Previous Page Next Page 
ఆడపడుచు పేజి 9

    ముక్త నెమ్మదిగా- "నీకు దణ్ణం పెడతాను. వెళ్ళిపో-" అంది.
    "వెళ్ళను...."
    "వెళ్ళకపోతే నీ భార్యకు ఫోన్ చేస్తాను..."
    "నిరభ్యంతరంగా చేయి. ఇప్పుడే చేయి. ఆమె యింట్లోనే ఉంటుందిప్పుడు. నీకు గుర్తులేకపోతే నంబరుకూడా నేనే యిస్తాను..."
    "ఏమిటి నీ ధైర్యం?" అంది ముక్త తెల్లబోయి.
    "ఇందులో ధైర్యమేమీలేదు. నా సంస్కారం, నా భార్య నన్నే నమ్ముతుంది. నిన్ను నమ్మదు. ఇక గొప్పదనుకుంటున్న నీ సంస్కారం గురించి ఆలోచించుకో....నీ భారత్కు మనమిలా కలుసుకున్నామని నువ్వు చెప్పుకోగలవా? అతడు నిన్ను నమ్ముతాడా?"
    ముక్త ఆలోచిస్తోంది. తను భర్తకితడి విషయం చెప్పాల్సింది. కానీ ఎందుకు చెప్పలేకపోయింది?
    గౌతమ్ భావిజీవితం గురించి కలలు కంటున్నాడు. ఆ కలల ధోరణిలో వాస్తవాన్ని పట్టించుకోవడంలేదు.
    ఇప్పుడు తనకారణంగా బాస్ తో గొడవ పెట్టుకుందుకతడు సిద్దపడవచ్చు. కానీ ఆ తర్వాత జీవితాంతం తనను సాధిస్తూంటాడు- నీ కారణంగా నా భవిష్యత్తు నాశనమయిందని.
    ముందే చెబితే వినిపించుకోలేదు. ఇప్పుడు చెబితే ముందే ఎందుకు చెప్పలేదంటాడు.
    తామిద్దరూ ఒకరికొకరెంతో దగ్గరయ్యారు. కానీ తానతడి సంస్కారాన్ని నమ్మడంలేదు. లోపమెక్కడుంది?
    "మన సమాజంలో ఆడది ఆడది కావడం కారణంగా బలహీనురాలు. నువ్వు నువ్వు సంస్కారమంటున్నది సంస్కారం కాదు. మగాడినన్న ధైర్యం!"
    భానుప్రకాష్ తమాషాగా నవ్వి- "వచ్చే జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించమని దేవుణ్ని కోరుకుంటాను. ఎందుకో తెలుసా? ఆడదానికి అంధమొక్కటి చాలు. ఏమైనా సాధించగలదు. సంధ్య నీకంటే విశేషమైన వ్యక్తికాదు. చెప్పాలంటే ఆమెకు నీకున్నంత అందం లేదు. అయినా ఆమె నాకు భార్యకావడంవల్ల నీకంటే గొప్పదయింది. సంధ్యకంటే ముందు నీవంటిదాన్ని చూసిఉంటే- బహుశా ఆమెను పెళ్ళాడి ఉండేవాణ్ణికాదు. ఏది ఏమైనా మగాడి పరిస్థితి అంత సులభం కాదు. అతడు ప్రగతిని సాధించాలంటే సమర్ధతుండాలి. ఎలాంటి సమర్ధతంటే- తను కోరినవి సాధించడమేకాదు. తను కోరుకుంటున్న యువతి భర్తకి కూడా అన్నీ సాధించిపెట్టాలి...." అన్నాడు.
    ముక్త అతడిమాటలు వింటూ- "రోజురోజుకూ ఇతడుమితిమీరి పోతున్నాడు. ఎలా ఇతడినాపడం?" అనుకుంది.
    తాను వివాహిత. స్వంతంత్రురాలు.
    అయినా ఒక పరాయి మగాడు తనపట్ల కోరికను వ్యక్తపరుస్తూంటే తన్ని తగలేయలేక పోతోంది.
    "మిస్టర్ భానుప్రకాష్! మావారి ఉద్యోగమేమైనా నాకు ఫరవాలేదు. నీవిక నా దగ్గరకు రావద్దు. మరోసారి వస్తే నిన్ను నేనల్లరి పెట్టాల్సి ఉంటుంది...
    భానుప్రకాష్ లేచి నిలబడి - "నేను నిన్ను కలుసుకుందుకు రాను. అది నీ అదృష్టం కాదు. దురదృష్టం-" అన్నాడు
    "దురదృష్టానికి నేను భయపడను..."
    "అది కాలమే చెబుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో...సిరిరా మోకాలడ్డుతున్నావు...."
    "నీద్వారా వచ్చే సిరికి నా మోకాలెప్పుడూ అడ్డమే!"
    "ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడంలేదు. నేనెవరో తెలుసుకోలేక పోతున్నావు. అది నీకు తెలిసేలా చేస్తాను...."
    "నీ బెదిరింపులకు నేను భయపడను..."
    "నాకు నీమీద జాలిగా ఉంది. అభిమానం పోనంటోంది. అందుకే వద్దన్నా మరో అవకాశం యిస్తున్నాను. అదేనీకు ఆఖరి అవకాశం..."
    "నాకె అవకాశాలూ వద్దు...."
    "వద్దన్నా యిస్తున్నానని ముందే చెప్పాను. ఈ రోజుకు సరిగ్గా వారంరోజులు అంటే వచ్చే మంగళవారం - మధ్యాహ్నం మూడుగంటలకు...సరిగ్గా మూడు గంటలకు....నువ్వు నా యింటికి రావాలి. అప్పుడింట్లో నేను, సంధ్యమాత్రం ఉంటాం. సంధ్యను కలుసుకోవాలన్న వంకతో నువ్వు మా యింటికొస్తావు. నిద్రమాత్రల ప్రభావంతో సంధ్య నిద్రపోతూంటుంది. నేను నిన్ను బలాత్కారం చేయను. ఒక్కమాటకూడా అనను. సంతోషంతో నిన్ను నువ్వు నాకర్పించుకోవాలి....."
    "అలా ఎన్నటికీ జరుగదు..."
    "నేను వెడుతున్నాను. మంగళవారం మాయింట్లో కలుసుకుందాం..." అని వెళ్ళిపోయాడు భానుప్రకాష్.
                                           13
    టూర్నించి బుధవారం సాయంత్రానికి భార్యాభర్తలిద్దరూ తిరిగివచ్చి యిల్లు చేరుకున్నారు.
    భర్తకు విషయం చెప్పాలని ముక్త ఎన్నోసార్లనుకుంది. కానీ ఈ విషయం చెప్పడానికి తనకీ అతడికీ మధ్య ఎంతో దూరముందనిపిస్తోందామెకు.
    ఇంతకాలం తనకీ అతడికీ రహస్యాలు లేవనుకుందామె. ఇద్దరికీ మధ్య చనువు వుందనే భావించిందామె.
    తాను చనువనుకుంటున్నది చనువుకాదు.
    భర్తకుకూడా చెప్పుకోలేని రహస్యాలు తనకేర్పడ్డాయి. అందుక్కారణం అతడేనన్న అనుమానమామెలో ఉంది. ఆ అనుమానం అతడినే అడిగి తీర్చుకునే చనువునామె చూపలేక పోతోంది.
    గురువారం నాడామె సంధ్యకు ఫోన్ చేసింది. సంధ్య ఆమెను స్వంత చెల్లెలిలా ఆప్యాయంగా పలకరించి విశేషాలడిగింది.
    ముక్త భానుప్రకాష్ ప్రసక్తి తీసుకుని వచ్చింది.
    "వారిగురించి నాకేమీ చెప్పొద్దు. నాకు నచ్చదు...." అందామె.
    "నచ్చినా నచ్చక పోయినా నిజం తెలుసుకోవాలి నువ్వు..."
    "తామరపువ్వు అందాన్ని చూసేటప్పుడు దానికింత బురదను చూడను. గులాబిని చూసి ఆనందించేటప్పుడు దానిచుట్టూ ఉండే ముళ్ళను గురించి ఆలోచించను నిజం ఒకోసారి బురదకన్నా అసహ్యంగా ఉంటుంది. ముళ్ళకన్నా తీవ్రంగా బాధిస్తుంది. మూన్నాళ్ళ ముచ్చటైన ఈ జీవితంలో సంతోషంగా ఉండడానికది అబద్దమైనా సరే- ఆశ్రయించడం తప్పుకాదు. నాకు తెలిసినదబద్దమైనా అందమైనది. నీకు తెలిసినది నిజమైనా - నాకది వద్దు. ఏమీ చెప్పొద్దు-" అంది సంధ్య.
    "కానీ - నువ్వు నన్ను రక్షిస్తానని మాటిచ్చావు...."
    "నీవు కోరే రక్షణ నా భర్తనుంచే అయితే అది నీకవసరం లేదు. వారి సంగతి నాకు బాగా తెలుసు. నా ఆలోచనలు తప్పయితే సరే - తప్పక నేను నిన్ను రక్షించగలను. ధైర్యంగా ఉండు. వారినుంచి నీకేప్రమాదమూ ఉండదని నేను హామీయిస్తున్నాను..."
    "థాంక్స్ - అక్కా!" అంది ముక్త అప్రయత్నంగా.
    "ఇంతకీ ఏం జరిగింది?"
    ముక్త చెప్పాలనే అనుకుంది. చెప్పలేదు.
    విషయం సంధ్యకు తెలిస్తే ఆమె భర్తను నిలదీస్తుంది. అతడు గౌతమ్ పై అలుగుతాడు.
    అలిగితే ఏం జరుగుతుంది.
    సాయంత్రం కొంత అర్ధమయింది ముక్తకు.
    గౌతమ్ ఇంటికి పెందరాళే వచ్చాడు, వచ్చినవాడు ముభావంగానూ, దిగులుగానూ ఉన్నాడు.
    టూర్లో ఉన్న ఉత్సాహమిప్పుడు లేదు.
    "అలాగున్నాంరేం?" అంది ముక్త.
    "జీవన్మరణ సమస్య!"
    "ఏమయింది?"
    "కాసేపు నన్ను మాట్లాడించకు..."
    అతడు చిరాగ్గా ఉన్నాడని గమనించి ఊరుకుంది ముక్త.
    కాసేపటికతడు తేరుకున్నాడు.
    "దిక్కుమాలిన టూరు - నా కొంపముంచింది..."
    "ఏం జరిగింది?"
    "బాస్ నాకు స్వతంత్రంగా పని చెప్పాడనుకున్నాను. కానీ అది నిజం  కాదు. ఆయనకూడా నాకు తెలియకుండా వచ్చి గెస్ట్ హౌస్ లో ఉన్నాట్ట..."
    ముక్త తడబడుతూ - "ఎందుకు?" అంది. ప్రశ్న వేయగానే అతడేంచెబుతాడోనని ఆమె కంగారు.
    విషయమతడికి తెలియనంతవరకూ ఏమైనా ఆలోచించవచ్చు. అతడికి చెప్పాలనికూడా అనుకోవచ్చు. కానీ అతడికి తెలిసిపోతే...ఆ తర్వాత...
    "బాస్ నన్ను పరీక్షించాలనుకున్నాడు...."
    "ఎలా?"
    మళ్ళీ ముక్త గుండెలో భయం, వణుకు...
    అయితే అతడు చెప్పింది వేరు.
    బాస్ తన ఉనికిని గౌతమ్ కు తెలియనివ్వలేదు, గౌతమ్ ఒక పార్టీతో మాట్లాడేక తనూ వెళ్ళి ఆ పార్టీతో మాట్లాడేడు. గౌతమ్ వ్యవహరించిన తీరును తెలుసుకున్నాడు. పార్టీనే గౌతమ్ గురించిన అభిప్రాయమడిగాడు.
    "మీ బాస్ గెస్ట్ హౌస్ లో ఉంటే నాక్కనబడాలిగా...." అంది ముక్త. దీనికతడి బదులేమిటోనని ఆమె భయంగానూ, ఆతృతగానూ ఎదురు చూస్తోంది.
    "నీకెందుక్కనబడతాడు? నీక్కనబడితే నాకు చెబుతావు. అప్పుడు తన రహస్యం బైటపడి పోతుంది...."
    ముక్త తేలికగా నిట్టూర్చింది.
    కానీ గౌతమ్ కంగారు పోలేదు.
    "పార్టీ నామీద సదభిప్రాయాన్ని వెలిబుచ్చలేదుట. ఇలాంటి మనిషిని పంపిస్తే మీ కంపెనీ మీ కంపెనీ  దెబ్బతింటుంది- అన్నాట్టాయన. ఈ రోజు బాస్ నామీద మండిపడ్డాడు...." అన్నాడతను.
    "మండిపడితే రాజీనామా చేయాల్సింది-" అంది ముక్త.
    "ఓ క్షణంలో నాకూ అలాగే అనిపించింది. ఎందుకో బాస్ ఈరోజు నామీద ఉగ్రరూపం చూపించాడు. గతంలో మెచ్చుకున్న వర్కునుకూడా ఈరోజు తప్పుపట్టాడు. నాకు బొత్తిగా ఏమీ రాదన్నాడు. నాకు ప్రాముఖ్యతనిచ్చి తప్పు చేశానన్నాడు..."
    "ఈ ఉద్యోగం వద్దండీ - రాజీనామా చేసేయండి..." అంది ముక్త.
    "నేను చెప్పేది పూర్తిగా విను..." అన్నాడు గౌతమ్.
    "ఇంకా ఏం వినాలి?" అంది ముక్త.
    "వినాలిమరి -" అంటూ మొదలు పెట్టాడు గౌతమ్.
    బాస్ గౌతమ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఊళ్ళో అతడికొ పెద్ద బంగళా తీసుకోవాలను కుంటున్నాడు. కంపెనీ తరపునించి కారివ్వాలను కుంటున్నాడు. కారు గురించి ఆర్డరు కూడా వెళ్ళిపోయింది. బంగాళా విషయం మాటల్లో ఉంది. బాస్ అయిడియాలో నాలుగున్నాయి. వాటిలో ఒకటి లీజుకు తీసుకుంటుంది.
    "బాస్ నాకు అయిదురోజులు టైమిచ్చాడు...." అన్నాడు గౌతమ్.
    "దేనికి?"
    "టూర్లో జరిగిందానికీ- నా ప్రగతికీ కనెక్షనుంది..." అన్నాడు గౌతమ్.
    ఉలిక్కిపడింది ముక్త - "అలాగని మీబాస్ అన్నాడా?"
    "తెలుస్తూనే ఉందిగా...పైగా ఆయనంటాడు - టూర్లో ఏం జరిగిందో నీ భార్యతో క్షుణ్ణంగా చర్చించు. ఆమె కూడా చదువుకున్నదే కదా! ఒకసారి ఆడాళ్ళకుండే వ్యవహారజ్ఞానం మగాళ్ళ కుండదు. నువ్వు చెప్పిందంతావిని ఆమె నీకు సాయపడే సలహా లివ్వగలదు- అన్నాడు-"
    "నేను మీ కెలా సాయపడగలను?"
    "మొత్తం వ్యవహారమంతా చెబుతాను. నేనేం చేశానో చెబుతాను నా వల్ల లోపమెక్కడ జరిగిందో నువ్వు నాకు చెప్పాలి. అందుకు బాస్ నాకు అయిదురోజులు టైమిచ్చాడు..."
    "అయిదురోజులంటే...?"
    "వచ్చే మంగళవారం..."
    ఉలిక్కిపడింది ముక్త. అంటే భానుప్రకాష్ రంగంలోకి దిగేడన్నమాట.
    "ఇలా షరతులు పెట్టేచోట మీ రెందుకు పని చేయాలి? నా మాటవిని మరో ఉద్యోగానికి ప్రయత్నించండి..."
    "ఇంతకంటే మంచి ఉద్యోగం దొరకదు ముక్తా!" అన్నాడు గౌతమ్ విచారంగా.
    "సమర్ధతంటూ ఉంటే ఎందుకు దొరకదు?"
    "మన దేశంలో సమర్ధతకు విలువేముంది? సమర్ధతకే విలువిస్తే ఈ కంపెనీలో నాకుద్యోగం దొరికేదో లేదో...రికమెండేషన్ మీద నేనిది సంపాదించుకున్నాను"
    "పోనీలెండి - మనకు కారూ, బంగాళాలూ వద్దు..." అంది ముక్త.
    "అసలు విషయం నీకు తెలియడంలేదు..."
    "ఏమిటది?" అంది ముక్త..అసలు విషయం ముక్తకు తెలుసు. అది భర్తకు తెలుసునో తెలియదో ఆమెకు తెలియదు.
    "మా ఆఫీసులో బాలచంద్రరావు నీకు తెలుసుగదా!"
    "ఎవరూ?" అంది ముక్త.

 Previous Page Next Page