Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 9


    మిగతా వాళ్ళందరూ ఘొల్లుమని నవ్వారు. పెద్ద చప్పుడు, తరవాత నిశ్శబ్దం.

    "లేకపోతే ఒంటరిదాన్నీ అమాయకురాలినీ చేసి రోడ్డు మీద అల్లరి పెడతారా? ఏదీ ఇప్పుడెయ్ నీ హీరో వేషాలు
చూద్దాం !" అంది శ్యామల.

    అమ్మాయిలు వెళ్ళిపోయారు.

    మురళి ప్రతిమలా నిలబడిపోయాడు.


                        *    *    *


    "రాధా !" అన్నాడు మురళి కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ తరువాత తల మరింత పైకి ఎత్తి. "...రాధా" అన్నాడు మరొకసారి.

    పక్కనే పక్కమీద పక్కకి తిరిగి పడుకుని డిటెక్టివ్ నవల చదువుతూన్న కనకారావు. పుస్తకం పక్కన పడేసి మురళిపక్కకి తిరిగి, "ఒరేయ్ ! నక్కలా మోర పైకెత్తి అరిగిపోయిన రికార్డులా అలా " రాధా రా...ధా" అని అరవకు" అన్నాడు విసుగ్గా.

    "నా గుండెల్లో లావాలా నిక్షిప్తమైవున్న ప్రేమ ఆమె చెంప దెబ్బతో పెఠాలున బ్రద్దలయింది. ప్రేమ నన్ను ముంచేస్తుంది. ఆ చేతి దెబ్బ...ఆమె చెంపదెబ్బ... అబ్బా!" అన్నాడు (చదువరీ ! ఇక్కడ 'అబ్బ' అనుపదము బాధను సూచించునది కాదు ! తదాత్మ్యతను సూచించునది.)

    "అయితే ఏమిటంటావు ?"

    "ఆమెని వివాహం చేసుకోని జీవితం వ్యర్ధం..."

    విన్సెంటు లేచి మురళి దగ్గిరగా వచ్చాడు అతడికి హస్తసాముద్రికం పిచ్చి వుంది. జేబులో ఎప్పుడూ భూతద్దం పెట్టుకొని తిరుగుతూ వుంటాడు. ఆ భూతద్దాన్ని మురళి చెంపమీద పెట్టి పరీక్షగా చూస్తూ "చేసేసుకోవచ్చు గురూ ! అమ్మాయి అదృష్టరేఖ జెర్రిపోతులా స్పష్టంగా కనిపిస్తూంది" అన్నాడు. "అంతేకాదు. తొందర్లో వివాహం అయ్యే యోగం కూడా కనబడుతూ వుంది."

    "ఒరే ! నిన్ను చంపీగల్ను " కోపంగా అన్నాడు మురళి.

    విన్సెంటు చెంపని మరోమారు చూసి, "లాభం లేదు గురూ ! ఆ అమ్మాయి భర్త హంతకుడు అయ్యే యోగం చేతి రేఖల్లో కనపడటం లేదు" అన్నాడు అదే స్వరంతో.

    ఇంతలో కనకారావు పక్కమీద లేచి కూర్చుంటూ నిన్నటి వరకూ బాగానే వున్నావు కదా ! ఈ రోజు ఇలా అయిపోయావేమిట్రా" అని అడిగాడు మురళిని.

    "ఎలా అయిపోయాను ?"

    "ప్రతిదానిపట్లా నిర్లిప్తత, నిరాసక్తత, స్థబ్దత, నిర్విణ్ణత, అప్పుడప్పుడు షాక్ తగిలినట్లు వుండటం... అచేతనుడవటం..."

    మురళి విరక్తిగా నవ్వి "పిచ్చివాడా ! అవన్నీ ప్రేమ తాలూకు విశేషణాలు" అన్నాడు ఉలిక్కిపడి.

    "ఉలిక్కి పడ్డావెందుకు ? అది కూడా ప్రేమ తాలూకు ఒక విశేషమా ?" అని అడిగాడు కనకారావు.

    "కాదు. కిటికీ పక్కనే నిలబడి వార్డెను మన మాటలన్నీ వింటున్నాడు" అన్నాడు మురళి స్టిఫ్ గా.

    విన్సెంటు వెనక్కి తిరక్కుండానే, "వాడి మొహం ! వాడొక తొండ, గొంగళి పురుగు, రాజకీయ నాయకుడు, మంత్రి, ఊసరవెల్లి, సీతాకోక చిలుక..." అంటూ వుండగా రామలింగం ఇక కోపం పట్టుకోలేక, "ఏయ్ !" అంటూ లోపలకు దూకాడు.

    "మీరా సార్ ! రండి. ఏమిటిలా దయచేశారు ?"

    "మీరన్న మాటలన్నీ విన్నాను. సస్పెండ్ ! మిమ్మల్ని ముగ్గురినీ సస్పెండ్ చేసేస్తాను."

    "ఎందుకు సార్ ! ఏమన్నాడు వాడు ? తొండ, గొంగళి పురుగు, రాజకీయ నాయకుడు, మంత్రి అవగానే రంగులు మార్చేస్తాయి అంటున్నాడు. అంతే గదరా."

    "మరే !" అంటూ వత్తాసు పలికాడు కనకారావు. రామలింగం మరింత పెట్రేగిపోయి "వాడొక తొండ - అన్నాడు 'వాడు' అంటే నేనే" అన్నాడు.

    "నిశ్చయంగా పొరపాటు పడ్డారు. 'వాడొక' కాదు 'వాడుక' వాడుక అంటే- అలవాటు- అని అర్ధం. వాడుకగా తొండ, ఊసర..."

    రామలింగం మరి కోపం పట్టలేక, 'వాడి మొహం' అనికూడా అన్నాడు" అని అరిచాడు ఉక్రోషంగా- ఏడుపొక్కటే తరువాయిగా.

    మురళి నమ్రతగా "మళ్ళీ పొరపాటే ! వాడిమొహం అంటే వాడి అయిన మొహం. శివుడి మూడో కన్ను వుంటుంది చూడండి - సీరియస్ గా - అలా అన్నమాట," అన్నాడు.

    "అంతేనా !"

    "అంతే."

    "సీరియస్ గా అంతేనా ?"

    "అంతే సార్. నమ్మండి."

    "అంతే నంటావ్."

    ముగ్గురూ తలూపారు.

    రామలింగం బయటకు వెళ్ళబోయి ఆగి, అనుమానంగా "మరేదో ప్రేమ అంటున్నావ్ నువ్వు..." అన్నాడు మురళితో.

    "అబ్బే. ఏం లేదు సార్. ప్రేమంటే... అదే... రవీంద్రనాథ్ ఠాకూర్, మదర్ థెరిస్సా - వాళ్ళ గురించి చర్చించుకుంటున్నాం."

    'దొరికార్రా' అనుకున్నాడు రామలింగం తన మనసులో. ఇన్నాళ్ళకి వీళ్ళ వీక్ పాయింటు దొరికింది ! ఇప్పటి వరకూ తనని ఆడించేశారు. ఇక వీళ్ళని ఆడిస్తాను. ఒకవేళ ఆడించలేకపోయినా ఇక ముందు నుంచీ తను చెప్పినట్టు  వింటారీ పిల్లలు.   

 Previous Page Next Page