Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 16

                                 


    "ఎక్కడ?"
    "గవర్నమెంట్ స్కూల్ల. ఆడ ఫీజు తక్కువ. సదువెట్లెయిన జెప్పనీ గానీ మంచి టీచరొకన్ని ట్యూషన్ పెట్టిన!"
    "సరే వస్తా" అన్నాన్నేను లేచి నిలబడుతూ.
    "ఇగో ఒక్కమాట. ఈ మాట ఎవళ్తోనూ చెప్పకు మళ్ళా."
    "అబ్బే-చెప్పను. నే నెందుకు చెప్తాను?"
    "గదే అంటున్న- నువ్వు నా పాత దోస్త్ వని చెప్పిన."
    నేనూ, గోపాల్రావ్ బయటికొచ్చాం!
    "దిసీజ్ టూ మచ్!" అన్నాడు గోపాల్రావ్.
    టూ మచ్చేనని నేనూ అంగీకరించాను.
    "ఇప్పుడేం జేద్దాం?" అడిగాడు గోపాల్రావ్.
    "సెయింట్ ఆంథోని కిండర్ గార్డెన్ స్కూల్ కెళ్దాం పద."
    "అక్కడ మాత్రం దొరుకుతుందంటావా?"
    ఇద్దరం సెయింట్ ఆంథోని స్కూలుకి చేరుకున్నాం సైకిల్ మీద. అక్కడి వ్యవహారం కొంచెం ప్రోత్సాహకరంగానే కనిపించింది.
    ప్రిన్సిపాల్ అప్పటికప్పుడే కిరణ్ గాడిని, చిన్నిగాడిని ఇంటర్వ్యూచేసి, రిజల్ట్స్ కూడా పావుగంటలో చెప్పేశాడు. సీటు దొరికిందట. వెంటనే చెరో పన్నెండు వందలూ ఎడ్మిషన్ ఫీజుగా కట్టేయాలట.
    "ఇప్పుడంత డబ్బు తేలేదండీ, రేపు కడతాం" అన్నాడు గోపాల్రావ్.
    "ఊహు, రేపటికయితే గ్యారంటీ లేదండీ ఈలోగా ఇంకెవరయినా వస్తే ఎడ్మిషన్స్ క్లోజయిపోతాయి తరువాత మీ ఇష్టం."
    "పోనీ ఓ గంట టైమిస్తారా?"
    ఆయన టైమ్ చూసుకున్నాడు.
    "ఓ.కే గంట టైమిస్తున్నాను" అన్నాడు చిరాగ్గా.
    గోపాల్రావ్ సైకిల్ మీద రివ్వున దూసుకెళ్ళి అరగంట తర్వాత నురగలుకక్కుకుంటూ వచ్చి ఇద్దరికీ ఫీజు కట్టేశాడు.
    "హమ్మయ్య పెద్ద సమస్య తీరిపోయింది" అన్నాడు సరిగ్గా అప్పుడే ఓ పెద్దమనిషి హడావిడిగా స్కూలు గేటు దగ్గర్నుంచి మావేపు వచ్చాడు.
    "ఫీజు కట్టేశారా?" అన్నాడు ఆత్రుతగా.
    "ఆ కట్టేశాం- ఎందుకలా అడిగారు?" అన్నాను  ఆశ్చర్యంగా.
    గాలిలోకి చేతులు ఎత్తి "గోవిందా-గోవిందా" అంటూ అరిచాడు దణ్ణం పెడుతూ. మా గుండెల్లో రాయి పడింది.
    "ఏమిటది? ఎందుకలా అంటున్నారు? అడిగాడు గోపాల్రావ్ పాలిపోయిన మొఖంతో.
    "మీ ఫీజు గోవింద!"
    "ఏం ఎందుకని?"
    "ఎందుకేమిటండీ మావాడిని కిందటేడు ఈ స్కూల్లో జేర్పించాను. వాడికి లెక్కల్లో ఎ+బి హోల్ స్క్వేర్ అంటే ఎస్క్వేర్ ప్లస్ బిస్క్వేర్ అని చెప్పాడట ఆ ఇడియట్. వీడింక పిల్లలకేం నేర్పుతాడు?"
    "అంటే లెక్కల మాష్టారుకి లెక్కలు తెలీదా?"
    "గోవిందా... గోవింద." అసలు లెక్కలు మేష్టరంటూ ఒకడుంటే కదా. ప్రిన్సిపాల్ సెవెన్త్ క్లాస్ వాళ్ళకి లెక్కలు, సైన్సూ చెప్తాడు. అందుకే మొన్న పరీక్షకెళ్ళిన ముప్పయి మంది కుర్రాళ్ళలో ఇరవైమంది ఫస్ట్ క్లాసులోనూ, మిగతా పదిమంది సెకండ్ క్లాసులోనూ తప్పారు."
    "తప్పారా?"
    "అవును ఫస్టు సెకండ్ క్లాసుల్లో"
    "దేముడో- ఇప్పుడేమిటి చేయడం?"
    "ప్రజాసేవ చేయండి ఈ గేటు దగ్గర కాసేపురోజూ కూర్చుని- కొత్తగా బలి అయేందుకు వచ్చేవాళ్ళను రక్షించండి." అనేసి వెళ్ళిపోయాడతను.
    గోపాల్రావ్, నేనూ ఒకరి మొఖాలొకరు చూచుకున్నాం.
    "పద మన ఫీజు మనకిమ్మని అడుగుదాం" కోపంగా అన్నాడు వాడు.
    "వాడికివ్వనంటే."
    "మర్డర్ చేసేద్దాం జైల్లో గడపడానికి నేను సిద్దంగా ఉన్నాను."
    ఇద్దరం మళ్ళీ ప్రిన్సిపాల్ గదిలోకి జొరబడ్డాం.
    "మా ఫీజు మాకిచ్చేయ్" అన్నాడు గోపాల్రావ్ చొక్కాచేతులు పైకిమడిచి.
    "ఒక్కసారి ఫీజు కట్టాక-ఏ పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వబడదని రసీదు వెనుక రాశాంకదా? అది మారూలు-"
    "ఇవ్వకపోతే మొఖం పగలగొట్టాలని మాకూరూలుంది."
    అతను కోపంగా కుర్చీలోంచి లేచాడు.
    "అసలు ఎందుకు వాపస్ ఇవ్వాలి నేను?"
    "ఎందుకంటే నీ బోడి స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు లేరు గనుక."
    "ఏ స్కూల్లో ఏడిచారు గనుక- నా స్కూలులో ఉండటానికి?"
    "మీ స్కూల్లో అందరూ ఫస్ట్ క్లాసులో తప్పుతున్నారు."
    "అది వాళ్ళకర్మ! నేను "పాస్ చేయటం" గారంటీ ఇవ్వటం లేదు."
    వాళ్ళ కర్మకాదు. నీకు చదువుచెప్పటం రాకపోవటం మూలాన తప్పుతున్నారు."
    "ఎవడాడు రాదంది?"
    "అయితే ఎ+బి హోల్ స్క్వేర్ ఎంతోచెప్పు."
    "సడన్ గా చెప్పమంటే ఎలా? ప్రిపేరవ్వాలి. ఎల్లుండి మాణింగ్ ఒకసారి కనబడండి! చెప్తాను!"
    "పోనీ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏమిటో చెప్పు."
    "ఫస్ట్ లా ఆఫ్ మోషన్ మొదటి లైనుకొంచెం చెప్పండి మిగతాది చెప్పేస్తాను."
    "ఛస్తే చెప్పను-"
    "అయితే నేనూ సమాధానం చెప్పను-"
    "చెప్పలేకపోతే నాఫీజు నాకిచ్చేయి. రెండింట్లో ఏదోకటి చెయ్యి."
    అతను చాలాసేపు ఆలోచించి ఏవేవో తప్పులు చెప్పటం మొదలు పెట్టాడు.
    "నీకు రాదులేగానీ డబ్బిచ్చేయ్" అన్నాడు గోపాల్రావ్.
    "నేనివ్వను."
    గోపాల్రావ్ ఠక్కునవాడి చొక్కాపట్టుకున్నాడు. అంతే! ఐదునిమిషాల పాటు అక్కడేం జరుగుతుందో నాకు తెలీదు. బల్లమీద- వస్తువులూ, గోడలకున్న కాలెండర్లూ, కుర్చీలూ, చెత్తబుట్టా, ఫోనూ, అన్నీ ముక్కలు ముక్కలయిపోయినాయి. వాళ్ళ యుద్దంలో! ఈలోగా ఆ స్కూలు సెక్రటరీ కాబోలు వచ్చి గోపాల్రావ్ ని పట్టుకోబోయాడు. మరో పక్కనుండి ఆ స్కూలు ఫ్యూన్ అతనికి సహాయంగా వచ్చాడు. ఇంక నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. వాళ్ళిద్దర్నీ చెరోతన్నూ తన్ని కిందపడగానే కుర్చీలు మీదవేసి నొక్కిపట్టాను. మరో ఐదు నిముషాలు భీకర సంగ్రామం జరిగింది. బయట నిలబడ్డ కిరణ్ గాడు, చిన్నిగాడు లోపలికొచ్చి ఆ దృశ్యం చూసి ఎంతో ఆనందించారు. సినిమాసీనుల్లో ఫైటింగ్ చూడడం వారికెంతో ఇష్టం. అదే ఎదురుగ్గా జరుగుతోంది మరి.
    "డాడీ- వాడిని పిస్టల్ తో కాల్చేయ్" అని సజెషన్ ఇచ్చాడు చిన్నిగాడు.
    హఠాత్తుగా ప్రిన్సిపాల్ మెడ గోపాల్రావ్ చేతుల్లో ఇరుక్కోవడంతో ఊపిరాడక "బాబోయ్ మీ డబ్బిచ్చేస్తాను వదలండి" అనరిచాడు ప్రిన్సిపాల్.
    ఇద్దరం బట్టలుదులుపుకుంటూ లేచి నిలబడ్డాం. ప్రిన్సిపాల్ చేతిమీద నుంచి రక్తం కారుతోంది. గోపాల్రావ్ గాడి కన్నువాచిపోయింది. నాకాలు ప్రాక్చరయిందేమో అనుమానం. చివరకు ఇద్దరికీ చెరో వందరూపాయలూ కాన్సిలేషన్ ఫీజుకింద తీసుకుని మిగతా డబ్బిచ్చేశాడు ప్రిన్సిపాల్.
    ఇద్దరం చిరిగిన బట్టలతోనూ, చెరిగిపోయిన జుట్టుతోనూ, ఒగరుస్తూ బయటికొచ్చి పిల్లలను+సైకిళ్ళనూ నెమ్మదిగా తీసుకుని నడవసాగాము. నాలుగడుగులు వేశామోలేదో శంకర్రావ్ ఎదురయ్యాడు. మా అవతారాలు చూసి ఆశ్చర్యపోయాడు.
    "ఏమిటి అవతారాలు? స్కూలు ఫీజు వాపస్ గొడవేనా?" అడిగాడు నవ్వుతూ.
    "అరె! నీకెలా తెలుసు?" ఇద్దరం ఉలిక్కిపడి అడిగాము.
    "స్కూల్స్ తెరిచే రోజుల్లో అందరం నాలుగుచోట్ల యుద్ధం చేస్తేనే గదా ఈ చెత్త స్కూల్స్ తప్పించుకునేది."
    "నేను ఆరుగురు సెక్రటరీలను, పధ్నాలుగుమంది ప్రిన్సిపాల్ నీ కత్తితో పొడిచాను-ఫీజు వాపసుకోసం."
    "అంతమందినా?"
    "అవును మరి చాలా చోట్ల నేనూ కత్తిపోట్లు తిన్నాననుకో- తప్పదు మరి మన పిల్లల్ని ఆంద్రప్రదేశ్ లో చదివించాలంటే తల్లిదండ్రులు ఈ మాత్రం రిస్క్ తీసుకోవాల్సిందే."
    "ఒకవేళ ప్రిన్సిపాల్ స్త్రీ ఉంటే ఎలా?" అడిగాడు గోపాల్రావ్.
    "అప్పుడు మా ఆవిడను పంపిస్తాను. దానికి ఈ మధ్యే కరాటే నేర్పించాను.  దీనికోసమని. ముగ్గురు లేడీ ప్రిన్సిపాల్ ను చావగొట్టి ఫీజు వాపస్ తీసుకొచ్చింది. ఇప్పటికి-కనుక ముందు మీ భార్యలను కరాటే స్కూలుకి పంపించండి. వీలయితే మీరూ నేర్చుకోండి వస్తా- ఇంకో సెక్రటరీ ఈ పక్క కల్లు కాంపౌండ్ లో కల్లుతాగుతున్నాడట. వాడి అంతు తేల్చుకోవాలి." అంటూ కత్తి బయటకు తీసి పక్కనే ఉన్న కల్లు కాంపౌండ్ లోకి పరుగెత్తాడు.
    "పద" అన్నాడు గోపాల్రావ్.
    "ఎక్కడికి?" అడిగాను.
    "కరాటే స్కూలుకి"
    "మరి పిల్లలో..."
    "వాళ్ళను కూడా తీసుకెళదాం... మనకి సహాయంగా ఉంటారు పోనీ ఇంకో పని చేద్దాం. నువ్వు కరాటే స్కూలు కెళ్ళు. నేను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ స్ట్రక్షన్ ఆఫీసుకెళతాను. ఇలాంటి చెత్త స్కూల్సు అన్నిటికీ గవర్నమెంటు రికగ్నిషన్ యిస్తున్న ఆ ఆఫీసరు అంతు తేల్చుకొస్తాను...." వాడు పిల్లల్ని తీసుకుని కరాటే స్కూలు వేపు బయల్దేరాడు.
    నేను డి.పి.ఐ ఆఫీసు చేరుకున్నాను.
    రిసెప్షనిస్టు చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు.
    అందరికీ సమాధానాలు చిరాకుగా చెప్తాందామె.
    చివరకు నావంతువచ్చింది.
    "ఏం కావాలి?"
    "అడ్డమైన స్కూల్సుకీ రికగ్నిషన్ యిస్తున్న మీ డైరెక్టర్ని కత్తితో పొడవాలి! ఎక్కడాయన?" "ఆయనని కత్తితో పొడవాలనుకుంటున్న పేరంట్సు క్యూ ఆఫీస్ వెనుకవేపు వుంది. అటు వేపు వెళ్ళి 'క్యూ'లో నిలబడండి" అందామె చిరాకుగా.
    
                        

 

                                            *    *    *

 Previous Page Next Page