Previous Page Next Page 
భారతి పేజి 11

    "ఒకరోజు ఆయన అడగనే  అడిగారు, 'బాబు ఏదో మనోవ్యధతో  క్రుంగిపోతున్నట్లు  దిగులుగా కనిపిస్తూ, నన్ను తప్పించుకు తిరుగుతున్నాడేం?"

    "భోజనమయాక ఆకులు చుట్టి ఇస్తున్నానప్పుడు. అదే మంచి సమయంగా తోచింది  ఏమయితే అయిందని విషయం బయటపెట్టేశాను.

    హఠాత్తుగా నిశ్శబ్దం అములుకుంది. అసలే గంభీరంగా ఉండే ఆయన ముఖం వర్ణించలేనంత  గంభీరంగా మారిపోయింది. అదిరే గుండెతో, రక్తం వేడెక్కి  ప్రవహిస్తూండగా  ఆయన వంక  బిక్కు బిక్కుమని చూస్తున్నాను. ఆకాశం దట్టంగా మేఘాలు అలుముకుని, ఏ క్షణాన్నైనా  మెరుపులు మెరిసేటట్లు. ఉరుములు ఉరిమేటట్లు, తుఫాను వచ్చేటట్లు, పిడుగులు పడేటట్లు కనిపించింది పరిస్థితి. బాబు కోసం మంచి సంబంధం చేద్దామని సంపన్న కుటుంబాలన్నీ  ఆయన గాలిస్తున్నట్లు నాకు తెలుసు. ఆయన నోటి నుండి మేఘగర్జన  వినబడుతుంది. నేను శోషిల్లి  పడిపోవటం  తద్యం__అని తలపోస్తూ  అలాగే చూస్తున్నాను.

    చివరికాయన పెదవి విప్పారు. కాని అది గర్జనకాదు. "బాబు ఆమెపై  అంతగా  మరులుగొన్నాడా!" అని అడిగారు ప్రశాంత స్వరంతో.

    "అవునన్నాను"

    "ఆమె పేరేమిటి? ఊరేమిటి?" అని అడిగారు.

    "చెప్పాను"

    "ఏమనుకున్నారో ఏమిటో  'సరే! ఆ అమ్మాయిని  నేను వెళ్ళి చూస్తాను' అన్నారు తల పంకిస్తూ.

    "ఆ తరువాత  రెండుమూడు  రోజుల్లోనే  ఆయన మీ వూరు వచ్చి నిన్ను చూడటం  జరిగింది. ఆయన నోటి నుంచి  మాటలే  వస్తాయిగాని అభిప్రాయాలు వెలువడవు. 'సరే, బాబుకీ సంబంధం  ఖాయం చేస్తున్నాను' అన్నారు ఆ రాత్రి. 

    "ఇది భారతీ జరిగిన కథ. ఈ వాతావరణంలో  నీ జీవితచరిత్రను నువ్వే మలుచుకో" అని పూర్తిచేసింది రంగాజమ్మగారు.

    తెరిచివున్న కిటికీగుండా, ప్రక్కకు తొలగిన  తెరలలోంచి  దూరంగా కనిపించే నీలికొండల్ని  తిలకిస్తూ ఆలకిస్తూన్న భారతి ఉలికిపడింది. ఆమె గుండె చెదిరినట్లయింది.

    'అంత కఠినుడైన  మామగారు, కుటుంబ పరువు ప్రతిష్ఠల కోసం అంత ప్రాకులాడే గంభీర వ్యక్తి నన్ను చూడగానే తన కోడలిగా చేసుకోవటాని కెందుకంగీంరించారు? నాలో ఏం చూశారు? కేవలం జాలిచేత ఒప్పుకున్నారా? కొడుకు ముచ్చట తీర్చటానికి  విధి లేక ఊఁ అనవలసి వచ్చిందా?

    'అయినా ఇదంతా ఏదో కథలో జరిగినట్లుగా  ఉంది. వీరు....నన్ను చూసిందెప్పుడు? కేవలం కొన్ని క్షణాలు ఆ కొన్ని క్షణాలలోనే  ఇంత దృఢమైన  అభిప్రాయ మేర్పరచుకున్నారా? అంతా బలహీను డంటున్నారే ఆయన్ని. ఆ బలహీనుడి గుండెల్లో అంత బలమైన అభిప్రాయం ఎలా నాటుకుంది? తండ్రి వద్దంటే  ఏం చేసేవారు? నాలుగురోజులు ఉడుక్కుని ఊరుకునేవారంతేగా?"

    "ఏం భారతీ మాటాడవు?" ఆమెకు  అత్తగారు  భుజాలు పట్టుకుని కుదిపినట్టయింది.

    భారతి తల ఎత్తి  అత్తగారి ముఖంలోకి  చూసి, కనురెప్పలను క్రిందకు వాల్చి, "ఎవరెలాంటి వారయితేనేం? దేవతలాంటి  మీరు ఈ ఇంట్లో మసలుతూ  ఉండగా  నాకేం భయమత్తయ్యా" అన్నది మృదు కంఠంతో.

    రంగాజమ్మగారు తన చల్లని చేతులు  ఆమె చుట్టూ పోనిచ్చి కోడల్ని  మరింత దగ్గరగా పొడువుకుంది. భారతి ఆమె కళ్ళలోకి  చూసింది. ఇద్దరి నేత్రాలూ  ఆర్ద్రమైనాయి. ఇద్దరి శరీరాలు పులకరించాయి.

    "నిన్నిప్పుడు 'భారతీ' అని కాదు_ కోడలుపిల్లా  అని పిలవాలని ఉంది. నీలాంటివారు ఉన్నారని విన్నాను చూడటం ఇదే మొదటిసారి. అసలు దేవత ఇప్పుడే మా యింట్లో  గృహప్రవేశం చేసింది."

    "పొండత్తయ్యా! నన్నిలా పొగడితే  నేను సిగ్గుతో  కుమిలిపోతున్నాను. నన్నింత అందలమెక్కిస్తే  అది మీకెంత నష్టమో నీకు తెలియదు. అదీగాక  నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో మీకేం తెలుసు?"

    "లోపాలా? వెదికి చూసినా  ఎక్కడా  మచ్చ కనిపించని నీలో లోపాలా?"

    "వెదికి చూసినా కనిపించని మచ్చ__" వళ్ళు ఝల్లుమంది. భయంతో అత్తగారికి మరింత దగ్గరగా  హత్తుకుపోయింది.

    ఆ దశలో అమరత్వంతో  కూడిన అనుభూతులు అనుభవిస్తూ ఇద్దరూ కొన్ని క్షణాలు ఉండిపోయారు.

    అంతలో  అడుగుల చప్పుడయితే  ముందు భారతే ముఖం త్రిప్పి చూసింది. "ఇక్కడ మీరు...." అని ఏదో చెప్పబోతున్న సారధి__భారతిని చూసి చప్పున ఆగిపోయాడు. అతని ముఖంలో వర్ణించలేనంతగా  ఆశ్చర్యం కనిపించింది.

    భారతి గుండె గబగబ కొట్టుకున్నట్లయి లేచి నిలుచుంది.

    రంగాజమ్మగారు  చిరునవ్వు ముఖంతో, "ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, బాబూ చూశావా? నీ గది, ఇక్కడి వ్యవహారమంతా  ముందుగానే  అమ్మాయికి  చూపించేశాను. నీ గురించి అంతా  చెప్పేశానులే" అంది.

    సారథి ముఖం  ఎర్రబడగా  సిగ్గుపడుతూ, "పో అమ్మా" అన్నాడు.

    భారతి తలవంచుకుని అలాగే  నిలబడి ఉంది.

    రంగాజమ్మగారు  కోడలి అవస్థ కనిపెట్టి, తనుకూడా లేచి నిలుచుని, "నిన్ను దింపి వస్తాను పద, అమ్మా మీవాళ్ళు  నీ కోసం  ఎదురుచూస్తూ ఉంటారు" అని భారతి చెయ్యి పట్టుకుని, "నువ్వు  కాసేపు విశ్రాంతి తీసుకో బాబూ. నేనిప్పుడే వస్తాను" అని సారధికి చెప్పి బయల్దేరింది. 


                                                                       *    *    *


    పెళ్ళి వైభవంగా  జరిగిపోయింది. పెళ్ళికూతురి తరపువాళ్ళ కళ్ళు చెదిరి పోయేటట్లు, మనసు అదిరిపోయేటట్లు  అట్టహాసంగా, వేడుకలతో, విందులతో, వినోదాలతో జరిగిపోయింది.

    తలకు పాగా ధరించి, బంగారపు పొన్ను గల చేతికర్ర హుందాగా ఊపుకుంటూ, బుర్రమీసాలతో, చింత నిప్పుల్లాంటి  కళ్ళతో గంగాధరంగారు  ఎక్కడ చూసినా తనే అయి వ్యవహరించాడు.

    గంగాధరంగారినీ, సారధినీ ప్రక్క ప్రక్కన చూస్తే ఆ తండ్రికితను కొడుకనిపించడు. ఆయన దృఢకాయుడు: ఇతను సున్నిత శరీరుడు. ఆయనకి  అమిత చొరవ; ఇతనికి సిగ్గు, మొహమాటాలు. ఆయన మేరుగంభీరుడు. ఇతను చలించిపోయే స్వభావం గలవాడు.

    ఇలా చెప్పుకుంటే  ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి.

    పెళ్ళి జరుగుతుంటే  అంతా కలగా. మసక మసగ్గా ,ఏమీ తెలియనట్లుగా అనిపించింది భారతికి. మామ వరస అయిన  ఓ బంధువు చేతిలో బుట్ట పట్టుకుని  పెళ్ళిపందిరి దగ్గరకు  తీసుకువచ్చాడు. తెర తీసెయ్యటం, ఒకళ్ళ తలమీద ఒకరు చేతులు పెట్టటం, బెల్లం జీలకర్ర తలమీద వుంచటం, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, పెనక నుంచి బందువుల పరిహాసాలు, ప్రోత్సాహం, ఎటుచూసినా జనం కలకలలాడే ముఖాలు, కొత్తబట్టలు, గాజుల గలగలలు, పన్నీటి జల్లులు, సన్నాయి, బ్యాండ్ వాళ్ళ  వాద్యాల మ్రోత, చుట్టాలు చదివించటం. పురోహితుల అట్టహాసంతో కూడిన కేకలు....అన్నీ చకచక, ఇంకెవరికో  జరిగితే చూస్తున్నట్లు  జరిగిపోయింది.

    కాని అంతటి అస్పష్ట దసలోనూ, తెలియని స్థితిలోనూ  భారతికి ఒక సంగతి అస్పష్టంగా తెలిసిపోయింది. తలమీద తనకు వశం తప్పి పరాధీన అయిపోయింది. ఇప్పుడు  తన సొత్తు తనదికాదు. కాని ఈ సంఘటనలో అమూల్యమైన విలువ. అంతకు మించిన సుఖం. అంతకు మించిన తృప్తి దాగుని ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఈ భావాలన్నీ ఆమె ముఖంలో బహిరంగంగానే  కనిపించాయి.

 Previous Page Next Page