవంతుడి దగ్గర కెళ్ళిన మామయ్య మీద, అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిన్ను భార్యగా స్వీకరించటానికి నాకెటు వంటి అభ్యంతరమూ లేదు. కానీ, నీ మనసు కూడా తెలుసుకోవాలి గదా!
"రాజూ! ఇక ఆలోచనలు వదిలేయి-- నేను ఎవరి జీవితమూ పాడు చెయ్యదల్చుకోలేదు."
"నాకు తెలిసే చేసుకుంటున్నాను కాబట్టి మోసానికి అస్కారమేమీ లేదు కదా!'
"వద్దు! వద్దు -- రాజూ నేను మనస్పూర్తిగా ఆయన్నే భర్తగా అరాదిస్తున్నాను."
"ఇందూ! ఆ విషయం తెలుసుకుందామనే ఇన్ని మాటలు మాట్లాడాను. అతనెక్కడ ఉన్నాడు?" గంబీరంగా అంటున్న రాజారావు ని భయంగా చూసింది ఇందిర.
"ఎందుకు?" నాకు తెలియదు."
"నేనేం చేయ్యనులే. ఎక్కడున్నాడతను?"
"ఏమోకలకత్తా లో ఇంజనీరు గా పని చేస్తున్నాడు. అయినా అతనికి పెళ్ళి నిశ్చయమయి పోయింది. రాజూ! దయచేసి నువ్వు రభస చెయ్యకు. పెళ్ళిని గురించిన ఆశలేమీ లేవు నాలో. నాకు ప్రామిస్ చెయ్యి రాజూ! ఈ విషయంలో జోక్యం కలిగించుకోను అని"
"ఇందిరా నీకు ప్తామిస్ చెయ్యటానికి నేనే మన్నా నీ అధీనంలో ఉన్న వాడినా -- నా ఇష్టం- నీకే రకంగానూ నేను మాటివ్వలేను" ఇందిర చేతి లోంచి డైరీ లాక్కుని జేబులో పెట్టుకుంటూ అన్నాడు రాజారావు.
"రాజూ! ఎంత అన్యాయం . దొంగతనంగా డైరీ చదవటం మొదటి తప్పు. చదివిన వాడివి అంతటితో వూరుకోకుండా నా స్వంత విషయంలో జోక్యం కలగజేసుకోవటం రెండో పొరపాటు. మర్యాదగా నా డైరీ నా కిచ్చేసేయి"
"ఉష్! అరవకు -- ఎందుకలా ఆవేశ పడతావు " తాపీగా అన్నాడు రాజారావు.
"రాజూ! ఇదా నువ్వు నాకు చేసే సహాయం. నన్ను గురించి బాధపడ్డావనుకున్నాను. ఇదంతా అందరికీ చెప్పి నన్ను నవ్వుల పాలు చేస్తావా?"
దుఃఖంతో ఆమె గొంతు పూడుకు పోయింది.
"ఇందూ! నేనంత దుర్మర్గుడ్నా. నేనేది చేసినా నీ మేలుకే చేస్తాను. ఆ లోకంలో ఉన్న మామయ్యా కు ఆత్మ సంతృప్తి కలుగ జేస్తాను."