ఆ మాటలు నిజమై వుండవచ్చు. లేదా అతడు అబద్దాన్ని కూడా నిజాయితీగా చెప్పగలవాడు అయి వుండవచ్చు. "తన భర్త" అని ఆలోచించకుండా, ఒక వ్యక్తిగా చూస్తే, ఒక్కరోజు పరిచయం ఏమీ తెలీదు.
"అపురూపలక్ష్మి నాకు తెలుసు. అంతే!"
ఎంతవరకు తెలుసు! ఇదొకటి ముల్లులా గుచ్చుతోంది. పెళ్ళయిన మొదటిరోజే భర్త గర్ల్ ఫ్రెండ్ గురించి తెలియటం. అధీ పోలీసుల ద్వారా....
అతడొకవేళ ఈ హత్య చేయకపోతే, మరి చేసిందెవరు?
దూరంగా గడియారం నాలుగు కొట్టింది. ఆకాశం నిర్మలంగా వుంది. చల్లటిగాలి ఆగి ఆగి వీస్తూంది. ఇంకొంచెం సేపట్లో ప్రపంచం నిద్ర లేస్తుంది. బాణాలు, బల్లేలూ, సూదులూ పట్టుకు తయారవుతుంది. వచ్చిన కష్టంకన్నా, రాబోయే ఈ కష్టాన్ని ఎదుర్కోవటానికి ముందు ఆయత్తమవ్వాలి.
ఆమె పుస్తకం తెరిచి ఏకాగ్రతతో చదవటం ప్రారంభించింది. ఆమెలోని మంచి లక్షణం ఏమిటంటే ఒకసారి ఆ లోకంలోకి వెళ్ళాక మిగతావేమీ గుర్తుండవు. ఆమె చదువుతూన్న పుస్తకం డాక్టర్ మెయిన్ డబ్ల్యూ డయ్యర్ వ్రాసిన -
Pulling your own strings
* * *
ప్రొద్దున్న ఏడింటికి ఇన్ స్పెక్టర్ రాయన్నని ఇంటరాగేట్ చేయటం ప్రారంభించాడు.
"మీ పేరు?"
"రాయన్న!"
"ఎక్కడ పనిచేస్తూ వుంటారు?"
రాయన్న చెప్పాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల మొహం పీక్కుపోయింది. తలవంచుకుని సమాధానాలు చెపుతున్నాడు.
"చూడండి మిస్టర్ రాయన్నా! నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చేముందు, మీ లాయర్ పక్కన వుండాలి అని మీరు కోరవచ్చు. ఈ అధికారం మీకుంది- మీరేచెప్తారా లేక లాయర్ని పిలిపించుకుంటారా?"
"నేనే చెపుతాను."
"అపురూపలక్ష్మి మీకెంతకాలంగా తెలుసు?"
"సంవత్సరం పైగా-"
"ఇంకా ఆ లేడీస్ హాస్టల్ లో మీకెవరైనా అమ్మాయిలు తెలుసా?"
"ఇంకొ నలుగురైదుగురు తెలుసు."
"పేర్లు?"
రాయన్న ఇబ్బందిగా చూసి, "వాళ్ళపేర్లు తప్పనిసరిగా కావాలా?" అని అడిగాడు.
"బయటకి రాకుండా వుంచటానికి ప్రయత్నిస్తాను. రేపు కోర్టులో ఎలాగూ చెప్పాలి. అప్పటికి కేసు పాతబడిపోతుంది కాబట్టి ప్రెస్ వాళ్ళకి వాళ్ళ పేర్లమీద అంత ఉత్సాహం వుండదు చెప్పండి."
"పద్మ.... విజయ .... రమణి ... అనూరాధ ...." ఇన్ స్పెక్టర్ అతడివైపు అదోలా చూశాడు.
"మొట్టమొదటిసారి మీకు ఎలా పరిచయం అయింది అపురూపలక్ష్మి?"
"ఆటోగ్రాఫ్ కోసం వచ్చారు."
"అయిదుగురూనా?"
"కాధు, ముగ్గురు."
"ఎవరెవరు?"
"గుర్తులేదు."
"ఈ అయిదుగురిలో మీకు ఎంతమందితో పరిచయం వుంది?"
రాయన్నకీ ప్రశ్న అర్ధంకాలేదు. "అయిదుగురితోనూ" అన్నాడు.
"ఆ పరిచయం గురించి కాదు. 'ఆ పరిచయం' గురించి అడుగుతున్నాను."
రాయన్న మొహం వివర్ణమయింది. "ఎవరితోనూ లేదు" అన్నాడు.
ఇన్ స్పెక్టర్ మొహం కఠినంగా మారింది. ".....అపురూపలక్ష్మితో కూడా లేదా"? అని అడిగాడు.
"లేదు. ప్రమాణం చేసి చెపుతున్నాను."
"కోర్టులో కూడా నేరస్తులు ప్రమాచం చేసి చెపుతారు. ఆ ప్రమాణానికి విలువలేదు."
రాయన్న మాట్లాడలేదు. ఇన్ స్పెక్టర్ అతడి వైపే సూటిగా చూశాడు. రాయన్న తలదించుకున్నాడు.
"అపురూపలక్ష్మికి ఇంకెవరయినా మొగ స్నేహితులున్నారా?"
"లేరు. చాలా మంచి అమ్మాయి."
"మంచి అమ్మాయా? .... మీరున్నారుగా బోయ్ ఫ్రెండ్."
రాయన్నకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. మనసులో భావాల్ని ఎలా వ్యక్తీకరించాలో అతడికి తెలీదు. బాయ్ ఫ్రెండ్ వుండటంవల్ల మంచితనం ఎలా తగ్గుతుందో అతడికి అర్ధంకాలేదు. 'మంచి' అన్నది ఒక పువ్వు లాంటిది. అది తన పరిమళాన్ని నాలుగు దిక్కులకీ వెదజల్లుతూ వుంటుంది. ఎన్నో అంశాల్లో ఆ మంచితనం గోచరమవ్వొచ్చు.
"లక్ష్మి ఎవరితోనూ మాట్లాడదు. బాగా చదువుతుంది. చిత్రలేఖనంలో ఆసక్తి ఎక్కువ. తన పనేదో తను చూసుకుంటుంది. మిగతావారి విషయాల్లో జోక్యం కలుగజేసుకోదు. దైవభక్తి కూడా ఎక్కువ...."
'....అందువల్ల తనని మంచి అమ్మాయి అంటున్నాను-'అన్న అభిప్రాయంతో అన్నాడు.
"లక్ష్మిని మీరెప్పుడు చివరిసారిగా కలుసుకున్నారు?"
"నిన్న మధ్యాహ్నం...."
ఇన్ స్పెక్టర్ మొహంలో ఆశ్చర్యం కనిపించింది. "-కానీ మొన్న సాయంత్రం మీకు వివాహం జరిగింది?" అన్నాడు.
"అవును. చిన్న ఉత్తరం పంపించింది. అందుకని హాస్టల్ కి వెళ్లాను."
"హాస్టల్ లోపలికి వెళ్ళారా?"
"-లోపలికే."
"కానీ పరాయి వాళ్ళని లోపలి అనుమతించరే...."
"అది రూలేమో నాకు తెలీదు. మేమెప్పుడూ లోపలే కలుసుకుంటాం."
ఇన్ స్పెక్టర్ కాగితంమీద ఆ విషయం వ్రాసుకున్నాడు.
"ఏం మాట్లాడుకోలేదు."
"అంటే- వూరికే ఉత్తరం పంపించి మిమ్మల్ని చూశాను. అదే చాలు. వెళ్ళిరండి అనేసిందా?"
...... ...... .....
"మిస్టర్ రాయన్నా మీరు అబద్దం చెపుతున్నారు. అది మంచిది కాదు."
"నేను నిజమే చెబుతున్నాను. నేను వెళ్ళిన అయిదు నిమిషాలకి తను కలిసింది. కళ్ళు ఉబ్బి వున్నాయి. రాత్రంతా ఏడ్చినట్టుంది. కారణం అడిగాను. జవాబు చెప్పలేదు. ఉత్తరం ఎందుకు వ్రాశావు? ఏం మాట్లాడాలి? అని అన్నాను. పెళ్ళికి రాలేదేం? అని అడిగాను. మళ్ళా ఏడవటం ప్రారంభించింది. కొంచెంసేపు ఓదార్చాను. తరువాత వచ్చేశాను"
"బహుశ మీరు పెళ్ళి చేసుకోవటంతో ఆమె ఏడుస్తూ వుండి వుంటుంది-"
.... .... ....
"ఆ అమ్మాయికి ఇంకెవరైనా, మొగ స్నేహితులున్నారా?"
"లేరు. లేరు."
"ఆ విషయం నిర్ధారణగా చెప్పగలరా?"
"చెప్పగలను!"
"మిగతా వాళ్ళకి?"
"రమణికి వున్నారు..... చాలామంది."
"అందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వున్నారా?"
"ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆఫీసులో నా స్నేహితుడు ఒకరున్నారు. రాజారావు అని. అతడు గాక సుబ్రహ్మణ్యం అని ఇంజనీరింగు కాలేజీ హాస్టల్ లో ఒక కుర్రవాడున్నాడు."
"ఎక్కడ కలుసుకుంటారు?"
"హాస్టల్ లోనే-"
"అంటే-"
"అబ్బాయిల హాస్టల్ కే వెళ్తుందామె."
"అబ్బాయిల హాస్టల్ కి వప్పుకుంటారా?"
"నాకు తెలీదు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారట. అనూరాధ చెప్పటమేమిటంటే - జంటలందరూ అలాగే చెప్పుకుంటారట. ఈ అమ్మాయి రాగానే, అతడి రూమ్ లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారట-"
"అంటే ఇకనుంచీ మేము లాడ్జింగులు, హోటళ్ళేకాక హాస్టళ్ళు కూడా రెయిడ్ చెయ్యాలన్నమాట ...." ఇన్ స్పెక్టర్ నవ్వేడు, రాయన్నకి క్రమ క్రమంగా ధైర్యం వచ్చింది. ఇన్ స్పెక్టర్ అంత ఫ్రీగా వుండటం అతడు ఊహించని విషయం. పోలీసులు మొదట్లో సగం వరకూ అలాగే ఉంటారని అతడికి తెలీదు.