అసావేరి
--కొమ్మనాపల్లి గణపతిరావు
"ప్రేమా ప్రేమా ఎక్కడమ్మా నీ చిరునామా... నువ్వో అర్ధంకాని లిపివా...లేక అందరినీ ఆడించగల చిరునవ్వుల పసిపాపవా..."
మొన్న ఎవరో అనగా విన్నాను నువ్వు మృత్యువాకిటిలోని వధ్య శిలవని. కానియ్....శిలనైన నేను నీ ఉలి చెలిమితో శిథిల శిల్పంగా మారిపోతాను. నిన్న ఎవరో చెప్పారు. నీ తావు మనసు సంద్రపు లోతుల అగ్ని పర్వతాల్లో అని పోనియ్....ఆ సెగలవేడిలో సమిధనై కాలిపోతాను.
పదిహేడేళ్ళ ప్రాయమయ్యా నాది....ప్రేమంటే తెలియని నేను కాలపు సెలయేటి అడుగున ఇన్నాళ్ళూ గులకరాయిగానే బ్రతికాను తప్ప సేదదీర్చే ఒక చేతిస్పర్శకు సైతం నోచుకోలేకపోయాను. నిజమమ్మా రాలుగాయిని కాను నేను. రాలిపోయిన ఓ అమ్మబిడ్డను....కన్నీళ్ళే అమ్మ పొత్తిళ్ళుగా ఇన్నాళ్ళూ గడిపిన నేను ఈసరికే నిన్ను చేరుకునేవాణ్ణిగాని అసలు నేను ఎక్కడున్నానని...ఏడు సంద్రాల అవతల ఏడు రంగుల హరివిల్లును నేను....నిన్ను వెదకాలని బయలుదేరి అలసటతో ఏడు స్వరాలుగా విడిపోయాను. విడిపోతేనేం నువ్వు కలిస్తేచాలు ఏడేడు జన్మలు మనిషి పాడుకునే పాటనై పోతాను.
అదేమిటమ్మా........నువ్వంటే యిష్టపడని మనుషులు ఈ మధ్య కాలంలో నిన్ను అడవుల్లోకి తరిమేశారట కదూ...అప్పటికీ అంటున్నాను అక్కడ నీ స్పర్శతో అడవి మొక్కలూ గంధపు చెట్లవుతున్నాయని అందుకే నీకు కత్తివేట్లే సరైన గుణపాఠమూ అని....గొడ్డలి గాట్లతోనే గంధపు పరిమళం మరింత విస్తరిస్తుందని అలా చూస్తూండగానే అది అనంతమంతా వ్యాపిస్తుందని ఎందరికి తెలుసమ్మా....
నాది చిన్న వయసేకానీ నేను మాత్రం ఈ సత్యాన్ని తెలుసుకున్నానూ నీ చేయూత కావాలని కోరుకుంటున్నాను.
ఏమిటీ....నన్ను సమాధి చేస్తారంటావా...చేయనీ...ఒకసారి రాలినా నీ చెలిమి కోసం ఏడు జన్మలపాటు మళ్ళీ పుడుతూనే వుంటాను. నీ కోసం మరోసారి రాలిపోవటానికి సిద్దపడుతూనే వుంటాను....
అనిపించడమేగాని కనిపించని నా ప్రియతమ ప్రేమా ఆయువు కోల్పోయిన నేను కనిపించని వాయువులా ఇక్కడ మిగిలినా మిగలక పోయినా ఎప్పటికైనా మారే మనిషి కనుల కొలకుల్లో అశ్రువుగానయినా రూపు దిద్దుకుంటాను....అదీ కానినాడు ఏ కవి కలంలో అయినా రక్తపు సిరాగామారి కాలపు గుండెపై రాయబడిన చెరగని కవితనై ఓ కావ్యసృష్టికి నేనే కారణమౌతాను.....కరుణించు ప్రేమా....నన్ను కథగా మార్చుతప్ప ఓ వ్యధగా మాత్రం మలుపుతిప్పకు...
* * * * *
అర్ధరాత్రి కావస్తూంది.
చీకటి చుట్టిన ఆ పల్లె నిద్రలో పైటజారిన ప్రౌఢలా వుంది.
ఏటిపైనుంచి ఉండుండీ వీస్తున్న గాలి కాటేసే వలపు కోరికల్లా వూరిని చేరుకుంటుంది.
దూరంగావున్న పొలాలమధ్య నక్కల ఊళలు నిశిరాత్రి స్తబ్దతం చెరిపేస్తుంటే ఇళ్ళకి ఆనుకుని వున్న మామిడితోపులోని చెట్లపై గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తున్నాయి.
ఆకాశంలో మిణుకుమనే నక్షత్రాలు ఆ క్షణాన అక్కడ జరిగే ఓ సంఘటనకి సాక్ష్యాలు వున్నాయి.
కోవెలకీ రచ్చబండకీ మధ్య వీధి మొగలోని రెండు వాటాల పెంకుటింటి అరుగుపై నుంచి బెదురుగా క్రిందికి దిగింది మంగ. అంతసేపూ నిద్ర నటిస్తున్న మంగ సన్నగా కంపిస్తూనే చుట్టూ కలయచూసింది. అలికిడి లేదు అంతటా నిశ్శబ్దం....తాగుబోతు తండ్రి ఓ మూల మత్తుగా నిద్రపోతున్నాడు.
వీధి మలుపులు వున్న విద్యుద్దీపపు కాంతిరేఖలు ఇంతకుమించి వెలుగందించే శక్తిలేక మధ్యలోనే మాయమవుతున్నాయి.
మంగ మెల్లగా కదిలింది.
ఇరవై మూడేళ్ళ వయసొచ్చినా ఇంకా పెళ్ళికి నోచుకొని ఆమె శరీరం కోరికలతో కాలిపోతున్న పెనంలా వుంది. అవసరానికి మించి పెరిగిన ఆమె పొంకం ఇన్నాళ్ళూ దాచుకున్నది. ఈ రాత్రికోసమే అన్నట్టు ఊర్పులతో ఉలికులికి పడుతూంది.
నిస్త్రాణగా నేలకి జారుతున్న ఓ వెన్నెల కెరటం అంతదూరం కదలివచ్చింది. అందుకోసమే అన్నట్టు ఎత్తయిన ఆమె వక్షోజాల మధ్యకు సాగి అక్కడ గడ్డకట్టిన సెలయేరు అయ్యింది.
దూరంగా ఓ కుక్క మొరిగింది.
మంగ ఉలికిపడుతూ వేపచెట్టుమాటున నక్కింది.
చీర చెరగుతో నుదుటపట్టిన చెమటని తుడుచుకుని ఈసారి నడక వేగాన్ని హెచ్చించింది.
రెండే రెండు నిమిషాలు....
మంగ గమ్యాన్ని చేరుకుంది.
అక్కడ పెచ్చులూడిన మరో పెంకుటింటిముందు కమ్మలతో కట్టిన దడి డానికి ఆనుకుని వున్న ఓ కుక్కిన మంచంపై ఆదమరచి నిద్రపోతున్నాడు శంకరం. పదిహేడేళ్ళ శంకూ....
రెండు చేతుల్ని చెంప క్రిందుంచుకుని పడుకుని వున్న శంకూ అరక్షణం క్రితమే ఆకాశంనుంచి దిగిన చందమామలా వున్నాడు. ఆడపిల్లలా మెరుస్తున్న అతడి చెంపలు చీకటిలో సైతం మెరిసే కెంపుల్లా అనిపిస్తున్నాయి. అక్కడ పేరుకున్న అంధకారం మంగ కళ్ళకిప్పుడు వద్దన్నా కురిసిన వెన్నెల జలపాతంలా అనిపిస్తూంది.
కాంక్షల నాగుకి గండిపడుతుంటే మంచంపై అతడి పక్కగా కూర్చుంది.
గుట్టుగా లెమ్మంటే గట్టిగా అరుస్తాడనుకుందో వట్టిగా వాటేసుకున్నా తట్టుకోలేడనుకుందో చూస్తూనే అతడిపైకి ఒరిగింది.
పెదవుల్ని తాకక ముందే పైట జారింది.
జారినపైట శంకూ మొహంపైపడి అతడిలో కదలిక రప్పించింది.
ఇప్పుడు మంగ చీరచెరగు మరోపక్కకి ఒత్తిగిలిన శంకూ చేతుల క్రింద వుంది.
ఊర్పులతో రేగుతున్న మంగ 'ఎద' శంకూ చెంపల్ని తాకుతూంది.
ఇప్పుడే పరువానికి వస్తున్న శంకూని చూస్తూ రాలుగాయి కృష్ణున్ని చేరిన రాహలా నవ్వుకుంది.
చంద్రుడితో చీకటి చెలిమినికోరే తారగా తొందరపడిపోతూంది.
ఓపలేని తమకం....లాలనగా అయినా దారికి రప్పించాలనిపించే లాలసత్వం.
నెమ్మదిగా చాలా నెమ్మదిగా అతడ్ని పక్కకు తిప్పుకుంటూనే అతడి చేతిక్రింద చీరచెరగుని లాగుతూంది.
శంకూలో సన్నని కదలిక.
మరుక్షణం కళ్ళు తెరిచాడు శంకూ.
ఏం జరుగుతుందో తెలీని ఉలికిపాటో ఈవేళలో మంగ ఎందుకు వచ్చిందీ అన్న కలవరపాటో అదీ కానినాడు అదోలాంటి భయమో కెవ్వుమనబోయాడు.
"ష్...." వారిస్తూ శంకూ నోటికి చేతినడ్డం వుంచింది.
"ఎ....ఎందుకొచ్చావు?" శంకూ వణికిపోతున్నాడు.
"అందుకే...." మంగ సెగలా రగిలిపోతూంది.