మేక అరుపు ఆగిపోయింది__చిరుత పంజా దెబ్బకి ప్రాణాలు వదిలిన సత్యానికి సాక్ష్యంలా! కాని, ఎదురుగా చీకటిలో తెలుపురంగున్న మేకను చిరుత ఈడ్చుకుపోతూ వుండడం మసగ్గా కనిపించింది.
ఆ చిన్న గుర్తు చాలు. అంతే! చైతన్య ఆలస్యం చేయకుండా మేకను లాక్కుపోతున్న చిరుతను గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడు.
తూటా మోతకు జవాబుగా ఓ గుర్రు వినిపించడం, బరువయిన బండరాయి నేలపైపడి దొర్లిన శబ్దం వెనువెంటనే వినిపించాయి, ఏం జరిగిందీ తెలుసుకొనేలోగానే చిరుత ఎత్తయిన గట్టుపై నుంచి సన్నని మార్గంగుండా అడవిలోకి దూసుకుపోయింది.
తర్వాత మరో పది నిముషాలు చెవులు రిక్కించి విన్నాడు.
చిరుత పరంగా ఎలాంటి శబ్దమయినా వినిపిస్తుందేమోనని. తూటా మూలంగా గాయపడిందో ,లేక గురి తప్పి తప్పించుకుందో గుర్తించలేక పోయాడు.
అడవిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.
తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకుని ఉండడంతో ఆకాశం లోకి గురిచూసి తుపాకీ పేల్చాడు. అంతకు పూర్వమే గిరిజనులకి కొన్ని సూచనలు చేశాడు. గాలిలోకి తుపాకీ పేల్చాక, వారు ఉమ్మడిగా దేవదారు కొమ్మలతో చేసిన దివిటీలు పట్టుకుని పెద్దగా అల్లరిచేస్తూ అడవిలోకి రావాలి.
సుమారు పద్దెనిమిది అంగుళాల పొడవుగల ఈ దివిటీలు దేవదారు చెట్లకొమ్మల నుంచి తయారు చేయబడినవి. సామాన్యంగా విద్యుత్తు సరఫరాకు నోచుకోని మారుమూల గ్రామాలలోని వారు వెలుగుకోసం ఆధారపడేది ఈ దేవదారు దివిటీలపైనే.
మరికొన్ని నిముషాలలో ఓ ఇరవైమంది గిరిజనులు పెద్దగా కేకలు చప్పట్లు చేసుకుంటూ చైతన్య వున్న ప్రదేశాన్ని చేరుకున్నారు. దివిటీలు వెలుగులో ఓ ఏభై చదరపు గజాల మేర కాంతి వ్యాపించింది.
కొందరు వ్యక్తులు చెట్టు చుట్టూ అస్తవ్యస్తంగా పడివున్న ముళ్ళ కంచెల్ని లాగి చైతన్య క్రిందికి దిగిరావడానికి మార్గం చేశారు.
చాలాసేపు సరయిన ఆసరా లేకుండా కూర్చొని వుండటంతో అతని కాళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. కాంతి వెలుగులో నేలపడివున్న మేకను కొన్ని క్షణాలపాటు తదేకంగా చూసిన చైతన్య చిరుత పరుగుతీసిన బాటవైపు దృష్టి సారించాడు.
"చిరుత గాయపడిన మాట నిజమే అయినా, అది ఎంత బలంగా గాయపడిందో చెప్పలేను" అన్నాడు సాలోచనగా. "ఎలాగూ ఇంతవరకూ వచ్చారు కాబట్టి అది వెళ్ళిన మార్గంలో కొంతదూరం వెళ్ళి చెక్ చేద్దాం."
చైతన్య మాటలకు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్న గిరిజనులు_అలాంటి రాత్రివేళ ఇటువంటి పనికి సాహసించడం సమంజసం కాదన్నట్టుగా ఇబ్బందిగా చూశారు.
"ఒకవేళ కదలలేనంత బలంగా గాయపడి ఉంటే ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉండాలి."
"ఒద్దయ్యగోరూ! దెబ్బతిన్న పులి ఊరుకోదు. మరింత కసెక్కి ఏ సెట్టు మీద్నుంచో మీదపడి పేనాలు తీస్తాది" అనుమానం వ్యక్తం చేశాడో గిరిజన యువకుడు.
"దెబ్బతిన్నది నిజమయితే, ఈడనే ఏడో సచ్చి పడుంటాది. పొద్దుటేల కొచ్చి సూద్దాం" అన్నాడు మరో యువకుడు.
ఆత్రతని చంపుకోలేని చైతన్య మేకను లాక్కు వెళ్ళిన ప్రదేశాన్ని చేరుకుని నేలపై పరిశీలనగా చూశాడు జాగ్రత్తగా దివిటీలు వెలుగులో రక్తపు మరకలు కనిపించలేదుగాని, చిరుత శరీరంపై ఉండే వెంట్రుకలు బొత్తుగా పడి వున్నాయి.
వద్దని భయంతో మొరాయిస్తున్న గిరిజనులకు ధైర్యం చెప్పాడు. "నేను తుపాకీతో ముందు నడుస్తాను. మీరు నా వెనుక రండి. మీకెలాంటి ప్రమాదం జరక్కుండా నేను చూసుకుంటాను" నచ్చచెబుతున్నట్లుగా చూశాడు.
అప్పటికీ వారు జవాబు చెప్పలేదు.
"కనీసం ఈ గట్టుమీదుగా ఓ వంద గజాల దూరం వరకూ వెడదాం. ఈలోగా ఏ ఆధారాలూ దొరక్కపోతే వెనక్కి వెళ్ళిపోదాం" చివరిసారిగా అతడు తన స్థిర నిర్ణయాన్ని వ్యక్తం చేసేసరికి అయిష్టంగానే అతడ్ని అనుసరించారు.
దివిటీలు వెలుగులో చాలా ఏకాగ్రతగా చూశాడు నేలపై చిరుత రక్తపు మరకలు కనిపిస్తాయేమో అన్న ఆలోచనలతో. అతడు యిప్పుడు అనుసరిస్తున్నది చిరుత అడుగు జాడల్నే! హఠాత్తుగా నేలపైకి వంగి కూర్చున్నాడు ఇంకా తడి ఆరనిరక్తపు బొట్లనుచూస్తూ.
ఒకవేళ చిరుతకు ఏ వృష్ఠభాగంలోనో గాయమై ఉంటే అది వెంటనే మరణించదు. నాలుకతోగాని, పంజాతోగాని గాయాన్ని శుభ్రం చేస్తూ యెక్కడో నక్కి కూచుని వుంటుంది. అలా గాయపడిన చిరుత మరింత భయానకంగా ప్రవర్తిస్తుంది.
అందుకే అతణ్ని అనుసరించిన గిరిజనులతో చాలా స్పష్టంగా చెప్పాడు_దివిటీలు చాలా ఎత్తుగా పట్టుకునడవాలని, ఎలాంటి ఉపద్రవం వాటిల్లినా తను ఎదుర్కోడానికి సిద్ధంగా వున్నాడు. కాబట్టి ధైర్యంగా అనుసరించమని.
చైతన్య వారినలా హెచ్చరించింది భయంతో కాదు_దివిటీలు వెలుగులో పరిసరాలు చాలా స్పష్టంగా కనిపించనినాడు, చిరుత హటాత్తుగా పైకి చార్జీ చేస్తే తనను తాను రక్షించుకోవడమూ వీలుపడని విషయం కాబట్టి.
ఇంచుమించు అయిదు గజాల వెనుకగా నడుస్తున్నారు గిరిజనులు. చైతన్య పరిసరాలను అప్రమత్తంగా గమనిస్తూ ముందుకు వెళుతున్నాడు. నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ మరికొన్ని అడుగుల దూరంలో మార్గం పొదలతో నిండి ముందుకు ప్రయాణం చేయడమా, వద్దా అన్న ఆలోచనలో ఉండగానే ఊహించని విధంగా గట్టుపైకి వచ్చి నిలబడింది చిరుత.
కర్కశంగా అది చేసిన గాండ్రింపుతో ప్రకృతి గజగజా వణికింది. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన భయంతో ఒకరిపై మరొకరు పడుతూ ,దివిటీలను వదిలి వెనక్కి పరుగెత్తారు.
చిరుత ఆవేశంతో చేసిన గాండ్రింపు ఎంత భయానకంగా ఉంటుందంటే ఏనుగులు సైతం_భీతితో కకావిక లౌతాయి. చైతన్య అనుభవంలో ఇలాంటి సంఘటన లెన్నో చూశాడు.
అందుకే తన ననుసరించి వచ్చినవాళ్ళు ఆ సమయంలో ప్రాణ భీతితో పరుగెత్తినప్పుడు అతడు ఆశ్చర్యపోలేదు.
ఆ క్షణంతో చైతన్యకు సహకరించింది నేలపైపడి పరిసరాలను పూర్తి వెలుగుతో నింపిన దివిటీలు.
ఆ వెలుగులో చిరుత చాలా స్పష్టంగా కనిపిస్తోందతనికి. కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలబడి మృత్యువులా తన వేపే చూస్తున్న చిరుత_మరికొన్ని లిప్తల్లో మరోసారి గాండ్రించి మీదకి చార్జి చేయబోతుండగానే అతని చేతిలోని తుపాకి తూటాని కక్కి చిరుత గుండెలో నుంచి దూసుకుపోయింది. స్లగ్స్ చిరుత తాలూకు మరే ఇతర అవయవాన్ని తాకినా చైతన్య మిగిలేవాడు కాడు.
బాధతో దుముకుతూ ముందుకు రావాలని విశ్వప్రయత్నం చేస్తూ తుప్పల్ని చెల్లాచెదురుగా నేల కరిపిస్తూ నిస్సహాయంగా చైతన్యకు కొన్ని అంగుళాల దూరంలో నిర్జీవంగా పడిపోయింది.
అప్పటికే చాలా దూరం పరుగెత్తిన గిరిజనులు తిరిగివచ్చారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో నిలువెల్లా వ్యాపించిన భయం మనిషి ధైర్యాన్ని ఎంతగా నొక్కి పెడుతుందో చెట్టుపై కూర్చున్నప్పుడు జరిగిన సంఘటనతో కొన్ని నిముషాల క్రితమే అనుభవంగా తెలుసుకున్న చైతన్య వారిని అపార్ధం చేసుకోలేదు.
గుంపులుగా చేరి నేలపైపడి వున్న చిరుతను పరీక్షిస్తున్న వారితో "వెదురు బొంగుల్ని తీసుకొచ్చి రెస్టు హౌస్ కి తరలించండి" అన్నాడు. టెన్షన్ నుంచి పూర్తిగా తేరుకుంటూ.