"అమ్మో నాకు భయం "
"నేనంటేనా?"
"నువ్వంటే కాదు. నీతో అలా రావడానికి"
"ఏం నేనేమైనా..."
"ఛీ...అది కాదు"
"ఇలా రోడ్డు మీద అయిదు నిమిషాలు, పది నిమిషాలు మాట్లాడుకుంటుంటే నాకు తృప్తిగా వుండడం లేదు."
"నాక్కూడా. కాని ఇంతకంటే ఏం చెయ్యాలో కూడా తెలీడం లేదు."
"నిన్ను రోజూ కలుసుకోకుండా వుండలేకపోతున్నాను."
"నువ్వెప్పుడయినా కనిపించకపోతే నాకూ అలానే వుంటుంది గోపీ !"
"అస్మితా! రాత్రుళ్ళు నువ్వు ఒక్క దానివే గదిలో వుంటావా? లేకపోతే మీ అక్కయ్యతో కలిసి పడుకుంటావా?"
"ఏం?"
"ఒక్కదానివి వుంటే నాకెప్పుడయినా రావాలనిపిస్తే వచ్చేస్తాను."
"నేను మేడ మీద గదిలో వుంటాను. క్రింద దారులన్నీ మూసేసి వుంటాయి."
"నే రాదల్చుకుంటే ఏ మూసి వున్న దారి నన్నడ్డగించలేదు."
అస్మిత అతని ముఖంలోకి చూసింది. ఆ కళ్ళలో కానవస్తోన్న చురుకుదనం, దీక్ష, పట్టుదల చూస్తే అతనన్నంత పనీ చెయ్యగలడనిపించింది.
"అమ్మో! అలా ఎప్పటికీ చెయ్యకు. మా అక్కయ్య నాతోనే పడుకుంటుంది." అంది ముఖంలో భయం కనబరుస్తూ.
ఇంతలో ఆమె ఎక్కే బస్ స్టాప్ దగ్గరకొచ్చింది. ఆమెతోబాటు స్కూల్ కి వెళ్ళే అయిదుగురు విద్యార్ధినులక్కడ నిలబడి వున్నారు.
"ఇంక వెళ్ళిపో గోపీ. వాళ్ళెవరయినా చూస్తారు. రేపు కలుద్దాం" అంది అస్మిత.
అటూ ఇటూ చూసి ఆమె బుగ్గమీద చిన్న చితికవేసి అతను వెనక్కి తిరిగాడు.
ఓ పది గజాలు నడిచాడో లేదో వెనకనుంచి 'గోపీ!' అన్న పిలుపు వినిపించింది.
తల త్రిప్పి చూసేసరికి క్లాస్ మేట్. అతన్తో చనువుగా వుండే రామ్మోహన్ కనిపించాడు చేతిలో వున్న పుస్తకాలతో.
"ఏమిటిరా" అన్నాడు గోపీకృష్ణ.
"కాలేజీకి వస్తున్నావా?"
అతను తల అడ్డంగా తిప్పి "రాను" అన్నాడు.
"గోపీ! రోజూ కాలేజి మానేసి ఏం చేస్తావు?"
"ఏదో చేస్తాను. అర్ధం లేని ఈ చదువులంటే నాకసహ్యం. మీరంతా చదువుకుని జీవితాలను ఉద్దరింపచెయ్యండి, సంతోషిస్తాను."
"గోపీ! నిన్ను చూస్తే బాధగా వుందిరా. మనం చిన్నప్పట్నుంచీ క్లాస్ మేట్స్ గా వున్నాము. నీలో వస్తున్న ఈ మార్పులు నాకు చాలా బాధ ..."
గోపీకృష్ణ నిర్లక్ష్యంగా నవ్వాడు. "ఎందుకురా బాధ? మీరంతా చదువులు పూర్తిచేస్తారు ఎక్కడో అక్కడ ఉద్యోగాల్లో చేరి జీవితాలు మొదలెడతారు. అందులో పడి ఈదులాడుతూ వుంటారు. ఈ భయంకరమైన రొటీన్ నాకిష్టంలేదు. అందుకనే _ అందులోనుంచి తప్పించుకుని తిరుగుతున్నాను."
"ఈ రొటీన్ ఎంత భయంకరమైనదైనా మానవ జీవితానికి తప్పదురా."
గోపీకృష్ణ జావాబివ్వలేదు.
"వొరేయ్ ఓ విషయమడుగుతాను ఏమీ అనుకోవుగా ?"
"అడుగు పర్వాలేదు"
"నువ్వు రోజూ కలిసి వస్తున్నావే, ఆ అమ్మాయి ఎవర్రా ?"
"నా గర్ల్ ఫ్రెండ్."
"నిండా చూస్తే పదిహేనేళ్ళున్నట్లుగా లేవు. ఎందుకురా ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటున్నావు?"
"పదిహేనేళ్ళు _ ఈ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న వయస్సేమీ కాదు. చూపులకు వికసించనట్లు కనబడుతున్నా వాళ్ళ గుండెల్లో అఖాతాలుంటాయి. వాళ్ళకు తెలీని విషయాలంటూ ఏమీ వుండవు. ఇహ ఆటలాడుకోవడమంటావా? ఆ అమ్మాయి నను లైక్ చేసింది, నేనూ తనని లైక్ చేశాను. ఆమె గొప్పింటి బిడ్డ. తనని ఆసరాగా చేసుకుని పైకి వెళ్ళి పోవాలనే ఉద్దేశం నాకుంది."
"నువ్వు చేరువయ్యేది ఆ అమ్మాయి డబ్బుకోసమన్నమాట."
గోపీకృష్ణ నవ్వాడు "కావచ్చు"
* * *
ప్రజ్ఞ రేషన్ కార్డ్ తీసుకుని చౌక బియ్యం డిపోకి వెళ్ళింది. బియ్యం ఇంకా స్టాక్ రాలేదన్నాడు. ఉసూరుమంటూ వెనక్కి తిరిగి బయల్దేరింది.
తేజ వాళ్ళింటి దగ్గరకు రాగానే అప్రయత్నంగా తల త్రిప్పి చూసింది. తేజ ఇంటి ముందు భాగంలో వున్న సెట్ అవుట్ లో ఫేము కుర్చీలో కూర్చుని ఇంగ్లీషు నవలొకటి చదువుకుంటూ అదే సమయానికి తల ఎత్తి చూసింది.


